Share News

జ్ఞాపకాల నీడలలో కన్నీటి జాడలు

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:50 AM

తన నిజమైన ప్రేమను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. కళ్ళ ఎదుటనే నడయాడుతూ కడదాకా హింసించింది. తాను బ్రతికున్నంత కాలమూ ఇతడిని విరహాగ్నిలోనే కాల్చి వేసింది. కఠినాత్మురాలు ఆ ప్రేయసి. ఈమె...

జ్ఞాపకాల నీడలలో కన్నీటి జాడలు

తన నిజమైన ప్రేమను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. కళ్ళ ఎదుటనే నడయాడుతూ కడదాకా హింసించింది. తాను బ్రతికున్నంత కాలమూ ఇతడిని విరహాగ్నిలోనే కాల్చి వేసింది. కఠినాత్మురాలు ఆ ప్రేయసి. ఈమె అప్రాప్త మనోహరి,- అవాస్తవ మనోహరి కాదు. ఇది వాస్తవం. అయినా ఆ ప్రేయసిని పల్లెత్తు మాట అనని సిసలైన ప్రేమికుడు అసలైన ఈనాటి భావకవి నెల్లూరు నివాసి షేక్ మహబూబ్ బాషా.

చదువుకుంటున్న రోజుల్లో ప్రేమలో పడి, తిరస్కృతుడై మనసు జార్చుకున్నా గుండె జార్చుకోకుండా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడై ఉద్యోగిస్తూ భావకవిత్వంలో పడి ఉపశాంతి పొందుతూ కరుణశ్రీ ప్రభృతుల ప్రోత్సాహంతో పద్య శిల్పానికి మెరుగులు దిద్దుకొని విరహ వేదన పుక్కిలించిన పదాలతో పద్యాలు అల్లి అందని ఆమని పేరిట ఒక సప్తశతిని సంతరించి అప్పటికి బతికే ఉన్న తన ప్రేయసికి (2008) అంకితం చేసిన మనస్వి ఈ భాషా.


ఇది ప్రియా పరాఙ్ముఖ తప్త హృదయ కవిత

ఇది చిరవియోగ కరుణార్ద్ర హృదయ కవిత

ఇది ప్రణయ సౌరభ పరీత హృదయ కవిత

కలికి! నా ప్రేమ చిహ్నమీ కాన్క గొనుము

అప్పటి నుంచీ విరహ కవిత్వం రాస్తూనే ఉన్న ఈ కవి ప్రస్తుతం అశీతివసంతాల (80) వృద్ధుడు అలవాటు ప్రకారం వసంతాలన్నానే కానీ వీరి పద్యాలలో ప్రజ్వరిల్లే విరహాగ్ని వేడిమిని చూస్తే అశీతిగ్రీష్మాల వృద్ధుడనాలి. ఇప్పుడు వీరి విరహాగ్నికై వార్ధకాగ్ని తోడయ్యింది. ‘జ్ఞాపకాల నీడలతో’ సేద తీరుతూ రాసు కున్న ప్రణయ గీతాలను అదే శీర్షికతో పాఠకులకు అందించారు (జనవరి 2024). ఆనాటినీ ఈనాటికీ అదే అంకితగీతి– కలికి! నా ప్రేమ చిహ్నమీ కాన్క గొనుము. ఆమె జీవించి ఉండటం మరణించడం అనేవి అప్రధానాలు. తన ప్రేమ మాత్రం శాశ్వతం. ఆమె తిరస్క రణ వాస్తవం. తన విరహ వేదన అంతకన్నా వాస్తవం - శాశ్వతం. కోపంలేని, ద్వేషం రాని విరహ వేదన.

‘అకట! కనుచూపునకును నోచుకొనకుండా మనము కన్నుమూ యుదు మేమొ’’యని ఈ కవికి అలనాటి ఆవేదన. విషాదభరిత మైన ఊహ. హృదయము భరింపజాలని వ్యథ (732). ఈ ఊహ కూడా సడలి పోయిన దశ వచ్చేసింది.


చంద్రునకు శుక్ల కృష్ణ పక్షముల లీల

మర్త్యునకు యౌవనము జర మరణ మెసగు;

అస్తమించియు ఉదయించు అమృతకరుడు

కాని- కనుమూసిన నరుండు కను దెరవడు (737)

