రెండు చేతులు
ABN , Publish Date - Jun 17 , 2024 | 03:33 AM
అవంటే ఎంతో ఇష్టం నాకు వాటిలో నా మొఖం దాచుకొనేంత ఇష్టం ఆ రెండు చేతుల కోసం బ్రతుకంతా చేతులు చాచి ఎదురుచూసేంత ఇష్టం ఆ చేతులే..
అవంటే ఎంతో ఇష్టం నాకు
వాటిలో నా మొఖం దాచుకొనేంత ఇష్టం
ఆ రెండు చేతుల కోసం బ్రతుకంతా
చేతులు చాచి ఎదురుచూసేంత ఇష్టం
ఆ చేతులే..
నా అడుగులు తడబడుతున్నప్పుడు
కొండంత ఆసరాగా మారి పట్టి నిలుపుతాయి
చెంపలను నిమిరి
నా తడి కళ్ళను
చూపుడు వేలుతో అద్ది ముద్దాడుతాయి
పసికూనల్ని రెక్కల చాటుకు చేర్చుకున్న
తల్లి పక్షిలా
నన్ను తన కౌగిట్లో భద్రంగా పొదువుకుంటాయి
ఆ చేతులు..
తడారిపోయిన నా పెదవులకు
చెలిమి వెన్నను పూస్తాయి
నా పరిసరాల చుట్టూ
సువాసనలు వెదజల్లి
నాతో మాట్లాడిస్తాయి
మృదువైన మాటల్లో నన్ను ముంచి తీస్తాయి
అలసిన నా నుదుటిపై స్వేదాన్ని తుడిచి
చెదిరిపోయిన నా ముంగురులు సవరిస్తాయి
వేకువ చల్లదనాన్ని విసిరి
కొత్త రాగాన్ని నా గొంతులో ఒలకబోస్తాయి
ఆ చేతుల కోసం ఎన్నాళ్లుగానో
వెతుకుతున్నాన్నేను
కలనైనా కనిపించి అక్కున చేర్చుకుంటాయేమోనని
నిద్ర వాకిలి చెంత కూర్చొని నిరీక్షిస్తున్నాను
ఆ చేతుల దిండుపై తలవాల్చి
నన్ను నేను మరచిపోతూ
ఆ భ్రమల్లోనే మురిసిపోతూ
బతుకు రేక తెల్లబడే దాకా బతికిపోతుంటాను
సునీత గంగవరపు
94940 84576