ఆ ముసుగులో ఇంకా ఏమేం చేశారో?
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:46 AM
ఉమ్మడి రాష్ట్రంలో 1969లో శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని అణచివేయడానికనే పేరు మీద అధికార పార్టీ రాజకీయ నాయకత్వం పోలీసులకు మితిమీరిన అధికారాలను కట్టబెట్టిందనీ, పోలీసులు ఆ తర్వాత కూడా ఆ అధికారాలను అదే పేరు మీద విచ్చలవిడిగా...
ఉమ్మడి రాష్ట్రంలో 1969లో శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని అణచివేయడానికనే పేరు మీద అధికార పార్టీ రాజకీయ నాయకత్వం పోలీసులకు మితిమీరిన అధికారాలను కట్టబెట్టిందనీ, పోలీసులు ఆ తర్వాత కూడా ఆ అధికారాలను అదే పేరు మీద విచ్చలవిడిగా వాడుతున్నారనీ, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా అదే హక్కుల హననం రాజ్యాంగాతీతంగా, చట్టాతీతంగా, అప్రజాస్వామికంగా సాగిపోతున్నదనీ ఇంతకాలమూ విమర్శకులు అంటున్న మాటను ఇప్పుడు స్వయంగా తెలంగాణ పోలీసు శాఖ కూడా అంగీకరిస్తున్నట్టున్నది.
తెలంగాణలో ప్రతిపక్ష, అధికారపక్ష రాజకీయ నాయకుల, అధికారుల, ప్రముఖుల, జర్నలిస్టుల ఫోన్ల మీద కొందరు పోలీసు అధికారులు అక్రమ నిఘా పెట్టి, వారి సంభాషణలను రికార్డ్ చేశారని నడుస్తున్న టెలిఫోన్ టాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైకోర్టు ముందు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ అక్షరాలా అదే మాట అంటున్నది. అలా అక్రమాలకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రభుత్వమే ప్రస్తుతం ఆరోపిస్తున్న ఆ పోలీసు అధికారులు విప్లవోద్యమాన్ని అణచివేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి చెందినవారు.
ఆగస్ట్ 19న దాఖలయిన ఆ కౌంటర్ అఫిడవిట్‌లో, ‘‘పదవీ విరమణ పొందిన తర్వాత పొడిగింపు మీద ఉద్యోగంలో, అధికారిక హోదాలో కొనసాగిన ప్రభాకర్ రావు, చట్టబద్ధమైన నిఘా కోసం సంబంధిత అధికారులు ఇచ్చే అవసరమైన ముందస్తు అనుమతులు లేకుండానే, నిర్వహణా కారణాల (operational reasons), వామపక్ష తీవ్రవాద చర్యల ముసుగులో (under the guise) తన నిఘా చర్యలు సాగించారు’’ అనీ, ‘‘తప్పుడు సమర్థనలు, అసత్య కథనాలు, మోసం ద్వారా అధికారుల అనుమతి సంపాదించారు’’ అనీ రాశారు. తమ వాళ్లే, తమ శాఖకు చెందిన అధికారులే నేరం చేశారని ఎవరైనా చెప్పడాన్ని న్యాయ పరిభాషలో ఒప్పుదల ప్రకటన అనీ, నేరాంగీకార ప్రకటన అనీ, అప్రూవర్ స్టేట్మెంట్ అనీ అంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ హోమ్ శాఖ కార్యదర్శి అప్రూవర్ స్టేట్‌మెంట్ తమ శాఖే గతంలో ఎలా పనిచేసిందో చెపుతున్నది. స్వయంగా హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శే ‘‘ముసుగు’’ అనే మాట వాడారంటే, అటువంటి ఒక ముసుగు ఉండిందనీ, ఆ ముసుగు కింద పోలీసు అధికారులు తప్పుడు పనులు చేసే అవకాశం కూడ ఉండిందనీ అర్థం. అలా తప్పుడు పనులు చేసిన అధికారులు తమ పనులకు ‘‘తప్పుడు సమర్థనలు చెప్పే, అసత్య కథనాలు వినిపించే, మోసం చేసే’’ అవకాశం ఉండిందని కూడా హోమ్ శాఖ అత్యున్నతాధికారి న్యాయస్థానంలో ప్రమాణపూర్తిగా ఇప్పుడు అంగీకరిస్తున్నారు.
ఇది ప్రస్తుతానికి తెలంగాణ పోలీసు శాఖలో కొందరు కీలక అధికారులు గత పాలకుల రాజకీయ, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, వారి ఆదేశాలకు అనుగుణంగానో, రాజును మించిన రాజభక్తితోనో రాష్ట్రంలో అనేక మంది పౌరుల ఫోన్ల మీద, ఎలక్ట్రానిక్ పరికరాల మీద నిఘా పెట్టి, గోప్యమైన సమాచారం సేకరించారనే కేసుకు సంబంధించినది మాత్రమే కావచ్చు. ఆ టెలిఫోన్ టాపింగ్ కేసు, అందులో జరిగిన రాజ్యాంగ వ్యతిరేక అక్రమాలకు సంబంధించి మొత్తంగా సమాజం చర్చించవలసిన కోణాలు, తెలుసుకోవలసిన నిజాలు ఎన్నో ఉన్నాయి గాని, వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు నుంచే వెలువడిన ఈ నేరాంగీకార ప్రకటనను చర్చించడం అవసరం.
