ముఖచిత్రం అసంతృప్తిని మిగిల్చింది
ABN , Publish Date - Nov 25 , 2024 | 05:39 AM
నా మొదటి పుస్తకం ‘పిట్ట పాడే పాట కోసం’. మార్చి 1991లో అచ్చువేశాను. అది 1981–-1991 మధ్య రాసిన కవిత్వం నుంచి ఎంపిక చేసిన కవితల సంపుటి. సమాజాన్ని మార్చడానికి కవిత్వం ఆయుధం అని భావించి రాసిన కవిత్వమే కానీ...
నా మొదటి పుస్తకం
నా మొదటి పుస్తకం ‘పిట్ట పాడే పాట కోసం’. మార్చి 1991లో అచ్చువేశాను. అది 1981–-1991 మధ్య రాసిన కవిత్వం నుంచి ఎంపిక చేసిన కవితల సంపుటి. సమాజాన్ని మార్చడానికి కవిత్వం ఆయుధం అని భావించి రాసిన కవిత్వమే కానీ ఒక ఆహ్లాదకర మైన శీర్షికను ఉంచడాన్ని బట్టి ద్వైదీభావం ఏదో ఉండేదని నాకు తర్వాత అర్థమైంది. రాజమండ్రి సాహితీవేదిక, పోరుమామిళ్ల బ్రౌన్ సాహితీ సాంస్కృతిక సంస్థ, రాజోలు సాహితీ స్రవంతులలో భాగస్వామిగా ఉంటూ రాసిన కవిత్వమే అయినా నా ప్రధాన కవిత్వ కేంద్రం రాజమండ్రే. నా కవిత్వం సంపుటిగా రావాలని మొదట కాంక్షించింది డా. జయధీర్ తిరుమలరావు.
ఈ సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం మూడు వేలు ఆర్థిక సహాయం చేసింది. ప్రచురణకు అది సరిగ్గా సరిపోయింది. ముందుమాట ఎవరితోనూ రాయించ లేదు. రాజమండ్రి రత్నా ప్రింటర్స్‌లో అచ్చ య్యింది. పుస్తకం వెల ఐదు రూపా యలు పెట్టాను. ప్రచురణ బాధ్యత అంతా అప్పటికే ‘కంజిర’ను అందంగా తెస్తున్న నామాడి శ్రీధర్, ఒమ్మి రమేశ్ బాబులు తీసుకున్నారు. మధ్యలో ముఖ చిత్రం తతంగం ఒకటి జరిగింది. చిత్ర కారుడు ‘కాళ్ల’తో ముఖచిత్రం వేయించు కోవాలనే నా కోరిక తీర్చడానికి మిత్రులు గంగాధర్ నన్ను ఖమ్మం తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. నావి కొన్ని కవితలు ఇచ్చి ‘పిట్టపాడే పాట కోసం’ శీర్షికకు బొమ్మ వేసివ్వమని కోరి వచ్చేశాం. నెలన్నర గడిచినా ఆయన నుంచి బొమ్మ రాలేదు. ఉత్తరాలకు జవాబు లేదు. ఇలా కాదనుకుని జయధీర్ తిరుమలరావు గారు నన్ను హైదరాబాద్‌లో మోహన్ దగ్గరకు తీసు కెళితే ఆయన సాయంత్రానికి బొమ్మ వేసిచ్చారు. అది పట్టుకుని ఇంటికి వచ్చేసరికి కాళ్ల నుంచి బొమ్మ వచ్చి ఉంది. ఆయన నేనడిగిన శీర్షికకు కాకుండా తనకు నచ్చిన ‘ఆకలి నైరూప్యం కాదు’ అనే కవితకు బొమ్మ వేసి పంపారు. ఏం చెయ్యాలో తెలీ లేదు. పుస్తకం పేరు మార్చు కోవడం నాకు ఇష్టం లేదు. అడిగి వేయించుకున్న కాళ్ల బొమ్మను తిరస్కరించడం అగౌరవించడమని భావిం చాను. ఆ సమస్య మోహన్ విషయం లోనూ ఉంది. చివరికి ‘పిట్ట పాడే పాట కోసం’ శీర్షికనే ఉంచి, కాళ్ల వేసిన బొమ్మతో, మోహన్ అక్షరాలతో ముఖచిత్రం వేశాం. ఈ నిర్ణయం పూర్తిగా నాదే. కానీ చివరకు శీర్షికకూ బొమ్మకూ పొంతన కుదరలేదనే అసంతృప్తి ఉండిపోయింది.
ఆవిష్కరణ ఆ సంవత్సరం వేసవిలో రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో జరిగింది. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షులు. శివారెడ్డి ఆవిష్కర్త. పాపినేని శివశంకర్, సతీష్ చందర్‌లు సమీక్షకులు. మా అమ్మ నాన్నలు కనక దుర్గాంబ, అమర లింగేశ్వరరావులకు అంకితమిచ్చాను. సభ ఏర్పాట్లు అన్నాయ్ ప్రసాదమూర్తి చూశాడు. సంపుటికి అమలాపురం సరసం అవార్డు, హైదరాబాదు ఆంధ్ర మహిళా సభ దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం వచ్చాయి. కృష్ణశాస్త్రి పురస్కారానికి న్యాయనిర్ణేత డా. ఎన్. గోపి. అప్పటి నా కవిత్వం నచ్చడానికి ఆస్కారంలేని ఇస్మాయిల్‌గారు ఒకసారి కలిసినప్పుడు నేను అడక్కుండానే ‘‘మీ కవిత్వంలో ఒక అక్షరం కూడా తీసెయ్యడానికి వీలులేని బిగువు ఉంటుంది’’ అన్నారు.