Share News

ఆలయం.. ఆదరణ.. అక్కసుల చరితం!

ABN , Publish Date - Dec 03 , 2024 | 06:15 AM

సర్వమత సమాదరణలో మనకు సాటిరాగల దేశం లేదని గర్వంగా చెప్పుకుంటాం. శతాబ్దాల మతాల సహజీవనానికి అదే కారణమనీ నమ్ముతాం. అది నూటికి నూరుపాళ్లూ నిజమా? ఒట్టి ఆదర్శ ప్రచారమా? చరిత్ర పరిశీలనకు...

ఆలయం.. ఆదరణ.. అక్కసుల చరితం!

సర్వమత సమాదరణలో మనకు సాటిరాగల దేశం లేదని గర్వంగా చెప్పుకుంటాం. శతాబ్దాల మతాల సహజీవనానికి అదే కారణమనీ నమ్ముతాం. అది నూటికి నూరుపాళ్లూ నిజమా? ఒట్టి ఆదర్శ ప్రచారమా? చరిత్ర పరిశీలనకు అది నిలబడేదేనా? మన పాలకులు అంతటి విశాల హృదయులా? రాజ్యాన్ని వీరభోజ్యంగా భావించిన నేలలో అంతటి ఔన్నత్యాన్ని ప్రదర్శించారా? అన్నీ గంభీర ప్రశ్నలే! అందరినీ సంతృప్తిపరచే జవాబులే తేలికగా లభించవు! రాజ్య విస్తరణకు రక్తాలు చిందించటంలో మన పాలకులు ఎవరికీ తీసిపోలేదు. కానీ సర్వమత సమాదరణలో మాత్రం మన పాలకులు కొంతమేరకు సఫలం అయ్యారు. పూర్తిగా విఫలం మాత్రం కాలేదు! అందుకే మన చరిత్రను జాగ్రత్తగా మదింపు వేసుకుంటే సమాదరణలో మన సఫలతను ఆత్మస్తుతిగా భావించలేం! దీన్నుంచి ప్రేరణ పొంది మరిన్ని మంచి అడుగులు వేయటానికి మాత్రం ప్రస్తుతం తడబడుతున్నాం. విద్వేషాన్ని ఎగదోసే భావాలతో మందిర్‌–మసీద్‌ల చుట్టూ వివాదాలను రగల్చటానికే నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మసీదులపై కేసుల మీద కేసులు అందుకే పడుతున్నాయి. వారణాసి, మథుర, భోజ్‌శాల వివాదాలకు ఇప్పుడు సంభల్‌ మసీదు గొడవ తోడైంది. ఆరోపణల సారం మాత్రం మారటం లేదు. గుడులను కూల్చి మసీదులు కట్టారనే ఆరోపణలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయోధ్య తీర్పుతో భవిష్యత్తులో మందిర్‌–మసీద్‌ వివాదాలు తలెత్తవనే నమ్మకం క్రమేపీ నీరుకారి పోతోంది. ప్రార్థనా స్థలాలు, కట్టడాల స్వభావాన్ని మార్చకూడదని నిర్దేశించే 1991 నాటి చట్టాన్ని సుప్రీంకోర్టు గట్టిగానే సమర్థించింది. దాన్నిప్పుడు పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు. గుడుల కూల్చివేతలను తేల్చటానికీ, అవసరమైన పక్షంలో ప్రార్థనలు అనుమతించటానికీ సుప్రీం తీర్పు తమకు అడ్డుకాబోదన్న రీతిలోనే కింది కోర్టులు వ్యవహరిస్తున్నాయి. దీన్ని కట్టడి చేయాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నా సుప్రీంకోర్టు నుంచి అలాంటి ఆదేశాలు ఇప్పట్లో వచ్చే అవకాశమే కనపడటం లేదు.


ఇస్లాం పాలకులందరినీ ఆలయ విధ్వంసకులుగా ప్రచారం చేయటం ఇటీవల మామూలై పోయింది. చరిత్ర పేరుతో పుంఖానుపుంఖంగా అటువంటి రచనలు వచ్చి పడుతున్నాయి. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుతున్న ఆ తరహా ప్రచారంతో ఇబ్బందులెన్నో వస్తున్నాయి. పాలకుల మతం ఆధారంగా చరిత్రలో మంచిచెడులను నిర్ణయించటంతో ద్వేషభావనలకు పునాదులు పడ్డాయి. దేశంలో చీకటియుగం ముస్లిం పాలకులతో మొదలైందని చెప్పటానికి చరిత్రనే తారుమారు చేస్తున్నారు. బ్రిటిష్‌ పాలకులతో మొదలైన చరిత్ర వక్రీకరణ ఇటీవల ఇంకా ముదిరిపోతోంది.

మన చరిత్రలో ఆలయాల విధ్వంసాలు జరిగాయి. కాదనలేం. మసీదులు దాడులకు గురయ్యాయి. వాటినీ తృణీకరించలేం. అధికారం కోసం సాగిన యుద్ధాల్లో ప్రార్థనా మందిరాలు సమిధలయ్యాయి. వాటినీ విస్మరించలేం. ప్రత్యర్థిని దెబ్బతీయటానికి అతని కోటలనే కాదు అతను పరమ పవిత్రంగా పూజించే దేవాలయాలనూ మందిరాలనూ లక్ష్యంగా చేసుకున్నారు. అవి జరగలేదనీ చెప్పలేం. కానీ మొత్తం చరిత్రంతా అదేననీ, ముస్లిం రాజుల పాలనంతా పరమత ద్వేషంతోనే నిండిపోయి ఆలయాల విధ్వంసంతో గడచి పోయిందని చెప్పటంతోనే సమస్య వస్తుంది. ముస్లిం రాజుల పాలన మొదలయ్యే నాటికే కుల సామాజిక వ్యవస్థ బాగా వేళ్లూనుకుంది.


దీన్ని తొలగించటానికో, సంస్కరించటానికో ముస్లిం పాలకులు ప్రయత్నించలేదు. సైనిక సామర్థ్యంతో పాలనా యంత్రాంగంలో పైస్థాయిలో కుదురుకున్నా శిస్తు, పన్ను వసూళ్లకు కుల పెద్దలపైనే ఆధారపడ్డారు. చాలా చోట్ల రెవెన్యూ యంత్రాంగాన్ని యథాతథంగా కొనసాగించారు. సైన్యంలో గతంలోలాగే చేరికలను ప్రోత్సహించారు. కొందరికి ఉన్నత పదవులూ కట్టబెట్టారు. ఇక మెడమీద కత్తిపెట్టి మతమార్పిడులు చేశారనటానికి కూడా చారిత్రక ఆధారాల్లేవు. వందలేళ్లు అధికారం చలాయించిన దిల్లీ చుట్టుపక్కల గంగామైదాన ప్రాంతాల్లో అత్యధిక ప్రజలు ముస్లింలుగా మారలేదు. వందల సంవత్సరాలు ముస్లిం పాలనలో ఉన్నా హైదరాబాద్‌లోనూ మెజారిటీ ప్రజలు హిందువులుగానే ఉన్నారు. బలవంతంగా మతమార్పిడులు చేసి ఉంటే ముస్లిం పాలనకు కేంద్రాలైన నగరాల్లోనే గట్టిగా ఆ పనిని చేసి ఉండేవారు. బలగాలన్నీ అక్కడే ఉంటాయి. బలవంతాలూ అక్కడే సులువు! ఇక దేశానికి రెండు కొనల్లో ఉండే పశ్చిమ పంజాబులోనూ, తూర్పు బెంగాల్‌లోనూ పెద్దఎత్తున ప్రజలు ముస్లింలుగా మారటానికి అనేక కారణాలున్నాయి. అక్కడా బలప్రయోగం లేదు. సూఫీ గురువుల బోధనలే ప్రధానపాత్రను పోషించాయి. ఇక ముస్లిం పాలకులు కూడా గుడులకు జాగీర్లూ ఇచ్చారు. ఇనాంలూ ఇచ్చారు. పునరుద్ధరణకు పైకాలూ ఇచ్చారు.


