Share News

కవులు యాత్రికులై, యాత్ర కవిత్వమైనప్పుడు...!

ABN , Publish Date - May 06 , 2024 | 01:49 AM

మొట్టమొదటి మనిషికి ప్రకృతి స్నేహిత. చెట్టు, పిట్ట, ఏరు, ఆకాశం ఇవన్నీ అద్భుతాలు. వీటి నుండే ప్రేరణ పొందాడు. జీవితానికి, సాహిత్యానికి ఇవి మూలాలు. నదినో, సముద్రాన్నో చూసినప్పుడు...

కవులు యాత్రికులై, యాత్ర కవిత్వమైనప్పుడు...!

మొట్టమొదటి మనిషికి ప్రకృతి స్నేహిత. చెట్టు, పిట్ట, ఏరు, ఆకాశం ఇవన్నీ అద్భుతాలు. వీటి నుండే ప్రేరణ పొందాడు. జీవితానికి, సాహిత్యానికి ఇవి మూలాలు. నదినో, సముద్రాన్నో చూసినప్పుడు ఇప్పటికీ మనిషి అప్రయత్నంగా కేకలు వేస్తాడు. కానీ కాలక్రమంలో ఇప్పటి మనిషి ప్రకృతికి దూరం అయ్యాడు. ఒక్కసారి మన గుండెల మీద చేయి వేసి నిజాలు మాట్లాడుకుంటే మనం చంద్రుడిని పలకరించి చాలా రోజులు అయి ఉంటుంది. ఎగిరే పక్షులను, పాడే తూనీగలను శ్రద్ధగా పరిశీలించి చాలాకాలం అయి ఉంటుంది. వాస్తవానికి సాహిత్యం అక్కడి నుంచే మనిషికి అందింది. పాయల మురళీకృష్ణ అన్నట్టు- ప్రతి యాత్ర జీవితంలోనుంచి జీవితంలోకి, చరిత్రగా మారే క్షణం నుంచి చరిత్ర లోకి.

మానవుడిగా జన్మించాక ఏదో ఒక ఊరిలో పుడతాం. చాలామంది అదే ఊర్లో ఉండిపోతారు. కొందరు ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్తారు. ఉన్న చోటే ఉన్నా, వేరే ప్రాంతాలకు వెళ్లినా ఎక్కువమంది ఏదో ఒక చోట స్థిరపడి పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, చనిపోతారు. కానీ మనిషిగా అవకాశం ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల్ని చూడాలి, ఆస్వాదించాలి. హత్తుకోవాలి లోపలికి తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని కొందరు యాత్రా సాహిత్యంగా రికార్డు చేస్తున్నారు. కొందరు కవులు తాము వెళ్ళిన ప్రాంతాలను చూసి అక్కడ పొందిన స్ఫూర్తితో కవిత్వం అవుతున్నారు.


