సంగీత విశ్వంలో తబలా శబ్దబ్రహ్మ
ABN , Publish Date - Dec 19 , 2024 | 02:35 AM
సంగీత జగత్తులో అనుపమేయ గాంధర్వులు కొందరు ఉంటారు. అటువంటి అరుదైన ప్రజ్ఞావంతులలో జాకిర్ హుస్సేన్ ప్రథమగణ్యుడు. సంగీత విశ్వానికి భౌగోళిక సరిహద్దులు ఉండవు కదా. కనుకనే సప్తస్వరాల...
సంగీత జగత్తులో అనుపమేయ గాంధర్వులు కొందరు ఉంటారు. అటువంటి అరుదైన ప్రజ్ఞావంతులలో జాకిర్ హుస్సేన్ ప్రథమగణ్యుడు. సంగీత విశ్వానికి భౌగోళిక సరిహద్దులు ఉండవు కదా. కనుకనే సప్తస్వరాల వినూత్న మేళవింపుతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన జాకిర్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సమస్త సమాజాలలోను ప్రభావశీలుడుగా వెలుగొందారు. భౌతికంగా ఒక నిర్దిష్ట తరానికి చెందినవాడైనా ఆయన సార్వకాలికుడు. తండ్రి తబలా మేస్ట్రో అల్లా రఖా నుంచి తొలి శిక్షణ పొందిన జాకిర్ వ్యక్తిత్వం, ప్రతిభ, సృజనశీలత ఆయన ఒక అద్వితీయ సంగీత ప్రదేశ కాలాలలోకి ప్రవేశించేందుకు అన్ని విధాల ప్రేరేపించాయి. భారతీయ సంగీత వాహిని ప్రపంచవ్యాప్తమవుతున్న తరుణంలో జాకీర్ రంగప్రవేశం చేశారు. ఆయన నేతృత్వంలో భారతీయ గాయనీ గాయకులు, సంగీత స్రష్టలు పాశ్చాత్య దేశాలు ‘ప్రపంచ సంగీతం’గా పిలిచే సమ్మిళిత సంగీతాన్ని సృష్టించారు. ప్రపంచ వేదికలపై కీర్తి కిరీటాలు ధరించారు.
భారత్ ఆ సంగీతాన్ని సంలీన లేదా మిశ్రమ సంగీతంగా పరిగణించింది. ఏ పేరుతో పిలిచినా గులాబీ గులాబీయే కదా. ఆ సంగీత ప్రపంచం వికాసానికి, విస్తరణకు జాకిర్ భాయి మార్గదర్శకత్వం వహించారు. ప్రపంచవ్యప్తంగా విభిన్న సంగీత శైలులలో సుప్రతిష్ఠులు అయిన సంగీతవేత్తలతో కలసి సంయుక్తంగా కొత్త ‘ప్రపంచ సంగీతం’ను అభివృద్ధిపరిచారు. ఈ వినూత్న సృజనాత్మక ప్రస్థానంలో ఆయన తన పెద్దలు కొంత మంది అడుగుజాడల్లో నడిచారు. తండ్రి అల్లా రఖా, విఖ్యాతుడు అలీ అక్బర్ ఖాన్ మొదలైన వారితో కలసి సంగీత సృష్టిలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి అభివర్ణించడానికి విశేషణాలు లేనటువంటి లోకోత్తర హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని సృజించారు. ఇరవయో శతాబ్ది హిందుస్థానీ సంగీత ప్రేమికులు ఎంతగానో ఆస్వాదించిన సంగీతమది.
1970లలో శక్తి రికార్డింగ్స్‌లో ఆయన నిత్య నూతన సజీవ సంగీతాన్ని విన్న తరువాత నేను తబలా సంగీతం పట్ల ఆకర్షితుడినయ్యాను. అంతిమంగా జాకిర్ హుస్సేన్ ప్రపంచంలోకి ప్రవేశించాను. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సాంస్కృతిక లోకంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జాకిర్ భాయి నాకు పరిచయమయ్యారు. జాకిర్‌తో నా తొలి అనుభ వాలతో ఆయన ఆలోచనాశీలత, నమ్యత, భావ ప్రసార నైపుణ్యం నాకు తెలిసివచ్చాయి భారతీయ సంగీత సంస్కృతి పురిగొలిపే ఆశలు, అనివార్యం చేసే నిరీక్షణలు తదితర విషయాలపై అవగాహన లేనివారితో ఆయన ఎంత ఓర్పుగా, నేర్పుగా మాట్లాడతారో నేను స్వయంగా చూశాను.
భిన్న నాగరికత, సంస్కృతికి చెందిన మాతో విపులంగా మాట్లాడేందుకు, తన సంస్కృతిని మాతో పంచుకునేందుకు ఆయన సదా సుముఖంగా ఉండేవారు. జాకిర్‌లోని ఈ సుగుణాలకు మూలాలు తండ్రి విశాల వైఖరులలో ఉన్నాయి. తండ్రి నుంచి పొందిన శిక్షణకు, సంగీత, బౌద్ధిక వారసత్వాలకు జాకిర్ భాయి వన్నె తెచ్చారు. విశాల ప్రపంచంలోకి ప్రవేశించేందుకు, భారతీయ జయపతాకలు ఎగురవేసేందుకు ఆయన వాటిని బాగా సద్వినియోగపరచుకున్నారు. మాపై ఆయన ప్రభావం, మా పట్ల ఆయన చూపిన ప్రేమానురాగాలు మా జీవితాలలో శాశ్వతంగా ఉండిపోయాయి.
