Share News

గ్రామ రాజకీయాల స్థాయికి దిగజారిన రాష్ట్ర రాజకీయాలు!

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:47 AM

వర్తమాన రాజకీయాలను చూస్తే ఐదారు దశాబ్దాల క్రితం గ్రామాల్లో నెలకొన్న పెత్తందారీ వ్యవస్థ రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. ఎందరెందరో ప్రముఖ నాయకులు నిస్వార్థంగా రాజకీయాలలో...

గ్రామ రాజకీయాల స్థాయికి దిగజారిన రాష్ట్ర రాజకీయాలు!

వర్తమాన రాజకీయాలను చూస్తే ఐదారు దశాబ్దాల క్రితం గ్రామాల్లో నెలకొన్న పెత్తందారీ వ్యవస్థ రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. ఎందరెందరో ప్రముఖ నాయకులు నిస్వార్థంగా రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన తెలుగు రాష్ట్రాలలో వర్తమాన రాజకీయాలు చూస్తుంటే జుగుప్సాకరమైన అసహనం, ఏమీ చేయలేని చేతకానితనం, భవిష్యత్తులో మరింకేమి కాబోతున్నదోనన్న ఆందోళన కలుగుతున్నదనడంలో బహుశా అతిశయోక్తి లేదేమో.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి మీద జరిగిన రాళ్ల దాడి ఘటననే తీసుకుంటే– నమ్మశక్యం కాని సందేహంగా ఒకవైపు, ఒకవేళ అది నిజంగా ప్రతిపక్షంవారి పనే అయితే, ఇలాంటి చర్యలకు ప్రతిపక్షాలు పాల్పడవచ్చా అన్న మీమాంస మరోవైపు! రాష్ట్ర, దేశ రాజకీయాలలో దినదిన ప్రవర్ధమానమవుతున్న అసంబద్ధ ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తుంటే అపనమ్మకమనే జీవాయుధం తీవ్రంగా పని చేస్తున్న రోజులు వచ్చాయనవచ్చు. ఈ తరహా దాడులు, ‘కుళ్లు రాజకీయాలు’ ఒకప్పుడు గ్రామ రాజకీయాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడవి దేశ, రాష్ట్ర రాజకీయాలలో సర్వసాధారణమైపోయాయి.

ఈ సందర్భంగా ఐదారు దశాబ్దాల క్రితం అలనాటి ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి, గ్రామ రాజకీయాలు జ్ఞప్తికి వస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐఎం) మద్దతుతో శీలం సిద్దారెడ్డి; కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) మద్దతుతో జలగం వెంగళరావు వర్గాలుగా చీలిపోయారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో పెత్తందారుల కక్షలు కార్పణ్యాల వాతావరణం ఉండేది. మా గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐఎం) అభిమానులు ఉన్నప్పటికీ భూస్వాములకు భయపడి నిశ్శబ్దంగా ఉండిపోయేవారు. పంచాయితీ ఎన్నికలలో పోటీకి దిగే సాహసం చేయకపోయేవారు. నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తున్న తమమీద ఉన్న వ్యతిరేకత ఏ క్షణాన బహిర్గతమవుతుందో అన్న భయంతో, కమ్యూనిస్ట్ భావజాల కుటుంబ నేపథ్యం కలిగిన ఒక పెద్దమనిషిని, పెత్తందారీ గ్రామరాజకీయాలను నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. గ్రామ నాయకత్వం జలగం వర్గానికి చెందిన వ్యక్తిగా చాలా మంచివాడైన గ్రామ పోలీసు పటేల్ చేతుల్లో ఉండేది.

పంచాయితీ ఎన్నికల తేదీ ప్రకటించగానే, రచ్చబండ దగ్గర అతడు నిర్ణయించిన అభ్యర్థి పేరే ప్రకటించి, గ్రామస్థుల ఆమోదం ‘మూజువాణీ’ పద్ధతిన పొంది, ఆయననే ఏకగ్రీవంగా సర్పంచ్‌‍గా ఎన్నుకునేవారు. గ్రామ రాజకీయాలను ఆసరాగా చేసుకుని, పెత్తందారులను అడ్డం పెట్టుకుని, గూండాగిరి చేస్తూ ఒక వ్యక్తి పటేల్‌కు సన్నిహితంగా వుంటూ, అతడి అండ చూసుకుని అందరి మీద పెత్తనం చేసేవాడు. తాగుడుకు బానిసై, గ్రామంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడు. సినిమాల్లో వలె పటేల్ అతడి ద్వారా పెత్తనం చెలాయించేవాడు. చివరకు ఇద్దరికీ బెడిసి ఒకరిని మరొకరు బెదిరించుకోవడం, పటేల్ మరో అనుచరుడు సైకిల్ చైన్‌తో అతడిని చితకబాదడం, మొత్తం వ్యవహారాన్ని పటేల్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం ఫక్తు గ్రామ రాజకీయాల స్థాయిలో జరిగాయి. వర్తమాన రాష్ట్ర స్థాయి రాజకీయాలు ఈ స్థితిలోకి వచ్చాయిప్పుడు. తమపక్షంలో లేని వారిని, రానివారిని హింసకు గురిచేయడమే ఇప్పటి రాజకీయంగా మారింది!

