వెలుగులు విరజిమ్ముతూ...
ABN , Publish Date - Oct 31 , 2024 | 02:55 AM
నిజమే లక్ష్మీబాంబులా పేలుతుందనుకున్నపుడల్లా తుస్సుమంటూ ఆరిపోతుంది సీమటపాకాయల్లా చిటపటలాడుతూ గొలుసుకట్టుగా పేలుతుందనుకున్నపుడు...
నిజమే
లక్ష్మీబాంబులా
పేలుతుందనుకున్నపుడల్లా
తుస్సుమంటూ ఆరిపోతుంది
సీమటపాకాయల్లా
చిటపటలాడుతూ గొలుసుకట్టుగా
పేలుతుందనుకున్నపుడు
తుస్సు తుస్సుమంటూ
టప్ టప్ మంటూ
చిట్లిపోయి మధ్యలోనే తెగిపోతుంది
మతాబులా వెలగాలనో
పెన్సిల్లా మెరవాలనో
తలపోసినపుడల్లా
వెలిగినట్టే వెలిగి
ఆరిపోయిన కాకరపువ్వొత్తిలా
పడివుండటమూ సర్వసాధారణమే
అస్తిత్వం భూచక్రంలా
తన చుట్టూ తాను తిరిగి తిరిగి
ఉన్నచోటే ఆరిపోయి ఆగిపోవటమూ
మామూలే
బతికుండే క్షణాలన్నీ
పాంబిళ్లలా బుసకొట్టీ బుసకొట్టీ
బూడిదవటమూ తప్పని పరిస్థితే
సమస్యలు చిచ్చుబుడ్లయి
చిరచిరలాడినా
జీవించే క్షణాలతోనే
లోపలి ముఖాల్ని వెలిగించుకోవాలి
జీవితమెప్పుడూ
లక్ష్మీబాంబులానే పేలదు
చాలాసార్లు
తుస్సు తుస్సుమంటూనే
ఆరిపోవచ్చు
అయినా
తారాజువ్వలా
వెలుగులు విరజిమ్ముతూ
చీకటి నింగికెగరాల్సిందే
అనేక అమావాస్యల తరువాత
ఒక దీపావళి తప్పక వస్తుందని
నమ్మి తీరాల్సిందే
చిత్తలూరి