Share News

వికాస భారత వైతాళికుడు

ABN , Publish Date - Apr 14 , 2024 | 02:13 AM

సమ్మిళిత భారతదేశ నిర్మాణానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అందించిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివి, సదా గౌరవ భావంతో స్మరించుకోవలసినవి. ఆయన ఒక సామాజిక న్యాయ ప్రవక్త...

వికాస భారత వైతాళికుడు

సమ్మిళిత భారతదేశ నిర్మాణానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అందించిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివి, సదా గౌరవ భావంతో స్మరించుకోవలసినవి. ఆయన ఒక సామాజిక న్యాయ ప్రవక్త; సమ్మిళితత్వం, న్యాయం, సమానత్వ వైతాళికుడు. ప్రశస్త న్యాయకోవిదుడు, ప్రతిభావంతుడైన ఆర్థికవేత్త, మానవతావాది. సాంఘిక సంస్కర్తగా అంబేడ్కర్ తన జీవితాన్ని కుల వివక్షను రూపుమాపడానికి, అణగారిన, వెనుకబడిన వర్గాలను సముద్ధరించేందుకు అంకితం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ పౌరులు అందరికీ ప్రాథమిక హక్కులు, రక్షణలు సమకూరేందుకు ఆయన చాలా శ్రద్ధ వహించారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల వారి హక్కులను కాపాడేందుకు ఆయన నిరంతరాయంగా చేసిన కృషి మన సామాజిక వ్యవస్థలో మౌలిక సంస్కరణలకు దారి తీసింది.

మహోన్నత సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఆయన సామాజిక న్యాయ దార్శనికత నుంచి మనం నేర్చుకోవలసింది, అనుసరించవలసింది ఎంతో ఉంది. భారతీయ సమాజంలో శతాబ్దాలుగా పాదుకుపోయి ఉన్న అసమానతలను, ముఖ్యంగా కుల వ్యవస్థ దౌష్ట్యాన్ని ఆయన గుర్తించారు. వేదాల ప్రభోదాలకు విరుద్ధంగా మన సమాజంలో అమానుషంగా అమల్లో ఉన్న అస్పృశ్యతను నిర్మూలించడానికి ఆయన పోరాడారు.

కుల వ్యవస్థ దుర్మార్గాలకు అంబేడ్కర్ స్వయంగా బాధితుడు అయ్యారు. హిందూ సమాజానికి గుణపాఠం చెప్పేందుకు, భారతీయ విలువలు, సంప్రదాయల నుంచి ప్రభవించిన బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించారు. హిందూ మతం పట్ల ఆగ్రహం ఎంతగా ఉన్నప్పటికీ ఆ మతాన్ని ఆయన వ్యతిరేకించలేదు. హిందుత్వకు ఆయన ప్రతికూలం కాదు. ఇస్లామిక్, క్రైస్తవ మత పెద్దలు తమ మతం స్వీకరించేలా అంబేడ్కర్‌ను ప్రభావితం చేసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పరాయి సీమలలో ప్రభవించిన ఆ మతాలలో దేనినీ ఆయన స్వీకరించలేదు.

పేద కుటుంబంలో జన్మించిన అంబేడ్కర్ బాల్యంలోనే అనేకానేక సామాజిక, ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యాన్ని ఆయన విడనాడలేదు. కష్టనష్టాలన్నిటినీ చాలా ధైర్యంగా అధిగమించారు. తల్లిదండ్రులకు ఆయన 14వ బిడ్డ. తండ్రి ఆ బిడ్డను ఉత్తమ సంస్కారిగా తీర్చిదిద్దారు. తుకారమ్, జ్ఞానేశ్వర్, రవిదాస్ ప్రభోదాలను వివరించి చెప్పేవారు. రామాయణ, మహాభారత గాథలను బాల అంబేడ్కర్ తన తండ్రి నుంచే విన్నారు. 1908లో ఎల్ఫిన్ స్టోన్ ఉన్నత పాఠశాల నుంచి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణుడయ్యారు. ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రంను ఆయన అభ్యసించారు. 1912లో బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఆయన బిఏ డిగ్రీ పొందారు. మహారాజా బరోడా ఇచ్చిన ఉపకార వేతనంతో ఉన్నత విద్యాభ్యాసానికై కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ‘పురాతన భారతీయ వాణిజ్యం’ అన్న అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని రచించడం ద్వారా 1915లో ఆ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తరువాత ఆ వర్శిటీలోనే ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అన్న అంశంపై పరిశోధన చేసి పట్టా పొందారు. 1920లో లండన్ విశ్వవిద్యాలయం ఆయనకు డిఎస్‌సి ప్రదానం చేసింది. తరువాత జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయంలో తన అధ్యయనాలు, పరిశోధనలను ఆయన కొనసాగించారు. ఆ కాలంలో కొలంబియా (అమెరికా), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్‌ బాన్ నుంచి డిగ్రీలు, డాక్టొరేట్ పొందిన ఏకైక భారతీయ రాజకీయవేత్త అంబేడ్కర్ మాత్రమే. ‘అధ్యయనం, పోరాటం’ అన్న సూత్ర స్ఫూర్తితో మేధో ప్రపంచంలో తనకొక అనితరసాధ్యమైన స్థానాన్ని సాధించుకన్న మహా మేధావి అంబేడ్కర్.

