Share News

రెండు దశాబ్దాల ‘రైతునేస్తం’

ABN , Publish Date - Oct 18 , 2024 | 02:31 AM

నేను సైతం రైతు కోసం అంటూ 2005లో ప్రారంభమైన రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఈ కాలం మొత్తం రైతునేస్తం రైతుల గుండె చప్పుడుకు వేదిక అయింది. ఆధునిక వ్యవసాయంతో...

రెండు దశాబ్దాల ‘రైతునేస్తం’

నేను సైతం రైతు కోసం అంటూ 2005లో ప్రారంభమైన రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఈ కాలం మొత్తం రైతునేస్తం రైతుల గుండె చప్పుడుకు వేదిక అయింది. ఆధునిక వ్యవసాయంతో సాగును లాభసాటి వ్యాపకంగా తీర్చిదిద్దడానికి అహరహం శ్రమించి పల్లె పల్లెకు చేరింది. ప్రతి రైతు కుటుంబంలో భాగస్వామి కావటానికి కష్టపడింది. వ్యవసాయ అనుబంధ రంగాలతో అదనపు ఆదాయం రైతుకు సమకూరాలనే దిశగా రైతులలో అవగాహన కోసం పరితపించి కొన్ని విజయాలు సాధించింది. రైతులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల మధ్య వారథిగా మారి రోజువారీ సాగు సమస్యలకు హేతుబద్ధ పరిష్కార మార్గాలు సూచిస్తూ ప్రయాణం కొనసాగటం అందరికీ తెలిసిందే. మారిన కాలాన్ని అనుసరించి పశునేస్తం, ప్రకృతినేస్తం మాసపత్రికలను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే కరోనా తరువాత రైతుల కోరిక మేరకు తిరిగి వాటిని రైతునేస్తంకు జోడించి సమగ్ర వ్యవసాయ పత్రికగా తిరిగి తీసుకువచ్చారు. ఇదే సమయంలో పత్రికను పూర్తిగా సేంద్రియ, సంప్రదాయ, సుస్థిర, సహజ వ్యవసాయ విధానాల కోసమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దిశగా పత్రిక నడుస్తోంది.


హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో, గుంటూరు జిల్లా కోర్నెపాడు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరం వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. చిరుధాన్యాలు, ప్రాసెసింగ్, అదనపు విలువ చేర్చటం, మిద్దెతోట సాగుకు అండగా చేయూతనిస్తూ ఆరోగ్య సమాజం కోసం తనవంతు కర్తవ్యం నిర్వహిస్తూ వస్తున్నారు. మరోవైపు రైతుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన వ్యాపకాల మీద వందకు పైగా ప్రచురణలు తీసుకురావటం సాధారణ విషయం కాదు. శిక్షణ, అవగాహన శిబిరాలు, ప్రచురణలతో పాటు రైతునేస్తం పేరుతో సేంద్రియ వ్యవసాయం కోసమే యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ, రైతుల మద్దతుతో కొద్దికాలంలోనే విశేష ఆదరణ పొందటమే కాకుండా నెంబర్ వన్ స్థాయికి ఎదగటం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. లాభంతో పనిలేదు. కేవలం సేవాభావంతోనే కార్యక్రమాలు చేస్తూ రైతునేస్తం అంటే రైతులకు ఒక నమ్మకంగా నిలబెట్టారు.


పిట్ట కొంచెం కూత ఘనం అన్న పెద్దలమాట రైతునేస్తం విషయంలో రుజువయింది. చిన్నపత్రిక కొన్ని మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టి తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతులు, శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులతో పాటు వ్యవసాయ పాత్రికేయులను పద్మశ్రీ డా. ఐ.వి సుబ్బారావు రైతునేస్తం పురస్కారాలతో సత్కరిస్తూ వ్యవసాయ రంగంలో పని చేస్తున్నవారు ఎవ్వరికీ తీసిపోరు ఆన్న ఆత్మబలం ఇవ్వగలిగింది. రైతులకు ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి తన విశ్వసనీయత పెంచుకుంది. మిద్దెతోట, చిరుధాన్యాలు... ఆరోగ్యకర సమాజం కోసం అవసరమని నమ్మి, ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్న అవగాహన సదస్సులు వారి కృషికి ప్రత్యేక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తెలుగునాట మిల్లెట్ మాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలీ, మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి ఆశయాలను ప్రతి గడపకు చేర్చింది. సత్కార కార్యక్రమం చేస్తే రైతునేస్తం వారే చెయ్యాలి. పుస్తకం ముద్రిస్తే వారే ముద్రించాలి. శిక్షణ, అవగాహన శిబిరాల నిర్వహణ అంటే రైతునేస్తం వైపు దృష్టి సారించటం అంటే... పత్రిక తన 20 ఏళ్ల ప్రయాణంలో విజయం సాధించినట్లే కదా!

కాకుమాను సాంబశివరావు

(అక్టోబర్‌ 20న గన్నవరం, ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో రైతునేస్తం ద్విదశాబ్ది వేడుకలు)

Updated Date - Oct 18 , 2024 | 02:31 AM