Share News

మన ఆత్మగౌరవ ప్రతీకకు ‘భారతరత్న’ ఇంకెన్నడు?

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:20 AM

తెలుగుదేశం పార్టీని ప్రకటించిన సందర్భంలో నందమూరి తారకరామారావు "ఈ పార్టీ పేదవాడి ఆకలిమంటల్లోంచి పుట్టింది" అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకూ...

మన ఆత్మగౌరవ ప్రతీకకు ‘భారతరత్న’ ఇంకెన్నడు?

తెలుగుదేశం పార్టీని ప్రకటించిన సందర్భంలో నందమూరి తారకరామారావు "ఈ పార్టీ పేదవాడి ఆకలిమంటల్లోంచి పుట్టింది" అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడూ ఉపయోగించని పదజాలం అది. ఆ సమయంలోనే ఓ విలేకరి "మీ సిద్ధాంతం ఏమిటి రామారావు గారు?" అని ప్రశ్నించినపుడు ఎన్టీఆర్‌ నోటి వెంట సమాధానం బుల్లెట్‌లా వెలువడింది: "గ్రంథాలయాల్లో దుమ్ము పేరుకుపోయిన పుస్తకాల్లో మీకు మా సిద్ధాంతం కన్పించదు. మీ వీధిలో ఉన్న పేదవాడి ఆకలి చూపులలో మాత్రమే అది మీకు దర్శనమిస్తుంది" అంటూ ఆవేశంతో చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో, "పేదవాడికి పట్టెడన్నం పెట్టడం, నిలువనీడ కల్పించడం, ఒంటినిండా బట్ట కప్పుకొని ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి కల్పించడం" తొలి ప్రాధాన్యతాంశంగా పేర్కొన్నారు. 1983లో అధికారంలోకి రాగానే కిలో రూ.2లకు 25 కిలోల బియ్యం పథకం, పక్కా గృహ నిర్మాణం, సగం ధరకే జనతా వస్త్రాలు వంటి పథకాలు అమలు చేశారు.

సబ్సిడీ బియ్యం పథకం ప్రభుత్వ ఖజానాకు భారం అవుతుందని కొందరు అధికారులు చెప్పినపుడు "పేదవాడికి ఇంత నైవేద్యం పెట్టలేని ప్రభుత్వం దేనికండి?" అంటూ ఎన్టీఆర్‌ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని స్పష్టమైన సిద్ధాంతాలతో, విధానాలతో, ఉన్నత రాజకీయ విలువలతో నడిపిన ఎన్టీఆర్‌ ఎన్నడూ వాటి నుండి దూరంగా జరగలేదు, ఎప్పుడూ రాజీపడలేదు. పరిపాలనలో సామాజిక న్యాయం, సంస్కరణలకు పెద్దపీట వేసి సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేశారు. సామాన్యులు, రైతులు, మహిళలు బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం ఎన్టీఆర్‌ చేసిన కృషి, కల్పించిన రాజకీయ భాగస్వామ్యం, ప్రవేశపెట్టిన పథకాలు ఆనాడు దేశానికే దిక్సూచిగా నిలిచాయి.