ఒక కవి రామప్ప గుడిని చూడ్డానికి వెళ్ళాడు. ఆ ఉలికళకు శిలాపూర్వక వందనాలు సమర్పించుకున్నాడు. పిలిస్తే చాలు లేచి ఒక్క ఉదుటన దూకడానికి సిద్ధంగా ఉన్న నందిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గుడి చుట్టూ రకరకాల భంగిమలలో ఎన్నో కథలను హృదయాల్లోకి పంపుతున్న యువతీ యువకుల చిత్రాలు చూశాడు. ఆ శిల్పాలను చెక్కిన ఉలి ఉంటే తిరూర్లో తుంజన్‌ ఘంటాన్ని ఊరేగించినట్లు ఊరేగించాలని పొంగిపోయాడు. ముగింపులో- ‘‘ఇంతకీ ఈ శిల్ప ప్రాచీన కట్టడంలో/ ఇవాళ ఇట్టే ఇమిడిపోతున్న నేనెవరిని/ నాటి రామప్పనా/ అతనికి రాయినందించిన సహచరుణ్ణా లేక అనుచరుణ్ణా/ లేక ఈ గుడి మీద వాలిన తొలి పక్షినా’’ (‘ఉలి కళ’, దర్భశయనం శ్రీనివాసాచార్యులు) అంటూ తాదాత్మ్యం చెందాడు. ఈ కవి బుద్ధగయను సందర్శించి బోధి వృక్షం నీడలో మనసుని శుభ్రం చేసుకున్నాడు. చెట్టు నీడ నుంచి వెళ్లిపోతూ బుద్ధుని నీడ వెలుతురై ఆయన కళ్ళల్లోకి చేరినది. తేటపడ్డ చూపుతో ఈ యాత్రను కొనసాగిస్తూ, ‘‘నా దారిని నేనే వెతుక్కుంటూ’’ అంటూ తాను పొందిన జ్ఞానోదయాన్ని మన ముందు ఉంచాడు. దర్భశయనం అండమాన్‌ జైలు గురించి కూడా ఒక కవిత రాశాడు. అక్కడి చీకటి గదిలో ఈ దేశపు పోరాట యోధుల్ని బంధించి ఆనందించిన తెల్లవాడి మురికితనాన్ని, వాడి భయాన్ని ఆయన మనకు గుర్తు చేస్తాడు. ఢిల్లీలోని లోటస్‌ టెంపుల్‌ని చూశాక కూడా ఆయన ‘కమల దేవళం’ అనే శీర్షికతో అద్భుతమైన కవిత రాశాడు.


యాత్రలకు వెళ్లిన వ్యక్తులు కవులు అయితే కచ్చితంగా వారు కవిత్వంలో ఆ ప్రాంతాన్ని రికార్డు చేస్తారు. ఇది సాంస్కృతిక ప్రసారంలో ఒక భాగం అవుతుంది. అట్లాంటి కవితలు చదివిన పాఠకుడు, అటు వెళ్లినప్పుడు ఆ కవి రాసిన భావాలు లేదా అనుభూతులు నిజమా కావా పరీక్షించుకుంటాడు. బెల్లంకొండ రవికాంత్‌ అనే కవి మైసూర్‌ వెళ్ళాడు. అయితే అతను మైసూర్‌ గురించి రాయలేదు. మైసూర్‌ వెన్నెల గురించి కవిత రాశాడు. వాస్తవానికి వెన్నెల ఎక్కడైనా వెన్నెలే, అయితే ఈ కవిని మైసూర్‌ వెన్నెల ఆవహించింది. అసలు మైసూర్‌ వెన్నెలను అక్షరాలు చేయడానికి ఎన్నో భాషా శాస్త్ర పరిశోధనలు జరగాలి అంటాడు. కవిత ముగింపులో తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు. మైసూర్‌లో నువ్వేం చూసావు అని అడిగితే- ‘‘మెరుస్తున్న కళ్ళతో/ హృదయాన్ని కాగితంలా పరిచి/ వెన్నెల్లో తడిచి ముద్దయిన నన్ను/ ఈ అక్షరాలను చూపిస్తాను,’’ అంటూ ఇదే కవితని మనకు సాక్షిగా ఇచ్చాడు. అయితే అందరి కవులు రాసిన యాత్రకు సంబంధించిన కవితల్లో కవిత్వం ఉండకపోవచ్చు.

