Share News

చెమట రంగు పతాకం

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:29 AM

నమ్ముకున్న రెక్కలు మిత్తి లెక్కలకు మింగుడుపోతే.. పల్లె తల్లి కంట్లె నీళ్లు తుడుస్తూ పట్నం బాటల కదిలే బతుకు చక్రానివైతివి...

చెమట రంగు పతాకం

నమ్ముకున్న రెక్కలు

మిత్తి లెక్కలకు మింగుడుపోతే..

పల్లె తల్లి కంట్లె నీళ్లు తుడుస్తూ

పట్నం బాటల కదిలే

బతుకు చక్రానివైతివి

నాలుగు రోడ్ల కూడళ్ళో

మూడు రాళ్ల పొయ్యిమీద

జొన్న రొట్టెవై కాలే నువ్వు

శెక్కర బీమారోల్లకు

తీపి జ్ఞాపకం పంచే

అన్నపూర్ణవైతివి

గంపెడు పిల్లల్ని

కండ్ల గంప కింద కమ్మి

రొట్టెంట రొట్టెవై

రోజును ఈదుతుంటే..

బతుకు పద్యానికొక

కొత్త అలంకారానివనిపిస్తావు

రోడ్లన్నీ నిద్రపోయేవరకు

అలుపెరుగక జోకొట్టే

నీ మునివేళ్ల కళకు

పజ్జొన్న పిండి ముద్ద

పసిడి రంగు జాబిలయితది


ఏ తండా కన్న బిడ్డవో

రూపాలీ..

తన మీద మచ్చతో

చంద్రుడే నీ నుండి

భేదమయ్యాడు కానీ

దాటలేని అగాధాలను

గుండె పొరల కింద దాచి

చెరగని చిరునవ్వు వెదజల్లే

వెన్నెల పున్నమి నువ్వు

పల్లె నుండి ఎవరైనా

అయినవాళ్ళొస్తే

చుక్కలు తెగిన ఆకాశమల్లే

దిక్కుల నిండా దుఃఖమై పారుతావు

అయినా..

జీవితంపై ఓటమినెప్పుడూ

ఒప్పుకోని నువ్వు

చెమట రంగు పతాకాన్ని

ఆత్మగౌరవమై ఎగరేస్తావు!

తుల శ్రీనివాస్

99485 25853

Updated Date - Dec 23 , 2024 | 01:29 AM