Share News

‘‘నలభై ఏళ్ల నా సాహిత్య ప్రయాణానికి ఇదొక కనువిప్పు, కుదుపు!’’

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:23 AM

‘‘పొద్దుటి ఆహారంలో రొట్టెను తాకగానే-- ప్రతి తునకలో గాజా కనిపిస్తోంది’’ - ఇలా చిన్న చిన్న పద్యాల్లో గొప్ప భావసంచలనాన్ని దట్టించాడు అఫ్సర్‌. ఇటీవల రంజాన్‌కి "Fasting hymns' పేరుతో రోజుకో పద్యం వంతున 30 పద్యాలు ప్రకటించాడు. ముస్లిం సమాజపు జీవన విధ్వంసాన్నీ దుఃఖాన్నీ, ఎదుర్కొంటున్న వివక్షనూ, యుద్ధం...

‘‘నలభై ఏళ్ల నా సాహిత్య ప్రయాణానికి ఇదొక కనువిప్పు, కుదుపు!’’

‘‘పొద్దుటి ఆహారంలో

రొట్టెను తాకగానే--

ప్రతి తునకలో గాజా కనిపిస్తోంది’’

- ఇలా చిన్న చిన్న పద్యాల్లో గొప్ప భావసంచలనాన్ని దట్టించాడు అఫ్సర్‌. ఇటీవల రంజాన్‌కి "Fasting hymns' పేరుతో రోజుకో పద్యం వంతున 30 పద్యాలు ప్రకటించాడు. ముస్లిం సమాజపు జీవన విధ్వంసాన్నీ దుఃఖాన్నీ, ఎదుర్కొంటున్న వివక్షనూ, యుద్ధం లోహపాదాల కింద నలుగుతున్న పాలస్తీనా కన్నీటినీ కవిత్వం చేశాడు. కవి లోతుగా గాయపడ్డ విషయానికి ప్రతి పద్యం సాక్ష్యం చెబుతుంది.

‘ఉపవాస పద్యాలు’ పేరుతో పి. శ్రీనివాస్‌ గౌడ్‌ అనువదించిన ఈ పద్యాలు రంగులకు అతీతంగా అందర్నీ చుట్టుకుంటాయి. సరళతను గాఢతను ఒకే దారంతో పేని అందించిన శ్రీనివాస్‌ గౌడ్‌ అనువాద ప్రతిభను అభినందించకుండా ఉండలేం. ఉపవాస పద్యాల పుట్టుక, మనుగడ, ప్రభావాల గురించి కవి, అనువాదకుడి మాటల్లోనే విందాం.

సాంబమూర్తి లండ

96427 32008


‘Fasting Hymns’ - ఎన్నాళ్ళుగానో గూడుకట్టుకున్న దుఃఖగీతాలుగా ఎందుకున్నాయి?

అనేక వ్యక్తిగత, సామాజిక అడ్డుగోడల వల్ల కొన్ని విషయాలు మనసు మూలల్లోనే వుండి పోతాయి. ఒక గట్టి సామాజిక సందర్భం వచ్చినప్పుడు వాటిని మనసు విప్పి చెప్పుకునే శక్తి రచయితకి వస్తుందేమో! రంజాన్‌ లాంటి పండగలు కేవలం ముస్లింల అనుభవం మాత్రమే కాదు. మన సమాజాల్లో అవి మతం అడ్డు గోడల్ని దాటి వచ్చిన సామరస్య సందర్భాలు. అయితే, ఒక డిసెంబర్‌ ఆరు తరవాత, మరో పాలస్తీనా విషాదం తరవాత ఆ పండగ నా లోపల చాలా దుఃఖాన్ని కూడా నింపింది. దాహార్తికి గుక్కెడు నీళ్ళు ఇస్తే పది పుణ్యాలు దక్కుతాయన్న విశ్వాసం రంజాన్‌ నెల. ఆ గుక్కెడు నీళ్ళు కూడా దొరక్క చనిపోతున్న పాలస్తీనా పసిపిల్లల ప్రాణాల గురించి ఆక్రోశంలో ఈ ‘ఉపవాస పద్యాలు’ పుట్టాయి. అవి పుట్టిన చరిత్రనీ, నేపథ్యాన్ని బట్టి చూస్తే, ఇవి రాజకీయ పద్యాలు అని వేరే చెప్పక్కర్లేదు కదా!

ఒక్కో పద్యంలో కవిగా మీరు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ గురించి చెప్పండి?

వీలైనంత సూటిగా, ఎలాంటి అలంకారాలూ లేకుండా, నిజానికి హైకూలు మాత్రమే రాయాలని మొదలు పెట్టాక, ఆ పరిమితుల్లో కొన్ని ఆలోచనలు ఇమడలేదు. మొదటి కవిత రాశాక మిత్రుడు అనంతు కొన్ని సూచనలు చేశారు. అదే సమయంలో శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టత కోసం వేసిన ప్రశ్నలు నా వ్యక్తిగత పరిమితుల్ని దాటించడంలో ఉపయోగ పడ్డాయి. అలా రాసే క్రమంలో వచ్చిన ప్రతి మార్పునూ నేను నిష్పూచీగా స్వీకరించాను. మరో మిత్రుడు ఎన్‌. వేణుగోపాల్‌ రాజకీయ అంశాల గురించి ఇంకా కొంచెం స్పష్టత రావాలని సూచించడంతో పాలస్తీనా గురించి చాలా చదవాల్సి వచ్చింది. ఇవన్నీ కవితలకి కొత్త రూపాన్ని ఇవ్వడంలో ఉపయోగపడ్డాయి. కవిత్వం అంటే మన లోపల మనం నలిగిపోవడం మాత్రమే కాదనీ, నలుగురినీ కలుపుకొచ్చే వాహిక అని ఇవి రాస్తున్నప్పుడు నాకు బాగా అర్థమైంది. పద్యాల అందం పద్యంలోనే కాకుండా, అవి సృష్టించే రాజకీయ సంభాషణల వల్ల చిత్రిక పెట్టుకుంటుందని తెలిసొచ్చింది. ఆ రకంగా గత నలభై ఏళ్ల నా సాహిత్య ప్రయాణానికి ఇదొక ఆశ్చర్యకరమైన కనువిప్పు, కుదుపు!