అణగారిన కులాల వారి సాధికారత, విముక్తికి విద్య, రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత ఆవశ్యకాలని డాక్టర్ అంబేడ్కర్ భావించారు. సామాజిక న్యాయం గురించిన తన దార్శనికతలో ఆయన ఈ అంశానికి అగ్ర ప్రాధాన్యమిచ్చారు. ప్రజాస్వామ్య భావన, ఆదర్శాలను ఆయన సంపూర్ణంగా విశ్వసించారు. ఉన్నతాదర్శాల సాధనకు సాయుధ పోరాటం అవసరమని ఆయన భావించలేదు. సహ జీవన సూత్రాన్ని ఆయన పరిపూర్ణంగా విశ్వసించారు. అన్నికులాల, మతాల ప్రజలను సమభావంతో గౌరవించాలన్న ఆదర్శాన్ని పాటించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల వారి విముక్తికి విద్య ఒక సాధనమని ఆయన నొక్కి చెప్పుతుండేవారు. ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా కుల వివక్ష, సామాజిక అసమానతల కారణంగా చారిత్రకంగా చదువు సంధ్యలకు నోచుకోని బడుగు వర్గాల వారికి సంపూర్ణ విద్యావకాశాలు కల్పించాలని ఆయన సదా కోరేవారు. సహానుభూతి, న్యాయం, సామాజిక సమానత్వం భావాలను ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణా అనుసరించాలని ఆయన కోరేవారు. మేధో శక్తులను పరిపూర్ణంగా వికసింప చేసుకోవడమే మానవ అస్తిత్వ అంతిమ ధ్యేయంగా ఉండాలని ఆయన అభిలషించేవారు. మహిళా సాధికారతకు ఆయన ఎనలేని కృషి చేశారు. ‘ఒక సామాజిక సమూహం అభ్యున్నతిని, ఆ సమూహానికి చెందిన మహిళలు సాధించిన పురోగతి ప్రాతిపదికన చూడాలని’ అంబేడ్కర్ సదా అంటుండేవారు.

జాతీయ ఐక్యత, సమగ్రతపై అంబేడ్కర్ ఆలోచనలను గుర్తు చేసుకోకపోతే మనం ఆయనను అగౌరవ పరిచిన వారమవుతాం. ఒక జాతి అభ్యున్నతి, సుస్థిరతకు సమైక్యత, సమగ్రతలు పునాదులని ఆయన భావించారు. ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, అవకాశాలు ఉండే సమాజాన్ని మనం నిర్మించుకోవాలని ఆయన కోరేవారు. సామాజిక సామరస్యం, పరస్పర గౌరవం సంఘ జీవనంలో చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పుతుండేవారు. మన కార్మిక చట్టాల పరిణామంలో అంబేడ్కర్ పాత్ర విశిష్టమైనది. ఆయన దార్శనికత, కృషి కారణంగానే సమాన వేతనాలు, బాల కార్మికతపై నిషేధం మొదలైన నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. స్వతంత్ర భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఫ్యాక్టరీల చట్టం, కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం ఇత్యాది ప్రగతిశీల శాసనాలను తీసుకువచ్చారు. కార్మిక హక్కుల సాధనకు, పారిశ్రామిక పురోగతికి అవి ఇప్పటికీ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

