భరోసా ఉంది, భ్రమా ఉంది!
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:44 AM
నా కవితా సంపుటి ‘చలినెగళ్లు’ పేరుతో 1968 మే నెలలో వెలువడింది. నిజానికి 1965లో వెలువడవలసింది. ఎందుకంటే అందులో నేను 1958 నుంచి 64 వరకు రాసిన తొలి కవితలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలంటే జ్ఞాపకాల వీధి (డౌన్ మెమొరీ లేన్)లో అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి...
నా మొదటి పుస్తకం
నా కవితా సంపుటి ‘చలినెగళ్లు’ పేరుతో 1968 మే నెలలో వెలువడింది. నిజానికి 1965లో వెలువడవలసింది. ఎందుకంటే అందులో నేను 1958 నుంచి 64 వరకు రాసిన తొలి కవితలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలంటే జ్ఞాపకాల వీధి (డౌన్ మెమొరీ లేన్)లో అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మిత్ర మండలి సాహిత్య సంస్థ నుంచి, ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్, ఆర్ట్స్ కాలేజి, ముఖ్యంగా ఎ హాస్టల్ రూమ్ నెం.67 దాకా నా 57–64 విద్యార్థి, యవ్వన అనుభవాల్లోకి, అనుభూతుల్లోకి వెళ్లాలి– అన్ని విధాల నా నేల నుంచి, నా భాష నుంచి చాలా దూరం నడిచి వచ్చిన ప్రవాసం నుంచి.
‘చలినెగళ్లు’ హైదరాబాద్ నారాయణగూడలోని నాగార్జున ప్రింటర్స్‌లో అచ్చయ్యింది. 1964 డిసెంబర్ మూడో వారానికి నేను క్యాంపస్ వదలడంతో నా కవితా సంకలనం ప్రయత్నాలు కూడా మూలపడినవి. 1966లో ప్రారంభమైన సృజన ద్వారానే పరిచయమైన శ్రీపతి హైదరాబాద్‌లో సృజన చిరునామా అయ్యాడు. ఆయన స్నేహం నాకు శ్రీకాకుళం సుబ్బారావు పాణిగ్రాహినే కాదు, ఆయన సహాధ్యాయులు సత్యం కైలాసం, రమణమూర్తి, భూషణం వంటి అందరినీ, శ్రీకాకుళ ఉద్యమాన్నీ పరిచయం చేసింది.
నాకు ఆధునిక/ అభ్యుదయ కవిగా గుర్తింపు తెచ్చిన ‘సోషలిస్టు చంద్రుడు’ 1957 ‘చలినెగళ్లు’లో చేర్చలేదు. 1958లో రాసిన ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది’ – స్వర్గంలోని వర్గ కలహాలు దాని కళ్లల్లో చదువుకుంటాను – అనే కవితలో సారళ్యం, స్పష్టత నండూరి రామ మోహనరావు వంటి కవి, విమర్శకులు, పత్రికా సంపాదకుల దృష్టిని ఆకర్షించింది. ‘కప్పుకోడానికి ఏమున్నయి, అయినా కప్పుకోడానికి ఏమున్నయి’ (ఆకలి) కవితా వాక్యం చేకూరి రామారావుకు పాఠ్యాంశ మైంది. 1962లో మర్లిన్ మన్రో చనిపోయినపుడు రాసిన కవిత ‘అకవితా వస్తువు’ నా కవిత్వాన్ని సంకలనంగా వేసుకోవాలన్న ఆత్మవిశ్వాసానికి దారి తీసింది. అది కొత్తగా విజయవాడ నుంచి వెలువడిన ‘జ్యోతి’లో బాపు ఇష్టంగా వేసిన బొమ్మతో అచ్చయి ఆయనతో, రమణతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని పురస్కరించుకునే బాపు ‘చలినెగళ్లు’కు ముఖచిత్రం వేసి అక్షరాలు రాసాడు. కవర్ వెనుక ఉన్న నా ఫొటో ఆర్టిస్టు, రచయిత చలసాని ప్రసాదరావు 1961లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆవరణలో తీసింది. కింద నా పరిచయ వాక్యాలు రాసింది శ్రీపతి.
మా ఉత్తర ప్రత్యుత్తర స్నేహంతో కెవిఆర్ గారికి నేను 62లో ‘చలినెగళ్లు’ రాతప్రతి పంపించాను. ఆయన అక్షర, శబ్ద దోషాలు మొదలు అన్వయం దాకా సవరించి ఓపికగా సూచనలు చేసారు. ఆ సందర్భంలోనే ఎండా కాలం సెలవులు మే చలం సంచిక ‘సృజన’తో పాటు ‘చలినెగళ్లు’ రూపొందింది. ఇటు శ్రీపతి ప్రోత్సాహానికి అటు ‘మిత్రమండలి’ సీనియర్ రచయిత దేవులపల్లి సుదర్శనరావు నెల్లుట్ల సంజీవరావుతో కలిసి ప్రచురణ సంస్థ ప్రారంభించాలనే ఆకాంక్ష దోహదం చేసింది. ఆయన అప్పటికే తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో కవి. ‘‘వసుధైక కుటుంబం కోసం, వర్గరహిత సమాజం కోసం ఎలుగెత్తి పిలిచి, మేల్కొల్పి స్వాతంత్ర్య పరమావధి వైపు పురోగమించే ప్రబోధం చేసిన వాని కోసం సాగిన’’ తన అన్వేషణలో నేను దొరికానని రాసారు.
ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ అనుకూలమైన సమీక్ష చేసాడు. కాని తెలంగాణలో వాడే ‘బొక్కలు’ అనే మాటను ఆంధ్రలో పొక్కలుగా అర్థం చేసుకొని అన్వయం కొన్ని చోట్ల కుదరలేదన్నాడు. ‘సంవేదన’లో రాచమల్లు రామ చంద్రారెడ్డి నన్ను ప్రోత్సహించే సమీక్ష రాసాడు. కుందుర్తి 1968లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ప్రారంభించాక శీలా వీర్రాజు ‘కొడిగట్టిన సూర్యుడు’ (68) తర్వాత 69లో ‘చలినెగళ్లు’కు వచ్చింది. ‘చలినెగళ్లు’ గుడిపాటి వెంకట చలానికి అంకితమిచ్చాను.
కాగితం మీద రాసిన అక్షరానికి నిలవాలనే నిబద్ధత నా కవితా ప్రయాణానికి దిశానిర్దేశం చేసింది. ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే స్పష్టాస్పష్టమైన నెహ్రూవియన్ సామ్యవాద ఎండమావి నుంచి నూతన ప్రజాస్వామిక విప్లవ సాంస్కృతిక, సాహిత్య మార్గాన్ని ఎంచుకున్నాను. అది ‘మిత్రమండలి’ నుంచి, ఫ్రీవర్స్ ఫ్రంట్ నుంచి, సృజన, విరసంలోకి ప్రయాణం వల్ల సాధ్యమైంది. ‘చలినెగళ్లు’, ఇతివృత్త కవితల్లోని ప్రబంధ భాషా ప్రభావం నుంచి ‘అన్‌లర్నింగ్ ప్రాసెస్’లో ప్రజలకు చేరువయ్యే పలకరించే భాషలోకి చేరుకున్నాను.
వరవరరావు