అల్లారఖా సమక్షంలో ఉన్నప్పుడు సదా కుతూహల స్వభావంతో ఉండి తీరాలి. ఇది ఆయన కుమారుడి విషయంలోనూ నిండు సత్యమే. జాకిర్ భాయి స్ఫూర్తిదాయకంగా, హాస్య ప్రవృత్తితో మాట్లాడుతారు. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతమైనది. ఆయన ఆసక్తులలో వైవిధ్యం మనలను ఆశ్చర్యపరుస్తుంది. క్రికెట్ నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు ఆయనకు తెలియని విషయం లేదు. సరే, ప్రతి సంగీత శైలిపట్ల ఆయనకు ఆసక్తి మాత్రమే కాదు, అభిమానం, ఆదరణ కూడా చాలా మెండుగా ఉన్నాయి.
జాకిర్ భాయిలోని ఈ విశిష్ట గుణాల గురించి తెలిసినవారు ఎందరో ఉన్నారు. ఉత్కృష్ట ప్రతిభావంతుడైన సంగీతజ్ఞుడుగానే కాదు, తన జీవిత పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి శ్రేయస్సు, సంక్షేమం గురించి చిత్తశుద్ధితో ఆలోచించే మానవత కూడా ఆయనలో మెండుగా ఉన్నది.
భారతీయేతర సంగీత సంప్రదాయాలు, ఆయా సంగీత శైలుల ప్రతిభావంతుల పట్ల ఆయన గౌరవాదరాలు అద్వితీయమైనవి. మనకు భిన్నమైనవారిని ఎలా ప్రేమించాలో, ఆదరించాలో ఆయన మాకు నేర్పారు. సంగీత ప్రపంచంలో తనకు ముందున్న, తన తరానికి మార్గదర్శకులుగా ఉన్న వారిని జాకిర్ అపరిమితంగా గౌరవించేవారు. తన తండ్రి తరానికి చెందిన తబలా కళాకారుడు కిషన్ మహరాజ్, నేపథ్య గాయని ఆశా భోస్లేల పట్ల ఆయన చూపే గౌరవాభిమానాలే అందుకు నిదర్శనం. పెద్దలనేకాదు, తన కంటే చిన్నవారినీ ఆయన అమితంగా అభిమానించేవారు, ఆదరించేవారు, ప్రోత్సహించేవారు, భారతదేశంలోను, వివిధ దేశాలకు చెందిన యువ సంగీతజ్ఞులకు ఆయన అందించిన సహాయ సహకారాలు ఎనలేనివి. జాకిర్‌లోని ఆ పెద్దరికమే ఆయన్ని ఎందరికో గౌరవపాత్రుడిని చేసింది. న్యూజీలాండ్‌లోని ఆక్‌లాండ్ నగరంలో జరిగిన ఒక సంగీత కచేరి సందర్భంగా స్థానిక పసిఫిక్ ఐలెండ్‌కు చెందిన డ్రమ్మర్లను ఆహ్వానించి వారితో కలసి ఆనాటి శ్రోతలకు మరపురాని సంగీతాన్ని అందించారు. ఆ డ్రమ్మర్లతో కలసి సంగీతాన్ని సృష్టించడం ద్వారా ఆయన తన సహచరులకు, శ్రోతలకు బాహాటత్వం, సమ్మిళితతత్వం గురించి విలువైన పాఠాలు నేర్పారు.
యువ సంగీతజ్ఞుడి స్థాయి నుంచి భారతీయ శాస్త్రీయ సంగీతం అగ్రగామి ప్రతినిధిగా ఎదిగేందుకు జాకిర్ నిర్విరామంగా కృషి చేశారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన తరువాత యువ సంగీతజ్ఞులకు కచేరీ న్విహణకు, రికార్డింగ్ అవకాశాలను కల్పించడంలో కూడా ఆయన నిరంతరం ఎంతగానో తోడ్పడేవారు. అందుకు తన పలుకుబడిని, ఉదారశీలతను వినియోగించేవారు.
జాకిర్ శాశ్వతంగా నిష్క్రమించారు. ఆయనతో యాభై సంవత్సరాల స్నేహ బంధం ఉన్నవారైనా లేదా కేవలం ఐదు నిమిషాల పరిచయమున్నవారైనా ఆ మానవీయుడిని ఎన్నటికీ మరచిపోలేరు. ఆ తబలా మాంత్రికుడు తన సంగీతంతో మన జీవితాలలో ఎప్పటికీ ఉంటారు.
గ్రెగొరీ డి బూత్
ప్రొఫెసర్, యూనివర్శిటీ ఆఫ్ ఆక్‌లాండ్, న్యూజీలాండ్
(వ్యాసకర్త ‘బిహైండ్ ది కర్టెన్ : మేకింగ్ మ్యూజిక్ ఇన్ మూంబైస్ ఫిల్మ్ స్టూడియోస్; బ్రాస్ బాజా : స్టోరీస్ ఫ్రమ్ ది వరల్డ్ ఆప్ ఇండియాస్ వెడ్డింగ్ బాండ్స్ రచయిత)
(స్క్రోల్ సౌజన్యం)