Share News

కశ్మీరం ఎటు వెళుతోంది?

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:34 AM

చరిత్రను విస్మరించటం మనకు కొత్తకాదు. చరిత్రను తవ్వితీయటమూ వింతకాదు. అలా తవ్వితీయటం మనల్ని ఒక్కోసారి నిర్ఘాంతపరుస్తుంది. నిశ్చేష్టులను చేస్తుంది. ఆగ్రహాన్ని పుట్టిస్తుంది. ఆవేశాన్ని రగుల్చుతుంది...

కశ్మీరం ఎటు వెళుతోంది?

చరిత్రను విస్మరించటం మనకు కొత్తకాదు. చరిత్రను తవ్వితీయటమూ వింతకాదు. అలా తవ్వితీయటం మనల్ని ఒక్కోసారి నిర్ఘాంతపరుస్తుంది. నిశ్చేష్టులను చేస్తుంది. ఆగ్రహాన్ని పుట్టిస్తుంది. ఆవేశాన్ని రగుల్చుతుంది. ఆవేదన పొంగేలా చేస్తుంది. నిశ్చితాభిప్రాయాల్ని తలకిందులు చేస్తుంది. ఇంత గాఢ భావోద్వేగాలను కలిగించే చరిత్రను ఒకపట్టాన విస్మరించలేం! నిత్యం ఏదోరకంగా రగిలిపోయే కశ్మీర్‌పై ఇలా తవ్వితీసిన చరిత్ర ఒకటి ఇటీవల జనం ముందుకు వచ్చింది. కశ్మీర్‌టైమ్స్‌ పత్రికకు ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఉన్న ప్రముఖ జర్నలిస్టు అనురాధ భాసిన్‌ ‘ఎ డిస్‌మాంటల్డ్‌ స్టేట్‌’ అనే పేరుతో రాసిన చరిత్రను విస్మరిద్దామనుకున్నా విస్మరించలేం! ఆర్టికల్‌ 370 రద్దుకు ముందూ తర్వాతా కశ్మీర్‌లో జరిగిన పరిణామాలపై ఇప్పటివరకూ వినిపించని కథ వినిపిస్తున్నానంటూ సాహసోపేతంగా ఎన్నో ఘటనలను కళ్లముందుంచారు. విస్మరించలేని భావనాశక్తితో ఒక రచన ఊగిపోతే దాంతో విభేదించే శక్తులూ ఉంటాయి. భిన్న ప్రయోజనాలు కాంక్షించే జన సమూహాలున్న సమాజంలో దేన్నీ ఒక దృష్టితో చూడటం అసాధ్యం. అందుకే కశ్మీర్‌పై ఏకాభిప్రాయం రావటం కష్టం! ఏకాభిప్రాయం అసాధ్యమైనా ఉన్న అభిప్రాయాల్లో న్యాయబద్ధమైనవి లేకుండా పోవు. అక్కడి ప్రజలకు సాంత్వన ఇచ్చేవి ఉండకుండా పోవు. హింసను చల్లార్చే మార్గాలను సూచించేవి కనిపించకుండా పోవు. అవేమిటో తెలుసుకోటానికి భాసిన్‌ రచన ఖచ్చితంగా తోడ్పడుతుంది.


జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ 370ని రాజ్యాంగంలో పొందుపరచటం చారిత్రక మహాపాపంగా పరిగణించే ధోరణి ఇప్పుడు ప్రబలంగా ఉంది. ఎటువంటి మినహాయింపుల్లేకుండా సాధారణ రాష్ట్రస్థాయినే కశ్మీర్‌కు ఆనాడు కల్పించి ఉంటే 75 ఏళ్లనాడే సమస్య సమసిపోయేదని రాజకీయంగా ఎంతైనా వాదించొచ్చు. కానీ జమ్మూకశ్మీర్‌.. భారత్‌లో విలీనమైన ఆనాటి చరిత్రనూ, అప్పటి పరిస్థితులనూ దృష్టిలో పెట్టుకుంటే దాన్ని అంగీకరించటం తేలిక కాదు. కశ్మీర్‌పై వచ్చిన ప్రామాణిక చరిత్రలన్నీ దీన్నే చెబుతాయి. ఆనాటి జమ్మూకశ్మీర్‌ మహారాజు హరిసింగ్‌ ప్రేమతో తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేయలేదు. పాకిస్థాన్‌ ప్రోద్బలంతో శ్రీనగర్‌ను చుట్టుముడుతున్న ఆక్రమణదారుల నుంచి రక్షించుకోటానికే భారత్‌ సైనిక సహాయాన్ని అర్థించారు. సాంకేతికంగా ఆనాటికి వేరే రాజ్యంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఆ సాయాన్ని చేయలేమనీ, తమతో విలీనమైతే అందుకు ముందుకు వస్తామని భారత్‌ తేల్చిచెప్పటంతో గత్యంతరం లేక హరిసింగ్‌ అంగీకరించారు. విలీనపత్రంపై సంతకం చేసినా పలుషరతులు పెట్టారు. రక్షణ, విదేశీ, కరెన్సీ, కమ్యూనికేన్స్‌ మినహా మిగతా అన్ని విషయాలపై భారత ప్రభుత్వం చేసే ఏ చట్టానికైనా తన ఆమోదం ఉండాలని స్పష్టంచేశారు. ఈ షరతుల నేపథ్యంలోనే ఆర్టికల్‌ 370 వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసితులు ఎవరన్నది నిర్దేశించటానికి వీలు కలిగించే ఆర్టికల్‌ 35ఏను కూడా రాజ్యాంగంలో ఆ నేపథ్యంలోనే పొందుపరచారు. 35ఏ ఆర్టికల్‌ వల్లే భూములపై కశ్మీరు ప్రజలకు ప్రత్యేక హక్కులు వచ్చాయి. ఇతరులు అక్కడ భూములు కొనకుండా నిషేధాలూ కొనసాగాయి. ఉద్యోగాలు జమ్మూకశ్మీర్‌ ప్రజలకే దక్కేలా చర్యలూ తీసుకున్నారు. ఈ నిషేధాలన్నీ ఆర్టికల్‌ 35ఏ వల్లే ఆనాడు కొత్తగా వచ్చాయని భావించలేం. హరిసింగ్‌ పాలనలోనూ అవి ఎంతోకొంత అమల్లో ఉన్నాయి. ప్రజా ఒత్తిడికి తలవొగ్గి వాటిని ఆయన ప్రవేశపెట్టారు. ఇక పాలనపరంగా చూస్తే హరిసింగ్‌ ప్రభుత్వం ఏ మాత్రం జనరంజకమైనది కాదు. అంతా భూస్వాముల ఆధిపత్యమే ఉండేది. పౌరహక్కుల్లేవు. రాజకీయ హక్కులు అసలే లేవు. కశ్మీర్‌తో పాటు జమ్మూ, లద్దాఖ్‌ ప్రాంతాల్లోనూ సంఖ్యాపరంగా అనాడు ముస్లింలే ఎక్కువగా ఉన్నా పాలనలో వారికి భాగం లేదు. కౌలుదారులుగా, కూలీలుగా, వృత్తి జీవులుగా ఉన్న వారిలో ముస్లింలే ఎక్కువ. అధిక సంఖ్యాక ప్రజలకు హక్కులు, అధికారాలు, భూసంపద పంపిణీని డిమాండ్‌ చేస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉనికిలోకి వచ్చింది. భారత్‌ సైన్యానికి చేదోడుగా నిలిచి ఆక్రమణదారులను తరమటానికి తోడ్పడింది. కశ్మీర్‌ భారత్‌లో విలీనమయ్యేలా ప్రజాభిప్రాయాన్ని మలచింది. ఎక్కడా జరగని స్థాయిలో భూసంస్కరణలను అమలుపరచింది. భూస్వాముల నుంచి లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని రైతులకు పంచింది. ఇదంతా గడిచిన చరిత్ర. మరి వర్తమానం సంగతేమిటి?


