వాళ్ళూ మనమూ ఒకటే!
ABN , Publish Date - Nov 25 , 2024 | 05:47 AM
కాలం తెస్తున్న మార్పులను కథానిక నమోదు చేసినంత ప్రభావశీలంగా మరో ప్రక్రియ చేయలేదు. తక్షణ ప్రాముఖ్యం ఉన్న అంశాన్ని పాఠకుని దృష్టికి తెచ్చే కాల్పనిక ప్రక్రియ కావటం వల్ల కథానిక...
కాలం తెస్తున్న మార్పులను కథానిక నమోదు చేసినంత ప్రభావశీలంగా మరో ప్రక్రియ చేయలేదు. తక్షణ ప్రాముఖ్యం ఉన్న అంశాన్ని పాఠకుని దృష్టికి తెచ్చే కాల్పనిక ప్రక్రియ కావటం వల్ల కథానిక సాహిత్య రంగంలో తొందరగా నిలదొక్కుకుంది. పరిమిత పాత్రలతో, సంఘటనలతో, సన్నివేశాలతో ఆయా రచయితలు సృష్టించే కాల్పనిక ప్రపంచం లోకి పాఠకుడ్ని తీసుకు వెళ్తుంది. పాత్రల ప్రపంచాన్ని పాఠకుల ప్రపంచంతో సమన్వయం చేస్తుంది. మంచి భాషా శైలులు, సంవిధాన శిల్పం కథానికను బలోపేతం చేస్తాయి. సత్యాన్నీ తాత్వికతనూ జీవితంతో మేళవించి గొప్ప రచయితలు రాసిన కథానికలు పాఠకుల స్థాయిని పెంచుతాయి.
సీనియర్ జర్నలిస్ట్ పి.వి. సూర్యనారాయణ మూర్తి ఉర్దూ భాషలో బాగా కృషి చేసి, తనకు నచ్చిన ఉర్దూ సాహిత్యాన్ని, ముఖ్యంగా కథానికలను, తెలుగు లోకి అనువదించి ‘మెహక్ హైదరాబాదీ’ అన్న కలం పేరుతో ప్రచురిస్తున్నందుకు అభినందించక తప్పదు. ఆయన ఇప్పటిదాకా పది పుస్తకాలను అనువదించారు. వీటిలో జిలానీ బానూ కథలు రెండు సంపుటాలు, సాదత్ హసన్ మంటో కథలు రెండు సంపుటాలు, అమృతా ప్రీతమ్ నవల ‘పింజర్’, మఖ్దూమ్ మొహియుద్దీన్ వివాదాస్పద రచన ‘హైదరాబాద్’ మొదలైనవి ఉన్నాయి. జర్నలిస్ట్‌గా 2021లో రిటైరైన తర్వాత అవిశ్రాంతంగా చేస్తున్న సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం వారిని ఉన్నత విద్యా శాఖ లోని ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ మండలి సభ్యులుగా నియమించింది. ఇది ఒక అనువాదకునికి లభించిన అరుదైన గౌరవం.
‘మెహక్ హైదరాబాదీ’ ఇరవై రెండు ఉర్దూ కథానికలను ఉర్దూ మూలం నుంచి తెలుగులోకి అనువదించిన కథా సంకలనం పేరు ‘గుల్‌దస్త’. ఈ పుస్తకంలోని కథల అనువాద కార్యక్రమంలో ఒక పరిశోధనాత్మక దృక్కోణం సూత్రం లాగా ఇమిడి ఉంది. అది– ‘‘ఇక్కడి హిందువుల జీవితాలపై ముస్లిం రచయితలు ఎలాంటి కథలు రాశారు?’’ అన్నది. ఇదొక అన్వేషణ. అనువాదకుడు ఈ రెండు భాషల మధ్య సరికొత్త వంతెన వేస్తున్నాడు. దీన్ని ఉర్దూ సాహితీ మిత్రులు కూడా అనుసరిస్తే రెండు భాషల సాహిత్యం సుసంపన్నమవుతుంది.
