కారుణ్య నియామకాలు ఏవి?
ABN , Publish Date - Oct 23 , 2024 | 01:25 AM
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బందికి కారుణ్య నియామకాలను ఇచ్చే విధంగా ఈ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అడాప్ట్ చేసుకోవాలని ఉపాధ్యాయలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు...
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బందికి కారుణ్య నియామకాలను ఇచ్చే విధంగా ఈ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అడాప్ట్ చేసుకోవాలని ఉపాధ్యాయలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. సుమారు 21 మంది మోడల్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయులు అనారోగ్య కారణాలతోనూ, రహదారి ప్రమాదాల్లోనూ, కోవిడ్ సమయంలో రెగ్యులర్ సర్వీసులో ఉండగా చనిపోయారు. వాళ్ల కుటుంబాలలో ఒక వ్యక్తికి విద్యా శాఖలో, విద్యాశాఖ అనుబంధ కార్యాలయాల్లో లేదా జిల్లా యూనిట్‌గా కలెక్టరేట్ పరిధిలో లేదా గ్రామ, వార్డు సచివాలయంలో అర్హత గల కుటుంబాల్లో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని కుటుంబాలు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొని ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. సర్వీస్‌లో ఉండగా ఆ కుటుంబానికి ఆధారమైన ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఒకరికి అర్హత గల కారుణ్య నియామకం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. మరణించిన మోడల్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 164 మోడల్ స్కూల్స్‌లో రెగ్యులర్ విధానంలో 2650 మంది టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ మోడల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో విద్యాశాఖ కింద నడుస్తున్నాయి. విద్యా శాఖలో ఒక భాగమైన ఈ మోడల్ స్కూల్స్‌కు ‘కారుణ్య నియామకాల పాలసీని’ అడాప్ట్ చేసుకోవలసిన అవసరం ఉంది. 2013లో ఏర్పడిన ఈ మోడల్ స్కూల్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయ కుటుంబాలకు ‘కారుణ్య నియామకాల విధానం అమలు ద్వారా’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా కల్పించాలని ప్రార్థిస్తున్నాము. మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లోకి విలీనం చేస్తూ 010 పద్దు ద్వారా జూలై 2024 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తుంది. ఇటువంటి సందర్భంలో కారుణ్య నియామకాలను కూడా మోడల్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయులకు సర్వీస్ నిబంధనలతో పాటు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి.
బి.సురేష్
అధ్యక్షులు, మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ కమిటీ