Share News

మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?

ABN , Publish Date - Aug 15 , 2024 | 01:58 AM

అప్పుడే ప్రకాశ్‌రాజ్ ప్రదర్శన అయిపోయి, జనం హాలు నుంచి బయటకు వస్తున్నారు. అద్భుతమైన ఏకాభినయం. దక్షిణభాషలలోని ప్రసిద్ధ కవిగీతాలను ఆలాపిస్తూ, ఆ వైవిధ్యంలో ఏకతను ధ్వనింపజేస్తూ...

మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?

అప్పుడే ప్రకాశ్‌రాజ్ ప్రదర్శన అయిపోయి, జనం హాలు నుంచి బయటకు వస్తున్నారు. అద్భుతమైన ఏకాభినయం. దక్షిణభాషలలోని ప్రసిద్ధ కవిగీతాలను ఆలాపిస్తూ, ఆ వైవిధ్యంలో ఏకతను ధ్వనింపజేస్తూ అతను ప్రేక్షకులను ముగ్ధులను చేశాడు. మాట్లాడమనడమే అన్ని భాషలలోనూ అతని సందేశం. ‘ఆడు, మాతాడు’! అనేక సృజనకళల ఆ మేళవింపు ప్రేక్షక శ్రోతల మనః ప్రపంచాన్ని ఉన్నతీకరించింది. అంతకు ముందు అదే ఆడిటోరియంలో వెంకటేశ్ కుమార్ హిందుస్థానీ గాత్ర సంగీత ప్రదర్శన జరిగింది. పొద్దున్నే ఎనిమిదిన్నరకు మొదలైన ఆ కచేరీకి జనం కిక్కిరిసిపోయారు. కన్నడ శైవ వచనాల ఆలాపనతో కూడిన ఆ మధుర గాత్రసంగీతంలో తలమునకలైన కళాభిమానులు పదినిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.


మరి, ఈ రెండు ఆనందాలనూ అనుభవించిన గీతా రామస్వామి ఎందుకు అంత విచారంగా, కలవరంగా కనిపించారు?

బెంగుళూరులోని కోరమంగళలో ఆగస్టు రెండో వారంలో మూడు రోజుల పాటు జరిగిన ‘‘బుక్ బ్రహ్మ సాహిత్యోత్సవం’’లో గీతారామస్వామి పాల్గొన్నారు. తన ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ ప్రచురణలతో ఒక చిన్న స్టాల్‌ను కూడా ఆమె నిర్వహించారు. రచయితలలో, సాహిత్యాభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపిన ఆ ఫెస్టివల్ గీతారామస్వామిని దిగులులో ముంచింది. ‘‘చూశారా, ఈ కచేరీ, ఈ ప్రకాశ్‌రాజ్ అభినయం చూశారా, ఆడియన్స్‌ని చూశారా, మన తెలుగులో ఇటువంటివాళ్లెందుకు లేరు? ఇక్కడికి వచ్చిన పెరుమాళ్ మురుగన్, వసుధేంద్ర, జయమోహన్, సచ్చిదానందన్, ఒక్కొక్కరు ఎంతటి గొప్పవాళ్లు, వాళ్లు ఏ విషయాలు మాట్లాడుతున్నారో విన్నారా, తెలుగు నుంచి అటువంటి సాహిత్య వ్యక్తిత్వాలు వస్తున్నాయా? సాహిత్యాన్ని, కళలని ఇంతగా అభిమానించే సమాజం మనకెందుకు లేదు?’’ గీతా రామస్వామి బాధగా అంటున్నారు.

అది ఆమె ఒక్కరి బాధ కాదు. తెలుగు నేల నుంచి అక్కడి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన వారందరిలోనూ అవే ప్రశ్నలు. ఒకవైపు ఉదాత్తమైన, గంభీరమైన కళాసాహిత్య విషయాలను ఆనందిస్తూనే, గుండెలకు గుచ్చుకుంటున్న కించపాటుతో వారు నొప్పిపడ్డారు.


