తీరానికి కాలు చాపే ఉన్నాం!
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:03 AM
సాగర తీరం చూసినప్పుడల్లా నీ గాయాలు తడుముతూనే ఉన్నాయి కెరటాలు ఎగసినప్పుడల్లా నీ జ్ఞాపకాలు తరుముతూనే ఉన్నాయి...
సాగర తీరం చూసినప్పుడల్లా
నీ గాయాలు తడుముతూనే ఉన్నాయి
కెరటాలు ఎగసినప్పుడల్లా
నీ జ్ఞాపకాలు తరుముతూనే ఉన్నాయి
నువ్వు, ముప్పేట విరుచుకుపడి
రెండు పదులు దాటొచ్చిందేమోగానీ
అప్పటి నీ జ్ఞాపకాలింకా
గుండె గదుల్లో తాజాగానే ఉన్నాయి
ఎక్కడో దూరాన, సుమత్రా దీవుల్లో
భూమి పొరల్లోంచి మొదలైన నీ దాహార్తికి
సముద్రాన్నే మా మీదకు తరుముకొచ్చి
ఊడ్చుకుపోయింది అంతా ఇంతా కాదు
కట్టు బట్టలతో మిగులున్నా
కూడబెట్టుకోయిందురేమో
కొన ఊపిరితో మిగులున్నా
లేచి ఉసురుకోయిందురేమో
కడుపులో దాచుకున్న కాఠిన్యం ఏదో
కుండ బద్దలు కొట్టినట్టు
ఒక్క ఉదుటున లక్షలాది మందిని
పొట్టన పెట్టుకోవడం నీకే సాధ్యమైంది
నీ మనసు బోధైపోయాక...
ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపల్లా
ఎవరివారో, ఎక్కడెక్కడివారో
తీరం పొడుగునా, రుణం తీరినోళ్లే
నీవు వదిలి వెళ్ళిన భయమేదో
నీడలా వెంటాడుతూనే ఉంది
బ్రతుకు పోరు ఊగిసలాటలో
తీరం, తనవైపు లాగుతూనూ ఉంది
తీరం బతుకులంటేనే.. తీరిన బతుకుల్లా!
ఒడ్డును నమ్ముకొనే బతుకును నెట్టుకొస్తూ
చావు బ్రతుకుకూ మధ్య, కాటికి కాదు..
తీరానికి కాలు చాపే ఉన్నాం!
వినోద్ కుత్తుం
(‘సునామీ’ విషాదానికి నేటితో ఇరవయ్యేళ్లు)