కారణాలు ఏవైనా ఆనాడు దేశంలోని ప్రాంతీయ పార్టీలంటేనే సంకుచిత భావాలు కలిగి ప్రాంతీయతత్వాన్ని రేపుతాయనే అపప్రథ బలంగా నాటుకొని ఉండేది. తెలుగుదేశం పార్టీని సైతం అదేగాటన కట్టాలని కొందరు చూశారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి అక్కడ ఏర్పాటుచేసిన 'మీట్‌ ది ప్రెస్‌'లో పాల్గొన్నప్పుడు ఎన్టీఆర్‌ను ఓ విలేకరి "మీరు ప్రాంతీయవాది కదా? కేంద్రంతో కలిసి పనిచేయడం ఇబ్బంది కాదా?" అని అడిగాడు. దానికి సమాధానంగా ఎన్టీఆర్‌ "నేను మొదట భారతీయుణ్ణి. తర్వాతే తెలుగువాణ్ణి. అయినా రాష్ట్రాలు బలంగా ఉండాలని కోరుకోవడం ప్రాంతీయ వాదం కాదు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉండగలుగుతుంది" అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ అనగానే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని అందరూ అంటారు. నిజానికి ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవమే కాదు దేశంలోని రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని సైతం నిలబెట్టారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాల యూనియన్‌ అయిన భారతదేశంలో సమాఖ్య విధానం సంపూర్ణంగా అమలై వికేంద్రీకరణ జరగడం కోసం ఎన్టీఆర్‌ చేసిన కృషి అసామాన్యం, అద్వితీయం. పేరుకే ఫెడరలిజం కాకుండా రాష్ట్రాలు ఆత్మగౌరవంతో మనుగడ సాగించేలా కేంద్రం సహకరించాలని, అందుకొరకు రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చితీరాల్సిందేనని నాటి కేంద్ర ప్రభుత్వంపై ఎన్టీఆర్‌ ఒత్తిడి పెంచారు. రాష్ట్రాల హక్కుల సాధన కోసం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒక వేదికపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కేంద్రీకృత విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్‌ చొరవతో కేంద్ర–రాష్ట్ర సంబంధాల మీద ఏర్పాటయిన 'సర్కారియా కమిషన్‌'కు అనేక విజ్ఞప్తులు పంపి రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అధికారాలు అందించేందుకు అవసరమైన సూచనలు చేయాలని కోరారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే లోక్‌సభలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ప్రాతినిధ్యం పొందడానికి కృషి చేయాలని, అందుకు కాంగ్రేసేతర పక్షాల మధ్య ఐక్యత సాధించాలని చెప్పేవారు. జాతీయ స్థాయిలో కాంగ్రేసేతర పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ముందుగా ఆ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే ఆచరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఒకపక్క సీపీఐ, సీపీఎంలతో, మరోపక్క బీజేపీ, జనతా పార్టీలతో పొత్తు కుదుర్చుకొని రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 35 స్థానాలను గెలుచుకొని లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశంను నిలిపి దేశం దృష్టిని తన వైపు తిప్పుకోగలిగారు.

1984 ఆగస్ట్‌లో గవర్నర్‌ రామ్‌లాల్, నాదెండ్ల భాస్కరరావు, కేంద్రంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం కుమ్మక్కై తనను పదవీచ్యుతుడిని చేశాక నెల రోజులపాటు ఎన్టీఆర్‌ చేసిన ప్రజాస్వామ్య పోరాటం స్వాంతత్య్రానంతర దేశ రాజకీయ చరిత్రలో ఓ ఉజ్జ్వల ఘట్టంగా మిగిలిపోతుంది. తిరిగి అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్‌ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలపైన తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రాష్ట్రపతి పాలన విధించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను తొలగించాలని డిమాండ్‌ చేయడంతోపాటు రాష్ట్ర చట్టాలను కేంద్రం వీటో చేసేందుకు అధికారం కల్పించే ఆర్టికల్‌ 200, 201లను సవరించాలని ఎన్టీఆర్‌ చేసిన ప్రతిపాదన ఆనాడు దేశంలో ఓ సంచలనం. అలాగే, అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తి అమలు జరగాలంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ప్రజారోగ్యం, సాంఘిక సంక్షేమం వంటి కార్యక్రమాలను రాష్ట్రాలే నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని, బాధ్యతలకు తగినట్టుగా నిధుల సేకరణకు, పన్ను అధికారాలను హేతుబద్ధంగా కేంద్రం–రాష్ట్రాల మధ్య విభజించాలని కోరారు.