డమ్మీ భావాలని కవిత్వంలో చూపించితే మనకు తెలిసిపోతుంది. యాత్ర అనుభూతికి సంబంధించింది. ఆ కవి రాసిన అనుభూతి నాలోకి కూడా ప్రసారం కావాలి. అందువల్ల యాత్రలకు వెళ్లి కవిత్వం రాసే కవులు భావాల్లో, భావనల్లో నిజాయితీ ఉండాలి. డాక్టర్‌ ఎన్‌. గోపి గోవాకి వెళ్లారు. ఆయనకి గోవా భావ కవిత్వంలా కనిపించింది. లోతుల్లోకి వెళ్తే మానవీయ సంగీతం వినిపించింది. అక్కడ గైడు చెప్పేవన్నీ ఆయనకు యాంత్రిక వచనాల్లా వినిపిస్తున్నాయి. గోవా ఎందుకో చాలా మారిపోయినట్టుగా ఆయన కనిపించింది. ‘‘ఒకప్పుడు గోవా నిండా ప్రాచీన హవా/ పావురాల్లా తిరిగే మరబోట్లతో/ ఇప్పుడిది నయా గోవా’’ అంటారు. అయితే ఈ కవితను ప్రారంభిస్తూనే ‘‘అరేబియా సముద్రం మీద స్వారీ చేసే జవనాశ్వం గోవా/ పశ్చిమ కనుమల్లో విరబూసిన నీటి పువ్వు/ కొంకణీ కింకిణులు ధ్వనించే పుణ్యభూమి’’ అని అనడం ద్వారా గోవాని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు.


కశ్మీర్‌ని చూసిన ఇద్దరు కవులు విభిన్నంగా స్పందించడం గమనించ వచ్చు. పాపినేని శివశంకర్‌ ‘కుంకుమ పూల రాణి’ అనే పేరుతో ఓ కవిత రాశారు. ఈ కవిత కాలం 2010. కశ్మీర్‌ చరిత్రతో ఆ కవిత ప్రారంభం అవుతుంది. కశ్మీర్‌ను మొగల్‌ రాజుల మోహస్వప్నంగా, ఎండిన నా గుండెల్లో సైతం ప్రేమను పచ్చగా మొలిపించే కాల్పనిక సౌందర్యంగా హత్తుకున్నారు. ఇదంతా మొదటి భాగం అయితే రెండవ భాగంలో కశ్మీర్‌లోని కల్లోల పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. అక్కడి చీకటి కంచెలు, విభజన రేఖలు, దుఃఖ ఆగ్రహాలను చెప్తూ- ‘‘ఈ కాటుక రాత్రిలాగానే ఘనీభవించిన దాల్‌ సరస్సుపై/ కదలని షికారాలో/ మానని గాయాలు నిమురుకుంటున్న కన్నీటి కాలకన్యా,/ నా పగిలిన సౌందర్య పాత్రవు నువ్వేనా/ చెరచబడిన స్వప్నానివి నువ్వేనా,’’ అంటూ చారిత్రక సాక్ష్యాలను వర్తమాన వాస్తవాలను బేరీజు వేస్తూ రాశారు. అలాగే సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘కాశ్మీరం’ అనే పేరుతో 2018లో ఓ కవిత రాశారు. ఈ కవికి కశ్మీర్‌లో కరెంట్‌ పోల్‌ చివరన కూడా మంచు పువ్వే కనిపించింది. ‘‘ఎక్కడ చూసినా పత్తిని తెంపి పరచినట్టు, ఇళ్ళు అన్ని మల్లెపూలను కప్పుకున్నట్టు, మేఘాలు దిగివచ్చి కొండల మీద కండువాలా పరుచుకున్నట్టు/ చెట్ల ఆకుల మీద ముగ్గుజల్లినట్టు, జీలం నదుల గుండ్ల మీద కుందేలు పిల్లలు కూర్చున్నట్టే’’ కశ్మీర్‌లో మంచు కనిపించింది. ఇక్కడ కవి ఒక పొడవైన ఉపమాలంకారాన్ని సమర్థవంతంగా వాడుకున్నాడు. ఇంకా కవి కవితలో మంచుతో అక్కడ పడే ఇబ్బందుల్ని చెప్తాడు. ఈ కవికి కశ్మీర్‌లో పేదరికపాయ కనిపించింది. కడుపులో కల్లోల భాష వినిపించింది. కశ్మీర్‌ మాదే అనే స్వరాలు వినిపించాయి. జెండాల అహంకార తూటాల పగలు మధ్య విచ్ఛిన్నమైన ముఖాలు కూడా కనిపించాయి- ‘‘తెల్ల గులాబిలు ఈ నేలలో రక్తం స్రవిస్తున్నవి/ నాగళ్ళు ఏకే 47 అవుతున్నవి/ పొలాలు బుల్లెట్లను పండిస్తున్నవి/ సౌందర్య లోయ ప్రతిచ్చాయ నెత్తురుపాయ/ కాశ్మీర పురా సౌందర్యం/ కళ్ళల్ల మెదులుతున్నది’’. ఈ కవితలో గమనించదగ్గ మరో అంశం కవిత అంతా కూడా తెలంగాణ జీవద్భాషలో సాగుతుంది.

