Share News

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

ABN , Publish Date - Jan 25 , 2024 | 05:18 AM

న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే శక్తివంతమైన పాత్ర శాసనాలు తయారు చేసే పార్లమెంట్‌, అసెంబ్లీలది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినది రాజకీయ నేతలే. అలాంటి నేతలను....

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే శక్తివంతమైన పాత్ర శాసనాలు తయారు చేసే పార్లమెంట్‌, అసెంబ్లీలది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినది రాజకీయ నేతలే. అలాంటి నేతలను ఎన్నుకొనేది ఓటర్లే. ఓటర్లు ఆయా రాజకీయ నాయకులు, పార్టీల ప్రలోభాలకు లోనయి ఓటును అమ్ముకునే దుస్థితి మనకు దాపురించింది. రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఓటర్లను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25 నుంచి నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటు కల్పించడం, ఓటు సవరణ, ఓటు విలువ తెలియచేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గుతూ ఉంది, మేధావులు దూరంగా ఉంటున్నారు. మన దేశంలో ఓటు వేయనివారు ఇప్పటికీ 40 శాతం ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఓటు ప్రాముఖ్యత తెలియకపోవడం, నిరాసక్తత. ఎన్నికైన ప్రజాప్రతినిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశాభివృద్ధికి సేవాభావం ఉన్న ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నది ఎన్నికల సంఘం ముఖ్యఉద్దేశం.

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, విద్యాధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధిక శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక ఆయుధం. దానిని సక్రమంగా ఉపయోగిద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. ఆధార్ కార్డుతో ఓటును అనుసంధానం చేసేలా ఎన్నికల కమిషన్ కృషి చేయాలి. దొంగ ఓట్లను అరికట్టాలి. ప్రతీ ఒక్కరు తమ ఓటును ఒక ప్రదేశంలోనే వేసేలా చర్యలు తీసుకోవాలి.

కామిడి సతీష్ రెడ్డి

(నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం)

Updated Date - Jan 25 , 2024 | 05:18 AM