హరిశ్చంద్రుడి కథాకమామిషు
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:40 AM
పురాణాల ప్రకారం హరిశ్చంద్రుడు షట్చక్రవర్తులలో మొదటివాడు. ఈ చక్రవర్తి అస్తిత్వం లోని నిజానిజాలు ఏమైనా అన్ని భారతీయ భాషల్లోనూ హరిశ్చంద్రుని గురించి అనేక కావ్యాలు వచ్చాయి. తెలుగుకు సంబంధించినంత....
పురాణాల ప్రకారం హరిశ్చంద్రుడు షట్చక్రవర్తులలో మొదటివాడు. ఈ చక్రవర్తి అస్తిత్వం లోని నిజానిజాలు ఏమైనా అన్ని భారతీయ భాషల్లోనూ హరిశ్చంద్రుని గురించి అనేక కావ్యాలు వచ్చాయి. తెలుగుకు సంబంధించినంత వరకు 15వ శతాబ్దిలో గౌరన రాసిన ‘హరిశ్చంద్రోపాఖ్యానము’ మొదటిది కాగా, 17వ శతాబ్దిలో రామరాజు భూషణుడు రాసిన ‘హరిశ్చంద్ర నలోపాఖ్యానం’ అనే కావ్యం రెండవది. ఆధునిక కాలంలో కందుకూరి వీరేశలింగం రాసిన నాటకం 1899లో వచ్చింది. ఒక నాటక కంపెనీ వాళ్లు శంకర కవి రాసిన హరిశ్చంద్రోపా ఖ్యానాన్ని నాటకీకరించమని కోరగా కందుకూరి రెండు వారాల్లో నాలుగు అంకాలు పూర్తి చేశారు. కానీ ఎందు చేతనో నాటక కంపెనీవాళ్లు ఆ నాటకాన్ని ప్రదర్శించలేదు. అసమగ్రంగా ఉన్న నాటకాన్ని కాకినాడ లోని మరో నాటక కంపెనీ వారి కోరిక మేరకు వీరేశలింగం పూర్తిచేయగా ఆ ఐదు అంకాల ఆ నాటకాన్ని ప్రదర్శించారు. బలిజేపల్లి లక్షీకాంతం నాటకం వచ్చే వరకు కందుకూరి రాసిన నాటకమే తెలుగు ప్రాంతాల్లో ప్రదర్శింపబడేది. ఆంధ్ర వాఙ్మయ చరిత్ర ప్రకారం తెలుగులో వచ్చిన హరిశ్చంద్ర నాటకాలు 26గా గతంలో రికార్డు కాగా, ఈ విషయంలో పరిశోధన చేసిన డా. జ్యోతుల కృష్ణబాబు 50 నాటకాల్ని సేకరించాడు. హరిశ్చంద్ర నాటకంపై ఇంకా వాసా ప్రభావతి, పి.యస్.ఆర్. అప్పా రావు కూడా పరిశోధన చేశారు.
‘‘హరిశ్చంద్రుని కథ దాన్ని కల్పించిన నాటి జాతి హృద యానికి ప్రతిబింబం’’ అని గురజాడ అన్నారు. ఇది కేవలం కల్పిత కథగా గురజాడ భావించారని దీని అర్థం. అలాగే నార్ల వెంకటేశ్వరరావు కూడా ‘నరకంలో హరిశ్చంద్రుడు’ అనే తన 26 పేజీల నాటకానికి 36 పేజీల పీఠిక రాసి దీన్ని కల్పితగాథగా సశాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేశారు. ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, భారతం, భాగవతం, మార్కండేయ పురాణం, వాయుపురాణం, పద్మపురాణం, శివ పురాణం, దేవీ భాగవతం తదితర పురాణాల్లో హరిశ్చంద్రుని ప్రసక్తి వస్తుంది. ఈ పురాణాల ప్రకారం సత్యహరిశ్చంద్రుడు, అసత్య హరిశ్చంద్రుడు, రాజర్షి హరిశ్చంద్రుడు ముగ్గురు వేర్వేరు హరిశ్చంద్రులు కన్పిస్తారు. ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావనకు వచ్చిన హరిశ్చంద్రుడు సత్యవంతుడు కాదు. ఇతనికి వందమంది భార్యలున్నా సంతానం లేదు. నారదుని సలహాపై వరుణ దేవుణ్ణి ప్రార్థించి ‘‘నాకొక పుత్రుణ్ణి ప్రసాదిస్తే వాడిని యజ్ఞపశువుగా నీకు సమర్పిస్తానని’’ సంతానాన్ని పొందు తాడు. కాని వాగ్దానాన్ని నెరవేర్చకుండా వాయిదాలు వేస్తుండటంతో వరుణుడు కోపగించి ఇతనికి ‘జలోదర’ వ్యాధిని సంక్రమింప చేస్తాడు. చివరకు హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి నూరు ఆవులిచ్చి కొనుక్కొని తనకు బదులుగా అతణ్ణి బలి ఇవ్వటానికి పూనుకోగా దేవతలు ప్రత్యక్షమై ఆ బాలుణ్ణి రక్షించి హరిశ్చంద్రుడికి వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తారు. హరిశ్చంద్రుని భార్య, కుమారుడి పేర్లలోనూ వివిధ పురాణాల్లో వ్యత్యాసాలున్నాయి. ‘శివపురాణం’ హరిశ్చంద్రుని భార్య సత్యవతి అని పేర్కొనగా, ‘మార్కండేయ పురాణం’ శౖబ్య అని, గౌరన కావ్యం చంద్రమతి అని పేర్కొన్నాయి. మహాభారతంలో ‘ఔసీనరి’ అని చెప్పబడింది. వంద మంది భార్యల్లో ఒక్కరి పేరు కూడా ఐతరేయ బ్రాహ్మణం చెప్పలేదు.
