Share News

కాలస్వభావాన్ని నవల సమగ్రంగా దర్శించగలదు

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:54 AM

బండి నారాయణ స్వామి సమకాలీన నవలా రచయితల్లో నాకు అత్యంత ఇష్టుడు. ‘మీ రాజ్యం మీరే లండి’, ‘శప్తభూమి’, ‘రెండు కలల దేశం’- నేను బాగా ఇష్టపడిన తెలుగు నవలల్లో ప్రముఖంగా ఉన్నాయి. మూడు భిన్నమైన నేపథ్యాల నుంచి ఒకే రచయిత...

కాలస్వభావాన్ని నవల సమగ్రంగా దర్శించగలదు

నవలా శిల్పం

బండి నారాయణ స్వామి సమకాలీన నవలా రచయితల్లో నాకు అత్యంత ఇష్టుడు. ‘మీ రాజ్యం మీరే లండి’, ‘శప్తభూమి’, ‘రెండు కలల దేశం’- నేను బాగా ఇష్టపడిన తెలుగు నవలల్లో ప్రముఖంగా ఉన్నాయి. మూడు భిన్నమైన నేపథ్యాల నుంచి ఒకే రచయిత రాసిన మూడు నవలలు పాఠకుల మన్ననలు సమంగా పొందడం సర్వసాధా రణంగా జరగదు. అటువంటి అసాధారణ ప్రభావం వేసినందు వలన రచయితగా స్వామి నాకు అత్యంత ఇష్టుడయ్యాడు. స్వీయాత్మక, సామాజిక, చారిత్రక జీవన వైవిధ్యాన్ని భిన్న రీతుల్లో లోలోతుల నుంచి వెలికి తీసిన రచయితగా నారాయణస్వామి స్థానం తెలుగు నవలా ప్రపంచంలో అతి విశిష్టం.

ఇంటర్వ్యూ : అంబటి సురేంద్ర రాజు

మీరు కథ, కవిత, వ్యాసం ఈ ప్రక్రియలు దేనిలోనూ చేయలేనిది నవలలో మాత్రమే చేయగలిగేది ఏమిటి అంటే ఏం చెప్తారు?

వస్తువును ఒకవైపు చూడటం కథ. వస్తువును అన్నివైపులా తిప్పిచూడటం నవల.

కొన్ని సందర్భాల అల్లిక కథ. అనేక జీవితాల సమాహారం నవల.

ఏకానుభూతి కథ. వివిధానుభూతులకు పట్టుకొమ్మ నవల.

తాడుమీద నడవడం వంటిది కథ. మైదానంలో గుర్రపు స్వారీ నవల.

ఒక్కొక్క శతాబ్దానికి ఒక్కొక్క కాలస్వభావం వుంటుంది. ఈ కాలస్వభావాన్ని సమగ్రంగా దర్శించే పని నవల చేయగలదు. శరత్‌బాబు శ్రీకాంత్, విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు, ఉన్నవ మాలపల్లి, ఈ కాలస్వభావాన్ని పట్టుకోగలిగినాయి.


మీ మొదటి కవితల్లోనూ, ‘చమ్కీదండ’ వంటి కథల్లోనూ స్పిరిచువల్ ఎలిమెంట్ కనిపిస్తుంది. అటునుంచి తర్వాతి నవలల్లో సామాజిక వాస్తవికత వైపు వచ్చారు. ఈ ప్రయాణం ఎలా జరిగింది?

అది ప్రయాణం కాదు. ప్రయాణం లేదక్కడ. అధిభౌతికమూ, భౌతికమూ నా అస్తిత్వంలో రెండు పార్శ్వాలు. నా జీవితంలో మాదిరే నా సృజనలోనూ సమాంతరంగా ప్రయాణించినాయి. ‘సావుకూడు’ కథ రాసినప్పుడు కాళీపట్నం, శ్రీపతి, రాజేశ్వరరావు వంటివారు అట్లాంటి కథలే రాయమని లేఖలో రాసినారు. ‘చమ్కీ దండ’ రాసినప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఖాళీ సీసాల స్మైల్, రామలింగం వంటివారు ప్రత్యేకంగా సంతోషపడినారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే నా కమ్యూనిస్టు మిత్రులకు స్పిరిచువల్ ఎలిమెంట్ గురించి, నా స్పిరిచువల్ మిత్రులకు సామాజిక వాస్తవికత గురించి సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితిలోకి నెట్టబడినాను. ‘మీరాజ్యం మీరేలండి’లో పండమేటి స్వామి, ‘శప్తభూమి’లో తిక్కస్వామి నా రెండు పార్శ్వాల సమాంతర ప్రయాణానికి తార్కాణాలు.


