Share News

గిరిజన జీవితాల్లోకి తెరిచిన తలుపులు సువర్ణముఖి కథలు

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:37 AM

శ్రీకాకుళం అనగానే శ్రీకాకుళంతో ప్రత్యక్ష పరిచయం లేనివాళ్ళకు గుర్తొచ్చేది గిరిజనోద్యమ పోరాటం. ఆ ఉద్యమ స్ఫూర్తితో, గిరిజన జాతుల జీవన సంస్కృతిని అవలోకనం చేసుకొని ఉత్తరాంధ్ర తొలి గిరిజన కథ రాసిన రచయిత భూషణం మాస్టారు...

గిరిజన జీవితాల్లోకి తెరిచిన తలుపులు సువర్ణముఖి కథలు

‘‘ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే

శ్రీకాకుళము వైపు చూడమని చెప్పాలి’’

శ్రీకాకుళం అనగానే శ్రీకాకుళంతో ప్రత్యక్ష పరిచయం లేనివాళ్ళకు గుర్తొచ్చేది గిరిజనోద్యమ పోరాటం. ఆ ఉద్యమ స్ఫూర్తితో, గిరిజన జాతుల జీవన సంస్కృతిని అవలోకనం చేసుకొని ఉత్తరాంధ్ర తొలి గిరిజన కథ రాసిన రచయిత భూషణం మాస్టారు. వారికి కొనసాగింపుగా అంతే బలంగా గిరిజన కథ రాసుకొచ్చిన కథకులు సువర్ణముఖి. వీరి నుండి శక్తివంతమైన గిరిజన కథ వెలువడడానికి ప్రధాన కారణం సువర్ణముఖి ఉద్యమకారునిగా గిరిజనులతో మమేకమై జీవించడం. తన సృజనాత్మకతలో ఉద్యమాన్ని లీనం చేసుకొన్న రచయిత. గిరిజన జీవితాలను, ఆరాటాలను, పోరాటాలను, సంస్కృతులను, సాంప్రదాయాలను, ఆచారాలను, మూఢనమ్మకాలను, విశ్వాసాలను, నేస్తరికాన్ని దగ్గరగా చూసిన కథకులు సువర్ణముఖి. ఆయన కథలు రావిశాస్త్రిని సైతం తలపిస్తాయి.


1970 దశకం తరవాత గిరిజన కథ జవసత్వాలను పుంజుకుంది శ్రీకాకుళ ఉద్యమ దన్నుతోనే. పోరాటాన్ని, నిర్భందాన్ని, పునర్నిర్మాణాన్ని దశలవారిగా ఉత్తరాంధ్ర కథకులు అక్షరీకరిస్తూ వచ్చారు. సువర్ణముఖి తన కథల్లో నిర్బంధాన్ని, ఉద్యమ పునర్నిర్మాణాన్ని క్రోడీకరించుకుని కథలుగా రాసారు. 1989-95 మధ్య కాలంలో తొమ్మిది కథలను ‘సువర్ణముఖి కథలు’ పేరుతో ప్రచురించారు. రెండు దశాబ్దాల తర్వాత 2017లో ‘గోరపిట్ట’ పేరుతో మరొక కథల సంపుటి వెలువరించారు. శ్రీకాకుళ పోరాట మలిదశ కాలంలో వెలువడిన కథలుగా వీటిని గుర్తించవచ్చు. ఉత్తరాంధ్ర గిరిజన కథా సాహిత్యంలో స్వీయానుభవ కథకుల కంటే సహానుభవంతో రాసిన కథకులే ఎక్కువ మంది కనిపిస్తారు. దానికి ప్రధాన కారణం మైదాన ప్రాంత ప్రజలకు చేరువైనట్లుగా గిరిజన ప్రాంత ప్రజలకు విద్య అందలేదు. కొండలకు ఆనుకుని ఉన్న అడవుల్లో నివసించే గిరిజన తెగలలో క్రమపరిణామాల్ని చిత్రించాలంటే వారి జీవితాలతో రచయితలకి చాలా దగ్గర సంబంధం ఉండాలి. అలాంటి సంబంధాన్ని కలిగి, ఉత్తరాంధ్రలో ఉన్న సవర, జాతాబు, గదబ, కొండదొరల జీవితాల్లో వచ్చిన మార్పులను సాంస్కృతిక నేపథ్యం నుంచి చిత్రించినవిగా సువర్ణముఖి కథలు కనిపిస్తాయి.


విజయనగరం జిల్లా అంతటా ప్రవహించే సువర్ణముఖి నది పేరును తన కలం పేరుగా రౌతు బంగారునాయుడు మార్చుకున్నారు. సువర్ణముఖి ఎంచుకున్న కథా వస్తువలు ఎచ్చుతక్కువలు లేకుండా కచ్చితత్వం కలిగి ఉంటాయి. తాను చూసిన గిరిజన తాత్విక జీవితాలను, గత పోరాట జ్ఞాపకాలను మదిన నిలుపుకొని తన కథలు నడిపారు.

1967 అక్టోబర్‌ 31న వందలాది గిరిజనులు-పిల్లాపాపా, స్త్రీలు, వృద్ధులు అందరి అడుగులు మొండెంఖల్లు గిరిజన సభా ప్రాంగణంవైపు. ఆ సభకు వచ్చిన కొండగొర్రె మంగన్న, ఆరిక మంగన్న అనే ఇద్దరు ఆదివాసిలు అమరులయ్యారు. వారిరువురితోపాటుగా శ్రీకాకుళ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి జాతరగా బయలుదేరిన అశేష జనసంద్రాన్ని దృశ్యీకరించిన కథ ‘యాతర’. ఈ కథలో వారు ప్రయోగించిన భాష మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ‘‘తూం మీద అడ్డ, అడ్డ మీద తవ్వ, తవ్వ మీద సోల, సోల మీద గిద్ద, గిద్ద మీద సుత్తీ కొడవలి’’ అని స్తూపం గురించి వచనం చెప్పడంలోనూ ముక్తపదగ్రస్త అలంకారాన్ని ప్రయోగించారు. చివరకు ఆ స్తూపం ‘‘పుట్టిడు బియ్యం పట్టిన గూనలాగ మిగిలింది’’ అనడంలో కూడా ఉపమాలంకారం చూపించారు. స్థానిక భాషను ప్రయోగిస్తూ ఆ అమరవీరు త్యాగాన్ని గురించి ఈ కథలో తెలిపారు.


