Share News

మన అనువాదాలకు మార్కెట్‌ పెంచుకోవాలి

ABN , Publish Date - Oct 14 , 2024 | 04:05 AM

తెలుగు రచయితల పరిచయాలతో, సంభాషణలతో నాలుగేళ్ళ క్రితం మొదలైన ‘హర్షణీయం’ ఆడియో పాడ్‌కాస్ట్‌ చానెల్‌ క్రమంగా ప్రపంచవ్యాప్త అనువాద కులతోను, ప్రచురణకర్తలతోనూ సంభాషణలు నిర్వ హిస్తూ పరిధిని విస్తరించుకున్నది. ...

మన అనువాదాలకు మార్కెట్‌ పెంచుకోవాలి

మూడు ప్రశ్నలు

తెలుగు రచయితల పరిచయాలతో, సంభాషణలతో నాలుగేళ్ళ క్రితం మొదలైన ‘హర్షణీయం’ ఆడియో పాడ్‌కాస్ట్‌ చానెల్‌ క్రమంగా ప్రపంచవ్యాప్త అనువాద కులతోను, ప్రచురణకర్తలతోనూ సంభాషణలు నిర్వ హిస్తూ పరిధిని విస్తరించుకున్నది. ప్రస్తుతం అరవై భాషల్లో నుంచి వచ్చిన పుస్తకాల గురించి డెబ్బై గంటలకు పైగా ఆడియో హర్షణీయంలో అందు బాటులో ఉంది (harshaneeyam.in). ‘హర్షణీయం’ పాడ్‌కాస్ట్‌ టీమ్‌తో (గిరి, అనిల్, హర్ష) ఈవారం ‘మూడు ప్రశ్నలు’.


హర్షణీయం పాడ్‌కాస్ట్‌లో అనువాదాలకు (ముఖ్యంగా ప్రపంచ సాహిత్యంలో ఇప్పుడు వస్తున్న అనువాదాలకు) ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, ఆ అనువాదకుల ఇంటర్వ్యూలు చేస్తు న్నారు. అటువైపు దృష్టి పెట్టాలని ఎందుకు అనిపించింది?

రెండేళ్ళ క్రితం తమిళ రచయిత జయమోహన్ ‘అరం’ తమిళ కథలు, కన్నడ నవల ‘తేజోతుంగభద్ర’- వీటి ఆంగ్ల అనువాదాలు చదివాం. అదే సమయంలో కన్నడ రచయిత వసుధేంద్ర, ‘ఛాయా’ మోహన్ బాబు, కాలచ్చువడు పబ్లిషింగ్ కణ్ణన్‌ గార్లు అనువాదం గురించి మాట్లాడిన విషయాలు ఆసక్తిని రేకెత్తించాయి. రచన లాగే అనువాదం కూడా ఒక కళారూపం, సృజనాత్మక ప్రక్రియ అని తెలిసింది. అనువాద ప్రక్రియ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇతర భాషల అనువాదకు లతో, పబ్లిషర్లతో మా పాడ్‌కాస్ట్‌లో సంభాషణ మొదలు పెట్టాం. తమిళ – ఇంగ్లిష్‌ అనువాదకురాలు సుచిత్రా రామచంద్రన్‌తో మాట్లాడినప్పడు ఒక పుస్తకం గురించి అనువాదకులకంటే విపులంగా వేరెవరూ మాట్లాడ లేరనే విషయం అర్థమైంది. వారితో జరుపుతున్న ప్రతి సంభాషణ ఒక గొప్ప సాహిత్యానుభవం.


ఈ పాడ్‌కాస్ట్‌లలో అనువాదం చుట్టూ ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ప్రస్తుత అనువాద సాహిత్య వాతారణం మీద మీ అవగాహనకు వచ్చిన కొత్త విషయాల గురించి చెప్పండి?