మరొకవి వఝల శివకుమార్‌ బ్రైస్‌ లోయ అందాలను చూసి ఆశ్చర్యపోయాడు. పసితనపు అవ్యక్త అనుభూతిని పొందాడు. లోయలు శతాబ్దాల సహస్రబ్దాల భౌగోళిక సంక్షోభాలను, సన్నిపాతాలను పద్యాలుగా పొదిగి దాచుకున్న మహాకావ్య సంగ్రహాలయంగా అనుకున్నాడు- ‘‘బ్రైస్‌! ఓ సౌందర్య లయా/ నీ మనసు అద్దంలో/ ఉదయాస్తమయాలు సింగారించుకుంటాయి/ సున్నపురాతి గోడలను సహజగవాక్షాలను/ రెక్కల స్తంభాలను మీటుతూ గాలి/ మంచు కోతలు గతాన్ని గానం చేస్తుంది’’ అంటూ ఆ లోయ రసప్రవాహ చలనాన్ని మనలోకి తీసుకెళ్తాడు. పనిలో పనిగా మానవుడు సృష్టిస్తున్న కొత్త విధ్వంసాన్ని గుర్తు చేస్తాడు. కొండలను, గుట్టలను, అడవులను, ఎడారులను సైతం వదలని దురాశను ప్రశ్నిస్తాడు. కవి తాను చూసిన ఒక ప్రాంతం అందాన్నే కాకుండా, అక్కడ ధ్వంసం అయిపోతున్న లేదా మరణం అయిపోతున్న చుట్టు పక్కల పరిస్థితులను కూడా అక్షరీకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది.


మంత్రి కృష్ణమోహన్‌ కర్ణాటకలోని హొయసల, హొళేబీడు వెళ్ళాడు. పరమానందాన్ని పొందాడు. అక్కడ చరిత్ర, పలకరించిన మనోహర శిల్పాలు అతని అనాది మోహాన్ని కదిలించాయి. అతను నిలబడిన ప్రదేశం ఎంత చదివినా పూర్తికాని మహాకావ్యం అనిపించింది. అక్కడి కట్టడాలు మానవాళికి మౌనంగా సందేశాన్ని వినిపిస్తున్నట్లు అనిపించాయి- ‘‘వెదుక్కుంటూ వచ్చానిక్కడికి/ దూరాభారం లెక్కచేయక/ సకుటుంబంగా/ పిల్లలేం తిలకించారో/ ఏం అందిందో తెలియదు/ అయినా అందినదేదో అందిన క్షణమే/ తెలియాలనేముంది గనక’’ అని అని ఒక తత్వాన్ని ప్రకటించాడు.