ఈ పద్యాలకు ముస్లిం సమాజం నుండి ఎటువంటి ప్రతిస్పందన వచ్చింది?

‘Fasting Hymns’ మొదట ఇంగ్లీషులో పెల్లుబికిన వాక్యాలు. అందువల్ల, ఇది ప్రపంచంలోని వివిధ భాషల వాళ్ళు, ముఖ్యంగా మిడిల్‌ ఈస్ట్‌ దేశాల వాళ్ళు, అమెరికాలోని సాహిత్య అభిమానులు విస్తృతంగా చదివారు. అవి రాస్తున్న క్రమంలోనే ఆయా భాషల్లోకి అనువాదం చేస్తామని వాళ్ళు అడిగారు. బహుశా, వచ్చే రంజాన్‌ నెలకి కనీసం పది భాషల్లో ఈ కవితలు వెలువడుతాయి. ముఖ్యంగా, అరబీ, ఫారసీ, హిబ్రూ భాషల్లో ఇవి త్వరలో రాబోతున్నాయి. ఈ అనుమతి కోరిన వాళ్ళు ఎక్కువగా ముస్లింలే అని చెప్పలేను. ముస్లిం వేదనని అర్థం చేసుకుంటూనో, లేకపోతే, ముస్లిం సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళు అనో చెప్పలేను. వాళ్ళల్లో ఎక్కువమంది సామాజిక సాంస్కృతిక శాస్త్రాల నిపుణులు. తెలుగు సమాజం కూడా ముస్లిం, ముస్లిమేతర అనే తేడా లేకుండా ఆ పద్యాల్ని అక్కున చేర్చుకుంది.శ్రీనివాస్‌ గౌడ్‌ ఎంతో శ్రద్ధతో వాటికి పుస్తక రూపం ఇచ్చాక, అవి ఎక్కువమందికి అందాయి.

అఫ్సర్‌

‘‘ముస్లిం సమాజ వేదనని ఒడిసిపట్టిన కవిత్వం’’

పి. శ్రీనివాస్‌ గౌడ్‌

మీ ఇతర అనువాద సృజనతో పోలిస్తే ‘ఉపవాస పద్యాలు’ ఏవిధంగా విభిన్నం?

ముందు మూల రచన మన హృదయాలని కదిలించగలగాలి. అప్పుడే మనం దాని అనువాదానికి పూనుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం పట్ల ఇతర సమాజాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల వేదన చెందిన కవికి రంజాన్‌ మాసం అనేది ఒక సందర్భం. నెపం. ఆ సందర్భాన్ని ఆసరా చేసుకొని ముస్లిం సమాజం పడుతున్న అనంత వేదనని, వాళ్ళు సామాజికంగా మారాల్సిన అవసరతను అల్పాక్షరాలలో ఒడిసిపట్టిన కవిత్వం ఇది. అందుకే వెంటనే అనువాదం చేసాను. ఇతర అనువాద రచనలు పుస్తకాలుగా రావలసివున్నా ‘ఉపవాస పద్యాలు’ ముందుగా రావడానికి ఆ పద్యాలకు వున్న తక్షణ అవసరత, తీక్షణత కారణం. ఇతర అనువాదాలకు ఇది ఏ విధంగా విభిన్నమంటే ఇవి వెంటనే ముస్లిం సమాజాలకు, మిగతా పౌర సమాజాలకు జాగు లేకుండా అందవలసినవి.


కొన్ని పదాల విషయంలో కొంచెం స్వేచ్ఛ తీసుకున్నట్టు అనిపించింది?

ఇవి ఇంగ్లీషులో వెలువడిన కవితలు. ముస్లిం పండుగల పారిభాషిక పదాలు అరబ్బీ భాషలో వుంటాయి. అందువల్ల వాటి అర్థాలు మిగతా వారికి అర్థం కావు. కాబట్టి అనువాదంలో మక్కీకి మక్కీ ఇవ్వడం వల్ల వాటి జీవం పోతుంది. కనుకే అవసరమయిన చోట తెలుగు/ అరబ్బీ పదాలు ఉపయోగించాను. అవసరమైన మేరకు ఫుట్‌ నోట్సు ఇచ్చాను.

అనువాదకుడిగా, కవిగా ‘ఉపవాస పద్యాలు’ మీకు ఎలాంటి సంతృప్తిని ఇచ్చాయి?

ఈ పద్యాలను చదివినప్పుడు హృదయం ద్రవించిన అనుభూతికి లోనయ్యాను. నా తక్షణ స్పందనగా వాటిని అనువాదం చేసాను. నేరుగా తెలుగు కవిత చదివిన అనుభూతిని ఇచ్చిందని పాఠకులు అనడం ఆ కవితలను అనువాదం చేసిన ఫలితాన్ని, సంతృప్తిని ఇచ్చింది. ఉపవాస పద్యాలు చదివిన దాన్ని బట్టి ఈ కవితల సారాన్ని ఏ ఒక్కరిలోనైనా ముస్లిం సమాజాన్ని చూసేవాళ్ళ దృక్పథంలో కించిత్‌ మార్పు వస్తే అది నిజమైన సంతృప్తి.

Updated Date - Jul 22 , 2024 | 05:23 AM