ప్రపంచవ్యాప్తంగా అనువాదాలకు ఆదరణ, అను వాదకులకు గుర్తింపు పెరుగుతోంది. భారతీయ భాష ల్నించి ఇంగ్లీష్‌ లోకి అనువాదాలు చాలా తక్కువగా వెడుతున్నాయి (మిగతా భాషలతో పోలిస్తే బెంగాలీ, తమిళ, హిందీ భాషల పరిస్థితి కొంత మటుకు మెరుగు). యూరప్, లాటిన్ అమెరికా, జపాన్, కొరియాల నుంచి సాహిత్యం విరివిగా ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతోంది. BCLT (UK), ALTA (USA), SALT (Chicago university) లాంటి సంస్థలు, Words Without Borders, Asymptote లాంటి ఆన్‌లైన్‌ పత్రికలు ప్రపంచ వ్యాప్తంగా అనువాదాలపై అవగాహన పెంచడానికి విశేషంగా కృషి చేస్తున్నాయి. అనువాదాల్లో ముందుండే దేశాల్లో పిల్లల సాహిత్యం కూడా ఎక్కువగా అను వాదం అవుతోంది. అనువాదాలను తమ భాష నించీ వేరే భాషలకు తీసుకెళ్ళడంతో పాటూ వేరే భాషల సాహిత్యాన్ని తమ భాషలోకి తీసుకురావడం పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 3.5 లక్షలమంది మాట్లాడే ఐస్లాండిక్ భాషకూ రెండు లక్షలమంది మాట్లాడే ఎస్పెరాంటో భాషకూ కూడా పదుల సంఖ్యలో సాహితీ అనువాదకులు వున్నారు. కొన్ని చోట్ల ప్రసిద్ధి కెక్కిన రచయితల పుస్తకాలు ఒకే సమయంలో ఏడెమినిది భాషల అనువాదకులు కలిసి అనువాదం చేస్తారు. బుకర్, పెన్ లాటి అనేక సంస్థలు ప్రతి ఏటా అనువాదాలకు పెద్దఎత్తున బహుమతులను ప్రకటి స్తున్నాయి. మన దేశంలో సాహితీ అనువాదాలకు జేసీబీ ఇచ్చే బహుమతి చెప్పుకోదగ్గది.


అనువాదాలు బాగా జరుగుతున్న అమెరికా, యూరప్‌లలో అనువాదాలకు సంబంధించి ఎలాంటి వాతావరణం వుంది?

వారు తమ భాషా సాహిత్యం ఇతర భాషల్లోకి అనువదింపబడటానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా ఇంగ్లీషులోకి వస్తే, ఎక్కువమంది పాఠకులకు చేరువ అవ్వటమే కాక, ఇతర భాషలైన ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, స్వీడిష్ లాంటి అనేక భాషల్లోకి పుస్తకం వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రసిద్ధ రచయితలందరూ, స్వీడిష్ భాషలో తమ రచనలు ఉండాలని ఆశిస్తారు. స్వీడిష్‌లో వచ్చే గొప్ప అనువాద రచనలకు నోబెల్ పురస్కారం వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. ఫ్రెంచ్, నార్వే ప్రభుత్వాలు, తమ సాహిత్యాన్ని అనువదించి ప్రచురించే పబ్లిషర్లకు ప్రత్యేక రాయితీలు, గ్రాంట్లు ఇస్తాయి. మన దేశం నించి ఇలాంటి సహాయం తరచూ పొందేవారిలో కలకత్తాకు చెందిన సీగల్ పబ్లిషర్స్, నాగర్ కోయిల్‌కు చెందిన కాలచ్చువడు పబ్లిషర్స్ ముఖ్యమైనవి. (ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలాంటి రాయితీలు ఇవ్వడం మొదలెట్టింది.) ప్రతి ఏటా వచ్చిన అనువాదాల్లో నుంచి ఎంపిక చేసి బహుమతులు ఇచ్చే ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు అనేకానేకం వున్నాయి.


