Share News

గుర్తింపు కొరవడిన ‘టైగర్‌ ఆఫ్‌ తెలంగాణ’

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:24 AM

స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనం ప్రక్రియ పూర్తికావచ్చింది. 1947 సెప్టెంబర్ 13న మొదలైన ఆపరేషన్ పోలో 5 రోజుల్లోనే విజయవంతమైంది. సెప్టెంబర్ 17న విలీనమైంది. 18న నిజాం లొంగిపోయాడు...

గుర్తింపు కొరవడిన ‘టైగర్‌ ఆఫ్‌ తెలంగాణ’

స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనం ప్రక్రియ పూర్తికావచ్చింది. 1947 సెప్టెంబర్ 13న మొదలైన ఆపరేషన్ పోలో 5 రోజుల్లోనే విజయవంతమైంది. సెప్టెంబర్ 17న విలీనమైంది. 18న నిజాం లొంగిపోయాడు. అప్పటికి ముషీరాబాద్ జైల్లో ఉన్న 50 మంది ఉరిశిక్షితుల్లో 12 మందిని ప్రపంచానికి తెలియనీయకుండా ఉరి కంబాలకు ఎక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక అమెరికన్ జర్నలిస్టు ద్వారా టైమ్స్ పత్రికలో ‘బాలుడికి ఉరిశిక్ష’ అనే సారాంశంతో వచ్చిన కథనం ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ కేసుని వాదించడానికి లండన్‌లో సుప్రసిద్ధ న్యాయవాది డి.ఎన్.ప్రిట్ ఢిల్లీకి వచ్చాడు. ఈ నాలుగు రోజుల వాదనలకు అప్పటి సోవియట్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు. ఆ 12 మందిలో ఒకడిగా, రేపు ఉరి తీయబడతాడ‌న‌గా, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థల, భారత ట్రేడ్ యూనియన్ల ఆందోళనల ఫలితంగా ఉరితీతకు కేవలం 8 గంటల ముందు అప్ప‌టి భార‌త ప్ర‌భుత్వం న‌ర్సింహులు ఉరి శిక్ష‌ను రద్దు చేసింది.


మరో కేసులో అరెస్టై నల్లగొండ జైలులో ఉన్న న‌ల్లా న‌ర్సింహులును చూడ్డానికి అప‌రేష‌న్ పోలో ఇన్‌చార్జీ, యూనియన్ సైనిక జనరల్ జె.ఎన్. (జయంతో నాథ్) చౌదరి వెళ్ళాడు. అప్పుడు ఆ జిల్లా ఎస్.పి. ధనరాజ్ నాయుడు సంకెళ్ళతో ఉన్న నల్లా నరసింహులును ‘టైగర్ ఆఫ్ తెలంగాణ’ అంటూ పరిచయం చేశాడు. ఎందుకంటే ప్రజల్లో ఆయనకు ఉన్న పేరు, నాటి నిజాం రాజ్యానికి, రజాకార్లకు, దొరలు, జాగీర్దార్లకు ఆయనంటే హడల్ అని చెప్పాడు.

ఇదే సమయంలో తన కాళ్ళ సంకెళ్ళు తొలగించాలన్న నల్లా నర్సింహులు మాటను తిరస్కరించడంతో, తన లొంగుబాటు కోసం అరెస్టు చేసిన తన భార్య వజ్రమ్మను విడుదల చేయాలని కోరగా, తర్వాత కొంత కాలానికి విడుదల చేశారు.


