వ్యాపార నిపుణతలో విలువల నిబద్ధత
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:58 AM
రతన్ టాటాతో మా మొదటి సంకర్షణ (Interaction) సంతోషదాయకమైనది కాదు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే నిర్మలమైన గాలి పౌరుల హక్కు అని ఎలుగెత్తుతూ మేము ఒక ఉద్యమాన్ని ప్రారంభించాము....
రతన్ టాటాతో మా మొదటి సంకర్షణ (Interaction) సంతోషదాయకమైనది కాదు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే నిర్మలమైన గాలి పౌరుల హక్కు అని ఎలుగెత్తుతూ మేము ఒక ఉద్యమాన్ని ప్రారంభించాము. పిఎమ్ 2.5 అనే కణ రూప ద్రవ్యాన్ని డీజిల్ ఉద్గారిస్తుందనే వాస్తవాన్ని వైజ్ఞానిక పరిశోధనలు అప్పుడప్పుడే ధ్రువీకరిస్తున్న కాలమది. 1990ల నడిమి సంవత్సరాలలో అదొక కొత్త విషయం. డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి పిఎమ్ 2.5 రేణువులు ఉద్గారమై గాలిలో కలిసి, ఆ కాలుష్య గాలిని పీల్చిన వారి ఊపిరితిత్తులలోకి చొచ్చుకుపోతాయి. పౌరుల ఆరోగ్యం దృష్ట్యా డీజిల్‌తో నడిచే వాహనాలతో వాటిల్లే ఆరోగ్య ప్రమాదాల గురించి నేను, (కీర్తిశేషుడు అయిన) నా సహచరుడు అనీల్ అగర్వాల్ విపులంగా రాశాము. వెన్వెంటనే మాకు టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఒక పరువు నష్టం నోటీస్ వచ్చింది. అపనిందలతో తమ వ్యాపార నష్టానికి కారకులమవుతున్నామనేది ఆ హెచ్చరిక సారాంశం. రతన్ టాటా తన ఆటోమొబైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రోజులవి. అది డీజిల్‌తో నడిచే వాహనం. తత్కారణంగా ప్రత్యర్థి కంపెనీలు (పెట్రోల్ కార్ల ఉత్పత్తిదారులు) అయిన మారుతి సుజుకి మొదలైన వాటి కంటే నానోకు విశేష స్థాయిలో వ్యాపార అనుకూలత సమకూరే అవకాశమున్నది. ఇదలా ఉంచితే టాటా మోటార్స్ మాకు జారీ చేసిన లాయర్ నోటీసుపై మేము ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. న్యాయస్థానంలో పోరాడడానికి నిశ్చయించుకున్నాం. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మాకు, టాటా మోటార్స్‌కు మధ్య తీవ్ర న్యాయపోరాటమే జరిగింది. మేము మా వాదనకే దృఢంగా కట్టుబడి ఉన్నాం.
అయితే ఈ న్యాయపోరాటంలో మా పరస్పర ఆగ్రహం నెమ్మదిగా శాంతించింది. అంతిమంగా నేను ఒక వాస్తవాన్ని గ్రహించాను: మేము డీజిల్ కార్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది టాటా మోటార్స్ ప్రత్యర్థి కంపెనీల (పెట్రోల్ వాహనాల తయారీదారులు) తరపున అని తప్పుగా విశ్వసించినందునే రతన్ టాటా మాకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఉపక్రమించారు. అలాగే పిఎమ్ 2.5 విషయమై వైజ్ఞానిక పరిశోధనలు ధ్రువీకరిస్తున్న వాస్తవాల ప్రాతిపదికన మేము మా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని నిరూపణ అవడంతో రతన్ మా నిజాయితీని గుర్తించారు. ఆటోమోటివ్ ఇంధనంగా డీజిల్ ప్రజల ఆరోగ్యానికి ఎనలేని హానికారి అవుతుందనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. దీంతో మా ఉద్యమం పట్ల ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు మారాయి. అయితే టాటా మోటార్స్ తన డీజిల్ కార్ ప్రాజెక్టు నుంచి వెనక్కు తగ్గినట్టుగా భావించనవసరం లేదు. ఆ కంపెనీ ఆ వాహనాల ఉత్పత్తితో ముందుకు సాగింది. మేమూ, డీజిల్ వాహనాలకు వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని విడనాడలేదు. మరి ఈ వ్యవహారం ఎలా ఒక కొలిక్కి వచ్చిందో తెలుసా? విరుద్ధ అభిప్రాయాలను ఆమోదించడమనే పాత కాలం మంచి ప్రజాస్వామిక సంప్రదాయాల స్ఫూర్తితో ఆ వివాదం ముగిసింది. రతన్ టాటా తన నానో కార్లను తొలుత ఢిల్లీ ఆటో మోబైల్ ఎగ్జిబిషన్‌లో విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన నా పేరును ప్రస్తావించి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నానో, సునీతా నారాయణ్ ఆమోదం పొందగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు! ఆశ్చర్యపోయాను, వినమ్రంగా రతన్ టాటా విశాల, నిష్పాక్షిక దృక్పథాన్ని అంగీకరించాను.