చరిత్రను నిష్పాక్షికంగా విశ్లేషించిన అధ్యయనాల్లో ఇదే తేలింది. క్యాలిఫోర్నియా వర్సిటి యాంథ్రపాలజీ ఫ్రొఫెసర్‌గా పనిచేసిన క్యారన్‌ లేనర్డ్‌ హైదరాబాద్‌లోని హిందూ ఆలయాలపై చేసిన పరిశీలనల్లో ఎన్నో నిజాలు నిగ్గుతేలాయి. నిజాంల పాలనలో కీలకంగా ఉన్న కాయస్థ కులస్థులపై లేనర్డ్‌ చేసిన పరిశీలన బహుముఖమైంది. 50 ఏళ్ల కిందటే అందుకోసం విస్తృతంగా పర్యటించారు. హైదరాబాదీయులపై ఇటీవల వరకూ ఆమె పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నిజాంలు హిందూ ఆలయాలపై చూపిన ఆదరణను వివరించటానికి లేనర్డ్‌ చాలా ఉదాహరణలు ఇచ్చారు. ముస్లిం పాలకులు గుడులను కూల్చివేస్తారనే దురభిప్రాయం తొలగటానికి లేనర్డ్‌ పరిశోధనలు తోడ్పడతాయి. సందేహం లేదు! అంతమాత్రాన నిజాంలు మతాన్ని రాజకీయాల కోసం అసలు వాడుకోలేదని చెప్పలేం. సంక్షోభం చుట్టుముట్టినప్పుడు మతాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఊతం ఇచ్చారు. రజాకార్ల విజృంభణలో అది స్పష్టంగా కనపడింది. 1940లకు ముందు మాత్రం మతాదరణలో చాలావరకూ సాధారణ వైఖరినే ప్రదర్శించారు. ఈ సాధారణ వైఖరేమిటి అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. దీన్నే బహుళ మత సంస్కృతుల ఆదరణ విధానంగా లేనర్డ్‌ వర్ణించారు. అంటే ఒక మతాన్ని పాలక మతంగా స్వీకరించి.. మిగతా మతాలను పూర్తిగా అణగదొక్కి.. పాలకవర్గ మతానికే ప్రోత్సాహం ఇవ్వటం కాకుండా.. అన్ని మతాలను వీలైనంతమేరకు ఆదరించటమే దాని సారంగా చెప్పుకోవచ్చు. భారత ఉపఖండంలో ఈ భావన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒక విధాన రూపాన్ని సంతరించుకుంది. నైజాం పాలకులూ దీన్ని అనుసరించారు. వారు సున్నీ వర్గానికి చెందిన వారైనా షియాల ప్రార్థనా మందిరాల పోషణకు జాగీర్లు ఇచ్చారు. మొహర్రం ఊరేగింపులను కొనసాగనిచ్చారు.


ముస్లిం రాజుల పాలనా కాలంలో కాయస్థులు పాలనా వ్యవహారాల్లో, రెవెన్యూ లెక్కల్లో ప్రావీణ్యం సంపాదించి, మంచి అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలపై గట్టిపట్టును సాధించారు. ఇక హైదరాబాద్‌ కాయస్థుల్లో ఏడు ఉపకులాలు (సక్సేనా, మాథుర్‌, శ్రీవాత్సవ, గౌర్‌, భట్నాగర్‌, నిగం, అస్తానా) ఉండేవి. నిజాంల రాజ్యంలోని కాయస్థ అధికారులు–ప్రముఖుల అజమాయిషీలో 19వ శతాబ్దంలో 15 హిందూ ఆలయాలు ఉండేవి. వీటిల్లో ఎక్కువ వాటిని వారే స్వయంగా నిర్మించారు. అంతకుముందు నుంచీ ఉన్న కొన్నిటిని నిర్వహణలోకి తీసుకున్నారు. రాంబాగ్‌ (హైదరాబాద్‌కు పశ్చిమాన), చిత్రగుప్త (ఉప్పుగూడ), దేవల్‌ బజార్‌ రూప్‌లాల్‌ (శాలిబండ), నర్సింజీ/మాయారాం (శాలిబండ), బుచర్‌మాల్‌ ఆలయం (శాలిబండ), లలితాదేవి బాగ్‌ (ఉప్పుగూడ), బాలాజీ మహదేవ్‌ (కోట్ల ఆలీ జా), కేశవ్‌గిరి (హైదరాబాద్‌ దక్షిణం), రామచంద్రజీ (పురానపూల్‌), రాంమందిర్‌ (శాలిబండ), కాళీ టెంపుల్‌ (ఉప్పుగూడ), శంకర్‌జీ (మీర్‌ జుమ్లా ట్యాంక్‌), నర్సింగ్‌ బాబా (ఉప్పుగూడ), శంకర్‌బాగ్‌ (ఉస్మాన్‌గంజ్‌) ఆలయాలు.. ఇప్పుడు మనం పాతబస్తీగా భావించే ప్రాంతంలోనే ప్రధానంగా ఉండేవి.

