Share News

కరువుకు పునాది పడింది కేసీఆర్‌ పాలనలోనే!

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:46 AM

వెయ్యి ఏనుగులు తిన్న ఒక ముసలి నక్క నేను శాకాహారినైపోయానని చెప్పగా నమ్మిన గొర్రెలన్నీ పుర్రెలయ్యాయట. పదేళ్లు తెలంగాణను పాలించి, అప్పుల రాష్ట్రంగా మార్చి, దాని భవిష్యత్తును...

కరువుకు పునాది పడింది కేసీఆర్‌ పాలనలోనే!

వెయ్యి ఏనుగులు తిన్న ఒక ముసలి నక్క నేను శాకాహారినైపోయానని చెప్పగా నమ్మిన గొర్రెలన్నీ పుర్రెలయ్యాయట. పదేళ్లు తెలంగాణను పాలించి, అప్పుల రాష్ట్రంగా మార్చి, దాని భవిష్యత్తును నాశనం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరువు యాత్రకు వెళ్ళడం ఈ సామెతను గుర్తుకు తెస్తుంది. 2014కు ముందు తెలంగాణలో ఏ గోస, ఏ బాధ, ఏ ఏడ్పులు పడ్డామో అవి మళ్లీ వచ్చాయని, నీళ్ల కోసం ఎదురుచూపులు పునరావృతం అయ్యాయని కేసీఆర్ అంటున్నారు. అంటే ముఖ్యమంత్రిగా తాను పాలించిన పదేళ్ళల్లో నీటిపారుదల విధానం కరువును నిర్మూలించడంలో విఫలమైందని అంగీకరిస్తున్నారా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎండాకాలంలోనూ మేడిగడ్డ, సుందిళ్ల, ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోశామని, నాలుగు నెలల్లోనే పరిస్థితి తారుమారైందని కేటీఆర్‌ అన్నారు.

ఈ ఆరోపణలన్నింటినీ నిశితంగా పరిశీలిద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి పదో ఏడు పరిపాలనకు చెందిన వర్షాకాలంలో, ఉత్తర తెలంగాణలో భారీ ఎత్తున వర్షాలు కురిసాయి. కానీ దక్షిణ తెలంగాణలో కనీస వర్షాలు కురవలేదు. దక్షిణ తెలంగాణలో ఏ గ్రావిటీ ప్రాజెక్టులు నిండనిది వాస్తవం. దశాబ్దాల నాడు కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల ప్రాజెక్టులకు నీళ్లు రానిది వాస్తవం. వర్షాకాలపు ఖరీఫ్ సీజన్‌లో నాగార్జున సాగర్ కింద లక్షలాది ఎకరాల్లో రైతుల పంటలకు సెలవును ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించింది నిజం కాదా? బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్రాప్ హాలిడేను ప్రకటించి, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత వేసంగి పంటకు కరువు వచ్చిందని గోల పెట్టడం ఏ నీతి? పార్లమెంటు ఎన్నికల్లో స్వప్రయోజనాల కోసమే కదా ఈ కరువు రాజకీయాలు?

కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలో పంటలకు నీరు అందింది ఆయన కట్టిన ప్రాజెక్టుల వల్ల కాదు. గత తొమ్మిదేళ్లు వర్షాలు తెలంగాణలో పుష్కలంగా పడడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, ఉచిత కరెంటుతో పంటలు పండాయి. వాస్తవాలకు భిన్నంగా, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే 80లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని ఫ్లెక్సీలతో రాష్ట్రమంతా భజన చేశారు.

ఖజానాను దోచుకోవాలనే లక్ష్యంతో కాళేశ్వరం మేడిగడ్డ ఆగమేఘాలపై కట్టారు. ఢిల్లీ డ్యాం సేఫ్టీ ఇంజనీర్లు వేసిన ప్రశ్నలకు ఈఎన్‍సీ మురళీధర్ రావుతో సహా, ఇంజనీర్లు అందరూ నోరు వెళ్ళబెట్టింది వాస్తవం కాదా? ఆ తొందరలో చేసిన అనేక తప్పులతోనే ముందు మేడిగడ్డ ఐదు ఫీట్లు కుంగింది. నాలుగేళ్లలో మేడిగడ్డ నుండి ఎత్తిపోసింది 160 టీఎంసీలు. కడెం ఎదురు వరదలకు ఎత్తిన 100 టీఎంసీలు గోదావరి నుండి సముద్రంలో మళ్లీ కలిసింది నిజం కాదా? మీ పదేళ్ల నీటిపారుదల విధాన వైఫల్యంతో తలెత్తిన ఈ కరువుకు కేసీఆర్ కుంటుంబానిదీ, పార్టీదే కదా బాధ్యత?