రతన్ టాటాతో నా రెండో అనుభవం మరింత వ్యక్తిగతమైనది, మనసును తాకేది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో ఒకసారి నేను ఒక ఉన్నతస్థాయి విందు సమావేశంలో పాల్గొన్నాను. అత్యున్నత స్థాయి అధికారులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రభావ ప్రాబల్యాలుగల రాజకీయ నాయకులు ఉన్న సమావేశమది. దేశ జనాభాలోని ప్రతి ఆదాయ వర్గం వారి అవసరాలను తమ ఆటోమోబైల్ కంపెనీ ఎలా తీరుస్తుందో రతన్ టాటా వివరిస్తున్నారు. ఆయన అప్పుడే బ్రిటన్‌లోని ఆటోమోబైల్ దిగ్గజం జాగ్వార్ కంపెనీని స్వాయత్తం చేసుకున్నారు. సంపన్నులు, సెలెబ్రిటీలు, ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే లభ్యమయ్యే కారు అది. మొట్టమొదటిసారి కారు కొనుక్కోదలిచిన వినియోగదారులకు అందుబాటులో ఉండేది నానో. ఆయన మాటల మధ్యలో నేను జోక్యం చేసుకుని ఒక విషయాన్ని చెప్పడాన్ని రతన్ మరచిపోయారని వ్యాఖ్యానించాను. ఆయన కళ్లలో ఏదో కలత పొడసూపడం నాకు స్పష్టంగా కనిపించింది. పర్యావరణ ఉద్యమకారిణిగా నేను ఏదైనా ఇబ్బందికరమైన విషయాలను వెల్లడిస్తానని ఆయన అనుకున్నారు కాబోలు! అయితే నేను ఆయనకుగానీ మరెవరికిగానీ అప్రియమైన విషయాలు ఏవీ చెప్పలేదు. టాటా మోటార్స్ బస్సులు కూడా తయారు చేస్తున్నదని, అవి, కార్ల కంటే ఎంతో ఎక్కువ మందిని వారి గమ్యాలకు చేరుస్తున్నాయని, తమ కంపెనీ తాజాగా సిఎన్‌జితో నడిచే అధునాతన బస్సులను ఉత్పత్తి చేయడం ప్రారంభించిందనే విషయాన్ని ప్రస్తావించడాన్ని రతన్ టాటా మరచిపోయారని నేను అన్నాను. అందరూ నన్ను మెచ్చుకోలుగా చూడడాన్ని గమనించాను. సరే అటువంటి సమావేశాల్లో సంభాషణలు ఎప్పటి మాదిరిగానే సాధారణ విషయాల మీదకు మళ్లాయి. నేను ప్రస్తావించిన విషయం అంతటితో ముగిసినట్టేనని భావించాను.