‘రెండుకలల దేశమ్’ వంటి పూర్తి ఆటోబయోగ్రఫికల్ ఎలి మెంట్స్ గల నవలతోపాటు ‘మీరాజ్యం మీరేలండి’లాంటి కంప్లీట్ ఆబ్జెక్టివ్ దృష్టికోణం కల నవల కూడా రాశారు. ఈ రెండు రకాల పద్ధతుల్లో రాస్తున్నపుడు రచనా ప్రక్రియ లోనూ, రచనానుభవంలోనూ ఎలాంటి తేడా గమనించారు?

ఆటో బయోగ్రఫికల్ నవలకు ఇంట్రాస్పెక్షన్ అవసరం. ఆబ్జెక్టివ్ నవలకు పరకాయప్రవేశం అవసరం. రెండింటికీ మెడిటేటివ్ మైండ్ వుండటం ఒక కామన్ అవసరం.

ఆటోబయోగ్రఫికల్ నవల ఉత్తమ పురుష (నేను) ప్రక్రియకు దగ్గర. ఆబ్జెక్టివ్ నవల ప్రథమ పురుష (అతడు) ప్రక్రియకు దగ్గర. ఇది స్థూలమైన అభిప్రాయం మాత్రమే. ఆటోబయోగ్రఫికల్ నవలను ప్రథమ పురుషలోనూ, ఆబ్జెక్టివ్ నవలను ఉత్తమ పురుషలోనూ రాయవలసిన సాహితీ సందర్భాలు కూడా కొన్ని వుంటాయి.

కథానాయకుడు ఆదర్శపాత్ర అయినప్పుడు ఉత్తమ పురుషలో రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కథానాయకుడు దుష్టపాత్ర అయినప్పుడు కూడా ఉత్తమ పురుషలో రాయలేము. ఒకవేళ రాస్తే ఆ దుష్టపాత్రకు ఉత్తమ పురుష ద్వారా సామాజిక ఆమోదం లభించినట్లు అవుతుంది. ఇటీవల ‘కల్లోల కలల కాలం’ అనే నవల వచ్చింది. రచయిత పరవస్తు లోకేశ్వర్. నిజానికి అది రచయిత ఆత్మకథ. ప్రథమ పురుషలో రాయడం వల్ల మాత్రమే ఆ ఆత్మకథ నవలీకరణలో విజయం సాధించింది.


‘ఆకాశగానం’ నవల ఆత్మకథ కాదు, ఆత్మాశ్రయ నవల. కానీ దానిని ప్రథమ పురుషలోనే రాయవలసివచ్చింది. కథానాయకుని సంకీర్ణ సంక్లిష్ట స్వభావం వల్ల (సామాజిక నీతికి దూరంగా వుండటంవల్ల) ఉత్తమ పురుషలో రాయవలసిన నవలను ప్రథమ పురుషలో రాయవలసి వచ్చింది.

నిజం చెప్పాలంటే- నవల రాస్తున్న క్రమంలో ఒక మేజిక్ జరుగుతుంది. సబ్జెక్టివ్ ఎలిమెంట్‌కు, ఆబ్జెక్టివ్ ఎలిమెంట్‌కు మధ్య సరిహద్దు రేఖ చెరగిపోయి; స్వీయానుభవమా లేక సామాజిక అనుభవమా... అనేది అప్రధానం అయిపోయి మొత్తం ఒక మానవానుభవంగా పాఠకులకు అందుతుంది.

