Share News

కొత్త పాఠకులు ఏం చదువుతున్నారు...

ABN , Publish Date - Oct 14 , 2024 | 04:12 AM

తెలుగులో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి అనుకొనేవాళ్ళకి కొన్ని పుస్తకాలు చెప్పమంటే, ఎక్కువమంది తమకి నచ్చిన పుస్తకాల గురించి చెప్పేవారు. 2021 హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌లో ఆ పుస్తకాలను వెతికి కొన్నాను. కానీ....

కొత్త పాఠకులు  ఏం చదువుతున్నారు...

కొత్త పాఠకులు ఏం చదువుతున్నారు...

తెలుగులో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి అనుకొనేవాళ్ళకి కొన్ని పుస్తకాలు చెప్పమంటే, ఎక్కువమంది తమకి నచ్చిన పుస్తకాల గురించి చెప్పేవారు. 2021 హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌లో ఆ పుస్తకాలను వెతికి కొన్నాను. కానీ చదవడానికి ఇబ్బంది పడ్డాను. క్లిష్టమైన భాషే కాకుండా, నాకు తెలియని ఎన్నో గొప్ప సిద్ధాంతాలతో ఉన్న పుస్తకాలు అవి. కానీ ఒక కొత్త పాఠకుడు సులువుగా అర్థమయ్యే పుస్తకాలను చదవడానికి ఇష్టపడతాడు. ఇలాంటి బిగినర్‌ ఫ్రెండ్లీ పుస్తకాల గురించి మాట్లాడంతోపాటు, సమకాలీన సాహిత్యాన్ని అందరికీ పరిచయం చెయ్యాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టిందే– ‘The తెలుగు Collective’ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ. ఈరోజుకు దాదాపు 25వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఎక్కువమంది 30ఏళ్ల లోపువారే. తెలుగు పుస్తకాలు ఈ మధ్యనే మొదలుపెట్టిన వాళ్ళ నుంచి ఎన్నో ఏళ్లుగా చదువుతున్న వాళ్ళ దాకా అందరూ ఉన్నారు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా పుస్తక పరిచయాలు మాత్రమేగాక, ‘మీట్ & గ్రీట్’ పేరుతో బుక్ క్లబ్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఒక పుస్తక రచయితను పాఠకులు కలుసుకొని ఆ పుస్తకంపై తమ అభిప్రాయాలు, సందేహాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. ఈ పేజీ నిర్వ హణలో భాగంగా కొత్త పాఠకులు, వారి అభిరుచుల గురించి తెలుసుకొనే అవకాశం నాకు దొరికింది. ఇప్పుడు ‘వివిధ’ పేజీ తరఫున 30ఏళ్ల లోపు పాఠకులు కొందరితో మాట్లాడాను. వారు చదివిన మొదటి పుస్తకం ఏమిటి? ఇష్టమైన రచయిత (రచయిత్రి) ఎవరు? ఎక్కువగా చదవడానికి ఇష్టపడే జానర్‌ ఏమిటి? పుస్తకాలు ఎక్కడ కొంటారు? లాంటి ప్రశ్నలను అడిగితే– వారి నుంచి వచ్చిన జవాబులు ఇవి.

ఆదిత్య అన్నావఝల

instagram.com/telugu_collective/


భార్గవి బెజ్జం

నేను జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణిని మరోపక్క పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాను. బాల్యం నుంచే పుస్తక పఠనం చేస్తున్నాను. నేను చదివిన మొదటి నవల ‘మానవి’. దీనిని ఓల్గా గారు రచించారు. వీరు నాకు ఇష్టమైన రచయితల్లో ముఖ్యులు. దళిత, స్త్రీవాద, సామాజిక స్పృహ కలిగిన పుస్తకాలు చదువుతాను. అన్ని రచనా ప్రక్రియలు చదువుతాను. వ్యాసాలు నన్ను ఎక్కువ ఆకట్టుకొంటాయి. మనం ఏ స్థితిలో ఉన్నా, పుస్తక పఠనం గుండె నిబ్బరాన్నీ స్థిత ప్రజ్ఞతను ఇస్తుందని నమ్ముతాను. పుస్తకాలను నేరుగా షాపుల్లో కొనడానికి ఇష్టపడతాను. పుస్తకం వెనక అట్ట మీద రచయిత లేదా ఇతరులు రాసిన విషయాన్ని బట్టి పుస్తకాన్ని ఎంచుకుంటాను.


సాయి చరణ్‌

నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. చిన్నప్పుడు చిట్టి వికటన్ అనే మాసపత్రికలో వచ్చే కథలను ఇష్టంగా చదివేవాడిని. నాకు నచ్చిన రచయిత కేశవరెడ్డి. సూటిగా, వ్యంగ్యంగా ఆయన వాస్తవాన్ని నిర్వచించే తీరు నచ్చుతుంది. చిన్నప్పటి చందమామ కథల ప్రభావం వల్ల పెద్ద పేరాలుగా ఉన్న నవలల కన్నా చిన్నచిన్న పేరాలతో ఉండే కథల్లాంటివి చదవడం ఇష్టం. అభ్యుదయ, భావ కవిత్వం సూటిగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా చదువుతాను. సాధారణంగా నేను పుస్తకాలను షాపుల్లోనే కొంటాను. ఈమధ్య ఆడియో బుక్స్, ఆన్‌లైన్‌ కొనుగోలు అలవాటైంది. పుస్తకాలపై వచ్చే సమీక్షలను బట్టి, లేదా ఆ పుస్తకం ముందుమాట, కవర్‌ ఫోటోలు ఏమైనా కథపై ఆసక్తి కలిగిస్తే వాటిని బట్టి పుస్తకాన్ని కొంటాను.


