Share News

అధర్మంపై మౌనమే అసలైన చెరసాల

ABN , Publish Date - Oct 24 , 2024 | 02:31 AM

‘ఈ అంధకారం శాశ్వతమైనది కాదు. రేపటి ఉషోదయంతో ఈ చీకటి అదృశ్యమవుతుంది’– ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తున్న ఈ మాటలు వసంత సాయిబాబా వి. ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా ఆంగ్ల పుస్తకం ‘వై డు యు ఫియర్‌ మై వే సో మచ్‌?...

అధర్మంపై మౌనమే అసలైన చెరసాల

‘ఈ అంధకారం శాశ్వతమైనది కాదు. రేపటి ఉషోదయంతో ఈ చీకటి అదృశ్యమవుతుంది’– ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తున్న ఈ మాటలు వసంత సాయిబాబా వి. ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా ఆంగ్ల పుస్తకం ‘వై డు యు ఫియర్‌ మై వే సో మచ్‌? పొయెమ్స్‌ అండ్‌ లెటర్స్‌ ఫ్రమ్‌ ప్రిజన్‌’ ప్రతి నొకదాన్ని సెప్టెంబర్‌ 18, 2022న వసంత నుంచి నేను కొన్నప్పుడు ఆమె ఆ మాటలు రాశారు.

ప్రొఫెసర్‌ సాయిబాబాను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశంగా నాకు లభించలేదు. అయితే సాయిబాబా జైలు కవితలు, లేఖల నుంచి ఆయన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. విజయదశమి నాడు ఆయన మరణం, జైలు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది నెలలకే సంభవించడం నన్ను ఎంతో బాధాతప్త హృదయుడిని చేసింది.


ఐదేళ్ల చిరుప్రాయంలోనే పోలియో వ్యాధి కారణంగా సాయిబాబా నడిచే సామర్థ్యాన్ని కోల్పోయారు. జీవితం విసిరిన ఎన్నో సవాళ్లు, సమస్యలను ఆయన చిన్ననాటి నుంచే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. పదవ తరగతి సంవత్సరాంతర పరీక్షల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని స్వాయత్తం చేసుకోవడం అందుకొక మొదటి నిదర్శనం.

జీవితం ఎన్ని కష్టనష్టాలకు గురిచేస్తున్నప్పటికీ సాయిబాబా తన నవయవ్వన కాలం నుంచీ ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆదివాసీల, దళితుల, మహిళల, మైనారిటీల హక్కుల కోసం పోరాడారు. ప్రజా పోరాటాలు, సామాజిక ఉద్యమాలు సాయిబాబాకు పాదాలు అయి, ఆయన్ని ముందుకు నడిపించాయని వసంత అన్నారు. ఉన్నత విద్యాభ్యాసానంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయ రామ్‌లాల్‌ ఆనంద్‌ కళాశాల ఇంగ్లీష్‌ భాషా, సాహిత్య విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయ్యారు. సాయిబాబా కాళ్లు చలన రహితమైనా ఆయన చేతులే ఆయన శక్తి. జైలులో అధికారులు ఆయన ఆరోగ్యాన్ని అమానుషంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన చేతులు కూడా శక్తి హీనమయ్యాయి.


జైలు జీవితాన్ని తట్టుకుంటూ తన ప్రియమైన విద్యార్థులకు, సహచర అధ్యాపకులకు రాసిన ఒక లేఖలో ప్రొఫెసర్‌ సాయిబాబా ఇలా పేర్కొన్నారు: ‘నాకు తెలిసిన జీవితమంతా విద్యా ప్రాంగణాలలోనే నివసించాను; జ్ఞానం, అనురాగం, స్వేచ్ఛను అన్వేషిస్తూ బోధనా విధులను నిర్వహించాను. కొద్దిమందికి మాత్రమే ఉండే స్వేచ్ఛ అసలు స్వేచ్ఛే కాదని ఆ అన్వేషణా ప్రస్థానంలో నేను నేర్చుకున్నాను’.

అసత్యారోపణలు, తప్పుడు తీర్పు కారణంగా ప్రొఫెసర్‌ సాయిబాబాను 2021లో అన్యాయంగా అధ్యాపక ఉద్యోగం నుంచి తొలగించారని వసంత బాధపడింది. సరైన చికిత్స చేయించుకునేందుకు జైలు అధికారులు ఆయనకు పదే పదే అనుమతి నిరాకరించారు. బెయిల్‌ మంజూరు చేయడానికి న్యాయస్థానాలు తిరస్కరించాయి.

