సారవంతం
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:35 AM
ముత్తెమంత సేపైనా కరిగిపోతున్న ఆ దృశ్యాలని అల్లుకోని ఒలికిపోని భయాన్ని దిగూట్లో ఆరిపోయిన దీపం కింద దాచిపెట్టి కొంచమైనా సారవంతమవుతాను...
ముత్తెమంత సేపైనా
కరిగిపోతున్న ఆ దృశ్యాలని అల్లుకోని
ఒలికిపోని భయాన్ని
దిగూట్లో ఆరిపోయిన దీపం కింద దాచిపెట్టి
కొంచమైనా సారవంతమవుతాను
నక్షత్రాల వెలుతురు పదను అంటని దోసిళ్ళు
కన్నీటి శబ్దం వినని శ్రవణాలు
నిరంతరం జీవధారను వెక్కిరిస్తూనే ఉంటాయి
ఐనా చూపులను ఒడిసిపట్టుకుని
మరో రూపంలోకి నడిచిపోవాలి
ఈ మట్టి రోజొక కొత్త నిర్వచనం ఇస్తూనే ఉంటుంది
గతాలు చూర చూరైన ఆకుల శబ్దమై
పలుకరిస్తాయి
మెత్తటి పూలలాంటి సన్నివేశాలు
కేవలం నిద్రలోనే మెలుకువతో కదులుతాయి
దుఃఖంతో ఒంటికాలి నడక ఎత్తుగడ్డ కొసకే
నీడలు మనిషి ఆలోచనలను
అపసవ్య దిశలోకి మలపనంతవరకే
ఒక్కొక్క దేహపు వాసనలు కరిగిపోతూ
నడిచే తొవ్వల మీది ముళ్లను సవరిస్తాయి
సంకేతాలను అర్థం చేసుకోవడమే జీవితం
వేముగంటి మురళి
93922 56475