చిత్కళ

నేను ఇప్పుడు ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ చేస్తున్నాను. నేను తెలుగులో చదివిన మొదటి పుస్తకం శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’. నాకు కేశవరెడ్డి, సొలోమోన్ విజయ్‌ కుమార్ రచనలు ఇష్టం. సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే రచనలు, మిస్టరీ నవలలు ఇష్టం. పుస్తకాలు బుక్ షాప్‌లో కొనడాన్ని ఇష్టపడతాను. పుస్తకం కథాసారాన్ని చదివి, లేదా ఒక్కోసారి పుస్తకం పేరును బట్టి కూడా పుస్తకాల్ని ఎంపిక చేసుకుంటాను.


విరూపాక్ష

నేను సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ అనలిస్టుగా పనిచేస్తున్నాను. మొదటగా పరవస్తు చిన్నయ సూరి ‘నీతి చంద్రిక’ చదివాను. ప్రత్యేకంగా ఇష్టమైన రచయిత అని లేరు కానీ, ఓల్గా, కె.ఎన్.వై. పతంజలి, కొడవటిగంటి, రావిశాస్త్రి రచనలు అంటే మక్కువ ఎక్కువ. మాండలికంలో ఉన్న కథలు, నాన్ ఫిక్షన్ పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఇష్టపడతాను. పుస్తకాలు సాధారణంగా బుక్‌షాప్‌లలో కొనడానికే ఇష్టపడతాను. మా నాన్నగారు, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే స్నేహితుల సూచనలతో పుస్తకాలను కొనడానికి ఇష్టపడతాను.


నిర్వాణ

ప్రస్తుతం సీఏగా పనిచేస్తున్నాను. మొదటి చదివిన పుస్తకం ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ అని గుర్తుంది. సూర్యదేవర రామ్మోహనరావు రచనలు చదవడా నికి ఇష్టపడతాను. ఉత్కంఠభరితంగా సాగే నవలలు లేదా హాయిగా వెళ్లిపోయే షార్ట్ స్టోరీస్ ఎక్కువగా చదువుతాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే రికమెండేషన్స్‌తో దగ్గరలో ఉండే బుక్‌ షాపులో కొనుక్కుంటాను.


చరణ్‌ చిన్నన్నగారి

నేను ఇప్పుడు హెచ్‌సీయూలో ఎం.ఏ తెలుగు చదువుతున్నాను. నేను తెలుగులో చదివిన మొదటి పుస్తకం ఓల్గా రాసిన ‘విముక్త’. రచయితల్లో ఒకరు ఇష్టం అని చెప్పలేను. ప్రస్తుతానికి ఓల్గా, కేశవరెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, సొలోమోన్‌ విజయ్ కుమార్ రచనలు, శ్రీశ్రీ, తిలక్ వచన కవితలు బాగా ఇష్టం. మానవుల నిజమైన జనజీవనాన్ని, సంఘటల్ని కొత్త దృక్కోణంలో చిత్రించే నాటకాలు, వచన కవితలు, కథలు, నవలలు, బొమ్మల కథల పుస్తకాలు బాగా ఇష్టపడతాను. నేను పుస్తకాలు ఎక్కువగా బుక్ షాపుల్లో, ఇంకా బుక్ ఫెయిర్లో కొంటాను. స్నేహితుల సూచనలను బట్టి, కథాంశాలను బట్టి బట్టి పుస్తకాలు ఎంపిక చేసుకుంటాను.


రిషిత

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాను. గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’తో చదవడం మొదలుపెట్టాను. ‘కాలతీత వ్యక్తులు’ రాసిన శ్రీదేవి గారు నాకు చాలా ఇష్టం. ఏదైనా ఆలోచింప చేసేది కానీ ఏదైనా కొత్త అంశం చెప్పే కథలు కానీ ఎక్కువగా చదువుతాను. పుస్తకాలను నవోదయా బుక్‌ షాప్‌లో గానీ లేదా అమెజాన్‌లో గానీ కొనుక్కుంటాను. రచయితలను ఇన్‌స్పైర్‌ చేసిన రచనలను ఎన్నుకొని చదువుతాను, లేదా సమీక్షల ఆధారంగా పుస్తకాలు ఎంచుకుంటాను.


సాయి కీర్తన

సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేస్తున్నాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు ‘మస్టర్డ్’ అనే పుస్తకం చదివాను (సంపాదకులు: కడలి సత్యనారాయణ, అన్వేష్‌ చెట్టుపల్లి). ఈ జెనరేషన్ ఫేస్ చేస్తున్న అన్ని ఇష్యూస్ ఆ కథల్లో కనిపిస్తాయి. కొన్నిటికి రిలేట్ అయ్యాను. సీనియర్ రచయితలలో యద్దనపూడి సులోచనారాణి నా ఫెవరేట్. ప్రస్తుతం రాస్తున్న వాళ్లలో కడలి సత్యనారాయణ, మొహమ్మద్ గౌస్ రచనలు బాగా నచ్చాయి. నేను ఎక్కువగా లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్‌ చదవడానికి ఇష్టపడతాను. పుస్తకాలను బుక్‌ఫెయిర్లో లేదా అమెజాన్‌లో కొంటాను. నచ్చిన జాన్రా అయ్యుంటే తప్పకుండా తీసుకుంటాను. లేదంటే స్నేహితుల సూచనలతో తీసుకుంటాను.


రోహిత్‌ సత్య

ఈ మధ్యనే సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి అడుగుపెట్టాను. చదివిన మొట్టమొదటి పు స్తకం ‘బట్టి విక్రమార్క కథలు’. మనిషిని అర్థం చేయించే పుస్తకాలు ఎక్కువగా ఇష్టపడతాను. అందుకే కాశీభట్ల వేణుగోపాల్ గారు అంటే ఇష్టం. పుస్తకాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో కొనే వాడిని. ఇప్పుడు హైద రాబాద్‌లో బుక్ షాప్‌కు వెళ్లి కొంటున్నాను. స్నేహితుల సలహాలు, ఆన్‌లైన్‌ లో వచ్చే సమీక్షల ఆధారంగా పుస్తకాలు ఎంచుకుంటాను.


మాధవ్‌

ప్రస్తతం సినిమాల్లో పని చేస్తు న్నాను. నేను చదివిన మొదటి పుస్తకం గురజాడ అప్పారావు ‘కన్యా శుల్కం’. పింగళి సూరన్న, కేశవరెడ్డి రచనలు అంటే చాలా ఇష్టం. చదివే టప్పుడు డ్రామా లేదా ఫాంటసీ ఉండే నవలలు చదవడానికి ఇష్టపడతాను. మొదట్లో ఆన్‌లైన్‌ లేదా స్నేహితుల సలహాలతో పుస్తకాలు కొనుక్కునే వాడ్ని. కానీ ఇప్పుడు పుస్తకం వెనుక అట్ట మీద కథ గురించి రాసింది చదివి కొంటున్నాను. హైదరాబాద్‌లో ఉంటే షాపులో కొనడానికి ఇష్టపడ తాను. లేదంటే అమెజాన్, లోగిలి లాంటి వెబ్‌సైట్స్‌లో కొంటాను.


పవన్‌

ఈ మధ్యనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరాను. ‘అమరావతి కథలు’తో తెలుగు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కవనమాలి రచనలు నన్ను ఎప్పుడూ అబ్బుర పరుస్తాయి. ఏదో తెలియని సంతృప్తిని ఇస్తాయి. ఒక పాఠకుడిగా నాకు అన్ని రచనలు చద వాలి అని ఉంటుంది. ఒకటి ఇష్టంగా పెట్టుకుని గోడ కట్టుకోవాలి అని లేదు. హైదరాబాద్‌లో ఉన్నపుడు బుక్‌ షాప్‌లో కొనేవాడిని. ఇప్పుడు అమెజాన్‌లో కొంటున్నాను. పుస్తకం కవర్ పేజ్‌ చూసి, రచయిత ముందు రచనలని బట్టి, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే సజెషన్స్ను బట్టి పుస్తకాలు తీసుకుంటాను.


ప్రసన్న ఓరుగంటి

ప్రస్తుతం అమెరికాలో అగ్రికల్చర్ మీద పీహెచ్‌డీ చేస్తున్నాను. చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఉన్న ‘తులసీదాసు జీవిత చరిత్ర’ నేను చదివిన మొదటి పుస్తకం. అప్పటి రచయితలలో యద్దనపూడి సులోచనారాణి, యండమూరి, గొల్లపూడి మారుతీరావు, పి. శ్రీదేవి, రంగనాయకమ్మ నచ్చితే, ఇప్పటి రచయితలలో వి. మల్లికార్జున్, రవి మంత్రి రచనలు బాగా నచ్చాయి. నేటివిటీకి దగ్గరగా సాగే రచనలు ఎక్కువగా నచ్చుతాయి. ఆత్మపరిశీలనకి తోడ్పడే రచనలను చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. విదేశాలలో ఉండడం వల్ల తెలుగు పుస్తకాలు దొరకటం ఇబ్బంది. ప్రస్తుతానికి ఈ కొరియర్ సర్వీసుల పుణ్యమా అని అక్కడ స్నేహితుల సాయంతో కావాల్సిన పుస్తకాలు అన్నీ ఒకేసారి ఇక్కడికి తెప్పించుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే సమీక్షల ఆధారంగా పుస్తకాలు ఎంచుకుంటాను.

Updated Date - Oct 14 , 2024 | 04:21 AM