చొక్కా పాతబడుతోంది
ABN , Publish Date - Jul 01 , 2024 | 12:20 AM
అప్పటికీ మెలకువతోనే వున్నాను కొన్నిచోట్ల వెన్నెముకను మడత పెట్టుకుని కొన్నిచోట్ల తలను నేలలో పాతుకుని చొక్కా చిరిగిపోకుండా...
అప్పటికీ
మెలకువతోనే వున్నాను
కొన్నిచోట్ల వెన్నెముకను మడత పెట్టుకుని
కొన్నిచోట్ల తలను నేలలో పాతుకుని
చొక్కా చిరిగిపోకుండా కాపాడుకుంటూనే వున్నాను
కాలర్ దగ్గర పడ్డ మరకలు చెరిగేలా లేవు
పదేపదే జీవితంతో గొడవపడుతున్నానేమో
గుర్రాన్ని లొంగదీసుకున్నట్టు
కుక్కపిల్లను వెంట తిప్పుకున్నట్టు
పొయ్యిలో కాల్చి ఇనుపముక్కను ఇష్టానికి సర్దుకున్నట్టు
చొక్కాను సర్దుకోవడం నా వల్ల కావడం లేదు
అర్ధరాత్రి ఒంటరిగా చిక్కినప్పుడు
పది పది తలల నా చీకటి రూపం
చొక్కాను బద్దలుకొట్టుకునివచ్చి భయపెడుతోంది
ఇస్త్రీ చేసిన మడతల దగ్గర
దారాలు దారాలుగా తెగిపోతున్నాను
ఉడుకుడుకు గంజిలో నానబెట్టి ఎంతలా ఉతుక్కున్నా
చంకల లోతుల్లో దొరికిపోతున్నాను
బటన్ల దగ్గర దారం చిట్లిన చొక్కా
శరీరాన్ని దాచలేకపోతోంది
ఒకానొక కీలకఘట్టాన్ని చేరుకున్న సంకేతస్పర్శ
శీతాకాలపు మంచులా లోపలికి జొరబడుతోంది
ఉన్నదున్నట్టు
ప్రపంచం ముందు బయట పడిపోతున్నాను
నా చొక్కాకు ఏదో అయ్యింది
నటన మీద ఆకర్షణ మీద దృష్టి తగ్గినట్టుంది
పోనీ ఒకసారి
చొక్కా లేకుండా వేదిక మీదకు వెళ్ళిపోనా?
ఎపుడోసారికి నగ్నంగా మెరిసి మాయమయ్యే
మట్టిపాత్రలమేగా అందరం.
రాధ
83672 82012