రషీద్ కురేషీ 1938లో రాసిన కథ ‘వితంతువు’ (బేవా). భర్త చనిపోయిన తర్వాత సాటి స్త్రీల మధ్య కూడా ఒక అస్పృశ్యగా బతకటం యుక్త వయసులో ఉన్న షీలాకు దుర్భరమైపోతుంది. కూతుళ్ళ విషయంలో ఒక రకంగా, కోడళ్ళ విషంలో మరో రకంగా ప్రవర్తించే నోరున్న అత్తలకు హిందూ సమాజంలో దాదాపు ప్రతి ఇల్లూ కేంద్రమే. ఈ అత్త కూడా షీలాను ఇంట్లో నుండి గెంటే స్తుంది. షీలాకు సవతి తల్లి రంపపు కోత భరించక తప్పలేదు. ఈ దశలో యువకుడైన శంకర్ అనే ట్యూషన్ మాస్టారితో పరిచయం ఆమెకు ఒక వరమూ, శాపమూ కూడా. శంకర్ అనే వ్యక్తి పరిధి లోకి ఆమె జీవితం కుంచించుకు పోయింది. అతని ప్రేమ ప్రతిపాదన వల్ల ఆమె ఆలోచనలు పెళ్ళి వైపు మళ్ళాయి. కానీ అతడు ఈ వితంతువును వదిలేసి ఒక కన్యను పెళ్ళాడతాడు. దీంతో కథ విషమ స్థితికి చేరుకుంది. మూడు కోణాల ప్రేమకథ ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటుందన్న సూత్రం ప్రకారం షీలా ఈ లోకం నుండి నిష్క్రమిస్తుంది. చనిపోయిన భర్త, అత్త, సవతి తల్లి, శంకర్, శంకర్ భార్య – ఈ ఐదుగురితో మారుతూ వచ్చిన సంబంధాల దృష్ట్యా సంఘర్షణకు లోనైన స్త్రీ షీల. ఈ సంఘర్షణను చిత్రించిన తీరులో రచయిత సమర్థత కనిపిస్తుంది. ఒక్కోసారి ఒక సంఘటన సహజ పరిణామ క్రమంలో పతాక స్థాయిని అందుకుంటున్న ఘట్టంలో దాని నిర్వహణ చేతగాని కథకులు చేతులెత్తేస్తుంటారు. ఈ కథానికలో ఆ లోపం కనిపించదు. ఇది స్త్రీ కోణం నుంచి కథనం చేయబడ్డ కథానిక.
హిందూ సమాజంలో వితంతువుల సమస్య మతంతో ముడివడి ఉన్న అంశం. ముస్లిం సమాజంలో వితంతు సమస్య లేదనే చెప్పవచ్చు. తమ మతంలో లేని వితంతు సమస్య హిందూ సమాజంలో ఎట్లా ఉందో తమ పాఠకులకు తెలియజేయాలన్న ఆసక్తి నాటి ఉర్దూ రచయితలకు ఉండటం సహజం.
‘ఉప్పెన’ (సైలాబ్) కథానికను కదీన్ జమాఁ 2005లో రాశాడు. కథానాయిక నళిని పెళ్ళీడుకు వచ్చేసరికి ఒక నేపథ్యం ఏర్పడిపోయింది. ఆమెకు విష్ణుమూర్తి పట్ల ఎనలేని భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఒక రోజు పెద్ద తుఫాను వచ్చింది. సముద్రం చెలియలికట్ట దాటింది. నళిని, ఆమె భర్త పిల్లలను ఎత్తు కొని ఆత్మరక్షణ కోసం బయలు దేరారు. ఇంత ఆపదలో కూడా బరువైన విష్ణుమూర్తి విగ్రహాన్ని తనతోపాటు తెచ్చుకోవటం నళిని మరిచిపోలేదు. విగ్రహం సముద్రంలో జారిపడిపోయింది! వారు సురక్షితంగా గమ్యం చేరుకున్నారు. ఈ కథలో అంతఃసంఘర్షణకు భౌతిక పరిస్థితులు కారణమయ్యాయి. విష్ణుమూర్తి తాను సముద్రంలో మునిగిపోయి తమను కాపాడాడన్న భావన కూడా నళినికి దుఃఖ హేతువే. ఆమె భక్తిప్రపత్తులు విగ్రహాన్ని ఆశ్రయించే ఉన్నాయి. ముస్లిం సమాజంలో లేని విగ్రహారాధన హిందువుల విశ్వాసాలలో ప్రధాన భాగం. దీన్నే రచయిత ఈ కథానికలో తుఫాను ద్వారా చిత్రించాడు.
ఫాతిమా తాజ్ అన్న రచయిత్రి 2002లో రచించిన ‘జీవిత చక్రం’ (జీవన్ ధారా) కూడా విగ్రహారాధనకు సంబంధించిన కథే. ఇందులోని కథానాయిక పట్ల రచయిత్రి ప్రదర్శించిన గౌరవం, సానుభూతి పాఠకుడ్ని ఆకట్టుకుంటాయి. మరికొన్ని ఇతర కథల్లో కూడా హిందువుల మత సాంస్కృతిక మనోవ్యవస్థను గౌరవంతో దర్శించే శక్తి తమకు ఉందని ఉర్దూ రచయితలు నిరూపించుకు న్నారు. అంతరాంతరాల్లో లౌకికవాదం బలపడుతున్నదనటానికి ఇది సూచిక.
ఏ మతం వారి జీవితానికైనా ఆర్థిక శక్తే కేంద్రం. ఈ కేంద్రం చుట్టూ తిరిగే జీవితాలలో ఎంతో సమానత్వం, కొంత భిన్నత్వం ఉంటాయి. ‘గుల్‌దస్త’ కథలు ఈ సత్యాన్నే చెప్తున్నాయి. ఇక అనువాద విషయానికి వస్తే– మూల విధేయ పద్ధతికి చదివించే గుణం తోడైతే అనువాదకుని కృషి సార్థకమవుతుంది. మెహక్ హైదరాబాదీ కృషి సార్థక కృషి అని ‘గుల్‌దస్త’ పరిమళాలు చాటి చెప్తున్నాయి.
అమ్మంగి వేణుగోపాల్
94410 54637