కాబోయే విజేతకు విజయ హారతి!
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:30 AM
అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నిక జీవిత సదృశమైనది. ఆ మహా ప్రజాస్వామిక సమర తీరుతెన్నులు తరచు మారిపోతుంటాయి. అంతిమ విజయం ఎవరిదనే విషయమై మనం ఊహలు చేస్తాం. నిర్దిష్ట అంచనాలకు వచ్చేందుకు ఆరాటపడతాం...
అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నిక జీవిత సదృశమైనది. ఆ మహా ప్రజాస్వామిక సమర తీరుతెన్నులు తరచు మారిపోతుంటాయి. అంతిమ విజయం ఎవరిదనే విషయమై మనం ఊహలు చేస్తాం. నిర్దిష్ట అంచనాలకు వచ్చేందుకు ఆరాటపడతాం. అయితే తడబడతాం. మన పిచ్చా పాటీలో ప్రత్యామ్నాయ సంవాదాల వైపు మొగ్గు చూపుతాం. రాజకీయ పండితులు తెలివైన కథనాలు నివేదిస్తారు, అయితే పోరు పూర్తయిన తరువాతనే సుమా! అయితే ఇందుకు వారు విజేత ఎవరో నిర్ణయమవక ముందే క్రియాశీలంగా ప్రతిస్పందించవలసి ఉంటుంది. ఎవరు గెలుస్తారు లేదా గెలవరు అనే విషయమై నిరాకరించదగిన, ఆంగీకార యోగ్యమైన అభిప్రాయాలను సేకరించవలసి ఉంటుంది. ఆఖరుకు‘నేను ముందే చెప్పలేదా?’ అంటూ తమ సర్వజ్ఞతను సగర్వంగా ప్రదర్శిస్తారు!
ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత ఎవరు గెలిచారు అనే విషయం ఆధారంగా పాత్రికేయులు తాము ముందే తయారు చేసుకున్న కథనాలలో విజేత కనుగుణమైనదానిని ఎంపిక చేసుకుంటారు. డోనాల్డ్ ట్రంప్ గెలిచినట్లయితే అమెరికాకు అధికారికంగా, అనధికారికంగా వలస వచ్చిన, వస్తున్న వారు, ముఖ్యంగా మెక్సికన్ల పట్ల కఠిన వైఖరితో కూడిన విధానాన్ని అనుసరించాలన్న వాదన కారణంగా ఆయన విజయం సాధించారని తప్పక వక్కాణిస్తారు. ట్రంప్ ఓడిపోయారనుకోండి. అందుకు అధిక సంఖ్యాక వర్గం – శ్వేత జాతీయులు– వారే కారకులు అవుతారు. మిన్నెసోటా, మోంటానా లాంటి రాష్ట్రాల ఓటర్లు వలసల వ్యతిరేక వైఖరిని పట్టించుకోకపోవడమే కారణమవుతుంది. ఇంతకూ ఆ రాష్ట్రాల వారు చూసిన, చూస్తున్న మెక్సికన్లు వెండితెరపై కనిపించేవారు మాత్రమే. మరి వారు హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్‌కు సరిపోలరు కదా.
కమలా హారిస్ గెలవడం జరిగితే అందుకు ప్రధాన కారకులు నల్ల జాతివారే (ఆఫ్రికన్ అమెరికన్లు). అందునా ఒప్రాహ్ విన్ ఫ్రే, మిషెల్ ఒబామా లాంటి ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ ప్రముఖులు ఆమె పక్షం వహించడమే కమలాహారిస్‌కు కలిసివచ్చింది. అయితే నల్ల జాతీయుల మద్దతులో మరో కోణాన్ని కూడా మనం చూడవలసి ఉంది. నల్ల జాతి పురుష ఓటర్లు ప్రభావశీలమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ, ఎటువంటి సవాళ్లనైనా సదా సమర్థంగా ఎదుర్కోగల ధీర ఒక అగ్రగామిగా ఉండడాన్ని ఇష్టపడరు. సరే, కమలా హారిస్ కూడా ఒక నల్ల జాతీయురాలే అనివారు భావించరు. మరి డోనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి గురించి నిరంతరం ఘోషిస్తోంది ఇదే కదా!
ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా ఉన్న గర్భస్రావం విషయాన్ని చూద్దాం. ప్రతిష్ఠాత్మక అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంచుకున్న డెమొక్రాట్లలో అత్యధికులు గర్భ స్రావాన్ని చట్టబద్ధం చేయాలని వాదిస్తున్నారు. అయితే దీనివల్ల మహిళలకు, తగినంత మంది పురుషులకు మాత్రమే ప్రయోజనముంటుంది. కమలాహారిస్ గెలిచినపక్షంలో అందుకు కారణం అమెరికన్లలో కనీసం సగం మంది మహిళలు కావడమే. పిల్లలను కనే వయస్సుదాటిన వారు సైతం గర్భస్రావాన్ని చట్టబద్ధం చేయాలని పట్టుబడుతున్నారు. వీరంతా 1970ల నాటి రో వెర్సెస్ వేడ్ కేసులో గర్భస్రావం అనుకూల తీర్పుకు పోరాడినవారే. ఆ తీర్పు విషయంలో డోనాల్డ్ ట్రంప్ వైఖరి సానుకూలంగా లేదు.
కమలా హారిస్ గెలిచిన పక్షంలో కచ్చితంగా ఒక కారణం అందుకు ప్రధానంగా దోహదం చేస్తుంది: ఆమె తన భావాలు, అభిప్రాయాలను, అనుసరించబోయే విధానాలను ప్రశాంతంగా, ఎటువంటి తడబాటు లేకుండా స్పష్టంగా విశదంగా చెప్పడమే, సందేహం లేదు. అయితే ఓడిపోయిన పక్షంలో ఆమె వివరణలు, విధానాలు, నినాదాలు ఏవీ హాంబర్గర్, హాట్ డాగ్ స్టాండ్ (అమెరికాలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు, స్నాక్స్ క్యాంటీన్‌లు)ల లోనివారిని ఎటువంటి ఉద్వేగాలకు లోనుచేయదు. ఆ రాజకీయ పరిణామాన్ని పట్టించుకోవడంపై వారు శ్రద్ధ చూపరు. విజితురాలుపై వారిలో ఎటువంటి సానుభూతి జనించదు. మహిళా ఓటర్లలో అత్యధికులు తన పక్షానే ఉన్నారని కమలా హారిస్ భావిస్తున్నారేమో కానీ శక్తిమంతుడైన డోనాల్డ్ జాన్ ట్రంప్ తమ సమక్షంలో నిలబడినప్పుడు వారిలో ఎంత మంది ఆయను అనురాగ దృక్కులతో చూస్తారో ఆమెకు తెలుసా?
డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన పక్షంలో కారణమేమవుతుంది? ఆయన తన రాజకీయ ప్రత్యర్థులను తరచు తీవ్రంగా విమర్శిస్తుండడం, వలసవచ్చినవారిని దూషించడమే; అంతే కాదు, తీవ్ర శిక్షలకు అర్హమైన మహాపరాధాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్నో కేసులు ఉండడం కూడా. అంతేనా? ఎన్నికల ప్రచారానికి ఓటర్లు సమకూర్చిన నిధుల నుంచి ఒక సెక్స్ వర్కర్‌కు, తన ప్రతిష్ఠను కాపాడుకునే నిమిత్తం చెల్లింపులు జరిపారన్న తీవ్ర అప్రతిష్ఠను మూటగట్టుకోవడమూ ఆయన ఓటమికి దారితీసిందని చెప్పడం అనివార్యమవుతుంది. ట్రంప్ గెలిచారే అనుకోండి అప్పుడు ఆయన ఒక శక్తిశాలి పురుషపుంగవుడు కావడమేనని తప్పక చెప్పుతారు. మహిళల కంటే పురుషులనే ఎక్కువగా ఆకట్టుకునే వ్యక్తిత్వ వైనాలు ఆయనలో బాగా ఉన్నాయని ఘోషిస్తారు.
డోనాల్డ్ ట్రంప్ మళ్లీ శ్వేత సౌధం (అమెరికా అధ్యక్షుని అధికార నివాసం) ఆసామీ అయితే అందుకు తోడ్పడిన కారణం ఆయన అధ్యక్ష పదవీ కాలం (2017–21)లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడమే. అలాగే నిరుద్యోగిత స్వల్ప స్థాయిలో ఉండడమే. అయితే ట్రంప్ పదవీకాలం ఆఖరులో ద్రవ్యోల్బణమూ పెరిగింది, నిరుద్యోగిత సైతం పెచ్చరిల్లింది. అయినా అందుకు ట్రంప్‌ను మీరు తప్పుపట్టలేరు. ఎందుకని? కోవిడ్ విలయాన్ని గుర్తు చేసుకోండి. ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉన్నట్టు కన్పించడానికి కారణమేమిటో ఆయనకు తక్షణ పూర్వం అధ్యక్షుడుగా ఉన్న బరాక్ ఒబామా ఇలా చెప్పారు: ‘జార్జి బుష్ చిందరవందర చేసిన ఆర్థిక వ్యవస్థను తాను బాగు చేసి దాన్ని మళ్లీ శీఘ్ర పురోగతి బాటలోకి తీసుకువెళ్లడమే’. కనుక దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ శక్తిమంతం చేసిన ఘనత నిస్పందేహంగా డెమొక్రాట్లదేనని ఒబామా ఘంటాపథంగా అన్నారు.