మనవాళ్లు ఉట్టి వెధవాయలోయ్-, అన్న తెలివిడి కలిగి ఉండడంలోను, బాహాటంగా ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటున్నామనుకోవడంలోను తెలుగువాళ్లకు చాలా ప్రసిద్ధి ఉంది. అట్లా అనుకున్నాక, ఏమీ చేయకుండా ఊరుకోవడంలోనూ ప్రఖ్యాతి ఉంది. ఈ ప్రత్యేకతలు ప్రమాదవశాత్తూనో, పూర్వజన్మ కర్మ కారణంగానో సమకూరినవి కాదు. పూర్తి స్వార్జితాలు. సాంస్కృతిక జీవనంలోను, విలువల పాటింపులోను కొత్త పతనస్థాయిని, లేకితనంలో కొంగ్రొత్త పతాకస్థాయిని అందుకుంటున్న ప్రయాణం తెలుగువారిది. నెలకు రెండు సాహిత్యోత్సవాలు జరుపుకుంటామని, లక్షల మంది హాజరవుతారని, కొత్త పుస్తకాలు వేలకు వేలు అమ్ముడుపోతాయని, పత్రికలు పాఠకసమ్మర్దంతో వర్ధిల్లుతున్నాయని కేరళనుంచి వచ్చిన ప్రతినిధులు చెబుతున్నప్పుడు ఆశ్చర్యం కలగదా? తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యసభల్లో హాజరయ్యే జనాన్ని చూశారా? వారి సరాసరి వయస్సు ఎంతో గమనించారా? మరి కోరమంగళలో అంతమంది మిలీనియల్స్, జెన్‌జీలు సాహిత్యంతో ఎట్లా చెట్టపట్టాలు వేసుకున్నారు? నిత్యసాహిత్యోత్సవాలతో యునిసెఫ్ వారసత్వ సాహిత్యపట్టణంగా గుర్తింపు పొందిన కొజికోడ్‌లో సముద్రతీరంలో నవయవ్వనులు, యువకులు సీరియస్ సాహిత్యపఠనంలో సేదతీరుతారని తెలుసునా? కర్ణాటకలో ఆధునిక కవిత్వంతో పాటు శివకవుల వారసత్వాలు, యక్షగానాది ప్రదర్శనకళలు, నాటకాలు కలసి నడుస్తాయని, సినిమాల్లోకి కూడా ప్రవహిస్తాయని తెలిసి అబ్బురపడమా? తమిళనాట అణగారిన అస్తిత్వాల సాహిత్యం కొత్త వ్యక్తీకరణలను, కొత్త పాఠకశ్రేణిని సృష్టిస్తోందని, ధిక్కారం కూడా నలుపుతో, నీలంతో, ఎరుపుతో పదునెక్కుతున్నదని ముచ్చటపడమా?


ఇది కేవలం సాహిత్యానికి, పుస్తకపఠనానికి సంబంధించిన పోలిక కాదు. దక్షిణభారత భాషల సాహిత్యసమ్మేళనమే అయినా, అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి తాము తగినంత దక్షిణులము కామేమో అని సందేహం కలిగితీరుతుంది. ఉత్తరాదికి దక్షిణాదికి నడుమ ఉండడం వల్ల, అనేక భాషలు పొరుగులు కావడం వల్ల మనకు గాఢమైన భాషా సాంస్కృతిక అభినివేశం సమకూరలేదేమో అంటారు ప్రఖ్యాత కథారచయిత వివిన మూర్తి. ఈ అవలక్షణం కేవలం భౌగోళిక విశేషమేనా? సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు ఉన్నత సమష్టి విలువలను మనలో నింపలేదేమో? పెద్ద ఎత్తున సమీకరించి విముక్తి పోరాటాలు నడిపిన ఉద్యమాలు, సామాజిక, సాంస్కృతిక జీవనంలో ఉత్తమ, విశిష్ట ప్రమాణాల మీద దృష్టి పెట్టలేదేమో? ఇటీవలి దశాబ్దాలలో ప్రభావం వేసిన అస్తిత్వ ఉద్యమాలు మొదట శకలీకరణ చేసినా, అది అనంతరం సకలీకరణకు దారితీయలేదేమో?

