పోలవరం నిర్వాసితుల పునరావాసం మాటేమిటి?
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:18 AM
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు గురించి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తాజాగా పదే పదే అబద్ధాలు చెప్పడంతో ఆయనకు జవాబు కూడా తరచూ చెప్పడం ఎబ్బెట్టుగా వుంది...
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు గురించి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తాజాగా పదే పదే అబద్ధాలు చెప్పడంతో ఆయనకు జవాబు కూడా తరచూ చెప్పడం ఎబ్బెట్టుగా వుంది. ఇందులో రెండు మూడు అంశాలు పరిశీలించాలి.
టీడీపీ, వైసీపీ హయాముల్లో ఎంతెంత మేర పనులు జరిగాయి? జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నదానిలో వాస్తవమెంత? అయిదేళ్ల కాలం అధికారంలో వున్న జగన్మోహన్‌రెడ్డి ప్రాజెక్టు సమగ్ర రెండవ డీపీఆర్ కేంద్రం వద్ద ఆమోదం పోందేందుకు చేసిన కృషి ఏమిటి?
ప్రస్తుతం మరుగున పడిన పోలవరం ప్రాజెక్టు తొలి దశ అంశం తెర మీదకు తెచ్చిన జగన్మోహన్‌రెడ్డి గతంలో ప్రాజెక్టు భవిష్యత్తును ఐసీయూలోకి నెట్టడం నిజం కాదా? వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు దీటైన సమాధానం చెప్పారు. మరో వేపు ఆంధ్రప్రదేశ్‌కు చేయవలసిన ద్రోహం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమాషా చూస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాల్లోకెళ్లి అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు దృగ్గోచరమౌతాయి. గత టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు రెండవ డీపీఆర్ ఆమోదానికి తీవ్ర కృషి జరిగింది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల వనరుల శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి 2017–18 షెడ్యూల్ రేట్ల ప్రకారం తీవ్ర కసరత్తు అనంతరం 55,548.83 కోట్ల రూపాయలకు రెండవ డీపీఆర్‌కు ఆమోదం తెలిపింది. ఇందులో భూసేకరణ పునరావాసం కిందనే 33,868.23 కోట్లుగా నిర్ధారించింది. ఈ లోపు ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంలో ఫైలు మూలనపడింది.
2019లో అధికారం చేపట్టిన జగన్మోహన్‌రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ చెబుతున్నా వినకుండా కాంట్రాక్టరు మార్పుతో సంవత్సర కాలం గడచిపోయి రెండవ డీపీఆర్ గురించి పట్టించుకున్నవారే లేకపోయారు. ఈ సమయంలో జరిగిన కాలయాపనతో జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుపై తొలి దెబ్బ కొట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి జగన్మోహన్‌రెడ్డి తట్టాబుట్టా సర్దుకున్న తర్వాత 2020లో గాని కేంద్ర జల వనరుల శాఖలో కదలిక రాలేదు. 2020లో సమావేశమైన రివైజ్డ్ కాస్ట్ అంచనాల కమిటీ సాంకేతిక సలహా మండలి ప్రతిపాదించిన రెండవ డీపీఆర్‌ను తగ్గించింది. 2017–18 షెడ్యూల్ రేట్ల ప్రకారం ప్రాజెక్టు రెండవ డీపీఆర్ 47,785.24 కోట్ల రూపాయలకు కుదించింది. భూ సేకరణ పునరావాసం కలుపుకొని సాగునీటి వ్యయం 35,988.16. కోట్లుగా తేల్చింది. అంతవరకైతే ఫర్వాలేదు. 2013–14లో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని 2013–14 షెడ్యూల్ రేట్లతో మరో డీపీఆర్ ఆమోదించింది. ఈ డీపీఆర్ మేరకు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 29,027.00 కోట్లుగానూ ఇందులో సాగునీటి వ్యయం 20,398.81 కోట్లుగా తేల్చి కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఇక్కడ దుర్మార్గమేమంటే 2019లో సాంకేతిక సలహా మండలి రెండవ డీపీఆర్ ఆమోదించిన సమయంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించినదనే అంశం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టింది. ఇందుకు కారణం లేకపోలేదు. కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నందున ఈ విషయం బయట పడితే వ్యతిరేకత వస్తుందని ఈ ద్రోహానికి కేంద్రం తలపడింది. కాగా పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టం ద్వారా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పరిగణింపబడుతోంది.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మించవలసి వుంది. ఇందులో శషబిషలు ఏ మాత్రం లేవు. కాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దురాగతానికి తలపడింది. ఇదిలా వుండగా తనకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి అధికారానికి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఏనాడూ చట్టబద్ధత గల పోలవరం ప్రాజెక్టుకు జరిగిన ఈ దురాగతం గురించి కేంద్రాన్ని నిలదీసిన సందర్భం లేదు. 2013–14 షెడ్యూల్ రేట్లతోనా? లేక 2017–18 షెడ్యూల్ రేట్లతోనా? అనే చర్చ తుదకు పార్లమెంటులో కూడా జరిగిన అంశం అందరికీ తెలుసు. ఈ అయిదేళ్ల కాలంలో తేల్చుకోకపోవడం జగన్మోహన్‌రెడ్డి వైఫల్యమైతే కేంద్రం తొలి నుండి పక్షపాత ధోరణితో ఆంధ్రప్రదేశ్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించింది. ఈ జంఝాటకంలో నాలుగేళ్లు గడచిపోయిన తర్వాత తిరిగి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రెండూ కూడా తొలి దశ అనే విధానాన్ని తెర మీదకు తెచ్చాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో కార్యక్రమం పెట్టుకొని నీతి ఆయోగ్ సభ్యులు ఒకరు వచ్చిన సందర్భంగా జగన్మోహన్‌రెడ్డిని కలిసిన విషయం చాలా మందికి గుర్తు వుంటుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించమని ఆ సభ్యులు జగన్మోహన్‌రెడ్డిని కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తొలిదశ పురుడు పోసుకొన్నది. తదుపరి జరిగిన సంఘటనలు కూడా మరింత ఆసక్తికరంగా వున్నాయి.