మొదటి ఘటన బక్కపలచగా, చిన్నగా ఉండే నర్సింహులు ఓ బాలుడిని తలపిస్తే, రెండో సంఘటన ఆ బక్కపలచని వాడి బలాన్ని నిరూపించింది. మూడో ఘటన ఆయనే కాదు ఆయన కుటుంబం పడిన కష్టాలకు తార్కాణంగా నిలిచింది. అక్టోబర్ 2వ తేదీన స్వాతంత్ర్యోద్యమానికి సారథ్యం వహించిన మహాత్మాగాంధీ, దేశానికి రెండో ప్రధానిగా సేవలందించిన జై జైవాన్, జై కిసాన్ అన్న లాల్‌బహదూర్ శాస్త్రి జన్మించారు. సరిగ్గా ఇదే తేదీన న‌ల్లా నరసింహులు పుట్టాడు. తెలంగాణ సాయుధ పోరాట న‌రసింహంగా వెలుగొందాడు. విచిత్రంగా వీళ్ళంతా... నీతి, నిజాయితీకి నిలువుట‌ద్దాలు. వ్య‌క్తిత్వంలో స‌మున్న‌తులు. ఉద్య‌మాల్లో ఉద్దండులు. పోరాటాల్లో వెన్నుచూప‌ని వీరులు. యాదృచ్ఛికంగా ఈ ముగ్గురు మ‌హోన్న‌తులు ఒకే తేదీన పుట్ట‌డం కాక‌తాళీయం కావ‌చ్చు కానీ, దేశం గ‌ర్వించ‌ద‌గ్గ భార‌త‌మాత ముద్దు బిడ్డ‌లు. ఈ ముగ్గురివి స్వాతంత్య్ర పోరాటాలే కానీ, దారులు వేరు. గాంధీజీ, శాస్త్రీజీ నాటి దేశ దాస్య‌శృంఖ‌లాలు తెంచ‌డానికి ఉద్య‌మాలు చేశారు. న‌ర్సింహులు నాటి తెలంగాణ నిజాం నిరంకుశ, దేశ్‌ముఖ్‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను రక్షించ‌డానికి ఉద్య‌మించాడు. ఆనాడు వారి దారి శాంతియుత మార్గ‌మైతే, న‌ర్సింహులు అనివార్యంగా సాయుధ పంథాని అనుస‌రించాడు.


ఇదే పోరాటం మరెవ్వరు చేసినా, నర్సింహులు మరే సామాజిక వర్గానికి చెందినవాడైనా, మరో దేశంలో చేసినా, అసాధారణ పేరు ప్రఖ్యాతులు వచ్చేవి. కానీ తన ప్రాణాలను లెక్కచేయని, నిస్వార్థ గెరిల్లా పోరాట యోధుడు నల్లా నర్సింహులుకు రావాల్సినంత గుర్తింపు రాలేదు.

నల్లా నర్సింహులు 1926 అక్టోబర్ 2న ఇప్ప‌టి జ‌న‌గామ జిల్లా దేవ‌రుప్పుల మండ‌లం కడ‌వెండిలో జ‌న్మించాడు. మామూలు పేద పద్మశాలి కటుంబం. చేనేత పని చేసి, ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. నాడు త‌న తండ్రికి జ‌రిగిన అవ‌మానంపై తిర‌గ‌బ‌డ్డ న‌ర్సింహులు అనుకోకుండానే ఉద్య‌మబాట ప‌ట్టాడు. రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభలో సభ్యత్వం తీసుకున్నాడు. తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య పేర్వారం జగన్నాథం 22–01–1989లో చేసిన ఇంటర్వ్యూలో నర్సింహులు చెప్పినట్లు... ‘‘ప్రజలను దోపిడీ, వెట్టి నుంచి విముక్తం కావించే శాంతియుత ఉద్యమాలపై దొరల గూండాల దాడులు, వారికి రక్షణగా అప్పటి పోలీసుల కేసులు, నిర్బంధాల నుంచి రహస్య జీవితాలు, సాయుధ పోరాటాలకు దారితీశాయి. నిజానికి సాయుధ పోరాటం పిలుపును కమ్యూనిస్టు పార్టీలు గానీ, పోరాట యోధులు కానీ ఇవ్వలేదు. ఆపరేషన్ పోలో సమయంలోనే సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.’’ ఆ తర్వాత నర్సింహులు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో, కొంత ఊగిసలాట తర్వాత సీపీఐలో జీవితాంతం కొనసాగారు.


