Share News

సంతలో సరుకైపోయిన సంతకాలు!

ABN , Publish Date - Nov 07 , 2024 | 03:07 AM

మన దేశంలో, పల్లెల్లో మొదలుకొని పట్టణాల వరకు, పుష్కలంగా విస్తరించుకొని, ప్రతి వ్యవస్థలో అంతర్లీనమై ఒక సర్వసాధారణ ప్రక్రియలా ‘సంతకాల విక్రయాలు’ జరుగుతున్నాయి. ఈ చీకటి సంతకాల సంతలు...

సంతలో సరుకైపోయిన సంతకాలు!

మన దేశంలో, పల్లెల్లో మొదలుకొని పట్టణాల వరకు, పుష్కలంగా విస్తరించుకొని, ప్రతి వ్యవస్థలో అంతర్లీనమై ఒక సర్వసాధారణ ప్రక్రియలా ‘సంతకాల విక్రయాలు’ జరుగుతున్నాయి. ఈ చీకటి సంతకాల సంతలు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ నెలకొల్పబడి ఉన్నవి. ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఏ డిపార్టుమెంట్‌లో లంచం ఎక్కువ దొరుకుతుందో ఆ డిపార్టుమెంట్‌ వైపే గురి పెడుతున్నారు. ఆ కొలువు పొందటానికి కూడా లంచమే బీజమవుతున్నది. ఇక ఆ తర్వాత పెట్టిన పెట్టుబడి వసూలు చేసుకోవడానికి, అధిక ఆదాయం పొందడానికి, సంతకాల సంతలో ఒక దుకాణం తెరుస్తున్నారు.


బయట రియల్ ఎస్టేట్ దందాలో బ్రోకర్లు ఏజెంట్లు ఉన్నట్లుగా, పౌరునికీ అధికారికీ మధ్యన పైరవీకారులే అనుసంధానకర్తలు. ఈ మధ్యవర్తులు బాధితునికి భరోసా కల్పిస్తూ, అధికారులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చాకచక్యంతో లంచాలు ఇప్పించి, తమ కమిషన్ తాము తీసుకొని, ఇంకో బాధితుని కోసం వేట మొదలుపెడతారు. ఇదంతా నిరంతర ప్రక్రియ. ఇది ఎంతవరకు కొనసాగుతున్నదంటే– లంచం ఇచ్చే పౌరుడికి కూడా ఇది సర్వసాధారణ విషయమే అయిపోయింది. ‘ఇంతో-అంతో ఇచ్చి పని కతం చేసుకుంటే అయిపోతది’ అనుకుంటున్నాడు. సంతకం పెట్టే అధికారి ‘ఏమీ ఇయ్యంది, ఎట్లా చేస్తాం?’ అని రుబాబుగా, లంచం తీసుకోవడం కూడా ఒక వృత్తి ధర్మమే అనే భావనలో బ్రతుకుతున్నాడు. అటెండర్‌ నుంచి మొదలుపెట్టి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి వరకు, లంచగొండితనం నరనరాల్లో ఇమిడిపోయి ఉన్నది. కొంతమంది నిజాయితీగల ఆదర్శవంతులు కూడా ఉన్నారు. వారిని చూస్తే గర్వంగా అనిపిస్తుంది.


ఉన్నత చదువులు చదివి పరీక్షల్లో నెగ్గి ప్రజాసేవకు అంకితమైనట్లు ప్రమాణాలు చేసి అధికారులైన కొంతమంది కలెక్టర్లు సైతం సంతకాల సంతలో చేరి ఒక మ్యుటేషన్‌కి కనీసం లక్ష చొప్పున తీసుకున్నారని ‘ధరణి’ బాధితులు చర్చించుకున్న విషయం తెలిసిందే. ఒక గ్రామంలో అయితే రేపు బదిలీ అవుతున్నాడని తెలిసిన తహసిల్దార్ ఆ రాత్రికి రాత్రి అడ్డగోలు లంచాలు తీసుకొని నకిలీ ప్రొసీడింగ్‌లు సృష్టించి, ఫోర్జరీలు చేసి మరి అక్రమ మ్యూటేషన్లు చేశాడు. ఆ వ్యవహారంపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కోర్టులో కేసు నడుస్తూనే ఉన్నది. విచిత్రం ఏమిటంటే, ఆ తహసిల్దార్‌కు ప్రమోషన్ కూడా దొరికి, తన ఉద్యోగం యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది.

మన భూమిని మన పేరు మీద నమోదు చేయమన్నా దానికి లంచమే! మనది కాని భూమిని మన పేరు మీద ఏదో విధంగా మార్పిడి చేయటానికి పిరమైన లంచం! ‘నా భూమికి నేను లంచం ఇచ్చేది ఏంది?’ అనడం వల్ల కోర్టు చుట్టూ తిరిగే గతి పట్టింది. భూమి మీద ఏ హక్కు లేకుండా లంచమిచ్చి అధికారి చేత సంతకాలు చేయించుకున్నవాడు ప్రస్తుతానికైతే ఆరాంగా ఉన్నాడు. ఇలాంటి అక్రమ మ్యుటేషన్లు చాలామందికి జరిగాయి. ఆ పేద రైతులు ఆశ వదులుకున్నారు. ఒక దంపతులు తహసీల్దార్‌ ఆఫీస్ ముందే ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఇలా లంచం కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు అధికారులు.


యాంటీ కరప్షన్ బ్యూరో లాంటి సంస్థలు స్థాపించి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఇది ఆగడం లేదు. పౌరుని మార్గం సుగమం చేయుటకు వెబ్ పోర్టల్స్‌ తయారు చేసి సౌలభ్యం కల్పించాక కొన్ని సంస్థల్లో లంచాలకు అడ్డుగోడ పడింది. కానీ కొన్ని సంస్థల్లో పంపిన అప్లికేషన్లు ఏదో వంకతో పెండింగ్‌లో పెడుతున్నారు. సరైన కారణాలు చెప్పకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. పౌరుడు మళ్లీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తిరిగి అప్లికేషన్ పెట్టుకొని ఆన్ రోడ్డు ఎక్కి మళ్ళీ అధికారి దగ్గరికి వెళ్లి మంతనాలు చేసుకొని ఇంతో అంతో ముడుపులు చెల్లిస్తే గాని అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వడం లేదు.

కొత్తగా ఎవరైనా ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నవారు– మొదట్లోనే ఇంత టార్చర్ ఉంటే ఇంక ముందు ముందు ఇంకెంత సతాయిస్తారో అని వ్యాపారం మొదలుపెట్టే లోపే ఆపేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో! తన సంపాదనలో జీఎస్‌టీ ఎలాగో అలా ఈ మామూలు చెల్లించుకోవడం కూడా ఒక చీకటి టాక్స్ లాగా భావించి సకాలంలో చెల్లించుకొని దూసుకుపోతున్న వ్యాపారస్తులు కూడా ఎందరో ఉన్నారు. ‘లంచాలిచ్చుకుంటే నోట్లు, కోట్లు! ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఆటు పోట్లు, కోర్టులు!’ ఏది నయ్యమో డిసైడ్ చేసుకోవాల్సి వస్తున్నది, ఈ కాలంలో, ఈ సమాజంలో దూసుకుపోయే ఏ వ్యాపికైనా.


ప్రపంచం మున్ముందుకు సాగుతున్నా, ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం ఎంత టెక్నాలజీ వాడినా, లంచగొండులు మాత్రం ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేసి, పాత అలవాట్లను కొనసాగిస్తున్నారు. వీటిని అరికట్టడానికి ప్రభుత్వంతో పాటు పౌరులు కూడా లంచం ఇవ్వద్దని కంకణం కట్టుకొని, ఎదురు తిరిగి నిలదీసే తత్వం పెంపొందించుకోవడం అవసరం. దానికి పరిపూర్ణమైన అవగాహన కావాలి. ఫలానా ఆ ఫైల్ ఆగటానికి కారణం ఏమిటో క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి. అయినా ఆ ఉద్యోగి ఇబ్బంది పెడితే భయపడకుండా పై అధికారికి ఫిర్యాదు చేసే ధైర్యం రావాలి. మనం కరెక్ట్‌గా ఉన్నప్పటికీ, ఆటంకాలు వస్తే కోర్టు మెట్లు ఎక్కి తీరాల్సిందే, మీడియా తలుపులు కొట్టాల్సిందే, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు ప్రకటించాల్సిందే. ఈ చీకటి దందాలకు మొట్టమొదలు పౌరులు దూరంగా ఉండాలి. అధికారులు తమ సంతకాల గౌరవాన్ని దక్కించుకోవాలి. సంతలో సరుకు మాదిరిగా చేసుకోకూడదు. అప్పుడే దేశం బాగుపడుతుంది.

సయ్యద్ రఫీ

చిత్ర దర్శకుడు

Updated Date - Nov 07 , 2024 | 03:07 AM