Share News

---తొల్సూరి బిడ్డను ఎత్తుకున్నంత సంబురం

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:32 AM

దేశంలో ఎమర్జెన్సీ తర్వాత మేధావులకు కలిగిన కొత్త వెలుగులో నేను స్పష్టమైన ప్రజా కోణం నుంచి కవిత్వం రాస్తూ వస్తున్నాను. నాకున్న ఆర్థిక పరిస్థితి వల్ల 1976 నుండి 1985 మధ్య రాసిన కవిత్వాన్ని...

---తొల్సూరి బిడ్డను ఎత్తుకున్నంత సంబురం

నా మొదటి పుస్తకం

దేశంలో ఎమర్జెన్సీ తర్వాత మేధావులకు కలిగిన కొత్త వెలుగులో నేను స్పష్టమైన ప్రజా కోణం నుంచి కవిత్వం రాస్తూ వస్తున్నాను. నాకున్న ఆర్థిక పరిస్థితి వల్ల 1976 నుండి 1985 మధ్య రాసిన కవిత్వాన్ని ప్రచురించ లేకపోయాను. అయితే 1987 నుండి 1993 వరకు వివిధ పత్రికలలో రాసిన కవిత్వాన్ని ‘పాతాళ గరిగె’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాను. ఈ పుస్తకం ప్రచురించడం వెనుక ఉన్న ముచ్చటను మీతో పంచుకోవాలి. సిరిసిల్లలో ఉన్న అర్బన్ బ్యాంకులో నా పేరు మీద, నా భార్య రమ పేరు మీద రెండు అకౌంట్ల పేరున రూ.5000 చొప్పున అప్పు తీసుకొని ఈ పుస్తకాన్ని ప్రచురించాను. అలాగే నా ఆత్మీయ మిత్రుడు నలిమెల భాస్కర్, అతని భార్య సావిత్రి కూడా ఒక్కొక్కరు రూ.5000 చొప్పున రుణం తీసుకొని ‘పది ఉత్తమ మలయాళ కథలు’ ప్రచురించారు. నా మొదటి పుస్తకం చేతుల్లోకి తీసుకున్నప్పుడు తొల్సూరి బిడ్డను ఎత్తుకున్నంత సంబురం కలిగింది.


అప్పటికే వందలాది తెలుగు పుస్తకాలకు ముఖ చిత్రాలు వేసిన శీలా వీర్రాజు వేసిన ముఖచిత్రంతో ‘పాతాళ గరిగె’ వచ్చింది. నాటి సామాజిక వాతావరణంలో, ఉత్తర తెలంగాణలో– ఒకవైపు వామపక్ష ఉద్యమాలపై అణచివేత, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. మరోవైపు సమాజం లోని విలువల అస్తిత్వం కోల్పోతున్న దశ.


‘‘నిండైన బావి నీళ్లలో

చేతులారా జారవిడుచుకున్న బొక్కెన కోసం

పాతాళ గరిగెతో దేవులాడుతూనే ఉంటాం’’

–అంటూ మనుషులు విలువల్ని కోల్పోతున్న వేదనను పలికించాను. నా మొదటి పుస్తకానికి మరో ప్రత్యేకత ఉంది. దానికి ముందుమాట నేనే రాసుకు న్నాను. మా తరం కవులకు, తర్వాతి కవులకు అది స్ఫూర్తిగా నిలిచింది. నాటి విమర్శకులకు కొత్త ఆలోచనలకు ఆస్కారం ఇచ్చింది. ఆ ముందుమాటలో నేను కవిత్వం లోకి ఎలా వచ్చాను లాంటి మాటలు కాకుండా నా చుట్టూ సమాజం అల్లకల్లోలాన్ని, గ్రామీణ ప్రాంత మట్టి మనుషుల ఆందోళనలను చిత్రీకరిస్తూ, నా కవిత్వాన్ని ఆర్థిక సామాజిక రాజకీయ నేపథ్యంలో స్వీకరించే విధంగా రాశాను.


స్త్రీ బహుజన అస్తిత్వ వాదాల ప్రభావం నా మొదటి పుస్తకం లోని కవితలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపిస్తుంది. పెట్టుబడి తడిబట్టతో ప్రజల గొంతు కోస్తున్న సమయంలో, రాజకీయాలలో డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న సందర్భంలో, తెలుగు జనజీవనంలోకి నూతనంగా ప్రవేశించిన ప్రపంచీ కరణ ప్రభావాలపైన కవిత్వం రాశాను. పెట్టుబడి కేంద్రీ కృతం అవుతున్న సుదూర ప్రాంతాలకు, అరబ్బు దేశాలకు వలసలను, దూరాల దుఃఖాలను, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అమాయక ప్రజల బాధలను, అప్పుడ ప్పుడే కవిత్వంలోకి ప్రవేశిస్తున్న అనేక సందిగ్ధ సంద ర్భాలను మొట్టమొదటిసారిగా కొత్త డిక్షన్‌తో తీసుకు వచ్చాను. అప్పుడూ ఇప్పుడూ సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో ముంచి తీసిన అక్షరాల తోనే కవిత్వం రాశాను.

అద్దాన్నీ, ఆకారాన్నీ విభజించలేనట్లే నేను జీవితాన్నీ, కవిత్వాన్నీ వేరువేరుగా ఇప్పటికీ దర్శించలేకపోతున్నాను. స్వచ్ఛమైన గుండెల నిండా ప్రాణవాయువు నింపుకొని ఉదయపు తాజాదనంతో, నది వారసత్వంగా బహుజన ప్రజల ప్రయోజనంగా పంటపొలాలవైపు సాహిత్యంగా ప్రవహిస్తున్నాను. నా మొదటి పుస్తకం నుండి ఇప్పటి వరకు వచ్చిన 16 కవిత్వ సంపుటాలలో ఇదే చేశాను, చేస్తూనే ఉంటాను. సమాజానికి నాకు మధ్య నా కవిత్వం ఒక యానకం.

జూకంటి జగన్నాథం

Updated Date - Dec 23 , 2024 | 01:32 AM