Share News

ఈ నదిని దాటాలి...

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:18 AM

ఇది రక్త నది ఋతువు ఏదైనా ఎండిపోని రుధిర ఝరి విశ్వాసాలు విఘాతాలై విచ్చుకుంటున్న కత్తుల విన్యాసంలో కుత్తుకలు తెగి వెల్లువెత్తుతున్న ఆగని నెత్తుటి ప్రవాహాల తడి...

ఈ నదిని దాటాలి...

ఇది రక్త నది

ఋతువు ఏదైనా ఎండిపోని రుధిర ఝరి

విశ్వాసాలు విఘాతాలై

విచ్చుకుంటున్న కత్తుల విన్యాసంలో

కుత్తుకలు తెగి

వెల్లువెత్తుతున్న ఆగని నెత్తుటి ప్రవాహాల తడి

దీని పుట్టుక ఏ పర్వత సానువుల్లోనో కాదు

పరాయి నీడను పడగ నీడగా తలచే

అసహన అరాచక ఆలోచనల సుడుల్లో..

ఈ నదిని దాటాలి

రక్తపు జాడలు లేని దరిని చేరాలి

మతాలు మానవత్వపు తడి లేని మరీచికలు

మనుషులను విడదీసి ఆడించే

మాయా జలతారు తెరలు

అధికార దండానికై ఆరాటపడే

దండ నాయకుల దహన క్రీడలో

గుండెల్లో గుణపాలు దించుకుంటున్న

గుళ్ళు.. మసీదులు

మనిషి రంగు రుచి వాసన మతమే అయ్యి

వికర్షిత ధ్రువాలై విస్ఫోటిస్తున్న విపత్కర కాలమిది

ఎండి ఎడారై పొడిబారిన ఏ ఎదలోనూ

చిగురించని ప్రేమ మొలకలు

గుహలు వీడి.. గహనాంతర గండాలు దాటి

నడిచిన నాగరికతా దారుల్లో

ఉన్మాద ఉత్పాతాలను ఎదిరించి నిర్మించిన

లౌకిక సౌధాలను సమాధి చేసే

వ్యతిరిక్త వ్యూహాలు

ఇది హృదయాలను అంటుకట్టాల్సిన సమయం

సామరస్య సహజీవన నినాద సందర్భం


మాటలు నేర్వకముందు

మతం వాసన పీల్చకముందు

ఆకలికి అమ్మ చన్ను అన్నమై చప్పరించిన

చనుబాల తీపిని తలుచుకోవాలి

మానవ సమూహాల సమైక్యజాడలు

తడిగా తగులుతాయి

మక్సద్ అలగ్ అలగ్

మగర్ అబ్ హమ్ భీ యెహీ బోలేంగే..

‘ఏక్ హై తో సేఫ్ హై’

వెలివాడలు.. అగ్రహారాల మధ్య

రాకపోకల రహదారులేయాలి

మందిర్ మస్జిదులు అలయ్ బలయ్ తీసుకోవాలి

బతుకమ్మ సద్దులు.. బక్రీద్ ఖీర్లు

చర్చిలో కలిసి ప్రేమగా పంచుకోవాలి

‘ఏక్ హై తో సేఫ్ హై’

హమ్ ఏక్ హీ రహేంగే!

-గాజోజు నాగభూషణం

98854 62052

Updated Date - Dec 30 , 2024 | 12:18 AM