మొత్తం మీద గ్రామంలోని ఒకరిద్దరు మోతుబరి రైతులు, పటేల్ పెత్తనం చెలాయించడం విషయంలో ఆగ్రహంగా ఉన్న అతడి మాజీ అనుయాయి, సైకిల్ చైన్ దెబ్బలు తిన్న వ్యక్తి, గ్రామానికి చెందిన పలువురు ఉత్సాహవంతులైన యువకులు, చేతులు కలిపారు. ‘పసుపు బియ్యాల’తో ప్రమాణం చేశారు. (ఇలాంటి ప్రమాణాలు ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయి రాజకీయాలలో ఆనవాయితీ అయిపోయింది. తడిగుడ్డలతో దేవాలయాలలో, స్వంత పిల్లల మీద, ఇలా రకరకాల విధాలుగా చోటుచేసుకుంటున్నాయి).

పంచాయితీ ఎన్నికలు రావడంతో పల్లెటూరి రాజకీయానికి తెరలేచింది. అప్పట్లో మూడంచెల పంచాయితీ వ్యవస్థ ఉండేది. గ్రామంలో మొదలు ఎన్నికలు జరిగేవి. వార్డు సభ్యులను ఎన్నుకునేవారు. ఓటింగ్ వార్డు వారీగా జరిగేది. అదే రోజు సాయంత్రం గెలిచిన వార్డు సభ్యులంతా సాధారణ మెజారిటీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. కొద్ది రోజుల తరువాత సర్పంచ్‌లంతా కలిసి సమితి అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ముందుగా సమితికి ఆరుగురు కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అంతా కలిసి సమితి అధ్యక్షుడిని రహస్య బాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. కో–ఆప్ట్ చేసుకున్న సభ్యులకు కూడా సమితికి పోటీ చేసే అర్హత ఉంటుంది.

ఆ తరువాత సమితి అధ్యక్షులంతా కలిసి ఇదే ప్రక్రియలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. అక్కడా కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే పద్ధతి ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్‌ది చాలా పవర్‍ఫుల్ హోదా. కొందరు కాబినెట్ మంత్రులుగా రాజీనామా చేసి, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎంత పలుకుబడి ప్రాబల్యం వుండేదంటే, వాళ్ల అంగీకారం లేకుండా ముఖ్యమంత్రి కావడం కూడా కష్టంగా ఉండేదారోజుల్లో. ఒకే ఒక్క గ్రామ సర్పంచ్ జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యాన్ని మార్చగలిగే స్థితిలో ఉండేవారు అప్పుడప్పుడూ. సమితిలో ఒక్క ఓటుతో అదృష్టం తారుమారయ్యేది. అదే ఒక్క ఓటు జిల్లా పరిషత్‌లో కీలకమయ్యేది. ఇప్పుడు జెడ్పీ, మండల చైర్మన్లు ఉత్సవ విగ్రహాలే!

‘పసుపు బియ్యాల మీద చేసిన ప్రమాణం’ చేసినవారిలో కొందరు ‘కులం కార్డు’ ప్రాతిపదికగా, తిరిగి పటేల్ వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. పటేల్ చేతిలో పరాభవం పొంది, దెబ్బలు తిని, పాతకాలపు గూండాగిరి మానిన వ్యక్తి కమ్యూనిస్ట్ పక్షాన ఒక వార్డులో పోటీ చేసి గెలిచాడు. తొమ్మిది వార్డులలో ఒక్క వార్డు మినహా, మిగతావన్నీ సీపీఐఎం–శీలం వర్గం కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. ఇప్పటి శాసనసభా పక్షం నాయకుడి ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకునే రాజకీయాల తరయాలో, చివరి క్షణం వరకూ గెలిచిన వార్డు మెంబర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ, పటేల్‌కు అయిష్టమైన ఒకప్పటి ఆయన సహచరుడు, సర్పంచిగా ఎన్నికయ్యాడు.