కేవలం ఆబ్జెక్టివ్‌గా రాస్తే కథ పత్రికా రిపోర్టు మాదిరి తయార వుతుంది. కేవలం సబ్జెక్టివ్‌గా రాస్తే అది కథ కాదు, ఆత్మకథ అవుతుంది. కథలోకానీ, నవలలోకానీ- అస్వీయానుభవాన్ని సబ్జెక్టివ్‌ లోకి మార్చడం వల్ల అనుభూతి కలుగుతుంది. స్వీయాత్మకతను ఆబ్జెక్టివ్‌లోకి మార్చడం వల్ల సార్వత్రికత కలుగుతుంది. అనుభవాన్ని అనుభూతిగా వడగట్టడంలో ఈ రచనాక్రమం అంతా జరుగుతుంది.


కొన్ని నవలల విషయంలో ఇతివృత్తం గురించి చేయాల్సివచ్చే పరిశోధన ఆ తర్వాత నవలా రచనలో నెరేటివ్‌ను డామినేట్ చేయకుండా వుండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

ఎక్కడికి అక్కడ మైండ్‌ను ట్యూన్ చేసు కుంటూ జాగ్రత్తపడటమే! ఒక నవల నుండీ ఇంకొక నవలకు మారుతున్నప్పుడల్లా ఈ జాగ్రత్త తప్పదు. ఒక నవల రాసినట్లు ఇంకొక నవల రాయకూడదు అని తీర్మానించుకున్నప్పుడు దానికి భాష, వాక్యం, శిల్పం... వీటిపట్ల ప్రత్యేకమైన కసరత్తు తప్పనిసరి.


‘శప్తభూమి’, ‘అర్ధనారి’ తదితర నవలల్లో ఎన్నో పాత్రలు సృష్టించడం, దేనికది నిలబెట్టడం, వాటిమధ్య సమన్వయం సాధించడం... ఇది ఎలా సాధ్యమయ్యింది?

పేపర్ వర్క్ ఎక్కువగా జరుగుతుంది. పాత్ర తాలూకు మోడల్ వ్యక్తిని స్పష్టంగా నిర్ణయించు కుంటాను. చరిత్రలో సామాన్యులు రికార్డు కాలేరు. చారిత్రక నవల రాసేటప్పుడు ఆ సామాన్యులకు మోడల్ వ్యక్తులు దొరకరు. ఆ సందర్భంలో వారి కొనసాగింపును కార్యకార ణాలకు వదిలిపెడతాను. ఆ కార్యకారణాలే ఆ పాత్రలను పోషిస్తాయి. ఒక పాత్ర ఇంకొక పాత్రతో ఏ సందర్భాలలో ఇంటరాక్ట్ అవుతుంది, ఏయే సందర్భాలలో సంఘర్షిస్తుంది, వాటివల్ల నవలా ప్రయోజనం ఎంతవరకూ నెరవేరుతుంది.. వీటి చుట్టూ పథకాలు రచించుకుంటాను.


కథలకు భిన్నంగా నవలాకారులకు మాత్రమే వుండాల్సిన లక్షణాలు ఏమైనా వున్నాయా? అవేమిటి?

నవల కంటే కథ రాయడమే కష్టం. కథ రాసినవారందరూ నవల రాయగలరు. కథా ప్రక్రియలో మేధోశ్రమ ఎక్కువ. కత్తెర ఉపయోగం కూడా ఎక్కువ. నవలాప్రక్రియలో మేధోశ్రమ తక్కువ. నవలారచనలో కాయకష్టం ఎక్కువ.

మీరు ఇరవైల వయస్సులో రాసిన ‘ఆకాశగానం’ నవల గురించి ఇప్పుడేమనిపిస్తుంది?

నా ఆధ్యాత్మిక లోకాలకు ద్వారాలు తెరిచింది ఆ ఇరవయ్యేళ్ల వయసులోని ప్లెటోనిక్ లవ్. తెలుగు సాహిత్యంలో తాత్విక ప్రేమ నవలలకు పెద్ద ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని పూరించే ప్రయత్నం కూడానూ ఈ నవలారచన. ఇటువంటి నవలను ఇప్పుడు ఈ వయస్సులో అయితే అస్సలు రాయలేను.

బండి నారాయణ స్వామి

Updated Date - Oct 07 , 2024 | 04:54 AM