తెలుగులో యక్షగానాలుగా, హరికథలుగా, వచన కావ్యాలుగా కూడా హరిశ్చంద్రుడి కథలు వచ్చాయి. విశ్వనాథ సత్యనారాయణ కూడా ‘కావ్య – వేద హరి శ్చంద్ర నాటకములు’ అని ఒక పుస్తకం వెలువరించారు. ఎన్ని నాటకాలున్నా తెలుగునాట బలిజేపల్లి లక్షీకాంతం నాటకమే ప్రాచుర్యంలో ఉన్నది. అందులోని పద్యాలు ప్రజల నాలికలపై నాట్యమాడాయి. హరిశ్చంద్ర పాత్రధారులుగా బందా కనకలింగేశ్వరరావు, పూవుల సూర్యనారాయణ, చీమకుర్తి నాగేశ్వరరావు లాంటివారు విస్తృతంగా నటించినా అబ్బూరి వరప్రసాద్ అనే నటుడు హరిశ్చంద్రుని పాత్ర లోకి వచ్చిన 50వ దశకంలో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు గుర్రం జాషువా స్మశాన వాటిక కావ్యం లోని 6 పద్యాల్ని కాటిసీనులో జొప్పించి పాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత బండారు రామారావు అనే నటుడు వాటికి అద్భుతమైన బాణీలు సమకూర్చుకుని తెలుగు నాటక రంగంలో హరిశ్చంద్ర నాటకానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాడు. ‘‘ఇచ్చోటనే సత్కవీంద్రుల కమ్మని కలము...’’; ‘‘ఆకాశంబున కారుమబ్బులు ఆవరించె’’; ‘‘ముదురు తమస్సులో మునిగిపోయిన...’’; ‘‘ఇచట అస్పృశ్యత సంచరిం చుటకు తావే లేదు’’; ‘‘ఎన్నో యేళ్లు గతించిపోయినవి గాని ఈ స్మశాన స్థలిన్’’; ‘‘మొన్న మొన్ననే దేహంబోర్చి’’ –ఈ ఆరు జాషువా పద్యాలతో బలిజేపల్లివారి హరిశ్చంద్ర నాటకం మరింత సంపద్వంతమైంది.
తన అనుమతి లేకుండా తన కావ్యంలోని పద్యాలు వాడుకుంటున్నాడని కొంత ఆగ్రహం చెందిన జాషువా వినుకొండలో జరిగిన నాటక ప్రదర్శనకు ప్రేక్షకునిగా వెళ్లి బండారు రామారావు పాడిన పద్యాలు విని పరమానందం చెంది వేదికపైకి వెళ్లి ‘‘నా పద్యాలకు సార్థకత కల్పించావు. వాటిని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో’’ అని చెప్పాడట. బండారు రామారావు తర్వాతి కాలంలో హరిశ్చంద్ర పాత్ర ధారిగా వచ్చిన డి.వి. సుబ్బారావు ఈ పద్యాల బాణీని మరింత మెరుగు పరచటమేగాక ఆనాటికి ఉచ్ఛస్థితిలో ఉన్న తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాన్ని సైతం వెనక్కునెట్టి హరిశ్చంద్ర నాటకాన్ని ప్రథమ స్థానం లోకి తెచ్చాడు. డి.వి. సుబ్బారావు తర్వాత అతని మనుమడు జూనియర్ డి.వి. సుబ్బారావు కూడా ప్రస్తుతం ఆ పాత్రలో రాణిస్తున్నాడు. ఇంకా మారంరెడ్డి సుబ్బారెడ్డి, బండారు రవి కుమార్, సైదులు, చల్లా వెంకటేశ్వర్లు తదితర నటులు హరి శ్చంద్ర పాత్రలు ధరిస్తున్నారు. హరిశ్చంద్ర పాత్రధారి శ్రీకాకుళానికి చెందిన మంగాదేవిని ప్రత్యేకంగా పేర్కొ నాలి. స్త్రీ పాత్రల్ని పురుషులు ధరించటం చాలాసార్లు జరిగినా ఒక స్త్రీ హరిశ్చంద్ర పాత్ర ధరించటంతోపాటు ఖ్యాతినొందిన పురుషు పాత్రధారుల కన్నా మిన్నగా పేరుపొందుతున్నది.
చెరుకూరి సత్యనారాయణ