Share News

శిశువు చిత్రనిద్ర

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:44 AM

సముచిత హింస అహింసేనా? ధర్మ మీమాంస ఎప్పుడూ చేతిలోని జిగురు చర్మపు చేపే fish out... తప్పించుకుని నీటిలోకి అంతర్థానమైపోవడం ఆత్మ రక్షణే... తా మించిన ధర్మం లేదు...

శిశువు చిత్రనిద్ర

సముచిత హింస అహింసేనా?

ధర్మ మీమాంస ఎప్పుడూ చేతిలోని జిగురు చర్మపు చేపే

fish out... తప్పించుకుని నీటిలోకి అంతర్థానమైపోవడం

ఆత్మ రక్షణే... తా మించిన ధర్మం లేదు...

శిరోఖండనే గణరాజ్య సిద్ధాంతం

గుర్రపు డెక్కల ఎర్రని ధూళి, మహోగ్రారణ్యాలు

విస్ఫోటించే రక్తపు నదులు

చరిత్ర ఎప్పుడూ నెత్తుటితడిని అద్దుకుంటూ

లిఖించబడ్తూంటుంది

శత్రువును జయించి అంతఃపురకాంతలతోసహా

సకలసంపదలనూ గుంజుకుని అనుభవించడమే

‘రాజధర్మ’మౌతున్న వేళ

నిర్వచనాలను మార్చుకుంటూ మార్చుకుంటూ

న్యాయం, ధర్మం, శాస్త్రం, ఆక్రందనలు... అన్నీ నిశ్శబ్దిస్తూ

ఆస్థానాల్లో మేధావులు తలలు వంచుకుని

సిగ్గుతో కుంచించుకుపోతున్నపుడు

కేవలం శారీరక మరణాలే కాదు

సౌప్తిక పర్వంలో శూన్యహత్యలు కూడా జరుగుతాయి

అన్నీ కరవాలదంష్ట్రలే... హరోంహరహర-

2

ఆదిమయుగంనాటి మనిషి

ఒక సారించిన ధనువు... ఒకటే బాణం ఒకటే లక్ష్యం

జీవితం సరళ సమీకరణం

రణమో... మరణమో

ట్రిగ్గర్‌పై వేలును

ఒక ‘జి కోడ్’ ఉగ్రావేశం శాసిస్తుంది..

లక్ష్యం మాత్రం విధ్వంసమే-

అన్నీ ముఖాలపై నవ్వులను చిందే రాజకీయ పాచికలే

ఎప్పుడు ఎక్కడ ఆకాశాన్ని చించుకుని

మహాసముద్రాలు కురుస్తాయో తెలియదు

కన్నుతెరిచే రెప్పపాటులోనే

ద్వారక సముద్రగర్భంలోకి కూరుకుపోతుంది

గాంధారిశాపం యుగాంతంకోసం వ్యూహించబడ్డ

కృష్ణుని రిక్తాదేశం

ఒకరు ఇంకొకరై ప్రత్యయిస్తారు

ఎప్పుడు ఎవరికోసం ఎవరు

కాలుతున్న కాగితంపై రాయబడ్డ

అక్షరాయుధాలౌతారో తెలియదు

కాలం గర్జిస్తూ ప్రవహించే అనంతాకాశమేనని... ఉవాచ-

3

మనుషుల వేషభాషలుమారుతాయి

వ్యూహాలు పొటమరిస్తున్నపుడు

అనుభూతులూ ప్రత్యనుభూతులూ మారుతూ

విందుల్లో విషాన్ని తినిపిస్తాయి

రహస్యప్రపంచాలు నిరాకారంగానే రాజకీయాలను కప్పుకుని

నిన్నటి రణభూమిని ఇవ్వాల్టి ఆరోవేలుగా మారుస్తాయి

అంతిమంగా

‘ఒక్కడు చచ్చు... మరియొకడుచంపుననుమాట పొరపాటు

ఆ భ్రాంతి విడువు’ గీతా ప్రవచనంతో

శాంతి పర్వంలో... అనంత అశాంతి విస్తరిస్తూంటుంది

చివరికి come and go అంతే... అదే జీవితం-

రామా చంద్రమౌళి

93901 09993

Updated Date - Sep 23 , 2024 | 12:44 AM