‘ఒకనాడు భూస్వామి రామచంద్రారెడ్డి తన విస్నూరు గ్రామంలో దారిలో పోతుండగా, గమనించక, పొరపాటున ఒక రైతు తన ఇంటిముందు అరుగుమీద కూర్చున్నాడు. దీంతో ఆ గ్రామంలోని ప్రజల ఇంటిముందరి అరుగులన్ని మూలమట్టంగా కూలగొట్టించాడు’.


నాటి ‘దొరసాని (విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ) దగ్గర పనిచేసే 20 మంది జీతగాళ్లతో సహా ఆ గ్రామంలో జీతగాళ్లందరిని సంఘటితపర్చి ఒక రోజు సమ్మె జరిపించాడు. 3 రోజుల తర్వాత రైతులు సంప్రదింపులకు దిగారు. రైతులు ఇచ్చే రేటు తాను కూడా ఇస్తానని దొరసాని తన ఏజెంటును సంప్రదింపులకు పంపించింది. 3 కుంచాల జొన్నలకు బదులు నాలుగు కుంచాలకు నెలజీతం పెంచబడింది. తూమెడుకు బదులు ఇద్దుం ధాన్యం సంవత్సరానికి భిక్షం పేర అదనంగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. సంవత్సరానికి 15 రోజులు సెలవు కూడా అంగీకరించారు. ఇది న‌ర్సింహులు మొద‌టి విజయం. ఆ తర్వాత అనేక మ‌లుపులు తిరిగిన ఉద్య‌మంతోపాటు న‌ర్సింహులు పోరాట ప్ర‌యాణం సాగింది. ఉద్య‌మ ప్రస్థానంలో 122 దళాలను, ఆత్మార్పణ గెరిల్లా సమూహాలను నిర్మించి, నాయకత్వం వహించి, అనేకసార్లు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, అప్పుడప్పుడు పట్టుబడి, న‌ర‌క‌యాత‌న అనుభవించి, జైలులో పెట్ట‌బ‌డి, కొన్నిసార్లు జైలు నుంచి త‌ప్పించుకుని, ఒకసారి కోర్టు నుంచి తప్పించుకుని, అనేక కేసుల్లో ఇరికించబడి, తన కేసులు తానే వాదించుకుని, కోర్టు హాలులో న్యాయమూర్తులకే కమ్యూనిస్టు పోరాట పంథాపై సుదీర్ఘ డాక్యుమెంట్లు సమర్పించి, మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడి, రద్దు చేయబడి అజేయంగా నిలిచిన నల్లా నరసింహులు పోరాట ప‌టిమ, వాక్పటిమ అన‌న్యసామాన్యం. అనితర సాధ్యం.


'పోరాటం ముగిసిన తర్వాత’ ఆయన మీద పడిన మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు రద్దయినాక, సుదీర్ఘ జైలు జీవితం అనంతరం 1959లో జైలు నుంచి విడుదలైనారు. 1987లో తెలంగాణ సాయుధ పోరాటం 40వ వార్షికోత్సవం సందర్భంగా సాయుధ పోరాట యోధులు తమ అనుభవాలు నివేదించాలన్న కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు నివేదిక బదులు న‌ల్లా న‌ర్సింహులు, ‘తెలంగాణ సాయుధ పోరాటం: నా అనుభవాలు’ అనే పుస్త‌క‌మే రాశారు. 1989లో ప్రచురితమైంది.

మార్గం ల‌క్ష్మీనారాయ‌ణ‌

(నేడు న‌ల్లా న‌ర్సింహులు వర్ధంతి.

పాలకుర్తిలో విగ్రహావిష్కరణ)

Updated Date - Nov 05 , 2024 | 03:24 AM