శకలీకరణ అంటే అస్తిత్వాల ప్రాతిపదికనో, భావాల రీత్యానో మాత్రమే కాదు. వ్యక్తీకరణ రూపాల రీత్యా కూడా. ఆధునిక తెలుగు కవిత్వ రంగానికి ఇతర కళారూపాలతో ఏ సంబంధమూ కనపడదు. సంగీతంతోను, నృత్యరూపాలతోను కలసి పనిచేసే కవులెవరూ ఉండరు. సమకాలీన కవిత్వాన్ని ప్రదర్శించాలని రంగస్థల ప్రదర్శకులు అనుకోరు. నాటకం ఇంకా పురాణకాలంలోనో, గతకాలంలోనో మాత్రమే వైభవంతో ఉన్నది. ఆధునిక కాలంలోకి దాన్ని లాక్కు రావాలని పట్టింపుతో ఏదో ఒక స్థాయి ప్రయత్నం చేసే వారికి ఎటువంటి ప్రోత్సాహమూ సాటి కళారంగాల నుంచి దొరకదు. కనీసం ప్రేక్షకులుగా కూడా ఆదరించరు. రాజకీయసభల్లో ఉపన్యాసాల విసుగునుంచి ఉపశమనం కోసం పాటలు పాడిస్తారు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని పాటల్లో కూడా కొత్త సాహిత్యం వస్తూనే ఉన్నది. కానీ, తక్కిన ప్రదర్శన రూపాల పరిస్థితి ఏమిటి?


గీతారామస్వామి మాతృభాష తెలుగు కాదు. కానీ, తెలుగు సమాజంలో ఆమె క్రియాశీల ప్రజాజీవితం గడుపుతున్నారు. అందులో భాగమే ఆమె నిర్వహించే పుస్తకప్రచురణ. తెలుగువారి సాహిత్య, సాంస్కృతిక అభిరుచుల గురించి ఆమె ఆవేదన ఈ నాటిది కాదు. బెంగుళూరు సాహిత్యోత్సవానికి వెళ్లిన తరువాత అది రెట్టింపు అయింది. నిజానికి, తెలుగు సమాజం నుంచి గొప్ప సృజనశీలురైన, ధైర్యశాలురైన రచయితలు లేకపోలేదు. తెలుగు సమాజంలో సంగీతం, నృత్యం, నాటకం తదితర కళారూపాల వారసత్వమూ చిన్నదేమీ కాదు. కానీ, అన్నీ కలగలసిన ఒక ఉమ్మడి వాతావరణం, సంస్కారం లోపిస్తున్నది. ‘‘ఎవరి శిబిరం వారు నిర్వహించుకుంటూ కూడా ఉమ్మడి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు, కానీ, ఒకరిపొడ మరొకరికి గిట్టని తనం తెలుగులలో ఎక్కువ’’ అని, ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ తెలుగు కన్వీనర్ సి.మృణాళిని అభిప్రాయపడ్డారు. బెంగుళూరు ఉత్సవం లాంటిది హైదరాబాద్‌లోనో, విజయవాడలోనో జరపాలంటే సవాలక్ష సమస్యలు ఎదురయ్యేవని ఆమె అన్నారు. దేశం నలుమూలలా అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవంతో చూస్తే, తెలుగు సాహిత్య సమాజంతో వ్యవహరించడమే అతి కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. సొంతదనం మీద పట్టింపు లేని ఈ లక్షణం మీదనే వివినమూర్తి ఆవేదన చెందారు. తెలుగు కథాప్రపంచం మీద జరిగిన చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ ప్రసంగవశాత్తూ ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిని ఉటంకించారు. ‘‘నా అనే అహంకారం తప్ప, మన అనే మమకారం లేదు మనకు’’ అన్నారట శ్రీపాద. వాస్తవమేనా? స్వీయ అహంకారాలు, సామూహిక ఆభిజాత్యాలూ తెలుగువారిని ముందుకు నడవనివ్వవా?