ప్రాజెక్టులో చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి చూపుతున్నారని, తెలివితక్కువతనంతో 50 టీఎంసీల నీళ్లు వదిలేశారని, కేసీఆర్‌ను బదనాం చేయాలన్న కుట్రతోనే నీళ్లు పోయేలా చేశారన్నారు కేసీఆర్. ఆయన నిర్మించిన మానస పుత్రిక నాలుగేళ్లకే గోదావరిలో కుంగినప్పుడు ఈ దివ్యజ్ఞానం ఏమైంది? మీ పాలనా కాలంలోనే ఢిల్లీ డ్యాం సేఫ్టీ ఇంజనీర్లు, నీళ్లు ఉంటే మూడు బ్యారేజీలకు ప్రమాదమని, మేడిగడ్డతో సహా అన్ని బ్యారేజీల్లో నీళ్లను, మీ చేతులతోనే సముద్రంలోకి వదిలిపెట్టింది నిజం కాదా?

తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన వెంటనే రూ.35,200 కోట్ల అంచనాతో దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. దక్షిణ తెలంగాణలో 12.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‍నగర్ 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి 5 లక్షల ఎకరాలు. పదేళ్లలో రూ.25వేల కోట్లు ఖర్చు చేశారు. నేటికీ ఇంకా అనేక పనులు పూర్తి కాలేదు. ప్రధాన కాలువలు పిల్ల కాలువల పనులు ఒక్క అడుగు కూడా మొదలు కాలేదు. డిసెంబర్ 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 31 మోటార్లకు కేవలం ఒకే ఒక్క మోటర్ ప్రారంభించి, ఒక్క చెరువులో రెండు గంటలు నీళ్లు పోసి, 12.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు ఫోజు పెట్టారు. రాష్ట్రమంతా వందల కోట్ల ఖర్చుతో ఫ్లెక్సీలు, పత్రికల్లో ప్రకటనలు, టీవీల్లో ఉత్త ప్రచారాన్ని మార్మోగించారు. 25 వేల కోట్లు ఖర్చు చేసి, 25 ఎకరాలు కాదు, 25 అడుగుల నేలకు కూడా నీళ్లు ఇవ్వనిది వాస్తవం కాదా?

నల్లగొండ జిల్లాలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ గ్రావిటీ కాలువ (SLBC) పనులు చేస్తే కమిషన్లు రావని మీ పదేళ్ల పాలనలో దాన్ని పడుకోబెట్టింది వాస్తవం కాదా? 97 వేల కోట్లతో మూడేళ్లలో క్రుంగిన కాళేశ్వరం మేడిగడ్డ పూర్తి చేస్తే, తెలంగాణకు ముందే సగం పూర్తయిన ఎస్ఎల్‌బీసీ, పదేళ్లయినా ఎందుకు పూర్తి కాలేదు. రూ.6వేల కోట్ల అంచనాతో, 3 లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, డిండి ఎత్తిపోతలు కేసీఆర్ చేపట్టారు. మూడు వేల కోట్లు ఖర్చుచేశారట. డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఎక్కడి నుండి తీసుకోవాలో పదేళ్ళయినా నిర్ణయించలేదు. పదేళ్ల పాలనలో మూడెకరాలకు కూడా డిండి కింద నీళ్లు ఇవ్వలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ఈ కరువులకు కారుకులెవరు? పదేళ్ల పాలనతో దోపిడీకి కేంద్రమైన మీ నీటిపారుదల విధానం విఫలమై, కరువుకు కారకులైన మీరే, బరితెగించి కరువుపై గోల చేస్తే ప్రకృతి సిగ్గుపడుతుంది.

తెలంగాణలో గతంలో నిర్మించిన గ్రావిటీ ప్రాజెక్టులలోనే, వేలకోట్ల కమిషన్ల కొరకు భగీరథ పథకాన్ని చేపట్టి, ఉన్న ఆయకట్టును నాశనం చేశారు. మినిమం డ్రా డౌన్ లెవెల్‍ని విచ్ఛిన్నం చేశారు. ఆయకట్టును నాశనం చేసి, లక్షలాది ఎకరాల్లో మీరు కరువును సృష్టించలేదా? హైదరాబాదు మహానగరంలో నేడు ప్రజలు నీటికోసం విలవిలలాడుతున్నారు. మహానగరపు వీధులన్నీ వర్షాకాలంలో సముద్రాన్ని తలపిస్తే, వేసవిలో నీటి కటకట. మహానగర సుస్థిర జల సంరక్షణ కొరకు మీరు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. భారీ పెట్టుబడి లేని, దోపిడీ లేని, చౌకైన ప్రకృతి అనుకూల విధానాలు అసలే మీకు గిట్టవు. లక్షల కోట్లతో పదుల దశలలో నీళ్లు భారీ ఎత్తిపోతలతో తరలించడమూ, మీరు మీ కాంట్రాక్టర్లు బాగుపడడమే మీ లక్ష్యం. అదే గ్రామీణ వ్యవసాయాన్ని కరువులో ముంచింది, ఖజానాను బడా కాంట్రాక్టర్లకు సమర్పించింది. రెండు కోట్ల మంది నివసించే మహానగరం జల కరువులో చిక్కుకుంది.

నైనాల గోవర్ధన్

Updated Date - Apr 24 , 2024 | 05:46 AM