దిగుమతులపై అత్యధిక స్థాయిలో సుంకాలు విధించడానికి తాను వెనుకాడనని ట్రంప్ ఇప్పుడు గట్టిగా చెప్పుతున్నారు. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు ఈ చర్య తప్పనిసరి అని ఆయన వాదిస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదిత సుంకాలు ఎవరూ ఎప్పుడూ కలలో కూడా కనీవినీ ఎరుగని స్థాయిలో హెచ్చుగా ఉన్నాయి. ట్రంప్ సరళంగా తన విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యలు అన్నిటినీ మటుమాయం చేసే అఖండ పరిష్కారమది. కమలా హారిస్ సైతం ఆర్థిక వ్యవస్థను మళ్లీ చక్కదిద్దేందుకు తన ప్రణాళికలను వివరిస్తున్నారు. ఆమె ఎన్నో అంకెలు ఏకరువు పెడుతున్నారు. నోబెల్ ఆర్థిక పురస్కార గ్రహీతలు (అమెరికాలో వీరి సంఖ్య తక్కువేమీ కాదు సుమా!) ఆమె ఆలోచనలు, ప్రతిపాదనలను ప్రశంసిస్తున్నారు. అయితే అసాధారణ మేధావంతుల, హాస్యదాయక రేఖా చిత్రకథలు చదివి ఆనందించేవారి ప్రపంచాలు పూర్తిగా భిన్నమైనవి. అవి పరస్పరం చాలా సుదూరమైనవి మరి.
డోనాల్డ్ ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించిన పక్షంలో ఆమె ప్రతిపాదించిన ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానానికి ఆ ప్రతిష్ఠ దక్కుతుంది. ఆమె ఎటువంటి శాఖా చంక్రమణం చేయకుండా ఆ ఓటర్లకు నివేదించిన విధానమది. మరి డోనాల్డ్ ట్రంప్ ఫిలడెల్ఫియా టౌన్ హాల్‌లో తన విధానాలను వివరించిన తీరు పూర్తిగా భిన్నమైనది. వ్యాపారవేత్తగా డోనాల్డ్ ట్రంప్ దివాళా, ఇతర వ్యాపార సంబంధిత చట్టాలను ఉపయోగించుకున్న తీరుతెన్నులపై ఆక్షేపణలు, అభ్యంతరాలు తక్కువేమీ కాదు. అయినప్పటికీ సామాన్య అమెరికన్ పౌరుడు (సిఎన్‌ఎన్ చర్చలు లేదా 60 మినిట్స్ లేదా అటువంటి టీవీ కార్యక్రమాలను వీక్షించే సమయం లేని శ్రమజీవి) ఒకటే మాట చెప్పుతాడు: ‘దేశ సమస్యలను ఎలా పరిష్కరించాలో ట్రంప్‌కు తెలుసు’.
ముస్లింలను తన పక్షానికి తిప్పుకోవడం ట్రంప్‌కు కష్టమేకావచ్చుకాని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చర్యలను ఆయన ఎట్టి పరిస్థితులలోను పూర్తిగా అనుమతిస్తారన్న విషయమై యూదు ఓటర్లకు ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంలో ట్రంప్‌పై వారికి పూర్తి భరోసా ఉన్నది. అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన ఈ కీలక అంశంపై కమలా హారిస్ నిక్కచ్చిగా, అస్పష్టంగా మాట్లాడడం లేదు. ఈ విషయంలో ట్రంప్‌దే పైచేయి. పాలస్తీనా సంక్షోభంపై డెమొక్రాట్లు ద్వంద్వ నీతితో వ్యవహరించడాన్ని ముస్లింలు నిరసిస్తున్నారు. కమలా హారిస్ గెలిచినప్పటికీ ముస్లింలు ఆమెకు మద్దతునిచ్చారని భావించనవసరం లేదు. కాకపోతే ఆమెను, ట్రంప్ కంటే తక్కువ హానికరమైన నేతగా చూస్తున్నారని అర్థం చేసుకోవాలి.
మొత్తం మీద 2024 అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ ఉందని, ఎవరు విజేత అవుతారన్నది అసందిగ్ధంగా చెప్పలేమని రాజకీయ పండితులు, ఓటర్ల అభిప్రాయాలు విశ్లేషించే నిపుణులు ఏకీభవిస్తున్నారు. సంభావ్య విజేత గురించి పాత్రికేయులు ముందుగా తయారు చేసుకున్న కథనాలు ఈ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే ఉన్నాయి. అంతిమ ఫలితం వెలువడిన వెన్వెంటనే వాస్తవ విజేతకు అనుగుణమైనవి ప్రచురితమవుతాయి. నెలల తరబడి తాము తదేక దీక్షతో ఎన్నికల ప్రచార తీరుతెన్నులు, ప్రజల ప్రతిస్పందనల విషయమై తమ నిశిత పరిశీలనను అవి ప్రతిబింబిస్తున్నాయని పాత్రికేయులు చెప్పుతారు. అయితే ప్రజాభిప్రాయం మారిపోయి, గెలిచిన అభ్యర్థి స్వల్ప మెజారిటీతో కాకుండా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన పక్షంలో ఓటర్ల అభిప్రాయాల విశ్లేషణ నిపుణులు, పాత్రికేయులు తమ వాదనలు, మార్చుకోవలసి ఉంటుంది. తాము పొరపడ్డామని ఒప్పుకోవడం అనివార్యమవుతుంది.
దీపాంకర్ గుప్తా
సామాజిక శాస్త్రవేత్త
జేఎన్‌యూ విశ్రాంత ఆచార్యులు