పబ్లిషర్లు ఫ్రాంక్‌ఫర్ట్, లండన్, ఢిల్లీలలో జరిగే అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలలో తప్పక పాల్గొం టారు. పుస్తకాల హక్కుల కోసం పబ్లిషర్లు రైట్స్ కాట లాగ్ (ప్రచురణ హక్కుల రాయల్టీ తదితర వివరా లతో) తయారు చేసుకోవడం తప్పనిసరి. పబ్లిషర్లు అనువాదాల నాణ్యతపైన ప్రత్యేక శ్రద్ధ పెడతారు.

కొన్ని దేశాల్లో ప్రభుత్వ సంస్థలు- అనువాదకులు పుస్తకం ఎంచుకున్న తర్వాత ఏ ఇబ్బంది లేకుండా పని చేసుకోడానికి వాతావరణం కల్పించి అన్ని ఖర్చులతో రెసిడెన్సీలను నిర్వహిస్తాయి. అనువాదకులు కూడా మూల రచన, రచయిత మీద ఎంతో గౌరవంతో అను వాదాలు చేస్తూ, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నిరం తరం కృషి చేస్తారు. సంఘాలుగా ఏర్పడి హక్కులను పరిరక్షించుకుంటారు. అంటే, కనీస వేతనాలకు డిమాండ్లు, అనువాదకుల ఎంపికలో జాతి వివక్ష ఉండకుండా చూడటం, అనువాదకులకు సరైన గుర్తింపు (ఉదాహ రణకు పై పేజీలో వారి పేరు)... మొదలైనవి.


తెలుగు భాష నుంచి ఇంగ్లీష్ అనువాదాలకు వస్తే– మన పరిస్థితి అత్యంత నిరాశాజనకంగా ఉంది. వచ్చిన అతితక్కువ అనువాదాల్లోనూ పుస్తకాల ఎంపిక సరిగా లేకపోవటం, అనువాద నాణ్యత కొరవడటం, పుస్తక ముద్రణలో నాణ్యత లేకపోవటం, సరైన అనువాదకులు సరైన సంఖ్యలో లేకపోవడం, పబ్లిషర్లు అనువాదాలతో ఇంగ్లీష్‌లాంటి పెద్ద మార్కెట్‌కు చేరువయ్యే ప్రయత్నాలు చేయకపోవడం దీనికి ముఖ్య కారణాలు. ఇది జరగాలంటే మన సాహిత్యం ఇతర భాషా సాహిత్యాలకు తీసిపోదని గుర్తెరిగి ఉండటం, కొత్త మార్కెట్లను చేరుకోవడానికి కావాల్సిన అన్ని వనరులను పెట్టుబడిగా పెట్టడం ముఖ్యం.

తెలుగు నుంచి ఇంగ్లీష్‌కు అనువాద నాణ్యతను పెంచడానికి ఇప్పుడు రెండు చెప్పుకోదగ్గ ప్రయత్నాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మొదటిది– అక్టోబర్‌ నుంచి ప్రఖ్యాత ఫ్రెంచి అనువాదకురాలు రాస్ స్క్వాట్జ్ తదితరులు నిర్వహించబోయే ఆరు నెలల మెంటరింగ్ వర్క్‌షాప్. ఈ వర్క్‌షాప్‌ హైదరాబాద్‌కు చెందిన ఛాయా రిసోర్సెస్, అజు పబ్లికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోంది. రెండోది– అమెరికన్ లిటరరీ ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్ (ALTA) తెలుగు – ఇంగ్లీష్ అనువాదకుల వర్క్‌షాప్. దీనిని తెలుగు కవి అఫ్సర్ నిర్వహిస్తారు.

(‘హర్షణీయం’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఇతర భాషల అనువాదకులు కొందరి ఫొటోలు.)

‘హర్షణీయం’ టీమ్‌: గిరి, అనిల్, హర్ష

harshaneeyam@gmail.com

Updated Date - Oct 14 , 2024 | 04:05 AM