తీవ్ర వివాదానికి కారణమైన ఆర్టికల్‌ 370 రద్దును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అసలు ఆర్టికల్‌ 370 రద్దయి 5ఏళ్లు గడిచిపోయాయి. జమ్మూకశ్మీర్‌కు ఒకనాడున్న ప్రత్యేకతలన్నీ పోయాయి. రాష్ట్రమే రెండు కేంద్రపాలిత ప్రాంతాలైంది. ఏళ్ల విరామం తర్వాత ఎన్నికలూ జరిగాయి. ఫలితాలూ వచ్చాయి. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో నవశకాన్ని ఆరంభించామని ప్రచారం చేసుకున్న బీజేపీ 90 స్థానాలున్న అసెంబ్లీలో 29 సీట్లతో సరిపెట్టుకుంది. కశ్మీర్‌లోయలో ఒక్క స్థానమూ గెలవలేదు. గెలిచినవన్నీ హిందువులు అధికంగా ఉన్న జమ్మూలోనే ఉన్నాయి. మరోవైపు కశ్మీర్‌లో హింసా సంఘటనలూ పెరుగుతున్నాయి. కశ్మీరేతర వ్యక్తులపై దాడులూ కొనసాగుతున్నాయి. ప్రత్యేకతలన్నీ చాలావరకూ తీసివేసి, దేశంలో అమలయ్యే చట్టాలన్నిటినీ జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేశామని చెప్పుకొంటున్నప్పటికీ మారిన పరిస్థితులతో ప్రజలు సమాధానపడినట్లుగా దాఖలాలు కనిపించటం లేదు. ఎందుకిలా జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఆశించినట్లుగా జాతీయ జీవనస్రవంతిలో కశ్మీర్‌ ప్రజలు ఎందుకు కలవలేకపోతున్నారు?


వీటికి సమాధానాలు తెలుసుకోటానికి ఆర్టికల్‌ 370 రద్దుకు ముందూ తర్వాతా జరిగిన పరిణామాల గురించి లోతుగా తెలుసుకోవాలి. ఆర్టికల్‌ 370ని రద్దుచేసిన 2019 ఆగస్టు 5కు చాలా ముందుగానే కశ్మీర్‌లో అరెస్టులు మొదలయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని అనుకున్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 5 నుంచి కశ్మీర్‌ అంతా లాక్‌డౌన్‌ పరిస్థితే నెలకొంది. రాజకీయ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులను గృహనిర్బంధంలో ఉంచారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లను వాడకుండా నిషేధాలను విధించారు. ల్యాండ్‌లైన్ల ఫోన్లపైనా ఆంక్షలు అమలయ్యాయి. ప్రజల మధ్య సమాచారమార్పిడి పూర్తిగా నిలిచిపోయింది. ప్రసార సాధనాల వార్తా సేకరణకు అన్ని వైపుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రజలకు వివరమైన సమాచారం లభించే పరిస్థితి లేదు. జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే చట్టాల మంచిచెడులపై అభిప్రాయాలు వెల్లడించే మార్గం ప్రజలకు లేదు. ప్రజల భౌతిక సంచారంపైనా అడుగడుగునా నిషేధాలు అమలయ్యాయని చెబుతూ అనురాధ ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. ఆ తర్వాత 2020 మార్చిలో విధించిన కోవిడ్‌ లాక్‌డౌన్‌తో జనజీవితం మరింత ఆంక్షలమయమైంది. తమ జీవితాలనూ తమ రాజకీయాలనూ తాము అనుసరించాల్సిన ఆర్థిక విధానాలనూ ఇతర రాష్ట్రాలతో తాము కొనసాగించాల్సిన సంబంధాలనూ నిర్దేశించే అనేక నిర్ణయాలు కశ్మీర్‌ ప్రజల ప్రమేయం లేకుండా జరిగిపోయాయనీ, 1947 తర్వాత ఏ రాష్ట్ర ప్రజలకూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నదే అనురాధ వాదన సారాంశంగా చెప్పుకోవచ్చు. ఆర్టికల్‌ 370ను కశ్మీర్‌ భారత్‌లో విలీనం కావటానికి తోడ్పడే విశిష్ట రాజ్యాంగ సాధనంగా గతంలో భావించారు. దాన్ని 2019 ఆగస్టు 5న నిర్వీర్యం చేసినా ఎప్పటి నుంచో దాన్ని బలహీనపరచటం మొదలైంది. పలు రాష్ట్రపతి ఉత్తర్వులతో కీలక కేంద్ర చట్టాలన్నీ కశ్మీర్‌లో అప్పటికే అమలయ్యాయి. అందుకే అది అలంకారప్రాయంగా మిగిలిపోయింది. బలమైన భావోద్వేగ అంశంగా మాత్రమే ఉండిపోయింది. దాన్నొక్కదాన్ని తొలగిస్తే సమస్య జటిలం అయ్యేది కాదు. సంపూర్ణ రాష్ట్ర హోదానీ తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేయటం, శాశ్వత నివాసీయులుగా విద్యా, ఉద్యోగాల్లో కశ్మీర్‌ ప్రజలకు లభించే ప్రత్యేక హక్కులను నిర్వీర్యం చేయటం, భూములు కశ్మీరేతర ప్రజల్లోకి వెళ్లేలా పలు చట్టాలను మార్చటం, ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆస్తుల కొనుగోలుపై ఏదో రూపంలో హక్కులు లభించేలా చూడటం... ఇప్పుడు తీవ్ర సమస్యలుగా మారాయి. ఈ మార్పులకు కశ్మీర్‌ ప్రజలు ఎలా సమాధాన పడతారన్నదే సవాల్‌గా మారింది. ఈ మార్పులకు వారు అంగీకరించనంత వరకూ సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న పూచీలేదు!