తన హయాంలో జరిగిన ప్రాజెక్టు పురోగతిపై జగన్మోహన్‌రెడ్డి తరచూ అబద్ధాలు చెబుతున్నారు. 2019లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర జల వనరుల శాఖ సమగ్ర నివేదిక సమర్పించింది. అందులో పోలవరం ప్రాజెక్టులో అప్పటి వరకు జరిగిన పురోగతి ఇలా వుంది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ 64.08 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇది రికార్డు రూపంలో వుంది. కాగా పది వేల కోట్ల రూపాయల అడ్‌హాక్ ఇస్తే 41.15 ఎత్తుతో ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తానని కేంద్ర జల వనరుల శాఖకు 2022 జూలై 19వ తేదీ సమర్పించిన నివేదికలో ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ 69.79 మాత్రమే పూర్తయినట్లు పేర్కొన్నారు. అంటే జగన్మోహన్‌రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పురోగతి ఇంచుమించు ఎవరైనా అంచనా వేసుకోగలరు. ఈ సందర్భంలోనే తొలిదశ డీపీఆర్ మొత్తం 36,448.83 కోట్లకు అంగీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసిన అంశం రికార్డుల్లో వుంది. ఈ లేఖపైననే కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితోనూ ఒకటి రెండు సమావేశాలు ప్రాజెక్టు అథారిటీతో పలు సమావేశాలు జరిగాయి. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం తొలిదశ ఆమోదిస్తున్నట్లు జగన్మోహన్‌రెడ్డి హయాంలో ప్రకటన వెలువడింది. పైగా హెడ్‌వర్క్స్ పద్దు కింద మూడువేల కోట్ల రూపాయలు కోత పెట్టారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇవన్నీ జగన్మోహన్‌రెడ్డి గంప కింద మూసిపెడితే దాగేటివి కాదు.
అయితే ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల సంఘం మాత్రం ఈ మొత్తానికి కోత పెట్టి రూ. 31,625.38 కోట్లకు కోత పెట్టింది. తిరిగి ఏ పద్దులు తగ్గించారో గాని 30 వేల కోట్లకే తొలి డీపీఆర్ అధికారయుతంగా ఆమోదించారు. కాని ఇక్కడ మరో మెలిక వుంది. ప్రాజెక్టు ఎన్ని దశలుగా నిర్మించినా ఎవరికీ అభ్యంతరం లేదు. మున్ముందు కేంద్రం ఏదైనా పేచీ పెట్టకుండా ఇప్పుడే ప్రాజెక్టు సమగ్ర డీపీఆర్ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం పొందాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించడం కష్టం కాకపోవచ్చు. ప్రధాన సమస్య నిర్వాసితుల పునరావాసానికి దాదాపు ముప్పయి వేల కోట్ల రూపాయలు కావాలి. ఈ లోపు చాలా కుటుంబాలు వేరుపడి తమకూ నష్టపరిహారం డిమాండ్ చేసే అవకాశం వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అంటుంటారు. పోలవరం ప్రాజెక్టును జీవనాడి చేయాలంటే ఎంత త్వరగా సమగ్ర డీపీఆర్ ఆమోదం పొందుతారో అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. పైగా మొదటి నుంచీ ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ యెడల సామరస్యంగా లేరు. రాజకీయ ప్రయోజనం లేనిదే నిధులు ధారాళంగా ఇవ్వరు. తొలి దశ పనులు జరిగే సమయంలోనే మరోవేపు సమగ్ర డీపీఆర్ ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వానికి సాంకేతికంగా ఏలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం దేశంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొని వుంది. తొలి దశ పనులు సాగిస్తూ అదే సమయంలో సమగ్ర డీపీఆర్ ఆమోదం పొందగలిగితే పోలవరం ప్రాజెక్టు అంశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు యాభై శాతం విజయం సాధించినట్లే.
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు