Share News

ఆరు నూతన పాలసీలు ఆకర్షణీయం, ఆదర్శం!

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:38 AM

స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఆరు కొత్త పాలసీలను రూపొందించింది కూటమి ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు కీలక రంగాలకు ఒకేసారి తీసుకొచ్చిన ఈ పాలసీలు ఆకర్షణీయం, ఆదర్శంగా నిలవనున్నాయి....

ఆరు నూతన పాలసీలు ఆకర్షణీయం, ఆదర్శం!

స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఆరు కొత్త పాలసీలను రూపొందించింది కూటమి ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు కీలక రంగాలకు ఒకేసారి తీసుకొచ్చిన ఈ పాలసీలు ఆకర్షణీయం, ఆదర్శంగా నిలవనున్నాయి. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తెచ్చిన నూతన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలవనుంది. ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీలు పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు తరలివచ్చేలా, విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉన్నాయి.

పట్టుదలతో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు సాధించి సంపద సృష్టించే దిశలో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రానున్న ఐదేళ్లలో 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే పారిశ్రామిక పాలసీలను రూపొందించింది. పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలవాలని నిర్ణయించింది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఆవిష్కరణలకు దోహదపడేలా నూతన పాలసీలను రూపొందించారు. వీటితో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడిదారులు బారులు తీరే అవకాశం ఉంది. నూతన పారిశ్రామిక పాలసీలు అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఉపాధి కల్పించారనేదే ప్రాధాన్యంగా జాబ్ ఫస్ట్ అనే నినాదంతో ఈ కీలక పాలసీలను రూపొందించారు.


రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆరు పాలసీలు గేమ్‌ చేంజర్లుగా నిలవనున్నాయి. పారిశ్రామికవేత్తలకు మళ్లీ నమ్మకం కుదిరేందుకుగాను అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. విశాఖ ఆర్థిక రాజధానిగా, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చెయ్యనున్నారు. ‘జాబ్‌ ముందు’ నినాదంతో పారిశ్రామిక విధానాన్ని రాష్ట్రంలో అమలు చెయ్యడం యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రభుత్వ పట్టుదలకు, చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎలక్ట్రానిక్, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డెవలప్‌మెంట్‌, ఎంఎస్ఎం పాలసీ, ప్లగ్‌ అండ్‌ ప్లే ఇండస్ట్రియల్‌ పాలసీలను రూపొందించారు. ఉద్యోగాల కల్పన ఆధారంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పారిశ్రామికవాడల్లోనూ, పరిశ్రమల ఏర్పాటులోనూ సామాజిక సమతుల్యతను పాటిస్తూ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను భాగస్వాములను చెయ్యనున్నారు.


రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రమంతా గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా, నౌకాశ్రయాలను గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లుగా మార్చనున్నారు. వన్‌ ఫ్యామిలీ–వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాలు చేయడమే కాదు, ఉద్యోగాలు కల్పించే స్థాయికి మన యువత ఎదగాలని, ఆరు నూతన పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి, సంపద సృష్టించి తద్వారా పెరిగిన ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు చెయ్యనున్నారు. అట్లాగే ఏపీని ప్రపంచానికే ఆక్వాకల్చర్ హబ్‌గా, రాయలసీమను ఫ్రూట్ బాస్కెట్ హబ్‌గా మార్చాలని, పెట్టుబడి లేని సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయించి... ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్ జోన్లు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అంతే కాదు అమరావతి కేంద్రంగా రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురాలలో జోనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా మార్చాలని, స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్రానికి గ్లోబల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పోర్టులు, టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టి, ఉపాధి కల్పనతోపాటు రాష్ట్ర సంపద పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పారిశ్రామికాంధ్ర ఆవిష్కారానికి కృషి జరుగుతున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నవ్యాంధ్రను జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలపగా, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కూడా అగ్రభాగాన నిలపనున్నారు. సుదీర్ఘ తీరప్రాంతం, అపార ఖనిజ సంపద, నౌకాశ్రయాలు, సరసమైన ధరలకు సరిపడా భూమి, మానవ వనరులు, నీరు, విద్యుత్తు అందుబాటులో ఉండడం, పెట్టుబడి రాయితీలు, మనం కల్పించే సౌలభ్యాలు, ప్రోత్సాహకాలు, నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధత, క్యారెక్టర్ ఫలితంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రానున్నాయి.


ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన నూతన పారిశ్రామిక పాలసీలు ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. విభజన సమయంలో రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు లేవు. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వ కృషితోనే అనేక భారీ పరిశ్రమలు బారులు తీరాయి. అన్నీ కోల్పోయిన రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి లక్షల మందికి ఉపాధి కల్పించడం చంద్రబాబుకే సాధ్యమైంది. ఇప్పుడు కూడా పెట్టుబడులు సాధించి రాష్ట్రాభివృద్ధికి బాటలు వెయ్యబోతున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన అడుగులు వెయ్యడం అభినందనీయం.

నీరుకొండ ప్రసాద్

Updated Date - Oct 23 , 2024 | 01:38 AM