ప్రత్యేక హక్కులను వదులుకోవటం ఎక్కడా సులభంగా జరగదు. చారిత్రక సందర్భం ఒక్కోచోట ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఆ సందర్భంగా ఒనగూడిన హక్కులు స్థిరమైన ప్రత్యేక మనఃస్థితిని కలిగిస్తాయి. అది బలీయంగా ఉన్నంత వరకూ ప్రజల మనస్సుల్లో ప్రత్యేక హక్కుల భావం తొలగిపోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సందర్భంగా కుదిరిన పెద్దమనుషుల ఒప్పందం, తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ మిగులు నిధులు, ముల్కి నిబంధనలు, ఆరుసూత్రాల పథకం, 610 జీవో లాంటివన్నీ దశాబ్దాలపాటు ప్రజల మనస్సుల్లో నిలిచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారితీశాయి. నిధులు, నీళ్లు, నియామకాలు తెలంగాణ వాసులకే పూర్తిగా దక్కాలనే ఆకాంక్ష, పట్టుదలను అసలుసిసలైన ప్రజాస్వామ్య కోరికలుగా భావిస్తే కశ్మీర్‌ ప్రజలు అవే కోరుకుంటే కాదనలేని పరిస్థితే ఉంటుంది. ప్రజాస్వామ్య కోరికను ఒక చోట ఆమోదించి మరొకచోట తిరస్కరించటాన్ని ఎవరూ సమర్థించుకోలేరు. తెలంగాణ రాష్ట్రం అవసరం గురించీ జరిగిన అన్యాయాల గురించీ వాగ్దానభంగాల గురించీ సాగినన్ని చర్చలు ఏ ప్రత్యేక రాష్ట్రోద్యమాల్లోనూ సాగలేదు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందించిన సౌలభ్యాలతో చర్చలు, ప్రతిచర్చలు భిన్న వేదికలపై కనీవినీ ఎరగని రీతిలో విజృంభించి బలమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి.


అంతర్జాతీయ సరిహద్దులో కశ్మీర్‌ ఉండటాన్నీ మతపరమైన సున్నితత్వాన్నీ దృష్టిలో పెట్టుకుని భిన్న ప్రమాణాలను అనుసరిస్తే దూరాలు పెరుగుతాయి తప్ప తరగవు. ప్రపంచంలో ఎక్కడైనా భూభాగాలపై స్వామ్యాన్ని సాధించటం సులభం. ప్రజల హృదయాలను గెలుచుకోవటం కష్టం. రాజకీయ విసుర్లు ప్రతివిసుర్లతో ఆర్టికల్‌ 370పై పదేపదే సవాళ్లు చేయటం కంటే కశ్మీరు ప్రజలను సమాధానపరచటానికి మార్గాలను అన్వేషించటం ప్రస్తుతం అత్యవసరం. సంపూర్ణ హక్కులతో రాష్ట్ర హోదాను జమ్మూకశ్మీర్‌కు కలగచేస్తే ఆ దిశగా కీలక అడుగుపడుతుంది. అదికూడా జరక్కపోతే చరిత్ర తిరిగే మలుపులను ఊహించలేం!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Nov 12 , 2024 | 12:34 AM