గిరిజనుల ‘కొండగాలి’లోకి పల్లం వాళ్ళ ‘కొత్తగాలి’ ప్రవేశంతో వాళ్ళ బతుకులు చిన్నాభిన్నంగా మారిపోయాయి. పాలన పేరుతో, వ్యాపారం పేరుతో, చట్టం పేరుతో, కొండల్లోకి, అడవుల్లోకి, గూడెంలోకి ప్రవేశించి అడివిని, కొండని దోచుకున్నారు. ఆ దోపిడికి సాక్షమే ‘సావుకర్చు’ కథ. శ్రీకాకుళ పోరాటంలో అసువులు బాసిన అమర వీరుల త్యాగ ఫలితాలకు కొండకి విద్యుత్‌, రోడ్డు, కార్పోరేషన్‌, బడులు వచ్చాయి. ‘‘ఓరే సుబ్బా! మీ యమ్మని కుడిసేత్తోటి సంపీసి, ఎడమ సేత్తోటి పాలిచ్చి తాగమంటే తాగుతావురానువ్వూ...? అలగే చేసినార్రా. సంపీసి సావుకర్చు ఇచ్చినార్రా!’’ అని రచయిత పలికించిన మాటల్లో గిరిజనుల వాస్తవ జీవితం దాగి ఉంది. సందర్భానుసారంగా ప్రయోగినచిన భాష, అలంకారాలు కథకు మరింత సౌందర్యాన్ని తెచ్చి పెట్టాయి. ‘‘కరెంట తంబామ్మీద ఎవలో చుట్ట కాలుతున్నట్టగ ఎర్రగ రంగమ్మిరపకాయనాగ ఎలుగెలిగి పోతుంది, కరెంటుబుడ్డీ’’ అని చెప్పడంలో స్వచ్ఛమైన ఉత్తరాంధ్ర భాష దాగి ఉంది. గిరిజనుల కష్టం ఏ రీతిగా పల్లం ప్రజల, అధికారుల చేతిలోకి వెళ్ళిపోతుందో రచయిత తనదైన శైలిలో చెప్పారు. ‘‘వెండి పోతలాగ పార్తంది ఏరు. కొండమీదున్న సవరోళ్ళ సెమటే గావల వూటల్లాగ అలగ కారికారి ఒక దగ్గర చేరిచేరి ఇలా నార్లంది. అది తిన్నగ ‘వనజ’ పండివోడి భూమిలోకి, దాన్నించి ‘జియ్యమ్మవల్స’ మండలాదికొరిగోరి భూమిలోకి ఎల్లిపోతాది. సవరోళ్ళ సెమట అక్కడ సరుకైపోద్ది’’ అని రాస్తారు సువర్ణముఖి.


సువర్ణముఖి కథల్లో నాటకీయత ఉంటుంది. కథ విభిన్నంగా నడుస్తుంది. ఆదివాసిల ఘర్షణలను, ఘటనలను చిత్రీకరించిన తీరుకు సంబంధించి ‘పండుగ’, ‘గోరపిట్ట’, ‘సుక్కి’ కథలు కనిపిస్తాయి. ఈ కథలన్నీ విస్తృతమైన నిడివి కలిగి ఉంటాయి. ప్రభుత్వం ప్రజాదర్బార్‌ పథకంలో భాగంగా గిరిజన యువకుల్ని ఆకర్షించి పోలీసు ఉద్యోగాలిచ్చి ఇన్‌ఫార్మర్‌లుగా మార్చడం, ఫలితంగా ఉద్యమకారులంతా ఉద్యోగాల్లో చేరిపోవడం ‘పండుగ’ కథలో కనిపిస్తుంది. కొండ ప్రాంతంలో జీవిస్తున్న సవరలు నాగరిక సమాజం ఇష్టానికి అనుగుణంగా జీవించే ప్రయత్నంలో మోసపోతున్నారు. అడవిలో ప్రవేశించిన గిరిజనేతరుల చేతిలో నలిగిపోతున్న ఆదివాసి మహిళల ఆత్మఘోష ‘గోరపిట్ట’ కథ.

‘‘సువర్ణముఖి ఎప్పుడూ ఒక వాతావరణం, ఒక దృశ్యం, ఒక సంఘటన లేకుండా మనముందు ఒక సత్యాన్ని ఆవిష్కరించడు’’ అని వరవరరావు అన్నట్లుగా శక్తివంతమైన శైలితో, స్వచ్ఛమైన భాషతో ఆయన కథలు మనల్ని వెంటాడతాయి. ఇంత మంచి కథలు వెలువడడానికి ప్రధాన భూమిక శ్రీకాకుళ గిరిజనోద్యమం. ఆ పోరాట అనుభవాలలో పెరిగినవారు సువర్ణముఖి. ఉద్యమ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకొని ఆదివాసిల జీవితపు పార్శ్వాలను విభిన్న కోణాల్లో చూపించారు.

సారిపల్లి నాగరాజు

80083 70326

Updated Date - Jun 17 , 2024 | 03:37 AM