Share News

సిద్దిపేట్ టూ మస్కట్ వయా హైదరాబాద్

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:33 AM

పోవాలని ఏనాడూ ఉండదు, నిమ్మళం లేని బతుకు ఉండనీయదు. కాలు ఇంట్లో ఉంటే కడుపాకలి తీరదు, రెక్క విచ్చుకున్న మరుక్షణం కంటతడి ఆరదు...

సిద్దిపేట్ టూ మస్కట్ వయా హైదరాబాద్

పోవాలని ఏనాడూ ఉండదు,

నిమ్మళం లేని బతుకు ఉండనీయదు.

కాలు ఇంట్లో ఉంటే కడుపాకలి తీరదు,

రెక్క విచ్చుకున్న మరుక్షణం

కంటతడి ఆరదు...

ఇదే చివరిదని తలచిన ప్రతిసారీ,

చివర్లన్నీ కొత్త కలతలకు చివుర్లేస్తూ...

కలతలన్నీ మొదలుకంటా చిదిమేస్తూ...

అప్పుడే పుట్టిన చంటిబిడ్డనూ,

మంచం పట్టిన ముసలి తండ్రినీ,

తొక్కు నూరిన పొట్లాల్ని

ముప్పై కిలోల మూటలో సర్దుతూ,

కంటి చెమ్మను కప్పెట్టి కలియదిరుగుతున్న ఆలి అవస్థనూ,

తోలీయనీకొచ్చిన ఎదురింటి జరీనాపను అలు ముకుని పుట్టెడు శోకాన్ని కుమ్మరించిన తల్లి కన్నపేగు తీపినీ,

ఇట్లా బంధాలన్నిటినీ విడిచేసి,

నావైన చేతుల్ని విరిచేసి,

నావి కాని రెక్కల్ని తొడుక్కున్నప్పుడల్లా,

దేహమొక దుఃఖ మేఘం,

ఇల్లేమో దిగులు కార్ఖానా...

‘‘సిద్దిపేట్ టూ మస్కట్

వయా హైదరాబాద్’’


ఒక్కో ఊరూ దాటిపోతోంది,

ఒక్కో చుక్కా రాలిపడుతోంది,

అశ్రువులన్నిటినీ పోగేసి,

కాలం దుఃఖపు పంటను సాగుచేస్తోంది...

అంధకారం నుండి అంధకారం వైపు

పయనిస్తున్న తొవ్వలో,

కళ్లల్లో సముద్రాలు మొలుస్తున్న అలికిడి,

కలవరింతల కత్తులు, కలల్ని పొడుస్తున్న

సలపరింత...

పైకంతా ప్రశాంతం గానే ఉంటుంది,

ముఖం లోనూ ఎలాంటి అలజడుండదు...

లోపల్నుండి ఉబికిన వాళ్ళు జలపాతాలై

జారుతున్న స్పర్శ....

‘‘లేడీస్, అండ్ జెంటిల్మెన్ దిస్ ఈజ్ యువర్ కెప్టెన్ స్పీకింగ్, వీ విల్ బీ అరైవింగ్ ఎట్ అవర్ డెస్టినేషన్ షార్ట్‌లీ...’’

CCC

‘‘జత్తన్ సే జా బేటా’’ అంటూ,

నా హిఫాజత్‌కై దువా చేసి,

తడికళ్ళతో తడిమిన ఇమామెజామిన్‌ను

భుజానికి ముడేసింది అమ్మీ....

విప్పేటప్పుడు

తాయత్తులోంచి జారిపడ్డ రూపాయి

బిళ్ళ శబ్దానికి రియాల్ కలలు రక్తం

కక్కుకున్నట్టు తనకెట్లా చెప్పను...?!

జాబేర్ పాషా

00968 78531638 (మస్కట్)

* జత్తన్ = జాగ్రత్త

* హిఫాజత్ = క్షేమం

* దువా = ప్రార్థన

* ఇమామెజామిన్ = సురక్షితంగా వెళ్లి,

రావాలని భుజానికి కట్టే తాయత్తు

* రియాల్ = మస్కట్ కరెన్సీ

Updated Date - Nov 04 , 2024 | 12:33 AM