Share News

ప్రేమలో కొన్ని తప్పులూ ఒప్పులూ

ABN , Publish Date - Oct 28 , 2024 | 06:02 AM

రెండు రెళ్ళు నాల్గనీ, చీకటైతే రాత్రనీ ఈ లోకంలో చెల్లుబాటయ్యే మాటలు ఎన్నైనా చెప్పచ్చు కానీ, కవిత్వ ప్రపంచంలో అడుగుపెట్టాక, గుప్పెడు పదాలు కవిత్వమెందుకు అవుతాయో, ఆ పొందికలో ప్రాణాన్ని దాచుకున్న...

ప్రేమలో కొన్ని తప్పులూ ఒప్పులూ

రెండు రెళ్ళు నాల్గనీ, చీకటైతే రాత్రనీ ఈ లోకంలో చెల్లుబాటయ్యే మాటలు ఎన్నైనా చెప్పచ్చు కానీ, కవిత్వ ప్రపంచంలో అడుగుపెట్టాక, గుప్పెడు పదాలు కవిత్వమెందుకు అవుతాయో, ఆ పొందికలో ప్రాణాన్ని దాచుకున్న మాట ఎక్కడుందో వివరించి చెప్పడం చాలా కష్టం. ‘ప్రూఫ్ రీడింగ్’ అని నందకిషోర్ రాసిన ఈ కవిత్వం, అచ్చంగా ఈ కోవలోకే చెందుతుంది. ఈ పద్యంలో మిరుమిట్లు గొలిపే పదాలు, ఉపమానాలు లేవు. హడావుడి లేదు. ఉన్నదల్లా ఒక అపురూపమైన భావం. అపూర్వమైన అల్లిక.


ప్రేమికుల కవిత్వంలో ఏ కాలాల్లోనైనా అదే ప్రేమ విన్నపం, అదే ఎడబాటు, అదే కోర్కె, మాయని అదే జ్ఞాపకం. కానీ వ్యక్తీకరణను సంభాషణగా మార్చడం ద్వారా కవితలో కొత్తదనం తీసుకురావడమెట్లానో ఇందులో చూడగలం. భాషలో తప్పులు వెదుకుతున్న ప్రేయసిని ఆపి, ఆ తప్పులన్నీ నీ వల్లేనమ్మీ అని ఎత్తిపొడిచే ప్రియుడి అల్లరి ఈ కవిత. ఆ జవాబులొక నెపంగా మళ్ళీ తన ప్రేమని నొక్కి చెప్పి, పాత జ్ఞాపకమొకటి ఆమెలోనూ తట్టి లేపి రెచ్చగొట్టే జాణతనం ఈ కవిత. ఒత్తుగా నిండుగా విరబూసిన గులాబీని అడ్డు పెట్టుకుని తన ప్రేమనంతా మొదటి పాదంలోనూ, ఒక్కటిగా ఉండాల్సిన ఇంద్రధనుస్సు రంగులు ఎడమైతే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో, తమ మధ్య దూరమూ అలాంటిదేనన్న ఊహని రెండో పాదంలోనూ చెప్పాడు.


ఆపైన, ఆ ఎడబాటులో నుండీ ఆమెను కూడిన క్షణాలను తల్చుకుంటున్నాడు. ఆ కలిసిన క్షణాల ప్రేమ సాఫల్యతను కలగంటున్నాడు. పొద్దులు పడట మంటే, నెల తప్పడం. కడుపులో నలుసు పడటం. అది ఉత్త కలే. కానీ అందులోనే ఆ ప్రేమ జ్వరతీవ్రత ఉంది. ఆమెను కలిసిన, ఆమెతో కూడిన క్షణాలను మరపుకు తెచ్చుకోలేని అశక్తతతో నిండిన దిగులూ ఉంది. అంత దిగులుపడ్డ హృదయానికీ ఊరట ఆమెదొక్క ముద్దు. ఊపిరి నిలిచేలా సుదీర్ఘమైన ముద్దిచ్చిన ప్రియురాలి ప్రేమతో లయ తప్పిన హృదయపు సౌందర్యం పరిచింది కనుకే, ఇది నాకు ప్రియమైన పద్యం.

మానస చామర్తి

Updated Date - Oct 28 , 2024 | 06:02 AM