ఈ నేపథ్యంలో ముగింపు మాత్రం వేరే విధంగా, ఇప్పటి ‘రాష్ట్ర రాజకీయం’, ఒకప్పటి ‘గ్రామ రాజకీయం’ శైలిలో జరిగింది. అచిర కాలంలోనే, మద్యానికి మరోసారి బానిసైన (అలా పటేల్ బానిసగా మలచిన) గ్రామ సర్పంచ్ (కులం కార్డు ప్రాతిపదికగా) పాతపగ మర్చిపోయి, మళ్లీ పటేల్ పక్షంలో చేరిపోయాడు. సమితిలో సగం గ్రామాలు కమ్యూనిస్ట్ (సీపీఐఎం), శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ వర్గం మిగిలిన సగం గ్రామాలు కమ్యూనిస్ట్ (సీపీఐ), జలగం వెంగళరావు కాంగ్రెస్ వర్గం గెలుచుకున్నది. ఖమ్మం సమితి గెలిచిన వారి పక్షమే జిల్లాపరిషత్ గెలుచుకునే పరిస్థితి నెలకొంది.

సమితి ఎన్నిక ఐదారు రోజులే ఉందనగా జలగం, శీలం వర్గాలు తమ తమ సర్పంచ్‌లతో ‘క్యాంపులు’ పెట్టే చర్యలు చేపట్టారు. (విపరీతమైన వ్యయంతో ఇలాంటి క్యాంపు రాజకీయాలు నిర్వహించడం ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సర్వసాధారణం). శీలం క్యాంపునకు మా గ్రామ సర్పంచ్ కూడా వెళ్లాలి. వెళ్లనని పేచీ పెట్టాడు. అప్పటికే (మనం–మనం ఒకే కులం అన్న ప్రాతిపదికన) పటేల్‌తో అతడికి రహస్య ఒప్పందం కుదిరిన విషయం బయటపడకుండా వుంచారు! చివరికి సర్పంచ్ క్యాంపునకు వెళ్లక తప్పలేదు.

పద్ధతి ప్రకారం నిర్ధారించిన తేదీ నాడు ఖమ్మం సమితి అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తొలుత ఆరుగురు కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగాలి. మా గ్రామ సర్పంచ్‌ను, ఇరు (శీలం, జలగం) వర్గాలవారు తమ ఓటు కింద వేసుకున్నారు. (ఇలా ఇరుపక్షాలు ఒకే వ్యక్తిని తమ పార్టీవాడిగా భావించడం రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు చాలా చిన్న విషయం.) మొదటి కో–ఆప్టెడ్ సభ్యుడిగా శీలం–సీపీఐఎం అభ్యర్థి మా సర్పంచ్ వేసిన ఓటుతో గెలిచాడు.

రెండవ అభ్యర్థిగా శీలం–సీపీఐఎం పక్షాన ఒక ప్రముఖ సీపీఐఎం నాయకుడు, సమితి అధ్యక్ష అభ్యర్థి, పోటీలో ఉన్నాడు. ప్రలోభాలకు అప్పటికే గురైన మా గ్రామ సర్పంచ్ అతడికి ఓటు వేయనందున ఓడిపోయాడు. ఆ సమయంలో సర్పంచ్‌కు తీవ్రమైన హెచ్చరిక పోయింది. ఫలితంగా, ఆ తరువాత మిగిలిన నలుగురు కో–ఆప్టెడ్ సభ్యులుగా శీలం–సీపీఐఎం గ్రూపు వారే ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీకి సమితి దక్కకుండా చేద్దామని, జలగం గ్రూపు అభ్యర్థి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినా ఫలితం లేకపోయింది.

గెలిచిన వారిలో సీపీఐఎం పార్టీకి చెందిన ఒకరు సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జిల్లాపరిషత్ చైర్మన్ పదవికి శీలం వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి, వైస్ చైర్మన్‌గా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీకి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. ఇది అప్పట్లో ఒక్క మా గ్రామ, లేదా ఖమ్మం సమితి పరిస్థితి మాత్రమే కాదు. గ్రామ గ్రామాన ఇదే అనుభం కొంచెం మార్పులు, చేర్పులతో!

అలనాటి గ్రామ రాజకీయాలు క్రమంగా మరింత దిగజారి నేడు రాష్ట్ర స్థాయికి చేరుకున్నాయి. గుళ్లో ప్రమాణాలు, పార్టీ మార్పిడులు, కులం కార్డులు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, అమ్ముడుపోవడం, ప్రత్యర్థుల మీద దాడులు, మద్యం ధనం విచ్చలవిడిగా వాడకం, ‘దమ్ముందా, వెంట్రుక పీకలేవు’ లాంటి పదజాలం విరివిగా ఉపయోగం... ఇలా ఎన్నో అతి జుగుప్సాకరమైన రాజకీయాలు రాష్ట్ర, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ దిగజారుడు రాజకీయాలకు ఆద్యులెవారు, బాధ్యులెవరు? ఏ రాజకీయనాయకుడిని అడిగినా అవతలి పక్షం వారివైపు వేలు చూపిస్తున్నారు!

వనం జ్వాలా నరసింహారావు

Updated Date - Apr 24 , 2024 | 05:47 AM