Share News

త్రిపురనేని శ్రీనివాస్‌ నాలుగు పేజీల ఉత్తరంతో నన్ను ఒప్పించాడు

ABN , Publish Date - Dec 09 , 2024 | 01:13 AM

ఏప్రిల్ 1990. ఒకరోజు శివారెడ్డిగారు నా చేతికి ఒక ఉత్తరం ఇచ్చారు. అది ఆయనకు త్రిపురనేని శ్రీనివాస్ రాసిన ఉత్తరం. అందులో శ్రీనివాస్ నా ఆచూకీ అడుగుతూ, నా కవితలు పద్నాలుగింటిని ఒక బుక్‌లెట్‌గా...

త్రిపురనేని శ్రీనివాస్‌ నాలుగు పేజీల ఉత్తరంతో నన్ను ఒప్పించాడు

నా మొదటి పుస్తకం

త్రిపురనేని శ్రీనివాస్‌ నాలుగు పేజీల ఉత్తరంతో నన్ను ఒప్పించాడు

ఏప్రిల్ 1990. ఒకరోజు శివారెడ్డిగారు నా చేతికి ఒక ఉత్తరం ఇచ్చారు. అది ఆయనకు త్రిపురనేని శ్రీనివాస్ రాసిన ఉత్తరం. అందులో శ్రీనివాస్ నా ఆచూకీ అడుగుతూ, నా కవితలు పద్నాలుగింటిని ఒక బుక్‌లెట్‌గా వేయాలని అనుకుంటు న్నట్టుగా రాశాడు. ‘‘అతను నాకు చిక్కకపోయినా నా అంతట నేనే నిర్ణయం తీసుకుని బుక్‌లెట్ వేసేద్దామని అనుకుంటున్నాను’’ అని కూడా రాశాడు. శ్రీనివాస్ అంతకుముందే ‘క్రితం తర్వాత’ అనే సంయుక్త కవితను బుక్‌లెట్‌గా ప్రచురించాడు. అది పొడుగ్గా odd size లో ఉంటుంది. శ్రీనివాస్ నాకు ప్రియ మిత్రుడే కానీ నా పుస్తకం ఎలా వేస్తాడో అనే సందేహంతో వద్దని ఉత్తరం రాశాను. అప్పుడు శ్రీనివాస్ ‘‘నీ కవిత్వాన్ని అచ్చువేద్దామని నాకు ఎంతగానో అనిపించింది. ఇప్పటికీ అనిపిస్తోంది. నీ కవిత్వం అంటే నాకిష్టం. ప్రేమ’’ అంటూ నాలుగు పేజీల పెద్ద ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివాక ఒప్పుకోకుండా ఉండలేకపోయాను. శ్రీనివాస్‌కి కొన్ని కవితలూ, కొన్ని హైకూలూ పంపాను. ‘స్వాప్నికమేఘం’ అనిగానీ, కవితల సంఖ్యతో గానీ పేరు పెడదామని రాశాను. తర్వాత విజయవాడ వెళ్లి రెండు మూడు రోజులు ఉన్నాను. కవితల సంఖ్యతో పేరు పెట్టడానికే శ్రీనివాస్ ఇష్టపడ్డాడు. ‘19 కవితలు’ అని పుస్తకానికి పేరు పెట్టాలనుకున్నాం. నిజానికి ‘19 కవితలు’ పుస్తకంలో 19 కవితలతో పాటు 5 హైకూలు కూడా ఉన్నాయి. ముఖచిత్రం ఎలా ఉండాలో నేనే చెప్పాను. ఆ విధంగానే టి.వి. ప్రసాద్ చేత ముఖచిత్రం వేయించాడు శ్రీనివాస్.


‘19 కవితలు’ పుస్తకం 1990 జూన్‌లో విజయవాడలో శ్రీకృష్ణా ప్రింటర్స్‌లో అచ్చయింది. శ్రీనివాస్ కొన్ని కాపీలు మా ఊరికి పంపించాడు. అయితే అప్పుడు నేను హైదరాబాదులో ఉన్నాను. ఒక సభలో నేను దగ్గరికి వెళ్లగానే కె.కె. రంగనాథాచార్యులుగారు ‘‘నీ పుస్తకం చదివాను. చాలా కాలం తర్వాత హాయిగా కవిత్వం చదు వుకున్నానని పించింది’’ అన్నారు. అదే ఆ పుస్తకానికి నేను పొందిన తొలి ప్రశంస. అప్పటికి ఇంకా నేను పుస్తకం చూడనే లేదు. తర్వాత ‘ఉదయం’ పత్రికాఫీసుకు వెళ్లి కూచిమంచి ఉదయ్ దగ్గర చూశాను. పుస్తకం ఎంతో అందంగా కనిపించింది. ఆ తర్వాత నా కాపీలు నాకు అందాక, ముందుగా నా చిన్నచెల్లెలు మాధవీలతకు ఒక కాపీ పోస్టులో పంపాను.

‘19 కవితలు’ పుస్తకానికి నేను ఊహించని ప్రశంస లభించింది. తల్లావజ్ఝల శివాజీ, వాడ్రేవు చినవీరభద్రుడు సమీక్షలు ఎంత బాగా రాశారో! చేకూరి రామారావు ‘చేరాతలు’లో పెద్ద వ్యాసం రాశారు. ఆరుద్ర, శేషేంద్ర, ఇస్మాయిల్ ప్రభృతులు అభినందిస్తూ ఉత్తరాలు రాశారు.


ఇటీవల 2020లో పసునూరు శ్రీధర్‌బాబు ‘19 కవితలు’ గురించి రాసిన వ్యాసం లోని మాటలు ఇవి: ‘‘త్రిపురనేని శ్రీనివాస్ ప్రారంభించిన కవిత్వం ప్రచురణల్లో మూడో పుస్తకంగా 1990లో అచ్చయిన ఈ పుస్తకం అప్పట్లో ఒక సెన్సేషన్. గాలి నాసరరెడ్డి అంటే అప్పటికే ఏర్పడిన ఇష్టంతో ఈ పుస్తకాన్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నాను. ఆ ఇరవై పేజీల పుస్తకాన్ని అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ ఎన్నిసార్లు చదివానో! శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదివాక తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ చదవకుండా ఉంటే ఏమైపోయే వాడినో కవిత్వంలో అనిపిస్తుంది ఇప్పటికీ నాకు. అలాగే, ఎనభైల తరువాత వచ్చిన ఆధునిక కవిత్వంలో ఈ ‘19 కవితలు’ నా జీవితంలోకి రాకుంటే ఎలా ఉండేదో అన్న ప్రశ్న కూడా నన్ను వెంటాడుతుంటుంది.’’

గాలి నాసరరెడ్డి

Updated Date - Dec 09 , 2024 | 01:13 AM