సౌదీ అరంకో–సింగరేణి
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:21 AM
సహజ వనరు అయిన ఖనిజ సంపదను సద్వినియోగం చేస్తే జాతి దిశ, దశ పురోగమన శీలమవుతాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గల్ఫ్ దేశాలే ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ. వాటి సహజ సంపద అయిన చమురు....
సహజ వనరు అయిన ఖనిజ సంపదను సద్వినియోగం చేస్తే జాతి దిశ, దశ పురోగమన శీలమవుతాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గల్ఫ్ దేశాలే ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ. వాటి సహజ సంపద అయిన చమురు నిక్షేపాలు పూర్తిగా ప్రభుత్వాల యాజమాన్యం, అజమాయిషీలో ఉండడం వల్లే ఆ దేశాల పురోగతి సాధ్యమయింది. ఒకప్పుడు తినడానికి తిండి లేక అలమటించిన ఈ ఎడారి దేశాలు ప్రైవేట్ రంగానికి పెద్ద పీఠం వేయడం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛా విపణి విధానాన్ని పాటిస్తున్నాయి. అయితే సహజ వనరుల విషయానికి వచ్చే సరికి గల్ఫ్ రాజ్యాల రాచరిక పాలకులు ఆ సంపదపై ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా కొనసాగిస్తూ తమ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తున్నారు. అనేక సంక్షోభాలు, సవాళ్ల మధ్య కూడ చమురు ఉత్పాదక దేశాలు పురోగమనిస్తున్నాయి. కారణమేమిటి? ఆ దేశాల ప్రభుత్వ రంగ సంస్థల చిత్తశుద్ధి, సహజ వనరుల కేటాయింపు తీరు తెన్నులే ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలోని సౌదీ అరంకో, అద్నాక్, ఖతర్ ఎనర్జీ మొదలైన సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక వహించే స్థాయికి ఎదగడానికి చమురు, సహజ వాయువు నిక్షేపాలపై ప్రభుత్వాలకు పూర్తి అధిపత్యం ఉండడమేనని నిస్సంకోచంగా చెప్పి తీరాలి.
గల్ఫ్ దేశాలకు చమురు నిక్షేపాల తరహాలో భారత్‌కు అపార ఖనిజ సంపద దేవుడిచ్చిన వరమే. అయితే అపరిమిత ఖనిజ సంపద ఉన్నా పేదరికం తాండవించడం దేశ దౌర్భాగ్యం. బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న జార్ఖండ్ ఒక పేద రాష్ట్రం. తెలుగునాట గోదావరి పరివాహక ప్రాంతాలలో బొగ్గు సమృద్ధిగా ఉన్నా అటు ఇల్లెందు నుంచి ఇటు తాడిచెర్ల వరకు ఉన్న గ్రామాలు పట్టణాలు కూడా వెనుకబడిన పేద ప్రాంతాలనే విషయాన్ని విస్మరించరాదు. ఇక ఖనిజాలను శుద్ధి చేసి ఉత్పత్తి చేసే ప్రభుత్వరంగ సంస్థలను సాక్షాత్తు పాలకులే వ్యూహాత్మకంగా బలహీనపర్చడం ఒక విచిత్ర విషాదం. దేశంలో నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తూ టాటా స్టీల్‌తో పోటీ పడే విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించకుండా దెబ్బతీస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం.
దేశ పారిశ్రామిక, విద్యుదుత్పత్తి రంగాలకు వెన్నుదన్నుగా ఉన్న బొగ్గు విషయాన్నే చూడండి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలలోని పరిస్థితులనూ గమనించండి. బిహార్ లోని కోల్ బెల్ట్ ప్రాంతమైన ధన్‌బాద్ లోని దయనీయ పరి స్థితుల ఆధారంగా నిర్మించిన హిందీ సూపర్ హిట్ సినిమా ‘కాల పథ్థార్’ (1979)లో అమితాబచ్చన్, శశికపూర్, శత్రుఘ్న సిన్హాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే కళ్లు ఆర్ధ్రమవుతాయి. ఆ రకమైన దుర్భర పరిస్ధితుల నుంచి కోలుకుంటూ క్రమంగా పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలకు తాజాగా శ్రీకారం చుట్టిన గనుల వేలం విధానం అశనిపాతమే అవుతుందనడంలో సందేహం లేదు.
సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు బంగారం. తెలంగాణ శ్రామిక జీవన జీవనాడి అయిన ఈ సంస్థ, గనుల వేలం విధానం మూలంగా క్రమేణా ఉనికి కోల్పోయి మున్ముందు ఒక దివాళా సంస్థగా మిగిలిపోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది. తెలుగునాట సింగరేణి కానీ ఈశాన్య రాష్ట్రాలలో కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థలు గానీ బొగ్గు ఉత్పత్తి ద్వారా దేశ విద్యుదుత్పాదనలో కీలక పాత్ర వహిస్తున్నాయి. మరోవైపు ప్రైవేటు రంగాన్ని సైతం ఆదుకుంటున్నాయి. 2013లో 565 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 2023లో 893 మిలియన్ టన్నులకు పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ప్రజాహితాన్ని కాంక్షిస్తాయి. అందుకే బహిరంగ విపణి విధానంలో కాకుండా జాతి సేవా దృక్పథంతో అవి బొగ్గును విక్రయిస్తున్నాయి. పైగా అడుగడుగునా రాజకీయ జోక్యం కారణాన ఈ ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు రంగం తరహాలో కేవలం లాభాల బాటలో మాత్రమే పయనించలేవు. ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా వర్ణించే ఆత్మనిర్భర్ భారత్‌కు ఈ బొగ్గు గనులు నిలువెత్తు సాక్ష్యం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వమే వాటిని నిర్వీర్యం చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా చేయడం ద్వారా ఆ రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సంస్థలు ప్రైవేటు కంపెనీలను ఆశ్రయించవల్సిన అవసరాన్ని కేంద్రం సృష్టించింది.
సంపన్న పాశ్చాత్య దేశాలలో పర్యావరణ కాలుష్యం సమస్యకు బొగ్గు ఒక కారణంగా ఉన్నది. భారత్‌లో ఇప్పటికీ ఆ నల్ల బంగారం ఒక ప్రధాన ఇంధన వనరు. విద్యుదుత్పత్తికి అవసరమైన ముడి పదార్థం. పన్నులు వగైరా కారణాన దేశీయ బొగ్గు కంటె విదేశీ దిగుమతి బొగ్గు ధర చౌకగా ఉండడాన్ని కూడ గమనించాలి. దేశ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ప్రైవేటీకరణ జరుగుతుండగా ఆ రంగంలో అదానీ సంస్థ అనూహ్యంగా దూసుకెళ్తుంది. విదేశీ బొగ్గుతో పాటు ఖతర్ సహజ వాయువు దిగుమతిలో కూడ అదానీ సంస్థదే సింహభాగం. ఈ నేపథ్యంలో సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు విషయం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. అంతా చట్ట ప్రకారమే అంటున్న కేంద్ర ప్రభుత్వం అదే చట్టంలో సింగరేణి తరహా సంస్థలకు రిజర్వేషన్ విధానంలో గనులను కేటాయించే వెసులుబాటు ఉన్నదనే వియాన్ని విస్మరిస్తోంది, ఉపేక్షిస్తోంది. పూర్తిగా మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక సంస్థ మనుగడ లేదా అందులో పని చేసే ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంగా కాకుండా సగటు పౌరుడికి అవసరమైన విద్యుత్ కోణం నుంచి సింగరేణికి గనుల కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సౌదీ అరంకో, అద్నాక్‌ల తరహాలో సింగరేణికి కూడ జాతి ప్రయోజనాల దృష్ట్యా బొగ్గు గనులు కేటాయించాలి. తద్వారా మాత్రమే ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ సుసాధ్యమవుతాయి.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)