‘బుక్ బ్రహ్మ’ ఉత్సవం నిర్వాహకులు సతీశ్ చప్పరికెను అభినందిస్తూ, వచ్చేసారి హైదరాబాద్‌లో నిర్వహించవచ్చు కదా అని అడిగినప్పుడు ఆయన, ‘‘చేయవచ్చును కానీ, ఏర్పాట్లు కష్టం’’ అని అన్నారు. బెంగుళూరు కార్యక్రమానికి అనేక వాణిజ్య సంస్థల నుంచి, విద్యాసంస్థల నుంచి ప్రాయోజకత్వం లభించింది. అనేక మంది విద్యార్థులు, యువతీయువకులు స్వచ్ఛందంగా పనిచేశారు. వందలాదిమందికి వసతి ఇవ్వగలిగిన ప్రాంగణం లభించింది. తెలుగు రాష్ట్రాలలో, ఒక సాహిత్య ఉత్సవానికి సమర్పకులను సంపాదించగలమా? సంపాదించాలంటే, ఆ ప్రాంత జీవితవిధానంలో సాహిత్యానికి పెద్దపీట ఉండాలి. సాంస్కృతిక పరివారమంతా ఒకటిగా ఉంటూ, సమాజం మీద తమ ముద్రను బలంగా వేయగలిగిన స్థితిలో ఉండాలి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన పెద్ద పెద్ద మహాసభలు కూడా తెలుగువారి జీవనంలో కళా సాంస్కృతికతను పెంపొందించలేకపోయాయి. ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలిగేది కళా సాహిత్య ఉద్యమాలే. బెంగుళూరు సాహిత్య ఉత్సవంలో పాలుపంచుకున్నవారంతా స్థూలంగా ప్రగతిశీలమైన ఆలోచనలు కలిగినవారే. కొంత భావఛాయల్లో తేడా ఉండవచ్చు. బుక్ బ్రహ్మ ఉత్సవంతోనూ కర్ణాటకతో సహా ఐదు రాష్ట్రాలలోను అసంతృప్తులు ఉండవచ్చు. కొందరిని వీరు మినహాయించి ఉండవచ్చు, కొందరు వారే ఎడంగా ఉండి ఉండవచ్చును. కానీ, మొత్తం మీద ఒక ప్రస్ఫుట కళాసాహిత్య చిత్రపటం ఆవిష్కృతమైంది. అందుకు బెంగుళూరు వేదిక కావడం ఒక ముఖ్య కారణం. ఆ యోగ్యతను తెలుగు నగరాలు ఎప్పుడు సంపాదించుకుంటాయి?


సమాజంలో అనేక తోవలు, కోవలు, పాయలు ఉంటాయి. ఎవరి మార్గంలో నడిచేవారు వారి బాటసారులతో సంభాషించుకోవాలి. అదే సమయంలో ఏదో కూడలిలో కలిసినప్పుడు, ఉమ్మడి ప్రయాణం గురించి, ప్రయాణపు ఉమ్మడితనం గురించి కూడా మాట్లాడుకోవాలి. భాషాసాంస్కృతిక అస్తిత్వం నుంచి చూసినప్పుడు తెలుగువారంతా ఒకటిగా బయటి ప్రపంచానికి కనిపించాలి. ఆ తపన లేనప్పుడు, కూడలులలో కూడా కలవనప్పుడు సొంత ప్రయాణం మాత్రమే మిగులుతుంది. ఎప్పుడైనా ఇంద్రధనుస్సులు కంటబడినప్పుడు, లోటు తెలుస్తుంది.

బెంగుళూరు వైభవాన్ని చూసి, తెలుగు రచయితలు కొందరికైనా నొప్పి కలిగింది. ఈ నెప్పి మంచిది.

కె. శ్రీనివాస్

Updated Date - Aug 15 , 2024 | 01:58 AM