Share News

పులుగడిగిన ముత్యాలు ఎవరు?

ABN , Publish Date - Apr 14 , 2024 | 02:19 AM

మర్రిమాను విశాలమైన ప్రాంతమంతటా ఊడలు దించుకున్నట్టు అవినీతి దేశమంతటా వ్యాపించి ఉంది. అది లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. మనమంతా అవినీతి పంకజాలమే అంటే చాలా మందికి కోపం రావొచ్చేమో కానీ...

పులుగడిగిన ముత్యాలు ఎవరు?

మర్రిమాను విశాలమైన ప్రాంతమంతటా ఊడలు దించుకున్నట్టు అవినీతి దేశమంతటా వ్యాపించి ఉంది. అది లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. మనమంతా అవినీతి పంకజాలమే అంటే చాలా మందికి కోపం రావొచ్చేమో కానీ, అది వాస్తవం. మన ఆర్థికవ్యవస్థ మూలాలే అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయి. అశ్రితపెట్టుబడి దేశం నరనరానా ప్రవహిస్తున్న చోట కేంద్రప్రభుత్వ ఆర్థికనిర్ణయాలే ఎలెక్టోరల్ బాండ్ల మీద ఆధారపడి వెలువడుతున్నప్పుడు మనమంతా దొర్లుతున్నది అవినీతి పంకిలంలోనే. ఆ పంకిలాన్ని ఎదుటివారి మీద చల్లడంలో ఎవరి శక్తిసామర్థ్యాలు ఎక్కువైతే వారిదే పైచేయి అవుతుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ అవినీతిని భూతద్దంలో చూపి ఢిల్లీ రామ్‌లీలా మైదాన్ వేదికగా ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బీజేపీ బాగా రక్తి కట్టించింది. అది ఆ ఎన్నికల్లో యూపీఏ ఓటమికి, దాని సారథి కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి కారణమయింది. అలా పాలనాపగ్గాలు చేపట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అవినీతిఅస్త్రాన్ని మరింత సునిశితంగా, జుగుప్సాకరంగా ప్రతిపక్షాల మీద సంధిస్తూ ఉండడం విశేషం. పాలకపక్షంగా బీజేపీ స్వతంత్ర దర్యాప్తుసంస్థలను సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రతిపక్షానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ‘ఆప్’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అదే అవినీతి ఆయుధంతో మద్యం కేసులో అరెస్ట్ చేయించి చిరునవ్వు నవ్వుకుంటోంది. హేమంత సోరెన్‌తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి జైల్లో తోసింది. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర భగేల్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రాష్ట్ర ఎన్నికల నడిమధ్యలో ఆయన మీద అవినీతి కేసు బిగించింది.

ఎప్పుడూ ఎదుటివారినే దొంగలుగా చూపించి తాను పులుగడిగిన ముత్యాన్ని అని చెప్పుకుంటున్న బీజేపీ మనల్నీ అదే నమ్మమంటోంది. జాతీయమీడియా అండతో నీతికి నిలువెత్తు కటౌట్‌గా పోజు కొడుతోంది. ఇటీవల ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మహాసభ నిర్వహించిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సునిశిత దాడి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ అవినీతిపై పోరాటం కొనసాగితీరుతుందని స్పష్టంచేశారు. ‘మోదీని ఎవరూ ఆపలేరు, ప్రతి ఒక్క అవినీతిపరుని మీద చర్య తీసుకుంటాం. నన్ను భయపెట్టడం కోసం అవినీతిపరులంతా ఒక్కచోట చేరారు. అది ఇంతకు ముందుకంటే బలమైన సంకల్పంతో అవినీతిపై రాజీలేని పోరుకు నన్ను సమాయాత్తం చేసింద’ని హెచ్చరించారు. అంటే, అవినీతిపరులంతా ప్రతిపక్షంలోనే ఉన్నారని ఆయన దేశప్రజలను నమ్మింపజూస్తున్నారు. ధగధగలాడే నీతికిరీటంతో మెరిసిపోతున్న తనను మూడోసారి ప్రధానిని చేయడం మినహా వేరే దారి లేదని వారికి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతిని భూతద్దంలో చూపించి ప్రయోజనం పొందదలచినట్టు మోదీ ప్రసంగాలు స్పష్టపరుస్తున్నయి. తన పదేళ్ల పాలనలో పేరుకుపోయిన మురికి ఎంత ఉతికినా వదలదనే విషయాన్ని కప్పిపెట్టి అందరి ముందు యూపీఏని దోషిగా నిలబెట్టడం ద్వారా ఆయన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో మోదీని జాతి అడగవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వాస్తవానికి ఎటువంటి రంగుకళ్లద్దాలు లేని నిష్పాక్షిక పరిశీలకులు వాటిని తరచూ ఆయన పైకి సంధిస్తున్నారు కూడా. విస్తృతప్రాచుర్యం గల జాతీయమీడియా సంస్థలు వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో అవి ప్రజల దృష్టిలో పడడంలేదు. గత పదేళ్లలో ఒక్క ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగమే లక్షకోట్ల రూపాయల అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుందని, తన అవినీతి నిర్మూలన యజ్ఞం ఎట్టిపరిస్థితులలోనూ ఆగబోదని మోదీ ప్రకటించారు.

