రచన గుర్తున్నంతగా రచయిత గుర్తుండరు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:25 AM
చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పిన కథలలో గుర్తున్న కథ గజేంద్రమోక్షం, భాగవతంలోనిది. ఆ సమయంలోనే ఇష్టంగా చదివిన పుస్తకం పంచతంత్రం. ఒక కథలోంచి మరో కథలోకి వెళ్లడం, కథలన్నీ ఒకదానితో ఒకటి అల్లుకొని ఉండడం...
చదువు ముచ్చట
మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?
చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పిన కథలలో గుర్తున్న కథ గజేంద్రమోక్షం, భాగవతంలోనిది. ఆ సమయంలోనే ఇష్టంగా చదివిన పుస్తకం పంచతంత్రం. ఒక కథలోంచి మరో కథలోకి వెళ్లడం, కథలన్నీ ఒకదానితో ఒకటి అల్లుకొని ఉండడం... ఆ కనెక్టివిటీ అప్పట్లో బాగా ఆకర్షించింది. ఆ కథల్లో ప్రతి కథ చివర్లో నీతి ఉంటుంది. నీతి ఎందుకు చెప్పాలి, ఇదే నీతి ఎందుకు అవుతుందని మా టీచర్‌ని అడిగితే.. కథలో నువ్వు తెలుసుకున్న విషయం, అర్థం చేసుకున్న విషయం ఏంటి అని అడిగారు. అది కథలను నా దృష్టితో చూడటానికి తోడ్పడింది.
ఈమధ్య చదివిన పుస్తకాల్లో నచ్చినవి?
రచనా రంగం లోకి వచ్చి కవిత్వం, కథలు, నవలలు ఇలా అనేకంగా నన్ను నేను వ్యక్తీకరించుకుంటున్న క్రమంలో చదవడం కొంత తగ్గింది. ఈమధ్య చదువుతున్న వాటిలో రమణజీవి కథలు, త్రిపుర కథలు, అజయ్ ప్రసాద్ కథలు, చంద్ర కన్నెగంటి కథలు నాకు నచ్చిన వాటిలో ఉన్నాయి. అనువాదాల్లో తమిళ రచయిత జయమోహన్ కథలు నచ్చాయి.
మీ పఠనాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?
చాలా డ్రాస్టిక్‌గా మారింది. నేను మెడిసిన్ చదువుతున్న ప్పుడే శరత్ సాహిత్యంతోపాటు స్పిరిచువల్ బుక్స్ కూడా చదివాను. అలాగే మొదటిసారి చార్లెస్ డికెన్స్ రాసిన చారిత్రక నవల ‘ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్’ చదివాను. దాంతో అప్పటి వరకు క్లాసిక్ లిటరేచర్, ఇంగ్లీష్ నవలలపైన ఉన్న అభిప్రా యం మారిపోయింది. మరో పదేళ్ళకి ఒక స్నేహితురాలు పరి చయం చేసిన భగవద్గీత, డిసైపుల్స్ ఆఫ్ రామకృష్ణ లాంటి పుస్తకాలు చదివాను. అది క్రమంగా స్పిరిచువల్ అండ్ ఫిలసాఫికల్స్ పుస్తకాలు వైపు మళ్ళడానికి దోహదం చేసింది.
మీ నమ్మకాల్ని, దృక్పథాన్ని ప్రభావితం చేసిన రచయిత?
రచన గుర్తున్నంతగా రచయిత గుర్తుండరు నాకు. పెద్దయ్యాక నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన పుస్తకం భగవద్గీత. అదేవిధంగా పాశ్చాత్య ప్రపంచానికి బుద్ధిజాన్ని పరిచయం చేసిన పాల్ కారస్ ‘ద గాస్పెల్ ఆఫ్ బుద్ధ’ పుస్తకం కూడా నా మీద ప్రభావం చూపింది. కవిత్వం విషయంలో బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’, ఠాగూర్ ‘గీతాంజలి’ చాలా ఇష్టంగా చదివాను. మాయా ఎంజెలో, ఖలీల్ జిబ్రాన్‌ల కవిత్వం చదివిన కొద్దీ నచ్చేది.
సాహిత్యంలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది?
మార్క్ ట్వైన్ ‘టామ్ సాయర్’ చిన్నప్పుడు నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్న పాత్ర. అది తొమ్మిదో తరగతిలో నాన్ డీటెయిల్‌గా వచ్చిన పుస్తకం. ‘మర్చెంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ పాత్ర కూడా చాలా రోజులు వెంటాడింది. పెద్దయ్యే కొద్దీ పాత్రల కంటే బాగా, నచ్చిన పుస్తకంతో ప్రయాణించడం అలవాటయింది. అలా వచ్చిన అనుభూతి చాలా రోజులు నన్ను అంటిపెట్టుకొనే ఉండటం గమనించాను.
ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఎవరితో, ఏం మాట్లాడతారు?
బాగా ఇష్టం రచనలే, రచయితల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఒక్కసారి గాంధీ గారి ఆత్మకథ ‘ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరి మెంట్స్ విత్ ట్రూత్’ చదివినప్పుడు డిస్టర్బ్ అయ్యాను. ఆయనను ఒక్క సారి కలిసి కొన్ని ప్రశ్నలు అడిగి నిజాలు తెలుసుకోగలిగితే బావుండేదనిపించింది. ఆయన పూర్తి చేయకుండా వదిలివేసిన ఖాళీల వల్ల ఆ పుస్తకం పాక్షికమైన నిజాయితీతో రాసినట్లు అనిపించడం వల్లనేమో.
రచన విషయంలో మీకు దొరికిన మంచి సలహా, మీరు ఎప్పుడూ పాటించేది?
నాకు నచ్చిన మంచి సలహా– మన పాదముద్రలు ఈ భూమ్మీద నుంచి ఎంత త్వరగా మాయమైతే అంత మంచిది. రచన విషయంలో కచ్చితంగా పాటించేది ఒక్కసారి రచన అయిపోయాక దానిని డిస్ఓన్ చేసుకోవడం. రచనలో నా ప్రమేయం లేకుండా చూసుకోవడం.
శ్రీసుధ మోదుగు
(శ్రీసుధ మోదుగు కవి, రచయిత. ఆమె కవిత్వ సంపుటాలు
‘అమోహం’, ‘విహారి’, ‘గొంగళి పురుగుల సామ్రాజ్యం’;
కథా సంపుటాలు ‘రెక్కల పిల్ల’, ‘డిస్టోపియా’, ‘జాగృత స్వప్నం’;
నవల ‘అంతర్హిత’.)