ముకుంద రామారావు నయాగరా జలపాతాన్ని చూసి, కరిగి కన్నీరు అయిన అనంత జలరాశి, పరవళ్ళు తొక్కుతున్న ప్రవాహం, సూర్యకాంతిని హత్తుకొని రాళ్ల మీద తలబాదుకుం టున్న ఇంద్రధనుస్సు, ఒళ్ళు ఝళ్లనిపించే ఆకాశ అవయవంగా కవిత్వీకరించాడు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌ ఇంద్రవెల్లి వెళ్ళాడు. అక్కడ తీగలు తీగలుగా ఎగబడే పోరాటం చూసాడు. ఆదివాసుల ప్రాకృతిక జీవన వైవిధ్యానికి అబ్బురపడ్డాడు. ఎద నిండిన ఆనందంతో అడవిని గుండెల్లో పెట్టుకొని ఇంటికి ప్రయాణమయ్యాడు- ‘‘ప్రవాహ గోదావరి దాటంగానే/ అడవితో ఆత్మీయ అలయ్‌ బలయ్‌/ దారికిరువైపులా చెట్లకు నెత్తుటి పూలు అమరత్వపు జ్ఞాపకాల నయనాలు’’ అంటాడు. ఈ ప్రయాణం అతనిలో ఎర్రదనాన్ని నింపింది. అలాగే ఆయన పాపికొండల మధ్య ప్రయాణం చేశారు. అక్కడి పత్ర హరిత జీవితాలను చూసి సంబర పడుతూనే ప్రపంచీకరణ పాము పరివాప్తి కోసం అడవి, ఆదివాసి అంతర్థానం అయిపోతాయేమోనని దిగులు పడ్డాడు. ఆయనే బొగత జలపాతానికి వెళ్ళాడు. అక్కడి నీళ్ల ఉరవడి చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. వాన చినుకులు కోసం ఎదురుచూసే కళ్ళకి ఒకేసారి అన్ని నీళ్లు కనిపిస్తే, హఠాత్తుగా కన్నీళ్లే వస్తాయి. బొగత జలపాతం చుట్టూ ఉన్న దృశ్యాలను ప్రతి వాక్యంలోనూ కవి నింపాడు. ఇక రేణుక అయోల తన తాజమహల్‌ సందర్శనను ‘ప్రేమ కట్టడం’ అనే పేరుతో కవితగా మలిచారు. ఆమెకు అక్కడ ప్రేమ పాదాలు, పదాలతో పాటు కఠిన శిలలు మోసిన కూలీల చెమట ధారలు, చలువరాతి పలకల కింద నలిగిన బతుకుల ఆనవాళ్లు కనిపించాయి. అయితే షాజహాన్‌ ప్రేమని మోసుకెళ్తున్నంత అనుభూతితో ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చింది.


చత్తీస్‌గఢ్‌లో జగదల్పూర్‌ సమీపంలో చిత్రకూట్‌, దండకారణ్యాన్ని చూసినపుడు పాయల మురళి ‘‘కాకులు లేని ఆకాశమా నీలో నా దేశాన్ని దర్శిస్తున్నాను, ఇది నా నిజప్రదేశ యాత్రలా ఉంది’’ అంటాడు. అక్కడ ఏ పిట్టల కిలకిలలు లేని దండకారణ్యాన్ని చూసి, ‘‘నువ్వు ఇంకా సూర్యోదయాన్ని స్వప్నంలోనే వెతుక్కుంటున్నావా’’ అని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు.

అయితే కేవలం ఒకే ఒక కవితలో అన్ని అంశాల్ని కవులు చెప్పలేకపోవచ్చు. అంతా చెప్పేయాలని అనుకున్నా సాగతీతలు అతివ్యాప్తులు తప్పవు. మనం యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడే అనుభవాలు అనుభూతులతో పాటు సామాన్యుల జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. గత సాహిత్య చరిత్రలో సామాన్యులను విస్మరించడం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదే పొరపాటున మనం పునరావృతం చేయకూడదు. మల్లారెడ్డి మురళీమోహన్‌ అడవి రుచి తెలియాలంటే తేనె పూసిన కళ్ళతో చూడమంటాడు. ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి మబ్బులు భాష నేర్చుకోమంటాడు. ‘‘మనిషితనం గుబాళించాలంటే/ ప్రయాణించే దారి పొడుగునా/ ప్రతి చేష్టా, ప్రతి స్పర్శ/ ప్రకృతికి పర్యాయపదమై జీవయాత్ర సాగించాలి’’. యాత్రలు చేద్దాం. యాత్రలో సాహిత్యాన్ని, ప్రకృతిని, సమాజాన్ని ఎలా చూడాలో అలా చూద్దాం.

సుంకర గోపాల్‌

94926 38547

Updated Date - May 06 , 2024 | 01:50 AM