ఐతే గత పదేళ్ల కాలంలోకి మనం ఒకసారి చూపు సారిస్తే వ్యక్తిగతంగా మోదీపైనే దట్టంగా అల్లుకున్న అవినీతిమేఘాలు చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. తనకు అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీని వెంటబెట్టుకుని విదేశయాత్రలు కూడా చేసిన ప్రధాని మోదీ, హిండెన్‌బర్గ్ పరిశోధనలు అతడి స్టాక్‌మార్కెట్ మోసాలచిట్టా విప్పిన తర్వాత పార్లమెంటుకు ముఖం చూపించలేకపోయారన్న చేదువాస్తవం అందరికీ తెలిసిందే. మాజీప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ‘మౌన్ మోహన్ సింగ్’ అని ఎద్దేవా చేసిన ఆయన ఈ విషయంలో మౌనవ్రతం పాటించడం ప్రపంచానికి వినోదమయింది. యుద్ధవిమానాల తయారీరంగంలో బొత్తిగా అనుభవం లేని అనిల్ అంబానీకి అనుకూలంగా మోదీ ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందాన్ని స్వయంగా కుదిర్చిపెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ పాలితరాష్ట్రాల్లో వ్యాపం (మధ్యప్రదేశ్) వంటి భారీ అవినీతి కుంభకోణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పాలకపక్షంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాలను చూపించి కార్పొరేట్ సంస్థల నుంచి క్విడ్ ప్రో కో రూపంలో విశేష ధనరాసులను మూటకట్టుకోడానికి దుర్భేద్యమైన రీతిలో రూపొందించిన ఎలెక్టోరల్ బాండ్ల పథకం ముసుగును సుప్రీంకోర్టు స్వహస్తాలతో తొలగించింది. ఈ బాండ్ల ద్వారా పార్టీలకు చేరిన మొత్తం సొమ్ములో దాదాపు సగం ఒక్క బీజేపీకే అందిందన్న కఠోరవాస్తవం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ అనుకుంటున్నట్టు బాండ్ల ద్వారా తమ పార్టీకి అందినది విశేషమొత్తమేమీ కాదని, మొత్తం రూ.20000 కోట్లలో తమకు ముట్టినది రూ.6000 కోట్లేనని, మిగతా రూ.14000 కోట్లు ఇతర పార్టీల ఖాతాల్లోకే వెళ్లాయని అమిత్ షా బుకాయించారు. అయితే వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. మొత్తం బాండ్ల విలువ రూ 16,518 కోట్లు కాగా అందులో బీజేపీ ఖాతాకు వెళ్ళింది రూ 8251.8 కోట్లని తేలింది. ఇలా ఎక్కడికక్కడ తన నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకోడానికి అబద్ధాలదడి కట్టుకోవడం కంటే జుగుప్సాకరం ఇంకేముంటుంది?

బీజేపీకి వెలుపల ఉన్నవాళ్లంతా అవినీతిపరులు, ఈడీ సంకెళ్లకు అర్హమైనవారు. ఆ పార్టీలో చేరిపోతే మాత్రం వారే నీతిమంతులు. ఈడీ కాదు కదా, ఈగ కూడా వారి మీద వాలదనే అభిప్రాయం దేశప్రజల్లో బలపడిపోయింది. దేశమంతటా అనేకమంది తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి నిష్పూచీగా బతుకుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి, కాంగ్రెస్‌నేతలు ఈడీ, సీబీఐలను బీజేపీ జవాన్లని పిలుస్తున్నారు. ఎంతటి అవినీతి నేతలనైనా పాలకపక్షంలో చేరగానే నీతిమంతులుగా మార్చివేసే వాషింగ్‌మెషీన్ అంటూ ఆ పార్టీని ఎద్దేవా చేస్తున్నారు. ఇలా తీవ్ర ఆర్థిక నేరాభియోగాలుండి బీజేపీ లేదా దాని మిత్రపక్షాల్లో చేరిన వెంటనే పరమపావనులైపోయినవారి ఉదంతాలు ప్రతిరాష్ట్రంలోనూ ఉన్నాయి. మహారాష్ట్రలోని యవత్మల్‌వాషిమ్ నియోజకవర్గ ఎంపీ భావన గవాలి (శివసేన) అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీనియర్ శివసేన నాయకుడు, మాజీ ఎంపీ పుందికేరావు గవాలి కుమార్తె ఈమె. మహిళా ఉత్కర్ష ప్రతిష్టాన్ చైర్‌పర్సన్‌గా ఆమె రూ.7 కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్టు 2020లో ఈడీ ఆరోపించింది. ఆమెకు సన్నిహితుడైన సయీద్‌ఖాన్‌ను అరెస్టు చేసింది. గవాలిని పిలిచి ఈడీ అనేకసార్లు విచారణ జరిపింది. ఈ కేసులో ఛార్జిషీట్ కూడా దాఖలయింది. 2022 జూలైలో భావన గవాలి ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు. వెంటనే ఆమెను లోక్‌సభలో ఆ పార్టీ చీఫ్‌విప్‌గా చేశారు. అంతే, ఈడీ కేసు హుష్ కాకి అయింది. ఆమెపై ఒక్క అనుబంధ ఛార్జిషీట్ దాఖలు కాలేదు. ఈడీ మళ్ళీ ఆమెను విచారణకు పిలవనే లేదు. ఇలాగే అజిత్‌పవార్ మీద మహారాష్ట్ర అవినీతి నిరోధకశాఖ కోర్టు పర్యవేక్షణలో మొదలుపెట్టిన విచారణ ఇప్పుడు ఏమైందో ఐపు లేదు. 2019లో ఇలా పుట్టి అలా గిట్టిపోయిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో అజిత్ ఉపముఖ్యమంత్రిగా చేరినప్పుడు ఏసీబీ ఆయనకు అన్ని అభియోగాల నుంచి విముక్తి కలిగిస్తూ బొంబాయి హైకోర్టులో క్లీన్‌చిట్ దాఖలు చేసింది.