సరిగ్గా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒక అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రమాణపూర్తిగా ఆ నేరాంగీకార ప్రకటన చేస్తున్న సమయానికే పొరుగు రాష్ట్రంలో మరిన్ని ఇటువంటి విషయాలే బైటపడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు తలచుకుంటే, ముఖ్యమంత్రి స్నేహితుడిని రక్షించడానికి అబద్ధపు కేసులు సృష్టించగలరని వార్తలు బైటపడ్డాయి. గత ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఒక వ్యాపారి వ్యక్తిగత కక్ష తీర్చడం కోసం రాష్ట్ర పోలీసు శాఖ ఎన్ని ఘోరాలకు, అక్రమాలకు పాల్పడగలదో ఆ వార్తలు తెలియజేశాయి.
ఇటు తెలంగాణ ప్రభుత్వపు కౌంటర్ అఫిడవిట్ గాని, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా బయటపెడుతున్న గత ప్రభుత్వ వ్యవహారాలు గాని ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో శిక్షణ, అనుభవం పొందిన ప్రస్తుత రెండు రాష్ట్రాల పోలీసు శాఖలకు తమకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, జవాబుదారీగా విధి నిర్వహణ చేయవలసిన బాధ్యత ఉన్నదని తెలియదు. వారికి శిక్షణలో ఆ విషయాలు పాఠాలు చెప్పి ఉంటారు గాని, ఆ తర్వాత ‘‘నిర్వహణా కారణాలు’’, ‘‘వామపక్ష తీవ్రవాద చర్యలు’’ అనే సాకులో, కారణాలో, ముసుగో చూపెట్టి చట్టాన్ని అతిక్రమించడానికి, వ్యక్తుల, సమూహాల హక్కులను హరించడానికి, రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాయడానికి పాలకులు బారాఖూన్ మాఫ్ అనుమతులు ఇస్తూ వచ్చారు.
వలస పాలనా కాలంలో తయారైన పోలీసు శాఖ ప్రజలను శత్రువులుగా భావించే అవగాహనను తన శిక్షణలో భాగం చేసుకుంది. వలస పాలకులు ప్రారంభించిన ఆ శిక్షణ 1947 తర్వాత ఎంతమాత్రమూ మారలేదు. అందువల్ల దేశంలో చాలా రాష్ట్రాల పోలీసు శాఖలు ఇలానే ఉండవచ్చు గాని, రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు శాఖలు ఇలా ఉండడానికి ప్రత్యేకమైన చారిత్రక కారణాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రం రోజుల నుంచీ స్వయంగా ప్రభుత్వాలే పోలీసులు రాజ్యాంగాన్ని అతిక్రమించినా, పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా చూసీ చూడనట్టు పోతూ వచ్చారు. సామాజిక ఆర్థిక సమస్యలకు తాము సాధించవలసిన పరిష్కారాలలో విఫలమవుతూ అంతకంతకూ ఎక్కువగా పోలీసుల మీద ఆధారపడుతూ వచ్చారు. ఆ క్రమంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారపక్ష నాయకులు ప్రజల మధ్యకు స్వేచ్ఛగా వెళ్లలేని స్థితి తామే కల్పించుకుని, పోలీసుల భద్రతా వలయమే, చక్రబంధమే రక్షణ అనుకుని నానాటికీ ప్రజలకు దూరమైపోయారు. రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చారు.
ఆ క్రమంలోనే ఇప్పుడు స్వయంగా హోమ్ కార్యదర్శి ‘‘ముసుగు’’ అంటున్న విప్లవోద్యమం, లేదా పోలీసు పరిభాషలో ‘‘వామపక్ష తీవ్రవాదం’’ పోలీసుల మితిమీరిన అధికారాలకు ఒక కారణమైంది. శ్రీకాకుళం జిల్లాలో 1958 నుంచీ సాగుతుండిన గిరిజనోద్యమం 1968 తర్వాత నక్సల్బరీ విప్లవోద్యమ మార్గం చేపట్టగానే ప్రభుత్వం అంతవరకూ సాగిస్తున్న అణచివేత విధానానికి మరిన్ని కోరలు తొడిగింది. కలకత్తా నుంచి వస్తూ 1969 మే 27న సోంపేట రైల్వేస్టేషన్‌లో దిగిన పంచాది కృష్ణమూర్తి, ఆయన సహచరులు ఆరుగురిని పట్టుకుని జలంతర కోట-పాతకోట కొండలకు తీసుకువెళ్లి కాల్చి చంపి ‘ఎన్‌కౌంటర్’ కథ అల్లి ప్రకటించారు. ఆ రోజు జరిగిన హత్య ఏడుగురు విప్లవోద్యమ కార్యకర్తలది మాత్రమే కాదు. ఆ రోజు రాజ్యాంగంలోని అధికరణం 21 హామీ ఇచ్చిన జీవించే హక్కు హత్య జరిగింది. అధికార యంత్రాంగం చట్టప్రకారం పని చేయాలనే విధ్యుక్తధర్మం, చట్టబద్ధ పాలన అనే విలువ అన్నీ హతమైపోయాయి. ‘‘వామపక్ష తీవ్రవాదాన్ని అణచడానికి’’ ఇటువంటి చట్టాతీత అధికారాలు పోలీసులకు ఇవ్వక తప్పదని ఆ నాటి ప్రభుత్వమూ అనుకుంది. ఆ తర్వాత యాభై ఐదు సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలూ అనుకుంటున్నాయి.
అదే కారణంతో ఆ తర్వాత కాలక్రమంలో పోలీసులకు మనుషులను చంపే, తప్పుడు కేసులు పెట్టే, వేధించే అధికారం మాత్రమే కాదు, ఆ అణచివేత కోసం విచ్చలవిడిగా లెక్క చెప్పనక్కరలేని నిధులు, వాహనాలు, కోవర్టులను ఉపయోగించుకునే కుటిలత్వం, మనుషులను చంపితే నగదు పారితోషికాలు, త్వరితగతి పదోన్నతులు వంటి అనేక ఆకర్షణలు చూపి మరింతమంది పోలీసు అధికారులు ఈ హంతక కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేశారు.
నిజానికి ‘‘వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు’’ అనేవి చట్టవ్యతిరేకమైనవని ప్రభుత్వం అనుకుంటే వాటి విషయంలో కూడా ప్రభుత్వ చర్యలు చట్టబద్ధంగా ఉండవలసిందే తప్ప చట్టవ్యతిరేకంగా, చట్టాతీత ప్రవర్తనతో ఉండగూడదు. చట్టాన్ని ప్రజలు పాటించకపోవడం ఎప్పుడైనా జరగవచ్చు, అందుకే నేర శిక్షా స్మృతులు వాటిని నేరాలుగా నిర్వచించి వాటికి శిక్షలను నిర్దేశించాయి. కాని చట్టాన్ని అమలు చేయవలసినవారే చట్టాన్ని ఉల్లంఘిస్తే దానికి పరిహారం ఏమిటి? చట్టాన్ని అమలు చేయడం తప్ప మరొక పని చేయడానికి అధికారం లేని పోలీసు యంత్రాంగాన్ని చట్టాతీతంగా ప్రవర్తించమనీ, ఇష్టారాజ్యంగా ఏమి చేసినా ఫర్వాలేదనీ ఉసిగొల్పింది రాజకీయ నాయకత్వమే కావచ్చు. కాని కాలక్రమంలో ఆ రాజకీయ నాయకత్వపు ఆదేశాలను పాటిస్తూనో, అతిక్రమిస్తూనో ఆ అధికారాన్ని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంటుందని చరిత్ర రుజువు చేసింది. ఒకసారి ఇంత విచ్చలవిడి అధికారం చేతికి అందినతర్వాత, నెత్తురు రుచి మరిగిన పులి లాగా ఇతర పనులకు, సొంత పనులకు, తమ పై అధికారులు చేప్పే పనులకు, తమ పై రాజకీయ నాయకత్వాన్ని సంతోషపెట్టే పనులకు ఆ అధికారాన్ని వాడుకోవడమూ, వాడుకోవడానికి ప్రయత్నించడమూ సహజమే.
తోటకూర దొంగతనం నాడే అడ్డు చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేదా అని మన తెలుగు సామాజిక వివేకం ఉంది. చట్టాన్ని అతిక్రమించడానికి, స్వయంగా చట్టవ్యతిరేక పనులు, నేరాలు, అక్రమాలు, ఘోరాలు చెయ్యడానికి పోలీసు యంత్రాంగాన్ని అనుమతించి, ప్రోత్సహించి, సమర్థించి, దశాబ్దాలు గడిచిపోయాక, ఇప్పుడు ఆ ‘‘ముసుగు’’లో ఇంకేవో చేశారనీ, ఒక నాయకుడి స్నేహితుడిని సంతోషపెట్టడానికి అక్రమాలు చేశారనీ ఇప్పుడు వగచి ఫలితమేమిటి? ఇప్పటికైనా, ఎప్పటికైనా ఆ ముసుగులో ఇంకా ఎన్నెన్ని భయంకర నేరాలు జరిగాయో బైటపడతాయా?
ఎన్. వేణుగోపాల్