కేంద్ర జాబితాలో ఉన్న ఎక్సయిజ్‌, ఇన్‌కంటాక్స్‌, కస్టమ్స్ డ్యూటీ మొదలయిన ఆదాయాల్లో రాష్ట్రాలకు సముచిత వాటాలు ఇవ్వాలంటూ ఎన్టీఆర్‌ చేసిన ప్రతిపాదనలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. దాని ఫలితంగానే ఆనాడు 9, 10వ ఫైనాన్స్‌ కమిషన్లు రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాలకు పన్నుల్లో ఎక్కువ వాటా ఇవ్వాలని సిఫార్సు చేశాయి. అంతేకాదు, మార్కెట్‌ రుణాల్లో రాష్ట్రాల వాటా పెంచాలని, రాష్ట్ర స్థాయి ప్రభుత్వరంగ సంస్థలు కూడా బాండ్ల ద్వారా వనరులు సేకరించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ఎన్టీఆర్‌ కేంద్రంపై ఒత్తిడి చేశారు. చట్టబద్ధ వనరుల వాటాలో కేంద్రం అనుసరించే ద్వంద్వ వైఖరిని ఉపేక్షించబోమంటూ రాష్ట్రాల తరఫున ఎన్టీఆర్‌ చేసిన హెచ్చరిక నాడు దేశంలోని కాంగ్రేసేతర ప్రభుత్వాలకు సైతం కళ్లు తెరిపించినట్లయింది. అప్పటివరకు కేంద్రం ఎంతిస్తే అంత తీసుకొనే విధానమే అమలయ్యేది. దానిని ఎన్టీఆర్‌ వ్యతిరేకించిన తర్వాత కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మరో విధంగా చెప్పాలంటే కేంద్రాన్ని యాచించే స్థాయి నుంచి ఆత్మగౌరవంతో తమ హక్కుల సాధన కోసం రాష్ట్రాలు పోరాడే స్థాయికి చేరుకొన్నాయి. ఎన్టీఆర్ హయాంలో చరిత్రను తిరగరాసిన ఇటువంటి విప్లవాత్మక సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్టీఆర్‌ది ఓ ఉజ్జ్వల అధ్యాయం. అయితే, ఓ సందర్భంలో ఎన్టీఆర్‌ "నాతో పుట్టిన పార్టీ నాతోనే పోతుందేమో" అని నిర్వేదంగా అన్నారు. నిజానికి 1995 ఆగస్ట్‌లో నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ నుంచి తెలుగుదేశం పార్టీ పగ్గాలను తీసుకోకపోయి ఉంటే ఆ తర్వాత ఏం జరిగేదో కానీ, సకాలంలో సరియైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి తన విలక్షణ నాయకత్వంతో, పరిపాలనా సామర్థ్యంతో ఎన్టీఆర్‌ ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన విజయం సాధించారు. ఇందుకు అనేక ఉదాహరణలు కళ్లముందు కనిపిస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన ఎన్నో అవరోధాలను, ఇబ్బందులను దాటుకొంటూ ఓ బలీయమైన రాజకీయ శక్తిగా తెలుగుదేశం పార్టీని మలిచి ప్రజల ఆదారాభిమానాలను చూరగొని తొమ్మిదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు; ఐదేళ్ళపాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రానున్న ఎన్నికలలో విజయం సాధించే దిశగా కృషి చేయడం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే, క్రిందటేడాది 'శత జయంతి' సంవత్సరాన్ని జరుపుకొన్న ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం 'భారత రత్న' ప్రకటిస్తుందని చాలామంది భావించారు. రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్‌ చేసిన సేవల్ని పరిగణనలోకి తీసుకొన్నప్పుడు, అనితర సాధ్యమైన ఆయన నట జీవితాన్ని లెక్కలోకి తీసుకొన్నప్పుడు ఎన్టీఆర్‌కు 'భారత రత్న' లభించాలని కోరుకోవడం అత్యాశ కాబోదు. ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇంకెప్పుడు అనే ప్రశ్న ప్రతి తెలుగువాడి మదిలో మెదులుతూనే ఉంది. అన్నట్టు దేశ రాజకీయాల్లోనే చిన్న అవినీతి మరక కూడా అంటని ఏకైక రాజకీయ నాయకుడు ఒక్క ఎన్టీఆరే!

విక్రమ్ పూల

సీనియర్‌ జర్నలిస్ట్‌

(నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం)

Updated Date - Mar 29 , 2024 | 03:20 AM