ప్రతిపక్షంలో ఉంటే కేసులు, బీజేపీలో లేదా దానితో మిలాఖత్ అయిన మిత్రపక్షాల్లో చేరితే అనాయాసంగా క్లీన్‌చిట్‌లు లభించేస్తున్నాయి. ప్రధాని మోదీ తన విశాలమైన ఛాతీ మీద చేయివేసి అవినీతి అంతు చూస్తానని చేసే ప్రకటనలు, ప్రతిజ్ఞల అసలు బండారం ఇదన్నమాట. కాంగ్రెస్‌ను వీడి అజిత్‌పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీలో చేరిన బాంద్రా ఎమ్మెల్యే బాబా సిద్ధికి, అజిత్‌పవార్ వర్గంలో చేరిన ఓబీసీ నేత చగన్ భుజ్‌బల్, మరికొంతమంది మహారాష్ట్ర నాయకులు, బీజేపీకి అనుకూలంగా రాజకీయ విధేయతలు మార్చుకుని అవినీతి ఊబిలోంచి బయటపడి నీతియోగ్యతాపత్రాలతో మెరిసిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ‘నారదవల’ (ఒక కంపెనీకి మేలు చేయిస్తే నగదు లంచం ఇచ్చే విధంగా అంగీకారం కుదిర్చిన ఒక వార్తా సంస్థ స్టింగ్ అపరేషన్)కు చిక్కిన ఒకప్పటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సువేందు అధికారి 2020లో బీజేపీలో చేరి కడిగిన ముత్యమైపోయారు, ప్రతిపక్షానికి నాయకుడిగా కొత్త అవతారమెత్తారు. మోదీ ఆశ్రితులై అవినీతిగతాన్ని వదిలించుకుని నీతినిష్టాగరిష్టులైపోయిన మాజీ విపక్షనేతలు ఎందరెందరో.

తప్పు జరిగితే తక్షణమే శిక్ష విధించాలి. అందులో మరో మాటకు అవకాశమే లేదు. 2022 జూలై, ఆగస్టులో నమోదైన మద్యం విధానం కేసును ఇంతకాలం నాన్చి నాన్చి ఇప్పుడు అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ దురాశ, పేరాశతోనే కేజ్రివాల్‌ను అరెస్టు చేయించారన్నది బహిరంగ రహస్యం. 2014 తర్వాత కేంద్ర దర్యాప్తుసంస్థలు కేసులు పెట్టి వేధించిన వివిధ పార్టీలకు చెందిన 25 మంది ప్రముఖ నాయకులు బీజేపీలో చేరి ఊరట పొందారని ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జరిపిన స్వతంత్ర దర్యాప్తులో తేలింది. కాంగ్రెస్ పాలనలోనూ ఇటువంటివి ఉన్నప్పటికీ ఇంత దారుణంగా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తుసంస్థలను దుర్వినియోగపరచడం ఇంతకు ముందెన్నడూ జరగలేదని ఆ పత్రిక దర్యాప్తు నిగ్గుతేల్చింది. అపరిమిత అధికారం వ్యవస్థలు, సంస్థల నిష్పాక్షికతను బలి తీసుకోవడం దేశానికి అత్యంత హానికరం. తన నిండా పూడ్చలేని కంతలు ఉంచుకుని ఎదుటివారిని వేలెత్తిచూపడం పిల్లి కళ్ళు మూసుకుని దొంగతనంగా పాలు తాగుతూ లోకం తనను గమనించడం లేదని అనుకోడం వంటిదే.

శ్రీరామమూర్తి గార

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - Apr 14 , 2024 | 02:23 AM