Share News

రెండో కుర్చీ

ABN , Publish Date - Oct 17 , 2024 | 02:26 AM

కుర్చీలో కూర్చోవడం ఒక్కటే ముఖ్యం కాదు! కూర్చున్న కుర్చీలో కుదురుకోవడమే చాలా ముఖ్యం! ఇంత ముఖ్యమైన విషయాన్ని విస్మరించి ముందుకు పోవడం ఎవరికైనా ఎంతో కష్టమవుతుంది...

రెండో కుర్చీ

కుర్చీలో కూర్చోవడం ఒక్కటే ముఖ్యం కాదు! కూర్చున్న కుర్చీలో కుదురుకోవడమే చాలా ముఖ్యం! ఇంత ముఖ్యమైన విషయాన్ని విస్మరించి ముందుకు పోవడం ఎవరికైనా ఎంతో కష్టమవుతుంది. ఈ కష్టాన్ని ముందే కనిపెట్టకపోతే ఎవరూ కార్యసాధకులు కాలేరు.

ఈ ముందు జాగ్రత్త ఉంది కనుకనే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే రెండో కుర్చీని వేయించి ఇది తన అధినేత అయిన అరవింద్ కేజ్రీవాల్ కోసమని సెలవిచ్చారు. ఇక నుంచి తను భరతుని వలె పరిపాలన సాగిస్తానని ప్రకటించారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లేంత వరకు ఈ నాలుగు నెలలూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ‘నన్ను సీఎంను చేసిన వ్యక్తిని సీఎంగా చేయడమే లక్ష్యంగా నేను పని చేస్తాను’ అని ప్రతిన బూనారు.


రాజకీయాలలో భక్తి కన్నా, భయం ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అది కుర్చీ భయమే అయినట్లయితే ఇక అది మామూలుగా ఉండదు. ఆ భయం తాలూకు చర్యలు అనేక రూపాలలో బయిటకు వస్తుంటాయి. ఈ రెండో కుర్చీ వ్యవహారం కూడా అలాంటిదే అని గిట్టనివాళ్ళు గుసగుసలాడుతున్నారు. అయితే ఇల్లలుకగానే పండుగ అవుతుందా? కుర్చీలో కూర్చున్నంత మాత్రాన అంతా కులాసాగా సాగాలని గ్యారెంటీ ఉందా? ఒకవేళ అలా సాగాలని ఎవరైనా అనుకున్నా అలా సాగనిచ్చే వ్యవస్థ ఏదీ అక్కడ ఉండాలని లేదు కదా. కూర్చున్న వారిని చూసి కుతూహలపడే వారి కన్నా కుతకుతలాడే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కూర్చున్న దగ్గర నుంచి వాళ్లను కూలదోసే ప్రయత్నం చేసే వాళ్లు కూడా పెరుగుతూ పోతుంటారు.

కుర్చీ మౌనంగానే ఉంటుంది. కూర్చునే వ్యక్తి కూడా మౌనంగానే ఉండొచ్చు. కానీ అందులో ఆ వ్యక్తిని ప్రశాంతంగా కూర్చోనిచ్చే వాతావరణమే చుట్టుపక్కల ఉండదు. అదిగో ఆ వాతావరణ ప్రభావం నుంచి పుట్టుకు వచ్చిందే ఈ ఆలోచన అని గిట్టని వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఈమెది భయాన్ని మించిన జాగ్రత్త అనీ, అదిగో ఆ జాగ్రత్త నుంచి పుట్టుకు వచ్చిందే రెండో కుర్చీ ఆలోచన అని కూడా అంటున్నారు. తన కుర్చీకి ప్రమాదం రాకుండా ఉండడం కోసమే ఆమె ‘ఆయన’ కుర్చీని ముందుకు తీసుకువచ్చారని ఒక పుకారును పుట్టించి దట్టించి మరీ దేశం మీదకి వదిలేశారు.


ఇది పైకి అధినేతపై భక్తి లాగా కనిపిస్తున్నప్పటికీ సారాంశంలో తన పదవికి ఎలాంటి ఢోకా లేకుండా చేసుకొనేందుకు చేపట్టిన ఇజ్రాయెల్ వాడిన ‘ఐరన్ డోమ్’ వంటి గట్టి భద్రతా వ్యవస్థ అనే అభిప్రాయాన్ని కూడా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇక నుంచి తన పైకి ప్రత్యర్థులు విసిరే రాజకీయ క్షిపణి దాడులన్నిటినీ కూడా తాను అధినేతకు వేసిన రెండో కుర్చీ అడ్డుకుంటుందని ఆమె నమ్మకమై ఉంటుంది!

ఆతిశీ చేసిన ఈ చర్య మనకు తమిళ రాజకీయాలను తలపునకు తెస్తున్నదికదూ! జయలలిత జైలుకు వెళ్ళిన ప్రతిసారీ అధికారాన్ని తన అనుంగు శిష్యుడు పన్నీరు సెల్వానికి అప్పగించడం– ఆయన కన్నీరు పెడుతూ ఈ కార్యాన్ని భుజాన వేసుకోవడం– మళ్ళీ ‘అమ్మ’ జైలు నుంచి బయటకు రాగానే పదవికి పన్నీరు పూత పూసి ఆమెకు పువ్వుల్లో పెట్టి మరీ అప్పగించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏలుకోరా నాయనా అంటే ఈ ఏడుపు ఎందుకని అప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయేవారు. కానీ ఆ ఏడుపు వెనక ఆతిశీకి ఉన్నటువంటి రెండో కుర్చీ లాంటి ఆత్మరక్షణ చర్యలు ఏవీ తనకు లేకపోయెకదా అనే బయటికి కనిపించని బాధ ఏదో ఆయనకు ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఈ పదవి ‘మూడు, నాలుగు నెలల’ ముచ్చటే కదా అనే ఆయన ఆత్మఘోష అటువైపు చెవి యొగ్గి విన్నవాళ్లకు తప్ప ఇతరులెవరికీ వినిపించే అవకాశం లేదు.


ఆతిశీ చేసిన రెండో కుర్చీ ప్రయోగం ‘ఆప్’ వర్గాలకు నచ్చితే నచ్చవచ్చు, కానీ అందరికీ ఎందుకు నచ్చుతుంది చెప్పండి? అందుకే ఆమె భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది అని కమలనాథులు ధ్వజమెత్తారు. అంతేకాకుండా రెండో కుర్చీ రాజ్యాంగ విరుద్ధమని కూడా ప్రకటించేశారు. దీనికి ప్రతిగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ప్రతిదాడికి పూనుకున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్లు అవసరం అంటున్న చోట– డబుల్ కుర్చీ సర్కారు ఎందుకు ఉండకూడదని ఎదురు ప్రశ్నలు గుప్పించాయి.

ఖాళీ కుర్చీ కనిపిస్తే ఎవరో ఒకరు కూర్చుంటారు. అట్లాంటిది అధికారంతో కూడిన ఖాళీ కుర్చీ కనిపించాక ఇక ఊరుకుంటారా? ఆ ఖాళీని పూరించేంత వరకు వాళ్లు ఎదుటివారికి ఖాళీ సమయాన్ని లేకుండా చేసేందుకే ముమ్మర ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతాపార్టీ ఢిల్లీ శాఖ ఇక నుంచి ఆ పనిమీదే ఉండబోతోంది. వారికి భాజపా హై(పై)కమాండ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి మరి!

గుండెబోయిన శ్రీనివాస్

Updated Date - Oct 17 , 2024 | 02:26 AM