శ్రీసుధ మోదుగు స్వచిత్ర కవిత్వం
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:41 AM
ఒక పాఠకుడిగా నాకు ఏ predetermined అభిప్రాయాలు కవిత్వానికి సంబంధించి ఉండవనే అనుకుంటాను. ఇప్పుడు కవిత్వ పాఠకునికి కావాల్సిందల్లా, శాశ్వతంగా పీఠాలు వేసి కూర్చున్న అనుభవాలనూ అర్థాలనూ decentralize చేస్తూ, ముక్కలు చేస్తూ...
ప్రియ పద్యం
ఒక పాఠకుడిగా నాకు ఏ predetermined అభిప్రాయాలు కవిత్వానికి సంబంధించి ఉండవనే అనుకుంటాను. ఇప్పుడు కవిత్వ పాఠకునికి కావాల్సిందల్లా, శాశ్వతంగా పీఠాలు వేసి కూర్చున్న అనుభవాలనూ అర్థాలనూ decentralize చేస్తూ, ముక్కలు చేస్తూ పోవటమే. తిరిగి కొత్త అర్థాలను అనుభవాలతో కలుపుతూ పోవడమే అత్యంత ఆధునిక కవిత్వంలోని పాఠక చర్య. ఇప్పటి మైక్రో విశ్వమే కిటికీ, పగిలే ముక్కలే ప్రవాహానుభవాలు. చూస్తూనే వున్నాం ఇటువంటి చిత్రధ్వనుల్ని. అందుకే, each and every tiny spectacle will morph into a spectacular world. ఇటువంటి అనుభవాన్ని తల లోపల, గుండె మీద ఎండాకాలం వానజల్లు లాగా శ్రీసుధ మోదుగు తీసుకు వచ్చింది. పద ధ్వని మాత్రల వివశత్వాన్నిస్తూ, విశ్రాంతిని విభ్రాంతిని పోగు చేస్తూ, కొన్ని ప్యారాగ్రాఫ్ కవితలతో. ఇందులోని పంక్తులలో multiplicity వుంది. గాఢత పెనవేసుకుంటూ పోయే నిరలంకారత కూడా వుంటుంది. సామాన్యత లోని అసమాన చలనాన్ని పసిగట్టడం చాలా అరుదైన విషయమే అనుకుంటాను. ఇస్మాయిల్ గారి నుంచీ వజీర్ రహ్మాన్, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, మందరపు హైమవతీ, రంధి సోమరాజు, మునాస వెంకట్, సూఫీ వచనకారుల అడుగుల ముద్రలు ఉండనే ఉన్నాయి. స్పష్టతలో అస్పష్టతను వికసింపచేయడం గొప్ప రసచర్య అని అనిపిస్తూ ఉంటుంది.
ఈ కవితల్లో వొక సహజతనంలో, నిలకడగా భ్రమింపజేసే వేగముంటుంది. Slowness కనపడుతుంది. నిశ్శబ్ద విస్తృతి వుంటుంది. వొక సన్నటి అలికిడిగా అనిపించే శబ్దమూ, నిర్లయా కళ్ళకు వినిపిస్తుంది. శిల్పి తన ఏకాగ్రతలో నిర్వాణ స్థితికి చేరుకుంటాడు- అనే గొంగళి పురుగులోని Metamorphic గుర్తింపు కూడా వుంటుంది. పువ్వు రాలిపోతూ మళ్ళీ మొగ్గనై పుడతాననే మాటను అందించి వెళ్ళిపోతున్నట్టు. ఇటువంటి కవిత్వానికి కంటెంట్ మొత్తం జీవితమే. ప్రతి శకలమూ ఆరంభ అంతమే. చీకట్లో కొన్నిసార్లు ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ పోవడమే కాదు వొక్కో దీపాన్ని మలుపుతూ పోవడం కూడా పాఠక గుణం అయ్యి వుండాలి, రాత్రిని అర్థం చేసుకోవడం కోసం అనుకుంటాను. ఈ కవిత్వంలోని క్లుప్తత ఇదే చెబుతుంది. గొంగళి పురుగును తెలంగాణ తెలుగు భాషలో బొంత పురుగు అని కూడా అంటారు. అందుకే బొంత పండు వంటి భయ స్నిగ్ధత కూడా వుంటుంది రూపంలో. అది క్రమంగా వొక సీతాకోక చిలుకయ్యి తోట వైపు ఎగిరిపోవడం వొక గొప్ప transmigration వంటి అనుభవం పాఠకునికి కవిత్వం లోనికి సాహస యాత్ర చెయ్యడానికి ఉన్మత్తంగా.
సిద్ధార్థ
73306 21563