నేను పొరపడ్డాను. కొద్దిరోజుల అనంతరం టాటా మోటార్స్ అత్యున్నత స్థాయి అధికారి ఒకరు మా కార్యాలయానికి వచ్చారు. మేము నిర్వహిస్తున్న డీజిల్ వ్యతిరేక ఉద్యమ విషయమై ఆయన వచ్చారేమోనని నేను భావించాను అయితే తాను టాటా మోటార్స్ కార్ల తయారీ విభాగం నుంచి గాక బస్‌ల ఉత్పత్తి విభాగానికి చెందినవాడినని ఆ అధికారి చెప్పారు. రతన్ టాటాకు నేను చెప్పిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించగా తాను ఎందుకు వచ్చిందీ వివరంగా చెప్పారు. ఆ విందు సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలు రతన్ టాటాకు విభ్రమం కలిగించాయట. ఆ తరువాత టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్‌కు ఫోన్ చేశారట (మా కార్యాలయానికి వచ్చింది ఆ అధికారే), తనకు కూడా తెలియకుండా తన కంపెనీలో జరుగుతున్న, సునీతా నారాయణ్ ప్రశంసించిన ఆ ప్రశస్త పని ఏమిటనేది. ఆయనకు తెలియలేదు. ఎట్టకేలకు నా వ్యాఖ్యలను ఆయన అర్థం చేసుకుని మెచ్చుకున్నారు. నా వ్యాఖ్యలు చలనశీలత రూపాంతరీకరణం (mobility transformation) ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడంలో కార్లు కాకుండా బస్సుల పాత్ర, ప్రాధాన్యం గురించి రతన్ టాటాలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయని తెలిసింది.
ఆ గొప్ప మనిషి నుంచి నాకు వ్యక్తిగతంగా లభించిన గుర్తింపు, ప్రశంసలను చెప్పుకోవడానికి నేను ఇది రాయడం లేదు. ఆయనలోని గొప్పదనమేమిటో వివరించడానికే ఇది రాస్తున్నాను. ఇతరులు చెప్పేది ఓర్పుగా వినే శక్తి, ఎంత ఇబ్బందికరమైనవి అయినప్పటికీ విరుద్ధ అభిప్రాయాలు, వైఖరులను అంగీకరించే విశాల దృక్పథమే ఆ గొప్పదనం. కొంత మంది ఇతర పారిశ్రామికవేత్తలతో మా అనుభవాల దృష్ట్యా కూడా నేను ఇది మరీ చెప్పుతున్నాను. తమ ఉత్పత్తుల్లో క్రిమిసంహారక మందులు ఉన్నాయని మేము నిరూపించినప్పుడు రెండు బహుళజాతి కంపెనీలు దౌర్జన్యకరంగా, అసహ్యంగా ప్రతిస్పందించాయి. మా శాస్త్రీయ నిరూపణలను ఆ కంపెనీలు పూర్తిగా కొట్టివేశాయి. తాము తప్పు చేయడమనేది జరగదని ఎందుకంటే తమవి అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీలు అనే దురహంకారాన్ని ప్రదర్శించాయి. ఒక కంపెనీ వారయితే మరింత ఆక్షేపణీయంగా ప్రవర్తించారు. మమ్ములను బెదిరించారు, భయపెట్టారు చౌకబారు ఎత్తుగడలకు దిగారు. చివరకు కేసులు పెట్టారు. వారు ఉత్పత్తి చేస్తున్న ఆహారంలో విష పదార్థాలు అధికంగా ఉంటున్నాయని నిరూపించడమే మేము చేసిన తప్పు! మేము మా వ్యక్తిగత ప్రయోజనాలకు పనిచేయడం లేదని, వ్యాపారంలో ఉత్పత్తిదారుల ప్రయోజనాలు, వినియోగదారుల సంక్షేమం మధ్య సమతౌల్యత ఉండాలనే ఉద్దేశంతో మేము మా కృషి చేస్తున్నామని వివరించినా ఆ కంపెనీ విన్పించుకోలేదు.
రతన్ టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయడం ఆయనలాంటి పారిశ్రామికవేత్తలు, వ్యవస్థా నిర్మాణ దక్షులు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజులు వెళ్లిపోయినందుకు విచారపడడమే; అటువంటి ఐశ్వర్యవంతులు తమ వ్యక్తిగత జీవితంలో పొదుపరితనం, నిరాడంబరత పాటించే రోజులు గతించినందుకు బాధపడడమే; వ్యాపారం అనేది కేవలం వ్యక్తిగత లాభాల ఆర్జనకు మాత్రమేకాదని, ప్రజల శ్రేయస్సుకూ అది తోడ్పడాలన్న సమున్నత విలువలు విలుప్తమవుతున్నందుకు విచారించడమే. రతన్ టాటాకు నివాళి అర్పించటం ఈనాటి కొంత మంది కుబేరుల అసభ్య దుబారాలను తిరస్కరించడమూ, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమంటే ఒక అభిప్రాయం పట్ల అనంగీకారం కాదనే భావనను మళ్లా మన జీవితాల్లోకి తెచ్చుకోవడానికి మనం సంకల్పించుకోవడం కావాలి.
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’
డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)