Share News

తొలి గిరిజన కథకుడు భూషణం మాస్టారు కాదు

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:14 AM

సువర్ణముఖి కథల మీద జూన్‌ 17 నాటి వివిధలో నాగరాజు గారు రాసిన వ్యాసం పరిపూర్ణంగా ఉంది. కానీ అందులో తొలి ఉత్తరాంధ్ర గిరిజన కథకులు అని భూషణం మాస్టారిని పేర్కొన్నారు. గిరిజన జాతుల జీవన సంస్కృతి, వారి పోరాటం, ఉద్యమ స్ఫూర్తితో...

తొలి గిరిజన కథకుడు భూషణం మాస్టారు కాదు

సువర్ణముఖి కథల మీద జూన్‌ 17 నాటి వివిధలో నాగరాజు గారు రాసిన వ్యాసం పరిపూర్ణంగా ఉంది. కానీ అందులో తొలి ఉత్తరాంధ్ర గిరిజన కథకులు అని భూషణం మాస్టారిని పేర్కొన్నారు. గిరిజన జాతుల జీవన సంస్కృతి, వారి పోరాటం, ఉద్యమ స్ఫూర్తితో ఉత్తరాంధ్ర గిరిజన కథ రాసిన భూషణం మాస్టారు తెలుగు కథ సాహిత్యంలో ఎప్పటికీ చిరస్మరణీయులే. కానీ దానికి ముందుగా తొలి గిరిజన కథ ‘చెంచి’ను, ఆ రచయిత గూడూరు రాజేంద్రరావును కూడా మనం ఒక్కసారి మననం చేసుకోవాలి. ఇది ఆయన బొబ్బిలి సంస్థానంలో పని చేస్తున్నపుడు రాసిన కథ. అప్పటి పరిస్థితులు నేపథ్యంలో రాసిన కథ. నెల్లూరువాసి కావటంతో సహజసిద్ధంగా నెల్లూరు మాండలీకం వారి కథ నిండా అలుముకుంది. 1932 ఆగస్టు నెల భారతిలో ‘చెంచి’ కథ ప్రచురితమైన తర్వాత ఐదారు నెలలపాటు ఈ కథ మీద తెలుగు ప్రసిద్ధులందరూ చర్చించటం ఈ కథ విశేష స్థానాన్ని తెలియపరుస్తుంది. గిరిజన బతుకుల్లోని దైన్యస్థితిని, దోపిడీని, లైంగిక వేధింపులను, అప్పుల వాళ్ళ జలగ పీడనా సంస్కృతిని, చెంచి కథలో ప్రస్తావించారు.


రాజేంద్ర కథలే కాకుండా కవితలు నాటకాలు కూడా రచించారు. నెల్లూరు జిల్లా వాసి అయిన గూడూరు రాజేందర్రావు నెల్లూరు విద్యాభ్యాసం అనంతరం మద్రాసులో ఎమ్మే చేస్తున్న రోజుల్లో షేక్‌స్పియర్‌ నాటకాలపై రాసిన విమర్శ ఆనాటి మద్రాస్‌ ప్రెసిడెన్సి కాలేజీ ఆంగ్ల పండితుల అభిమానాన్ని పొందింది. వీరి ఆంగ్ల పాండిత్యాన్ని గమనించిన బొబ్బిలి రాజా తన సంస్థానంలో నియమించుకున్నారు. షేక్‌స్పియర్‌ మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌లో షైలాక్‌ పాత్రను, వేదం వెంకటరాయ శాస్త్రి ప్రతాప రుద్రీయంలో ప్రతాపరుద్రుడుగాను ఇలా అనేక నాటకాల్లో నటించి కీర్తి పొందారు. 1904 సెప్టెంబర్‌ 25 తేదీన జన్మించిన వీరు 40 ఏళ్ల జీవిత కాలం పూర్తికాకుండానే 1945 జూలై 17వ తేదీ తనువు చాలించినా, తెలుగు కథా చరిత్రలో మర్చిపోలేని స్థానం పొందారు. ఆయన చెంచి కథ వెలువడి ఇప్పటికి 90 ఏళ్లు అయినప్పటికీ ఇంకా దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. వీరి రచనలు భారతి, శుభోదయం, స్వతంత్ర, జమీన్‌ రైతు పత్రికలలో 1932-40 ప్రాంతంలో విరివిగా వచ్చేవి.


వీరికి ఏమాత్రం కీర్తి కండూతి లేకపోవటంతో, కేవలం సామాజిక నేపథ్యంలో వారు రాసిన కథలు చాలావరకు అందుబాటులో లేకుండా పోయాయి. వీరు నెల్లూరు, కడప, కర్నూలు, పెద్దాపురంలలో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేయటం, బదిలీలు, పదోన్నతుల మధ్య జాగ్రత్త పరచలేకపోవటంతో వారి రచనలు చాలా వరకు వెలుగు చూడలేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

ఈతకోట సుబ్బారావు

94405 29887

Updated Date - Jul 22 , 2024 | 05:14 AM