బలమున్నా, లేకున్నా తగ్గేదిలేదు!
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:20 AM
పార్లమెంటులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ... అటు విపక్షాలకు, ఇటు మిత్ర పక్షాలక్కూడా తగ్గేదేలేదనే సంకేతం ఇస్తున్నది. మోదీ నేతృత్వంలో బీజేపీ మూడోసారి...
పార్లమెంటులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ... అటు విపక్షాలకు, ఇటు మిత్ర పక్షాలక్కూడా తగ్గేదేలేదనే సంకేతం ఇస్తున్నది. మోదీ నేతృత్వంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పరిచినా, గత రెండు దఫాల మాదిరి పూర్తి మెజారిటీ దక్కక, మిత్రపక్షాలపై ఆధారపడిన పరిస్థితి. అయినా తన ఆత్మవిశ్వాసంలో ఏ మాత్రం తేడా రాలేదని చెప్పడానికి అన్నట్లు కేబినెట్ ఈ బిల్లుని ఆమోదించడం, పార్లమెంటుకి పంపించడం చకచకా జరిగిపోయాయి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అన్నది బీజేపీ మ్యానిఫెస్టోలో ముఖ్యాంశం. కానీ దానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు జరపడానికి రెండింట మూడొంతుల సభ్యుల మద్దతు కావాలి. ఈ అంశంపై తన మిత్రపక్షాలకే ఏకాభిప్రాయం లేని స్థితిలో ప్రభుత్వం దీన్ని తలకెత్తుకుంటుందని సాధారణంగా ఎవరూ అనుకోరు. అయితే ‘బలమున్నా, లేకున్నా తగ్గేదేలే’ అని కమలం పార్టీ బలమైన సందేశం ఇవ్వడమే మంచిదని భావించింది. చూడాలి.. హిట్ అవుతుందో, లేదో?
జమిలి విధానంలో ఎన్నో సంక్లిష్టతలున్నాయి. లోతుగా ఆలోచించాల్సిన విషయాలున్నాయి. మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ నివేదిక ఈ విధానానికి అనుకూలంగా ఉంది. అనుకూల వాదనల్లో ముఖ్యమైంది తక్కువ ఖర్చు. రెండోది మాటిమాటికీ ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఎన్నికల వల్ల పాలనకు పడుతున్న బ్రేకులు. అయితే తక్కువ ఖర్చు అన్నదానికి బలమైన ఆధారాలు లేవు. మొదలైతేనే కదా అసలు లెక్కలు పైకి వస్తాయి. ప్రస్తుతానికి అంచనాలే. ఎన్నికల కమిషన్ 2029లో ఈ జమిలి విధానం పాటిస్తే అందుకు ఏడువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. అలాగే మాటిమాటికీ ఏదోచోట ఎన్నికల వల్ల ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టలేకపోవడం కూడా అధిగమించలేని అవరోధం కాకపోవచ్చు. కేంద్రంలో పాలక పక్షం ప్రతీ ఎన్నికా తమ ప్రతిష్ఠకు సవాలుగా భావించకుండా ఆయా ప్రాంతాల నాయకత్వానికి వదిలేస్తే సమస్యే కాదు. మిగతా పక్షాలకు పాలనతో ఎటూ సంబంధం ఉండదు.
ఇక ప్రతికూల వాదనలో ముఖ్యమైనది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని. ఖచ్చితంగా కాకపోయినా జమిలి విధానంలో రాష్ట్రాల కన్నా, కేంద్రం బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. జాతీయ అంశాలు ప్రాధాన్యత పొంది, ప్రాంతీయ అంశాలు వెనక్కు పోతాయి. అది జాతీయ పార్టీలకు మేలు చేస్తుంది. భిన్న సంస్కృతుల, ప్రాంతాల నేపథ్యంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన చక్కగా చెయ్యడం ద్వారా రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తిని చూపింది. అటు కేంద్రం మిథ్య అన్న భావం రాకుండా, ఇటు రాష్ట్రాలు కేవలం విడిభాగాలు అన్నట్టు కాకుండా... రెంటికీ ప్రాధాన్యత ఇస్తూ బ్యాలెన్స్ చేసింది. జమిలి ఎన్నికల విధానం వల్ల త్రాసు కేంద్రం వైపే మొగ్గుతుంది. ఇంకో భయం ఏమిటంటే రాష్ట్రంలో ఎవరికీ మెజారిటీ లేనప్పుడు స్థిరమైన గడువు వల్ల ప్రభుత్వాన్ని నిలుపుకోడానికి లేదా లాక్కోడానికి పార్టీల్లో అనైతికత పెరగొచ్చు అన్నది.
ఏది ఏమైనా ఈ అంశంపై పార్లమెంటులోనే కాకుండా పౌర సమాజంలో, వీథుల్లో విస్తృతంగా చర్చ జరగాలి. అన్ని కోణాల్ని స్పృశించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం (టైమ్) కన్నా, ఎన్నికల విధానమే (క్వాలిటీ) సంస్కరింపబడాలి. డబ్బు, మద్యం సహా అడ్డదారులన్నీ మూసుకుపోయినప్పుడే నిజమైన ప్రజాభిప్రాయం వ్యక్తమౌతుంది. సరైన ఎన్నిక ద్వారానే ప్రజాస్వామ్యం శోభిల్లుతుంది.
డి.వి.జి. శంకరరావు