పది సంవత్సరాలపాటు అమానుష జైలు జీవితంలో కఠోరమైన ఏకాంత వాసం గడిపినప్పటికీ, ఆరోగ్యం ఎంతగా క్షీణించిపోయినప్పటికీ ఆ కాలంలో ఆయన సృజించిన కవితలలో అసాధారణ ఆత్మవిశ్వాసం, ఆశాభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వసంతకు పంపిన ఒక కవితలో సాయిబాబా ఇలా చెప్పారు: ‘నీ స్వప్నాల గవాక్షాలను మూసివేయవద్దు. ఒక సుడిగాలిలో నిన్ను చూడడానికి వస్తున్నాను’. 26 అక్టోబర్‌ 2017న వసంతకు పంపిన మరొక కవితలో ఆయన ఇలా అన్నారు: ‘నేను చనిపోయేలా ఏం చేయాలో/ వాళ్లకు తెలియడం లేదు/ ఎందుకంటే/ నాకు మొలకెత్తే గడ్డి సవ్వడులు/ చాలా ఇష్టం’.


జైలు జీవితంలో సాయిబాబా ఎదుర్కొన్న బాధలు మాటల్లో వ్యక్తం చేయలేనివి. తెలుగు (ఆయన మాతృభాష)లో చదివేందుకు, రాయడానికి అధికారులు అనుమతించలేదు. వసంతకు ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం లేదు. భార్యాభర్తలు ఇరువురికీ అదొక బాధాకరమైన అనుభవం. ఇద్దరు మనుషులు అందునా జీవనసహచరులు తమ ఆత్మీయ భాషలో మాట్లాడుకోవడానికి అనుమతించకపోవడం ఎంత అమానుషం! నిజానికి సాహిత్యమే వసంత, సాయిబాబాలను సన్నిహితం చేసింది. ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరిచింది. ఉన్నతాదర్శాలతో సహజీవనం చేసేందుకు వారిని ప్రేరేపించింది. ఇరువురూ ఠాగూర్‌, ప్రేమ్‌చంద్‌, పెరియార్‌, శరత్‌, చలం, శ్రీశ్రీ, కొకు, కారా, రంగనాయకమ్మ సాహిత్యాన్ని చదివారు, స్ఫూర్తి పొందారు. కుల మత అంతరాలు, ధనిక– పేద, స్త్రీ –పురుష అసమానతలు లేని సమసమాజాన్ని స్వప్నించారు.


విప్లవ కవి వరవరరావును ఉద్దేశించి రాసిన ఒక కవితలో అన్యాయాలు చెలరేగుతున్నప్పుడు వాటిని ఎదిరించడానికి బదులు ప్రజలు తమకుతాముగా మౌనం పాటించడం పట్ల సాయిబాబా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధర్మంపై ప్రజల స్వచ్ఛంద మూకీ భావమే అసలైన చెరసాల అని ఆయన అభివర్ణించారు. దురదృష్ట కరమైన ఈ లోక రీతిని ఆయన ఎలా నిరసించారో చూడండి: ‘కొంత మౌనం బలవంతంగా విధించింది. మిగతా మూకీ భావం అంతా స్వయంగా పాటిస్తున్నదే. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నిషేధం కొంత ఆదేశించబడింది. మిగతాది అంతా స్వయంగా ఆచరిస్తున్నదే. మన చుట్టూ ఉన్న ఈ సాలెగూడు పరిస్థితుల్లో వ్యక్తమవుతోన్న భయం అధికారంలో ఉన్న వారి గురించి కాదు. అది నోరు లేని అమాయకుల ఆవేదనలు వినిపించడానికి భయపడుతున్న గొంతుకలలోని భయం. అది నైతిక దుర్బలత్వం. అది ఒక నాగరికత దురహంకారం. స్వేచ్ఛాయుత సమాజం కోసం మనం ఉమ్మడిగా చేసిన పోరాటాల విస్మరణ అది’.


తాను, తన భార్య వసంత ‘పేదల హక్కుల కోసం ప్రముఖం కాని మార్గాలలో పోరాడుతున్న సామాన్యులం. మరి బ్రహ్మాండమైన అధికారాలు గల రాజ్య వ్యవస్థ మా ఆశాభావాలు, మా అనురాగాలు, మా స్వప్నాలకు ఎందుకు భయపడుతుంది’ అని ప్రొఫెసర్‌ సాయిబాబా విస్మయం వ్యక్తం చేశారు. భిన్న భావజాలాన్ని అనుసరిస్తున్నవారు, రాజకీయ అసమ్మతివాదులు, అంతరాత్మకు నిబద్ధులయి ఉండేవారి పట్ల రాజ్యం ఎలా వ్యవహరించాలి అన్నది ఒక ప్రధానాంశం. అదొక చిక్కు ప్రశ్న కూడా. భావాల రంగంలో ఆ చైతన్యశీలురుతో పోరాడటమా లేక కఠోర చట్టాలను వారికి వ్యతిరేకంగా ప్రయోగించడమా? జైళ్లలో ఖైదీలు, భిన్న రాజకీయ అభిప్రాయాలు కలవారిపట్ల రాజ్య వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుందనేది మన నాగరికత ఔన్నత్యం, శక్తిశీలతకు ఒక నిజమైన పరీక్ష.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మూర్తి

వైస్‌ ఛాన్సలర్‌, అస్సామ్‌ రాయల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ

Updated Date - Oct 24 , 2024 | 02:32 AM