సమాజంలోని బలహీన వర్గాల హక్కుల పరిక్షణకు, దేశ సమైక్యతను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య సంప్రదాయాలు, లౌకిక వాద విలువలు, రాజ్యాంగ బద్ధ విధానాలకు మనం కట్టుబడి ఉండాలని అంబేడ్కర్ గట్టిగా వాదించేవారు. వైవిధ్యమనేది విభేదాలకు కాకుండా సమైక్యపరిచేదిగా ఉంచే సమ్మిళిత, బహుళత్వ సమాజాన్ని నిర్మించుకోవాలని ఆయన అభిలషించారు. సమాజంలోని కొన్ని వర్గాల వారి పట్ల అమానుషమైన వివక్షను చూపడాన్ని తీవ్రంగా ఖండించారు. అంటరానితనం అనేది నైతిక నేరమేగాక సామాజిక పురోగతికి, దేశ సమైక్యతకు తీవ్ర అవరోధమని ఆయన గర్హించేవారు. అస్పృశ్యతతను సంపూర్ణంగా రూపుమాపాలని, ఇందుకు చట్టపరమైన చర్యలతో పాటు సాంఘిక సంస్కరణలు అవసరమని ఆయన భావించారు. ఆయన నిరంతర కృషి వల్లే 1936లో దేవాలయాలలో ప్రవేశానికి అస్పృశ్యులకు చట్టబద్ధమైన అనుమతి లభించింది. అంబేడ్కర్ తన ప్రముఖ గ్రంథమైన ‘ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’లో దళితల హక్కుల గురించి గట్టిగా వాదించారు. కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయవలసిన అవసరం గురించి స్పష్టంగా చెప్పారు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ భారతీయ సమాజంలో తీవ్ర అసమానతలకు ఎలా కారణమవుతుందో ఎత్తి చూపారు. అసమానతలు, వివక్షను ప్రోత్సహించడమే కాకుండా వ్యక్తి స్వేచ్ఛకు, జాతీయ వికాసానికి కుల వ్యవస్థ కారణమవుతుందని అంబేడ్కర్ సహేతుకంగా నిరూపించారు.

స్వతంత్రభారతదేశ ప్రజాస్వామిక సంస్థల పురోగతికి డాక్టర్ అంబేడ్కర్ ఆదర్శాలు, కృషి విశేషంగా తోడ్పడుతున్నాయి. ఆయన ప్రతిపాదనలు దేశ సామాజిక– రాజకీయ పరిస్థితులలో మౌలిక మార్పులకు దారితీశాయి. ఆర్థిక, న్యాయ శాస్త్రాలలో ఆయన అపార పాండిత్యం, సాంఘిక సంస్కరణలను తీసుకురావడంలో ఆయన కృషి మనకు పేదరికం–అసమానతల నిర్మూలనలో మార్గదర్శకాలు. మరింత సమ్మిళిత, దయాశీల సమాజాన్ని నిర్మించుకోవలసిన అవసరాన్ని అంబేడ్కర్ జీవితం మనకు సదా గుర్తు చేస్తుంటుంది.

నేడు డాక్టర్ అంబేడ్కర్ జయంతి. ఆయనకు మన కృతజ్ఞతను వ్యక్తం చేయవలసిన సందర్భమిది. అంతేకాదు ప్రజాస్వామిక, లౌకిక, సమ్మిళిత జాతి నిర్మాణం విషయమై మన నిబద్ధతను పురుద్ఘాటించాల్సిన సమయమిది. అటువంటి సమాజంలో మాత్రమే దేశ పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం, సమానవకాశాలు దక్కుతాయని, ప్రజల మధ్య శాంతి సామరస్యాలు వర్థిల్లుతాయనే సత్యాన్ని మనం విస్మరించకూడదు. డాక్టర్ అంబేడ్కర్ కేవలం దళితుల నాయకుడు మాత్రమేకాదు, 140 కోట్ల మందికి పైగా భారతీయుల నాయకుడు. అంబేడ్కర్ ఆలోచనల విస్తృతి, విశాలత మన రాజ్యాంగంలో పూర్తిగా ప్రతిబింబించాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఎంతో మంది ఆర్థిక స్తోమత లేక పాఠశాల విద్య మధ్యలోనే ఆపివేయడం జరుగుతోంది. వారి విద్యాభ్యాసానికి మనం తోడ్పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రవర్తించాలని ఆయన జీవితమూ, ఆదర్శాలు మనకు నేర్పుతున్నాయి. బాధ్యతాయుత పౌరులుగా ప్రవర్తించని పక్షంలో 2047 సంవత్సరం నాటికి సమ్మిళిత వికసిత్ భారత్‌ను నిర్మించుకోలేము. సామాజిక అస్తిత్వాలపై మనలో ఎటువంటి దురభిప్రాయాలు ఉండకూడదు. వికసిత భారత నిర్మాణానికి అదే మొదటి అడుగు.

బండారు దత్తాత్రేయ

హర్యానా రాష్ట్ర గవర్నర్

(నేడు అంబేడ్కర్ జయంతి)

Updated Date - Apr 14 , 2024 | 02:13 AM