‘‘శిశువు - పుట్టినప్పుడేడ్చి మోదంబు చేకూర్చు. తరలిపోవు నాడు తనవారి నేడ్పించు తాను మౌనమూని’’ - (738). ఇంతటి పరిణతి వచ్చిన ఈ దశలోనూ వీరు ప్రేయసిని మెచ్చుకుంటూనే ఉన్నారు. ‘‘నీవు దక్కని లోటును నీ వియోగ బాధ పూరించె- అక్కున వాల్చి నన్ను. నిన్ను కరగింప జాలక నేను కరగిపోతి. దుఃఖాగ్ని కీలల పొందులోన’’ (741) అని అంగీకరించే ఔదార్యం, ‘‘గగన కుసుమమైపోయె నీ కరుణ- కాన అచటికే ఏగి అద్దాని నందు కొందరు’’ (743) అనే ధీమా అపూర్వంగా ఏర్పడ్డాయి. ఆ జ్ఞాపకాలూ ఆ విరహ బాధలూ ఆ తపనలూ అన్నింటినీ ఇప్పుడిలా దిగమింగుతూ రోజురోజుకూ తరిగిపోతున్న ఆరోగ్యం - దాపురించిన అనారోగ్యం- ‘‘నన్ను తరలించు నైరూప్య నరకమునకు’’ (744) అనే ఎరుకతో కూడిన సంసిద్ధత వీరిలో ఏర్పడింది. ‘‘ఒడిదుడుకులెన్నో తలదాల్చి బడలినాను ఇక వెడలు వేళ కావచ్చెనిల్లు వదలి అయిన ఆగిపోలేదు సఖి! నాదు అంతరంగ మథన మిపుడు నీ మీది మరుల వలన; ఇక రచన నాపవలెనని యెంతు గాని అది వినక చాటుగా వచ్చి యెదను మీటు’’ (750). దీని ఫలితం ఏమిటంటే-– ‘‘ప్రేయసీ! జీవితమె నాకు లేకుండ చేసినావు, వ్యథను పలికించి ప్రయణ కావ్యముగ మలిచి సాహితీ జీవితము నీ కొసంగి నాను’’ (754). ఇలా అనగలిగిన భావకవి మరొకడు కనపడడు.


వ్యాధులకు గురి గావించి బాధ పెట్టి

బంధువుల నేడిపించి చంపంగనేల?

మృత్యువా! క్లేశముక్తమౌ మృతి ఘటించి

మంచి పేర్వడసి భువి జీవించ రాదొ! (767)

– అప్పుడు గదా నీకు మృత్యు దేవత అనే పేరు సార్థకమ వుతుందంటూ సంభాషించడం వేదన తీవ్రతకు పరాకాష్ఠ. ‘‘నేడు ధాత్రికేను పరాయివాడ నైతి.’’ గతం గతః వదిలెయ్యండి అని చెబుతారుగానీ అది అంత సులువా? ‘‘పాము కుబుసము త్యజి యించు పగిది గతము మరువజాలునె మానవ మాత్రుడెందు?!’’ (778).

ప్రేయసీ! ఇంతకీ ఇప్పుడు నువ్వు ఈ లోకంలో ఉన్నావో? లేవో? తెలీదు. ఒకవేళ నువ్వు ఉన్నప్పటికీ- ఎగసి నీ చెంతకు ఉరకలేను. అలసి రెక్కలాడవు నేడు. అడుగు పడదు.


అతినిగూఢము సృష్టిరహస్య పథము

అందినట్లుండి ముందున కరుగుచుండు

కల్పములెన్ని దరలినగాని– పుడమి

రహస్యము అందని ఆకసమ్మె.

ఇదే వస్తువుతో రాసిన వీరి తొలి కావ్యం ‘అందని వసంతం’, ఈ మలి కావ్యం ముగింపు – ‘‘ఏనగ వసంత మాదిగా ఋతువులైదు జీవితాద్యానము స్పృశించె శిశిరమిపుడు. ఇంతటి శిశిరంలో కూడా వీరికి ప్రేయసి స్వప్నంలో సాక్షాత్కరిస్తూనే ఉంది. హృదయ వీణ మీటుతోంది. పాపం ఆమె వేళ్ళు కందిపోతున్నాయేమీ అని ఈ విరహి తపిస్తున్నాడు.

జ్ఞాపకాల నీడలలోన నడుము వాల్చి

గుండె బరువు తొలగంగ కునుకు తీయ-–

స్వప్నమున – రాగ రంజిత భగ్న హృదయ

వీణ మీటావు మానస వీధి మెరయ

చెలియ! నీ మృదులాంగుళు లలసెనేమొ?!

ఇలాంటి రసార్ద్రమైన కావ్యాలను చదవడం కొంచెం కష్టమే. ఎక్కడో చటుక్కున ఉబికి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ చదవాలి. అలిసిపోయిన మనస్సుకు విశ్రాంతి ఇస్తూ చదవాలి. విరమించలేక మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇంత కష్టపెట్టిన కవినీ అతడి అప్రాప్త మనోహరినీ మనస్సుకు హత్తుకోవాలి.

బేతవోలు రామబ్రహ్మం

98481 69769

Updated Date - Oct 07 , 2024 | 04:50 AM