తెలంగాణ ఘనతను చిత్రికగట్టే చిహ్నాలే ఉండాలి
ABN , Publish Date - May 31 , 2024 | 02:16 AM
తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను ఏవో కారణాలు చూపి తీసేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. చెప్పే కారణాలు సముచితం కాదు. కాకతీయ రాజుల కాలంలో ఉండిన పాలన గురించి...
తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను ఏవో కారణాలు చూపి తీసేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. చెప్పే కారణాలు సముచితం కాదు. కాకతీయ రాజుల కాలంలో ఉండిన పాలన గురించి తెలంగాణ మెజారిటీ ప్రజలకు సదభిప్రాయమే ఉంది. కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులకు ఉన్న ప్రాశస్త్యం తెలిసిందే. గొలుసు కట్టు చెరువుల వల్ల వాన నీటిని వృధా కాకుండా నిలువ చేసి తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవడానికి కాకతీయులు కృషి చేశారు. ఆ చెరువులను కుతుబ్ షాహీ రాజులు, నిజాం రాజులు కూడా జాగ్రత్తగా కాపాడారు. ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ చెరువుల గొలుసు కట్టు తెగిపోయింది. తెలంగాణ వచ్చాక కొంత వరకు కేసీఆర్ ప్రభుత్వం చెరువులను బాగు చేసింది. ఇలాంటి చరిత ఉన్న కాకతీయుల తోరణంలో రాజరిక పోకడలు కూడా లేవు. తెలంగాణ ముఖ ద్వారంగా అది ప్రశస్తి పొందింది. అలాంటి చిహ్నాన్ని తీసేయాలని చూడడం సరైంది కాదు. ‘రామప్ప గుడి’ని ఇటీవలే యూనెస్కో వాళ్లు వారసత్వ సంపదగా గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా కాకతీయ ప్రతిభను చాటిండ్రు.
అలాగే తెలంగాణ, హైదరాబాద్ అనగానే భారతీయులకీ, బయటి ప్రపంచానికి కూడా చార్మినార్ గుర్తుకు వస్తుంది. చార్మినార్ రాచరిక చిహ్నం ఎంతమాత్రం కాదు. హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతే ఆ మహమ్మారి చేసిన విపత్తుకు స్మృతి చిహ్నంగా చార్మినార్ కట్టించాడు కుతుబ్ షాహీ రాజు కులీ కుతుబ్ షా! 400 ఏండ్లుగా అది తెలంగాణకు, హైదరాబాద్‌కు ఇక్కడి గంగా జమునా తెహజీబ్‌కు గుర్తుగా ఉంది. దానిని కేసీఆర్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు తొలగించాలని చూడడం సరైంది కాదు. తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌ల లోగో కొనసాగించాలని కోరుతున్నాం.
అంతకైతే మధ్యలో అమర వీరుల స్తూపం ఉంచి ఇటు తోరణం, అటు చార్మినార్ కూడా పెట్టవచ్చును. ఆలోచించండి. లేదంటే మరో ఉద్యమం లేవడానికి అవకాశం ఇచ్చినవారు అవుతారు. అలాగే ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందించాలనే ఆలోచనను కూడా విరమించుకోవాలని, తెలంగాణ వారితోనే ఆ గీతాన్ని పాడించడం, తెలంగాణ సంగీత దర్శకుడే సంగీతాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– నందిని సిధారెడ్డి, కాసుల లింగారెడ్డి, కాత్యాయని విద్మహే, వఝల శివకుమార్, ఎ.కె.ప్రభాకర్, ఉదయమిత్ర, తైదల అంజయ్య, జిలుకర శ్రీనివాస్, నరేష్కుమార్ సూఫీ, బిల్ల మహేందర్, అన్వర్, సింగిడి,
తెలంగాణ రచయితల సంఘం.