కాయస్థేతరులు నిర్మించిన గుడులు కూడా ఉన్నాయి. రెండుమూడు చోట్ల ఆలయాలు, దర్గాలు, మసీదులు ఒకే ప్రాంగణంలో ఉండేవి. బ్రహ్మఖత్రీ కులానికి చెందిన రాజా రఘురాం బహదూర్‌ 1822లో నిర్మించిన కిషన్‌బాగ్‌ గుడి అలాంటిదే. ఈ గుడికి మూడో నిజాం సికిందర్‌జా రెండు జాగీర్లు ఇచ్చారు. దర్గా ఉర్సు ఉత్సవాలకు రాజా రఘురాం ప్రత్యేకంగా భవనాలను నిర్మించారు. బేగంబజార్‌ సీతారాం గుడిని మార్వాడి అగర్వాల్‌ అయిన పూరణ్‌మాల్‌ కట్టించారు. ఇక్కడ కూడా గుడి ఆవరణలో కుతుబ్‌షాహి కాలంనాటి మసీదు ఉండేది. ఈ గుడి పోషణకూ జాగీర్‌ను ఇచ్చారు. ఆలయ శంకుస్థాపనకు నిజాం స్వయంగా హాజరయ్యారు. పురానాపూల్‌ నుంచి మీరాలం ట్యాంకుకు వెళ్లే దారిలో రాజా శంభుప్రసాద్‌ కాళీ ఆలయాన్ని నిర్మించారు. నిజాంతో ఉన్నతస్థాయి అధికార సంబంధాలున్న కాయస్థులు, హిందువులు నిర్మించిన గుడుల్లో చాలా వాటికి నైజాం సర్కార్‌ నుంచి ఏదో రూపంలో సహాయం అందుతూనే ఉండేది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం కుతుబ్‌షాహీల కాలం నుంచే ఉండేది. నిజాం పాలకులు దాన్ని కొనసాగించారు. అలాగే అజంతా గుహల పునరుద్ధరణను చేపట్టారు. ప్రఖ్యాత రామప్పగుడినీ పునరుద్ధరించారు. అందుకే దేశంలోని ముస్లిం పాలకులందరినీ ఒకే గాటనకట్టలేం.


ఏకపక్ష మతదృష్టితో చారిత్రక వాస్తవాలను విస్మరించి విద్వేష భావనలను రగల్చటం రాజకీయంగా లాభం కావచ్చు. వందల ఏళ్ల ముస్లిం రాజుల కాలాన్ని చీకటి యుగంగా ముద్రవేయటం తేలిక కావచ్చు. కానీ ఆ యుగమే సూఫీ, భక్తికవుల సమానత్వ భావనను ఎలుగెత్తి చాటింది. కరడుగట్టిన కులవ్యవస్థ కదలబారటానికి భావాగ్నిని అందించింది. ఆధునికత వైపు దేశం అడుగులు వేయటానికి ఆర్థిక భూమికను ఏర్పరిచింది. ముస్లిం పాలనంతా అంధకారమైతే 17, 18 శతాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ అగ్రభాగాన నిలవటం అసాధ్యమయ్యేది. ఆ యుగంలో కొన్ని ఆలయాల విధ్వంసం జరిగినా ఆదరణా సమృద్ధిగానే ఉండేది! ఏ దేశ చరిత్ర అయినా మంచీచెడులు రెండింటినీ అందిస్తుంది. ఏది తీసుకోవాలన్నది మన విజ్ఞతకు గీటురాయిగా మిగులుతుంది.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Dec 03 , 2024 | 06:15 AM